నన్ను క్షమించు ప్రేయసీ..!


Tue,August 21, 2018 11:01 PM

స్వచ్ఛమైన ప్రేమ క్షమాగుణాన్ని కలిగి ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైతే.. ఆ వ్యథే వేరు. మళ్లీ ఎప్పటికైనా కలువాలనే తపన, తనతో ఊసులాడాలనే కోరిక ప్రియుడ్ని ఒకచోట ఉండనివ్వవు. ఈ ప్రేమికుడు కూడా అదే చేశాడు. చిన్న మనస్పర్థ కారణంగా దూరమైన తన ప్రేయసికి.. వినూత్నంగా సారీ చెప్పి, ఆమె ప్రేమను మళ్లీ సొంతం చేసుకున్నాడు.
Love-Sorry
మహారాష్ట్రలోని పింపరీ చించవఢ్ ప్రాంతానికి చెందిన నిలేశ్ ఖేడ్కర్ ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతణ్ని అంతేలా ఇష్టపడుతున్నది. అయితే వీరిద్దరి మధ్య అనుకోకుండా చిన్నపాటి గొడవ జరిగింది. అది చిలికిచిలికి గాలివానలా మారింది. ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు నిలేశ్‌కు దూరమైంది. ఇద్దరి మధ్య మంచి అవగాహనతో ఉన్న ప్రేమకాస్తా పెటాకులు కావడంతో అతనిలో అంతర్మథనం మొదలైంది. ఆ కొద్దిపాటి గొడవలకు తానే కారణమని తెలుసుకున్న ఈ అమర ప్రేమికుడు.. తన ప్రేయసిని ఒప్పించేందుకు వినూత్నంగా క్షమాపణ చెప్పాలనుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుందో, ఎలా సర్‌ప్రైజ్‌గా క్షమాపణ చెప్పాలో నిర్ణయించుకున్నాడు. వెంటనే పింపరీ చించవఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడాడు.


రూ.72వేలు ఖర్చు చేసి, తన స్నేహితుల సహాయంతో తన ప్రియురాలు ప్రయాణించే రోడ్డు మార్గంలో శివ్‌దే నన్ను క్షమించు అని రాసి ఉన్న దాదాపు 300 హోర్డింగులు కట్టాడు. ఆ మరుసటి రోజు ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రియురాలు ఆ ఫ్లెక్సీలు చూసి నిలేశ్‌కు ఫిదా అయింది. ఇంతలా సర్‌ప్రైజ్ ఇచ్చిన తన ప్రియుడిని క్షమించేసింది. అయితే, వాటిల్లో కొన్నింటికి అనుమతి లేదంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిలేశ్‌ను, అతని స్నేహితులను విచారిస్తున్నారు. మొత్తంగా ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

673
Tags

More News

VIRAL NEWS

Featured Articles