నడిసంద్రంలో.. 49 రోజులు!


Tue,September 25, 2018 10:44 PM

ఒక రోజు కాదు.. వారం కాదు.. ఏకంగా 49 రోజులు నడి సముద్రంలో కాలమెల్లదీశాడు. తెప్పమీదున్న గుడిసెలోనే అన్ని రోజులూ గడిపాడు. ప్రమాదవశాత్తూ లంగరు తెగిపోవడంతో ఇండోనేషియాకు చెందిన ఈ టీనేజర్ ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. పనామా ఓడలోని ఆర్గెప్పియా సిబ్బంది అతణ్ని రక్షించి ప్రాణభిక్ష పెట్టింది.
Aldi-Novel-Adilang
హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి సంఘటనలు చూసుంటాం. ఇది సినిమా కాదు. యదార్థగాథ. ఇండోనేషియాకు చెందిన అల్దీ నావెల్ అదిలాంగ్ అనే టీనేజర్ రంపోంగ్(తెప్పలాంటి గుడిసె)లో దీపాలు వెలిగించే వాడు. అల్దీ స్వస్థలం సులవేసీ. స్థానికంగా చేపలు పట్టేందుకు ఉపయోగించే నీటిలో తేలే ఈ ఫిష్‌ట్రాప్‌లో పనిచేసేవాడు. దానిపై చిన్నగుడిసె ఉంటుంది. ఒడ్డుకు కొంచెం దూరంగా సముద్రంలో అది లంగరు వేసి ఉంటుంది. పగలు, రాత్రి రంపోంగ్‌లోనే అల్దీ జీవితం. సాయంకాలమైతే దీపాలు వెలిగించడం అతని డ్యూటీ. ఆ వెలుగు చూసి వచ్చే చేపలు వలల్లో చిక్కుకుంటాయి. వారానికి ఓసారి చేపల కంపెనీకి చెందినవారు ఎవరో ఒకరు వచ్చి చేపలు సేకరించి, అల్దీకి ఆహారం తదితరాలు అందజేసి వెళ్లిపోతారు. గత జూలై మధ్యలో వచ్చిన ఈదురు గాలుల వల్ల లంగరు తెగిపోయింది. దీంతో అలలకు నడి సముద్రంలోకి వెళ్లిపోయాడు అల్దీ.


ఎటు చూసినా సముద్రం తప్ప మరేమీ కనిపించలేదు. అతని దగ్గర మహా అయితే ఓ వారానికి సరుకులు ఉన్నాయి. ఆ తర్వాత చేపలు పట్టి కాల్చుకుని తిన్నాడు. ఉప్పు తగ్గేందుకు సముద్రపు నీటిని చొక్కాలో పట్టి తాగేవాడు. చిన్న చిన్న చేపలను వేటాడి కడుపు నింపుకునేవాడు. అప్పుడప్పుడూ ఓడలు కనిపించినా.. అందులోని వారెవరూ అల్దీని చూడలేదు. వారికి అతని కేకలు వినపడలేదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. తన ఇంటి దగ్గర అంతా అతనిపై ఆశలు వదులుకున్నారు. గ్వామ్ తీరంలో నెలన్నరకు పైగా దాటిన తర్వాత.. పనామా ఓడకు చెందిన ఆర్గెప్పియో సిబ్బంది అల్దీని చూసి కాపాడారు. నేను సముద్రంలోనే చనిపోతానేమోనని భయమేసింది. సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా అని మీడియాకు చెప్పాడు అల్దీ. బతకాలనే సంకల్పంతోనే ఇన్నాళ్లూ జీవించాడని, అల్దీకి భూమ్మీద నూకలున్నాయని అంటున్నారు.

1163
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles