నాకెందుకు ఇలా వచ్చింది?


Wed,June 7, 2017 01:39 AM

నా వయసు 32 సంవత్సరాలు. నేనొక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. పదిహేను రోజులుగా ఎడతెరిపి లేని దగ్గుతో బాధపడుతున్నాను. చెయ్యాల్సిన చిట్కాలన్నీ చేసి చూశాను. కానీ దగ్గు ఎంతకూ తగ్గడం లేదని డాక్టర్‌ను కలిస్తే పరీక్షలు చేయించుకు రమ్మన్నారు. పరీక్షల్లో టీబీ అని తేలింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను చాలా పరిశుభ్రత పాటిస్తాను. సాధారణంగా జనం ఎక్కువ గుమిగూడి ఉండే ప్రదేశాల్లో తిరిగే అవకాశం కూడా తక్కువ. నాకు టీబీ రావడం ఏమిటి? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుపగలరు.
రంజిత్, హైదరాబాద్

image
మన దేశంలో ఇంకా టీబీ చాలా విస్తారంగా ఉంది. కాబట్టి టీబీ గురించి పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండడం అత్యవసరం. ఒక రకంగా చెప్పాలంటే అవగాహనే టీబీ సోకకుండా కాపాడుకునే రక్షణ కవచం వంటిది. అంటే ప్రతి ఒక్కరూ ఇది టీబీ కావచ్చేమో అనే అప్రమత్తతో ఉండాలి. టీబీ అంటువ్యాధి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మనదేశంలో ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది గాలిలో కలిసిన తర్వాత కూడా చాలా సమయం పాటు క్రియాశీలకంగా ఉంటుంది.
laxmanbabu
జబ్బు ఉన్న వారిని కలుసుకోవడమో, వారున్న ప్రదేశాల్లో మెదలడం వల్లో తప్ప ఈ వ్యాధి వ్యాపించదు. ఇది గాలిద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి దీన్ని నివారించడం కొంచెం కష్టంగానే ఉంటున్నది. మీరు ఎంత పరిశుభ్రత పాటించే వారైనా, జనసమ్మర్థంలో తిరగపోయినా ఎక్కడి నుంచైనా ఈ బాక్టీరియా గాలి ద్వారా మీ శరీరంలోకి చేరవచ్చు. సరే ఎలా చేరిందనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మీరు చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. ఇది చాలా త్వరగా వ్యాపించే వ్యాధి కాబట్టి మీ కుటుంబసభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వీలైనంత వరకు మాస్క్ ధరించి ఉండడం మంచిది. క్రమం తప్పకుండా పరీక్షలకు వెళ్లడం, మందులు పూర్తిగా వాడడం తప్పనిసరి. పోషకాహారం తీసుకోవాలి. కొన్ని మందుల వల్ల కీళ్ల నొప్పుల వంటి దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. వీటి గురించి మీ డాక్టర్‌తో చర్చించడం మరచిపోవద్దు. చికిత్స కొంచెం దీర్ఘకాలికంగానే ఉంటుంది. లక్షణాలు తగ్గిపోయాయన్న కారణంతో మందులు మధ్యలో అసలు మానకూడదు. ఇది మిమ్మల్ని మరింత ప్రమాదంలోకి నెడుతుంది.

377
Tags

More News

VIRAL NEWS