నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు


Sun,October 15, 2017 01:31 AM

చెరువును నేను ఊర చెరువును నేనురా పంటచేలకు, ప్రతిప్రాణికి అదరువును నేనురా అంటూ ఊరి చెరువు తను చేసే మేలును స్వయంగా చెప్పుకుంటున్నది. అయితే ఇప్పుడు కేవలం పంటలకు, తాగడానికే కాకుండా చెరువులు పర్యాటక ప్రాంతాలుగా కూడా మారుతున్నాయి. రోజంతా పనుల్లో అలసి సొలసి వచ్చే నగరవాసికి ఆహ్లాదాన్ని పంచేందుకు మేమున్నాం రమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. తన ఒడ్డున కూర్చుని ప్రేమ ఊసులాడుకుందురు రమ్మంటూ ప్రేమపక్షులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్‌లో కుటుంబమంతా బోటెక్కి షికారు చేసి కడుపునిండుగా ఆనందాన్ని పంచుకుందురు రమ్మంటున్నాయి. అలుగుపోసుకుంటున్న చెరువులు నేటి పర్యాటక నెలవులై ప్రకృతినేకాదు ప్రతి మనిషిని పరవశింప జేస్తున్నాయి.
ameenpur

హైదరాబాద్ అంటేనే లేక్ సిటీ. వలసపాలకుల పుణ్యాన అనేక చెరువులు, కుంటలు ఆక్రమణకు గురై చెరువులన్నింటా అపార్ట్‌మెంట్లు వెలసినయి. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఎన్నో చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. మిగిలిన కొన్ని చెరువులు నీరొచ్చే మార్గాలు కబ్జాకోరల్లో చిక్కి ఎండి బీటలు వారినై. అయితే కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు పూర్వపు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. నగరంలో మొత్తం 185 చెరువులుంటే వాటిలో కొన్ని చెరువులు అలుగుపోస్తున్నాయి. మిగిలిన చెరువులు సైతం నీటితో నిండుకుండలా మారాయి. వీటిలో చాలా చెరువులు పర్యాటక శోభను సంతరించుకుని ఈ వారంతంలో రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి.

హుస్సేన్ సాగర్ లేక్

hussen-sage
హైదరాబాద్ చరిత్రలో భౌగోళిక ప్రాంతంలో ఒక మైలురాయి వంటిది ఈ హుస్సేన్ సాగర్ చెరువు. 1562 లో ఈ మానవ నిర్మిత చెరువుని హజ్రత్ హుస్సేన్ షా వాలి నిర్మించారు. మూసీ నదికి అనుబంధంగా ఈ చెరువు నిర్మించబడినది. ఈ చెరువుని నిర్మించడంలో ముఖ్య ఉద్దేశ్యం నగరానికి సాగు నీరు అందించడం. ఆ అతిపెద్ద చెరువు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండి సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలను కలుపుతూ ట్యాంక్‌బండ్ ఉంటుంది. ట్యాంక్‌బండ్ పచ్చనిమొక్కలతో, ప్రముఖుల విగ్రహాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చెరువు చుట్టూ నిర్మితమైన నెక్లస్ రోడ్డు రాత్రి పూట లైట్లతో వజ్రాలు పొదగబడిన నెక్లస్ లాగా మెరుస్తూ ఉంటుంది. నెక్లస్ రోడ్డు,హుస్సేన్ సాగర్ చెరువు కలిసి రాత్రి పూట మనోహరంగా కనిపిస్తాయి. ఏక శిలతో రూపొందిన బుద్ధుని విగ్రహం 1992లో ఈ హుస్సేన్ సాగర్ మధ్యలో ప్రతిష్టించబడింది.

దుర్గం చెరువు

Durgam_cheruvu
జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దాగి ఉండడం వల్ల ఈ సరస్సు ని రహస్యపు సరస్సుగా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ప్రజలలో ఈ సరస్సుకి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఖుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో ఇంకా కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం ఈ సరస్సు కల్పించింది. రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ సరస్సుని ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణ గా ఈ సరస్సుని తయారు చెయ్యడం కోసం 2001 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సుని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కొద్ది కాలంలోనే ఈ సరస్సు ఏంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చేపలు పట్టేందుకు అనువుగా ఉంటుంది. ఎంతో మంది సరదాగా చేపలు పట్టడం కోసం ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మలిచేందుకు వెలుగులు, రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్ అలాగే కృతిమ జలపాతాల వంటి ఎన్నో ఆకర్షణలని ఇక్కడ జోడించారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి వివిధ వినోద కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చెరువుపై వేలాడే వంతెనను నిర్మిస్తున్నది.

ఉస్మాన్ సాగర్ లేక్

Osman-Sagar
ఈ ఉస్మాన్ సాగర్, గండిపేట్ గా స్థానికులచే పిలవబడుతుంది. ఇది మరొక మానవ నిర్మిత చెరువు. మూసీ పైన డ్యాం ని నిర్మించే సమయంలో నిర్మితమైనది ఈ చెరువు. 1920 లో నిర్మితమైన ఈ చెరువు అప్పటినుంచి హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల గ్రామాలకు మంచి నీటి అవసరాలని తీరుస్తున్నది. మూసీ నదికి 1908లో వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి మూసీనదిపై ఈ చెరువు నిర్మించారు. ఆఖరి నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ చెరువు నిర్మితమైనది. అయన పేరు మీద ఈ చెరువుని ఉస్మాన్ సాగర్ లేక్ అని పిలుస్తారు. ఈ చెరువు పక్కనున్న రాయల్ గెస్ట్ హౌస్ నుంచి చెరువుని ఆసాంతం చూడవచ్చు. ఈ అధ్బుతమైన సాగర్ మహల్‌ని నిజాం తన వేసవి విడిదిగా వాడే వారు. ఈ అద్భుత భవనం ఇప్పుడు చారిత్రక చిహ్నం గానే కాకుండా ఈ చెరువుని అధ్బుతంగా చూపించే ప్రదేశంగా కూడా ఉన్నది. విలాసవంతమైన విడిదిగా ఈ భవనాన్ని ఉపయోగిస్తున్నారు.

హిమాయత్‌సాగర్

Himayat_Sagar
1908లో హైదరాబాద్‌కు వచ్చిన వరదల నేపథ్యంలో నిర్మించబడిన మరో చెరువు హిమాయత్‌సాగర్. ఈసీనదిపై ఈ చెరువును నిర్మించడం వల్ల వరదలు తగ్గుముఖం పట్టడంతో పాటు నగరానికి అవసరమైన తాగు నీరు అందించే అవకాశం ఏర్పడింది. దీన్ని ఏడవ నిజాం కుమారుడు హిమయత్ ఆలీఖాన్ పేరుతో నిర్మించారు. 1927లో ఈ చెరువు నిర్మాణం పూర్తయింది. పచ్చని ప్రాంతంతో పిక్నిక్ స్పాట్‌గా ఈ చెరువు విలాసిల్లుతుంది. ఇక్కడికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

సఫిల్‌గూడ చెరువు

Safilguda-Lake
నడిమి చెరువుగా కూడా పిలవబడే సఫిల్‌గూడ చెరువు ఓల్డ్ నేరేడ్‌మెట్‌లో ఉంది. ఈ పార్కు చెరువు కట్టను విస్తరించి మిని ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దారు. చుట్టూ పార్కును అభివృద్ధి చేయడంతో దీన్ని సఫిల్‌గూడ లేక్ పార్క్ అని కూడ పిలుస్తున్నారు. ఈ చెరువులో చిన్న ఐస్‌ల్యాండ్ ఉండడంతో దీన్ని నడిమి పక్షి ఐస్‌ల్యాండ్‌గా పిలుస్తున్నారు. దీన్ని దట్టమైన వృక్షాలు కప్పి ఉంటాయి. ఈ చెట్లమీదా వేలాది రకరకాల పక్షులు సేదతీరుతుంటాయి. ప్రత్యేకంగా వలస పక్షులు అలరిస్తుంటాయి. చెరువు కట్టమీద కట్టమైసమ్మ దేవాలయం ఉంది.

అల్వాల్ చెరువు

alwal_lake
సికింద్రాబాద్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చెరువు. పర్యాటకులను ఎంతగానో ఆకర్శించే ఈ చెరువు చాలా వరకు ఆక్రమణలకు గురైనప్పటికీ అల్వాల్ రైల్వే స్టేషన్ స్టేషన్ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది.

రామాంతపూర్ చెరువు

ramanthapur
ఈ చెరువును పెద్ద చెరువు అని కూడా పిలుస్తున్నారు. రామాంతపూర్‌లో ఉన్న ఈ చెరువు నగరంలోని పెద్ద చెరువులలో ఒకటి. ప్రతిరోజు ఇక్కడికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

శామీర్ పేట చెరువు

Shamirpet-Lake
హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్ పేట సికింద్రాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని - హైదరాబాద్, NALSAR యూనివర్సిటీ అఫ్ లా, జీనోమ్ వ్యాలీ వంటి ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థలతో నిండి ఉన్న ప్రదేశం ఈ శామీర్ పేట్. ప్రఖ్యాతి గాంచిన శామీర్ పెట్ చెరువు కూడా ఈ జిల్లాలోనే ఉంది. నిజాం కాలం నాటి మరొక మానవ నిర్మిత చెరువు ఇది. స్థానిక పర్యటనకి ఇది ఒక ముఖ్య ప్రదేశం. ఎన్నో కుటుంబాలు, స్కూళ్ళు, కాలేజీ విద్యార్ధులతో ఈ ప్రదేశం కిటకిట లాడుతుంటుంది. వారాంత విశ్రాంతికి ఇక్కడ ఎన్నో రెస్టారెంట్లు, హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఒక క్లబ్బు, విలాసవంతమైన రిసార్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి. శామీర్ పేటలో ఉన్న జింకల పార్కు లో జింకలె కాకుండా నెమళ్ళు మొదలగు అనేక రకాల పక్షులు కూడా కనబడుతాయి. ఈ పార్క్ శామీర్ పేట చెరువుకి అతి సమీపంలో ఉంది. ఎన్నో తెలుగు సినిమాలు ఈ చెరువు చుట్టుపక్కల ప్రదేశాలలో నిర్మితమైనాయి.

సరూర్‌నగర్ చెరువు

saroornagar-lake
16వ శతాబ్దంలో 1626లో కులీకుతుబ్‌షా పాలనాకాలంలో పంటపొలాలకు నీరందించేందుకు, తాగునీటి అవసరాలకు ఈ చెరువు కట్టించారు. ఒక చదరపు కిలోమీటరు వైశాల్యం కలిగిన ఈ చెరువు కొంత కబ్జాకు గురైనప్పటికీ ఆ తర్వాత చెరువు కట్టను విస్తరించి చెరువు పరిసరాలను తీర్చిదిద్దారు. ఈ చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా విస్తరించడంతో పాటు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇక్కడి ప్రతిరోజు సాయంత్రం వందలాది మంది విహారానికి వస్తుంటారు.

అమీన్‌పూర్‌చెరువు

ameenpur
పటాన్‌చెరు సమీపంలోని అమీన్‌పూర్ చెరువును ప్రభుత్వం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ చెరువు అరుదైన పక్షుల కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రతి చలికాలంలో ప్లెమింగో వంటి అరుదైన పలు రకాల పక్షులు, అందమైన కొంగలు, వివిధ దేశాల పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. దీంతో వీటిని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ చెరువులో 171 రకాల పక్షులు, 250 జాతుల చెట్లు, 9 రకాల చేపలు, 41 రకాల సీతాకోకచిలుకలు, 23 రకాల పాకే జంతువులు, 21 రకాల కీటకాలున్నట్లు తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు గుర్తించి దీనిని జీవవైవిధ్య వారసత్వ సంపద కలిగిన ప్రదేశంగా ప్రకటించింది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.

జీడిమెట్ల చెరువు

jeedimetla
నగరంలో ఐదవపెద్దచెరువుగా పేరున్న జీడిమెట్ల చెరువును నక్కసాగర్ చెరువు, కొల్లచెరువు అనికూడా పిలుస్తారు. దీన్ని నిజాం నవాబులు 1897లో నిర్మించారు. రెండు కిలోమీటర్లకు పొడవు వెడల్పుతో ఉండే ఈ చెరువు కొంపల్లికి సమీపంలోని జీడిమెట్లలో ఉంది. ఇది చేపల వేట, పిక్నిక్‌లకు అనువైన చెరువు.

ఐడీఎల్ చెరువు

idl-cheruvu
కూకట్‌పల్లిలో ఉన్న ఈ చెరువు కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది.

వీటితో పాటు

మంత్రాల చెరువు, కొత్త చెరువు, ఐడీపీఎల్ చెరువు, హస్మత్‌పుర చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్ చెరువు, సూరారం చెరువు, లింగంచెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడురు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, మేకంపూర్ చెరువు, నల్లచెరువు, కాటేదాన్ దగ్గర పల్లె చెరువుతోపాటు నీటితో కళకళలాడే చెరువులు చాలా ఉన్నాయి.

2647
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles