నటించను.. జీవిస్తా!


Sun,July 22, 2018 01:52 AM

ఒకప్పుడు విలన్ క్యారెక్టర్‌లకి కేరాఫ్ అడ్రస్.. ఆ తర్వాత అన్యాయాన్ని ఎదురించే పోలీసాఫీసర్.. కూతురి బాగు కోసం.. కొడుకు కెరీర్ కోసం తపించే తండ్రి.. ఇన్ని షేడ్లలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు మురళీ శర్మ.. తెలుగు తెరకు ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికాడు.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి వచ్చినా.. ఈయన మూలాలు తెలుగు రాష్ట్రంలోనే ఉన్నాయి.. పరభాష నటుడిగా భావించే ఈయన తెలుగువాడే.
Murali

తెలుగు వారయుండి హిందీలో ఎలా ఎంట్రీ ఇచ్చారు?

అమ్మది గుంటూరు. పుట్టింది, పెరిగింది ముంబైలో. అలా నేను తెలుగువాడినే అయినా హిందీ బాగా వచ్చేది. పైగా అక్కడ నాటకాలు వేయడం, అక్కడే ప్రయత్నాలు చేయడం జరిగింది. అలా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధించాను. అప్పుడే అనుకోకుండా అతిథిలో విలన్ రోల్ వచ్చి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యా.

ముంబైలో పెరిగానన్నారు.. మరి తెలుగు స్పష్టంగానే మాట్లాడుతున్నారు?

అమ్మ తెలుగు అని చెప్పా కదా! అలా.. కొన్ని కొన్ని పదాలు అమ్మ నేర్పించింది. అంతా స్పష్టంగా మాట్లాడడం ముందు రాలేదు. సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగు భాష మీద మరింత మక్కువ ఏర్పాడి మాట్లాడడం నేర్చుకున్నాను. రాయడం మాత్రం కాస్త కష్టమే. (నవ్వుతూ..)

సినిమాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు?

నిజం చెప్పాలంటే.. నేను కాలేజ్ బంక్ చేయడానికి నటనను ఎంచుకున్నా. కల్చరల్ యాక్టివిటీస్‌లో ఉంటే క్లాసులు మానేసి అక్కడ గడిపేయొచ్చు అనుకునేవాడిని. అలా నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ టైమ్‌పాస్ చేసేవాడిని. కానీ ఇది ఎప్పుడూ సీరియస్‌గా తీసుకున్నానో, ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నానో కూడా గుర్తుకులేదు. అలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలలా జరిగిపోయాయి. అలా జరిగాయి కాబట్టే ఇలా మీ ముందు నటుడిగా నిలబడ్డాను.

సినిమాల్లో ఏమవ్వాలని వచ్చారు?

(నవ్వుతూ..) ఈ విషయం అనుకుంటే నాకు నవ్వు వస్తుంది. నేను హీరో అయిపోవాలని ఇండస్ట్రీకి వచ్చా. ఇనిస్టిట్యూట్‌లో అడుగుపెట్టాక నా మొహానికి హీరో అయ్యే చాన్స్ లేదని.. విలన్ అవ్వొచ్చని నిర్ణయించుకున్నా. నేను అనుకున్నట్టుగానే నాకు అవే ఆఫర్లు రావడం నేను నటుడినవ్వడం జరిగిపోయాయి. తెలుగులో కూడా విలన్‌గానే ఎంట్రీ ఇవ్వడం, దానికి నంది అవార్డు వచ్చాయి.

విలన్‌గా చేస్తూ.. పాజిటివ్‌గా మారిపోయారు. ఆ టర్న్ ఎలా జరిగింది?

నేను ఈ విషయంలో మారుతిగారికి కృతజ్ఞత చెప్పాలి. ఆయన నాలో ఒక పాజిటివిటీ చూశారు. నెగటివ్ రోల్స్ చేసిన నన్ను అలా ఆయన ఊహించుకోవడం నా కెరీర్‌కి చాలా ప్లస్ అయింది. మళ్లీ నేను వెనక్కి తిరిగి చూడకుండా నా కెరీర్ ముందుకు సాగుతున్నది. తెలుగు ఆడియన్స్, ఇండస్ట్రీ నన్ను ఇంతగా ఆదరించినందుకు అందరికీ నేను కృతజ్ఞుడిని.

ఆన్‌స్క్రీన్‌లో సీరియస్‌గా కనిపించే మీరు.. నిజజీవితంలో ఎలా ఉంటారు?

నిజజీవితంలో నేను బోరింగ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నాకంటే ఈ విషయం మా ఆవిడ బాగా చెబుతుంది. ఎక్కువగా పుస్తకాలు, మ్యూజిక్ వింటూ కాలం గడిపేస్తాను. నాతో పాటు రోజు కనీసం ఏడెనిమిది పుస్తకాలు ఉంటాయి. అవి నాకు మంచి కంపెనీ. షూటింగ్‌లో ఉన్నప్పుడు పక్కవాళ్లతో మాట్లాడతాను కానీ అంత ఎక్కువ కాదు. షూటింగ్ నుంచి బయటకి వచ్చి అన్ని స్విచ్ఛాఫ్ అవ్వాల్సిందే!

మీలో మీరు మార్చుకోవాల్నివి ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా?

అస్సలు లేదండీ. నాకు నేను నచ్చుతాను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఒకరి గురించి మారను, మార్చుకోను. ఏది నచ్చితే అది చేయడం స్వాతంత్య్రం. నాకు ఆ స్వాతంత్య్రం ఉండాలని కోరుకుంటాను.

మీ వయసుకు మించి పాత్రలు చేస్తున్నారు. ఎప్పుడైనా బాధ అనిపించిందా?

అస్సలు అనిపించ లేదు. నాకు వచ్చిన పాత్రల పట్ల నేను సంతృప్తిగా ఉన్నా. సంతోషంగా ఉన్నా. ఇంత మంచి పేరు వస్తుంటే ఎందుకనిపిస్తుంది. నాకు వచ్చిన అన్ని పాత్రలూ ఎమోషన్స్‌ని పండించేవే! నన్ను ఎవ్వరూ ఒక బ్రదర్, యంగ్ విలన్ రాలేదని ఎప్పుడూ ఆలోచించను. నేను లవ్లీ గర్ల్స్‌కి, డైనమిక్ హీరోలకి తండ్రిగా చేయడం నాకు నచ్చింది. నాకు తండ్రి ఇమేజ్ రావడం పట్ల బాధ లేదు. అంతకుమించి సంతోషంగా ఉన్నానని చెబుతున్నా.

మీరు మాట్లాడడం చూస్తుంటే మీరు చాలా పాజిటివ్ మనిషి అనిపిస్తున్నారు. నిజమేనా?

నిజమే. నేను చాలా పాజిటివ్. ఇంత పాజిటివ్‌గా ఉండకూడదు. దేన్నైనా నెగటివ్‌గా చూడడం, ఆలోచించడం నాకు తెలియదు. కానీ ఇలా ఉండడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నా కష్టపడేతత్వం కాకుండా, నా పాజిటివ్‌నెస్ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని నమ్ముతాను.

మీలో మీకు నచ్చినది, నచ్చనిది ఏమన్నా ఉందా?

నాకు అలాంటివి ఏమీ లేవు. ఈ జవాబు నాకంటే నా భార్య బాగా చెప్పగలదు. నేను సీరియస్ వ్యక్తినయితే కాదు. నా మటకు నేను పనిచేసుకుంటూ వెళ్లడం, నచ్చిన వాళ్లతో మాట్లాడడంలాంటివి చేస్తా.

ఖాళీ దొరికితే పుస్తకాలు, మ్యూజిక్ కాకుండా ఏం చేస్తారు?

మనకున్నది చాలా తక్కువ సమయం. రోజుకు 24 గంటలే కదా! అందులో ఏడు గంటలు నిద్ర. ఇతర కార్యక్రమాలకు రెండు గంటలు పోను నాకు చదువడానికి, పాటలు వినడానికి సమయం సరిపోవడం లేదు. మూడ్‌ని బట్టి పాటలు వింటా. ఇంతకుముందు ఆత్మకథలు చదివేవాడిని. ఇప్పుడు ఫిక్షన్ పుస్తకాల్లోకి వచ్చా. ఒకప్పుడు పుస్తకాలంటే భయం. అలాంటిది ఈరోజు ఒక్క పేజీ అయినా చదువకపోతే ఆ రోజు నాకు నిద్రపట్టదు. నేను పుస్తకాలతో ఇప్పుడు ప్రేమలో ఉన్నానని చెప్పొచ్చు. నాకు మంచి నడవడికను నేర్పించాయని చెప్పొచ్చు. నాకు కొంచెమైనా నాలెడ్జ్ సంపాదించకపోతే నేను పుట్టడం వేస్ట్ అనుకుంటా.

మీ ప్రేమ ఎలా మొదలైంది?

Murali1
ఆమె పేరు అశ్వినీ కోలెస్కర్. సోనీలో సీఐడీ సీరియల్ వచ్చేది. ఇప్పటికీ వస్తుంది. అందులో ఆమె ఏడు సంవత్సరాలుగా పోలీస్ క్యారెక్టర్ చేసింది. నేను అందులో ఆరేడు ఎపిసోడ్లు చేశా. ఆ తర్వాత అపహరణ్ అనే సినిమాలో కలిసి నటించాం. అక్కడ పరిచయం. మేం పెండ్లి చేసుకోక ముందు మంచి ఫ్రెండ్స్. ఇద్దరిట్లో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో కూడా
గుర్తుకు లేదు.

ఒక క్యారెక్టర్ చేయబోతున్నారంటే.. దాని వెనుక ఎలాంటి హోమ్‌వర్క్ చేస్తుంటారు?

నేను ప్రత్యేకించి ఇలా చేయాలి, అలా చేయాలి అని అనుకోను. కాకపోతే నేను నా చుట్టుపక్కల ఉన్నవాళ్లను గమనిస్తుంటా. చాలా వరకు అలా చూసినవాళ్లు నా మైండ్‌లో ఉండిపోతారు. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ మనుషులు నా కళ్ల ముందు కదులుతుంటారు. అలా నా క్యారెక్టర్ గురించి శ్రద్ధ తీసుకుంటా. ఉదాహరణకు.. విజేతలో తండ్రి పాత్ర కోసం మా తండ్రిని, బాబాయిని ఊహించుకున్నా. వాళ్లయితే ఈ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారనుకున్నప్పుడు ఆటోమెటిక్‌గా అలా నా నుంచి ఆ నటన వచ్చేస్తుంటుంది. ఇక్కడ నటన అనేకంటే జీవించేస్తా అనడం కరెక్ట్ అవుతుందేమో! యాక్షన్.. కట్ అనేవరకు నేను ఆ రోల్‌లోనే ఉండిపోతా. ఆ క్యారెక్టర్ నుంచి బయటకి రావాలంటే షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాతే సాధ్యమవుతుంది.

సినిమాలు చూసి క్రిటిక్ చెప్పేవాళ్లున్నారా?

నా బెస్ట్ క్రిటిక్ మా ఆవిడే. మొహం మీదే చెప్పేస్తుంది. సినిమా థియేటర్‌లోనే తను పక్కకు తిరిగి చూసిందంటే.. ఏదో నేను తప్పు చేశాననే భావన నాలో వచ్చేస్తుంది. మా అన్నయ్య కూతురు నైనిక, తమ్ముడు అవినాష్ కూడా సినిమా చూసిన వెంటనే ఫోన్‌లు చేస్తారు. నువ్వు ఈ సీన్‌లో బాగున్నావు, ఈ సీన్‌లో బాగా చేయలేదు అంటూ చెప్పేస్తుంటారు. నిజంగా ఇలాంటి వాళ్లు నా చుట్టూ ఉండడం వల్ల సినిమా సినిమాకు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందేమో అనిపిస్తున్నది. ఇంకో విషయం.. నేను కూడా క్రిటిక్‌నే. ఎందుకంటే షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ నా షాట్ చూసి ఆనందంగా ఫీలయితే నేను బాగా చేసినట్టు ఫీలవుతుంటా.

మిమ్మల్ని ఫిట్‌నెస్ ఫ్రీక్ అనొచ్చా?

నేను తిండిని కంట్రోల్ చేయలేను. కాబట్టి కచ్చితంగా వ్యాయామం చేస్తుంటా. జిమ్‌లో బోర్ కొడితే షూ వేసుకొని రోడ్ల మీద కూడా వాకింగ్ చేస్తుంటా. వాకింగ్ చేయడం మాత్రం మానను. ఉదయం ఆరుగంటలకు లేస్తే మాదాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ల మీద వాకింగ్ చేస్తూ కనిపిస్తుంటా.

ఇతర భాషల్లో చేస్తున్నారు. అక్కడ ఎలా ఉంది?

మనం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈ మాటను గట్టిగా నమ్ముతా. అన్ని భాషల్లోనూ నన్ను ఆదరిస్తున్నారు. తమిళం, మలయాళం, బెంగాళీ భాషల్లో కూడా మంచి ఆదరణ ఉంది. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. మా అమ్మమ్మ దగ్గర నుంచి ఈ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆమె 12 భాషలు మాట్లాడేది. అందులో సగమైనా నేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా.

మీరు బాగా తింటారని విన్నాం. ఇది నిజమేనా?

Murali2
అవును. కాకపోతే వెజిటేరియన్‌ని. అలా అని బయట ఫుడ్ అస్సలు ఇష్టపడను. ఇంటి ఫుడ్ అయితే లాగించేస్తా. షూటింగ్‌కి ప్రత్యేకంగా కుక్ వస్తాడు. తను నాకోసం వంటలు చేస్తాడు. నాకు సమయం దొరికితే నేనూ వండుతా. నేను ఎక్కడికి వెళ్లినా పప్పు, చపాతీలు ఉంటే చాలు. బతికేస్తా. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉన్నా, వెల్లుల్లి ఉన్నా, స్పైసీ ఫుడ్‌ల జోలికి వెళ్లను. నాకు వంట చేయడం ఒక మెడిటేషన్‌లా అనిపిస్తుంటుంది. చాలా విశ్రాంతిగా ఫీలవుతుంటా.

మీకు వచ్చిన బెస్ట్, వరెస్ట్ కాంప్లిమెంట్స్?

(నవ్వుతూ..) వరెస్ట్ అయితే చెప్పలేను. బెస్ట్ అంటే మాత్రం పెద్దగా గుర్తుకు లేవు. కాకపోతే విజేత మూవీ చేశాక చిరంజీవి గారు నా గురించి రెండు నిమిషాలు మాట్లాడడం గొప్పగా అనిపించింది. అలాగే చాలామంది ఆ సినిమా చూసి ఏడిపించేశారన్నారు. అవి నాకు మంచి కాంప్లిమెంట్స్ అని చెప్పొచ్చు.

డ్రీమ్‌రోల్స్ ఏమైనా ఉన్నాయా?

నాకలాంటివి ఏమీ లేవు. నేను చేసే ప్రతీ క్యారెక్టర్ నా డ్రీమ్‌రోలే. ఈ రోజు ఈ షూటింగ్ చేస్తున్నానంటే అదే నాకు నచ్చిన, మెచ్చిన రోల్‌గా భావిస్తా. వందశాతం ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయాలనుకుంటా. నాకోసం మంచి మంచి పాత్రలు డైరెక్టర్లు రాస్తున్నారు. హీరోలు కూడా నన్ను పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు.

బాక్స్ మీ ఇద్దరి ప్రేమ ఎలా మొదలైంది?

ఆమె పేరు అశ్వినీ కోలెస్కర్. సోనీలో సీఐడీ సీరియల్ వచ్చేది. ఇప్పటికీ వస్తుంది. అందులో ఆమె ఏడు సంవత్సరాలుగా పోలీస్ క్యారెక్టర్ చేసింది. నేను అందులో ఆరేడు ఎపిసోడ్లు చేశా. ఆ తర్వాత అపహరణ్ అనే సినిమాలో కలిసి నటించాం. అక్కడ పరిచయం. మేం పెండ్లి చేసుకోక ముందు మంచి ఫ్రెండ్స్. ఇద్దరిట్లో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో కూడా గుర్తుకు లేదు.

ఇంట్లో సినిమాల గురించే చర్చ జరుగుతుందా?

మేం ఇంట్లో ఉంటే సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోం. కొత్త స్క్రిప్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ టాక్ నడుస్తుంది. నేను ఎక్కువ తనకు పుస్తకాల గురించి చెప్పి బోర్ కొట్టిస్తుంటా. లేకపోతే మామూలు భార్యాభర్తలు ఎలా ఉంటారో మేమూ అలాగే ఉంటాం.

ఇద్దరూ విలన్ క్యారెక్టర్లతో ఇండస్ట్రీకి ఎంటరయ్యారు. ఇంట్లో ఎలా?

(నవ్వుతూ..) చాలామంది ఈ ప్రశ్న అడుగుతుంటారు. తను బద్రినాథ్‌లో చేసింది. మేమిద్దరం నెగటివ్ పర్సన్ కాదు. ఇద్దరం ఏం చెప్పాలనుకున్నా మొహం మీదే చెప్పేస్తుంటాం. ఏమనుకుంటారోనని ఆలోచించాం.

- సౌమ్య నాగపురి
సీఎం ప్రవీణ్

858
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles