దేశమంతా తెలుగు సినిమా వైపే చూస్తున్నది!


Sat,July 7, 2018 11:25 PM

ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా కీర్తిపతాకాన్ని ఎగురువేసిన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని వెండితెరపై దృశ్యమానం చేయడంలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఆబాలగోపాలాన్ని అబ్బుర పరచిన ఛాయాగ్రాహకుడు కె.కె. సెంథిల్‌కుమార్. చిన్న సినిమా..పెద్ద సినిమా అని తేడా చూడకుండా మనసుకు నచ్చిన కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారాయన. ఆయన ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వహిస్తున్న తాజా చిత్రం విజేత. చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రముఖ ఛాయాగ్రహకుడు కె.కె. సెంథిల్‌కుమార్ చెప్పిన విశేషాలివి.
senthil-kumar

బాహుబలి వంటి భారీ సినిమా తరువాత విజేత లాంటి చిన్న సినిమాకు పనిచేయడానికి కారణం?

-ప్రతి సంక్రాంతికి రాజమౌళిగారి ఫామ్‌హౌజ్‌కు వెళ్లడం నాకు అలవాటు. ఆ సమయంలో బాహుబలి పూర్తయి చాలా ఏండ్లు అవుతున్నది మీరింకా ఏ సినిమాను అంగీకరించలేదు ఏందుకండీ అని సాయి కొర్రపాటి నన్ను అడిగారు. ఆసక్తికరంగా ఉండే సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. అలాంటి కథ కుదిరితేనే పనిచేయాలనుకుంటున్నాను అన్నాను. ఈ మధ్యే ఓ దర్శకుడు నాకు కథ చెప్పాడు. చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ పరంగా భారీ స్కోప్ ఉన్న కథ కాదు. కానీ, సున్నితమైన భావోద్వగాల సమాహారంగా సాగుతుంది. ఒకసారి కథ వినండి. నచ్చితేనే చేయండి అన్నారు. ఆ తరువాత దర్శకుడు రాకేష్ నాకు కథ వినిపించారు. కథలోని అంశాలు మనకు చాలా దగ్గరగా ఉన్న అనుభూతి కలిగింది. అందుకే ఈ చిత్రాన్ని అంగీకరించాను.

విజేత ఎలా ఉంటుంది?

-తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. సాధారణంగా జీవితంలో ఎప్పటికప్పుడు ప్రాధమ్యాలు మారిపోతూ ఉంటాయి. ప్రాధమ్యాలు మారినప్పుడు మన చుట్టూ వున్న పరిస్థితులు కూడా మారుతుంటాయి. మనం విజయం సాధించినప్పుడే కుటుంబంలోనూ, సంఘంలోనూ విలువ ఉంటుంది. ఈ అంశం చుట్టూ అళ్లుకున్న కథ ఇది. ఈ అంశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు రాకేష్ శశి ప్రతి సన్నివేశాన్ని కొత్తగా రాసుకున్నాడు. నా కెరీర్‌లో అదృష్టం కొద్దీ ఐతే నుంచి బాహుబలి వరకు అన్నీ మంచి చిత్రాలే చేశాను. విజేత కూడా ఆ చిత్రాల సరసన నిలుస్తుంది.

చిన్న సినిమా చేయడం వల్ల మీకు పేరొచ్చే అవకాశం తక్కువ కదా?

-అన్ని సినిమాలు పేరు కోసమే చేయలేం. అప్పుడప్పుడు మనకు నచ్చిన సినిమాలు కూడా చేయాలి. అలా అనుకుంటే గోల్గొండ హైస్కూల్ చేసేవాడినే కాదు. ఆ సినిమాతో నాకు బాహుబలి, మగధీర తరహా గుర్తింపు లభిస్తుందని చేయలేదు. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ గేమ్ నేపథ్యంలో సినిమా అనేసరికి చాలా ఆసక్తి అనిపించింది. అందుకే ఆ సినిమా చేశాను. విజేత కథ విన్నప్పుడు కూడా నాకు అలాంటి అనుభూతే కలిగింది.

కెమెరామెన్‌గా తారా స్థాయికి చేరుకున్న మీరు కొత్త హీరోతో చేయడం ఎలా అనిపించింది?

-చిత్రీకరణ ప్రారంభమైన దగ్గరి నుంచి నటుడిగా అతనిలో చాలా మార్పులు గమనించాను. కోడి సాంగ్‌ను చివరన చిత్రీకరించాం. ఈ పాటలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు తొలి రోజుతో పోలిస్తే కల్యాణ్‌దేవ్‌లో ఎలాంటి బెరుకు కనిపించలేదు. ఈ సినిమా కోసం తను చాలా శ్రమించాడు. ప్రతీ సన్నివేశంలోనూ నటన పరంగా పరిణతిని ప్రదర్శిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రానున్న రోజుల్లో మంచి నటుడిగా గుర్తింపు పొందుతాడు.

మీ ప్రయాణంలో పెద్ద దర్శకులకు, చిన్న వారికి మధ్య ఏమైనా వ్యత్యాసాన్ని గమనించారా?

-ప్రతీ దర్శకుడికి ఓ పంథా, ఓ ైస్టెల్ అంటూ ఉంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా దర్శకుడే కెప్టెన్. నేను రాజమౌళితో కలిసి పనిచేశాను కాబట్టి ప్రతీ దర్శకుడి దగ్గర అదే ైస్టెల్‌ను ఆనుసరించి పనిచేస్తాను అంటే కుదరదు. దర్శకుడు రాజేష్‌కు ఓ ైస్టెల్ ఉంది. తను నమ్మిన పంథాలో కథ చెప్పాలనుకున్నాడు. ఆ కథను ఓ కెమెరామెన్‌గా ఎంత అందంగా తెరపైకి తీసుకురావాలన్నదే నా పని.

బాహుబలి తరువాత బాలీవుడ్ నుంచి అవకాశాలు ఏమైనా వచ్చాయా?

-చాలా ఆఫర్‌లు వచ్చాయి. సైరట్ రీమేక్ ధడక్‌కు పనిచేయమని అడిగారు. అలాగే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి కూడా ఓ ఆఫర్ వచ్చింది. అయితే నేను ఎదురుచూస్తున్న కథలు కాకపోవడంతో వాటిని సున్నితంగా తిరస్కరించాను. ఆ దశలోనే విజేత చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది.

బాలీవుడ్‌కు వెళ్లి భారీ సినిమాలకు పనిచేయాలనే కోరిక లేదా?

-ఇక్కడే బాహుబలి లాంటి సినిమాకు పనిచేసి ప్రపంచ స్థాయి ఖ్యాతిని పొందిన నేను ఇలాంటి చిత్రపరిశ్రమను వదిలి బాలీవుడ్‌కు వెళ్లాలనే ఆలోచన లేదు. బాహుబలి చిత్రానికి ముందు బాలీవుడ్‌కు వెళ్లాలనే కోరిక ఉండేది. అయితే ఆ సినిమా విడుదల తరువాత ఆ కోరిక చాలా వరకు తగ్గింది. గత ఏడాది నుంచి తెలుగు సినిమాకు మళ్లీ స్వర్ణ యుగం మొదలైంది. బాహుబలి, ఘాజీ, అర్జున్‌రెడ్డి, గరుడవేగ, రంగస్థలం, మహానటి వంటి విభిన్నమైన సినిమాలొచ్చాయి. ఇలాంటి కొత్త తరహా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారా? అనే అనుమానం చాలా మందిలో ఉండేది. కానీ, ప్రస్తుతం ప్రేక్షకుల దృక్పథంలో మార్పు రావడంతో తెలుగు సినిమాకు కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాను. దేశమంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపే చూస్తున్నది. ఇక్కడ సినిమా విడుదలైతే రీమేక్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇండియాలో సినిమా అంటే కేవలం తెలుగు సినిమానే అనే రోజులొస్తాయి.

senthil-kumar2

నెట్‌ఫ్లిక్స్‌కి పనిచేయబోతున్నారని తెలిసింది? దీనికి రాజమౌళి, దేవా కట్ట దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి?

-రాజమౌళి కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. దేవా కట్ట దర్శకత్వం వహిస్తారు. నెట్‌ఫ్లిక్స్ అనేది నా దృష్టిలో కొత్త ఆట. దీని కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. అంత సమయం నాకు లేదు. ఈ స్టేజ్‌లో టీవీ సిరీస్‌లకు పనిచేయాలనే ఆలోచన కూడా లేదు.

మీకు స్ఫూర్తినిచ్చిన కెమెరామెన్‌లు ఎవరు?

-చాలా పెద్ద లిస్టే ఉంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌లలో రోజర్ డికెన్స్ ఫొటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడతాను. ఆయనతో నాకు స్ఫూర్తి నిచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక ఇండియాకు సంబంధించిన వాళ్లలో ఐతే సంతోష్ శివన్, రవి కె. చంద్రన్‌ల వర్క్‌ను ఇష్టపడతాను. నాకు తెలిసినంత వరకు భారతీయ ఛాయాగ్రహణ ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లింది వీళ్లే. నచ్చిన దర్శకుల గురించి చెప్పాలంటే కూడా పెద్ద లిస్టే ఉంది. శంకర్, మణిరత్నం, రాజ్‌కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ.. ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్లందరితో పనిచేసిన తరువాతే దర్శకత్వం గురించి ఆలోచిస్తాను.

senthil-kumar3

ఒక సినిమాకు కెమెరామెన్ బాధ్యత ఎంత వరకు ఉంటుంది?

-ఫిల్మ్ మేకింగ్ అనేదే విజువల్ మీడియా. అందుకే ఏ సినిమాను తీసుకున్నా విజువల్‌గానే కథ చెప్పాలి. అందుకే ప్రతి సినిమాకు ఛాయాగ్రహకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ విషయంలో విజేత చిత్రానికి నా వంతు బాధ్యతని సమర్థవంతంగానే పూర్తిచేశానని అనుకుంటున్నాను. అది రేపు సినిమా చూసిన ప్రేక్షకులే చెప్పాలి. దర్శకుడు రాకేష్‌కు ప్రతి సన్నివేశంపై పూర్తి స్పష్టత ఉంది. దర్శకుడికి స్క్రిప్ట్ పట్ల పూర్తి స్పష్టత ఉంటే మిగతా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు చాలా సులువు అవుతుంది.

బాహుబలి వంటి భారీ సినిమా చేసిన మీకు చిన్న సినిమా చేయడం ఇబ్బందిగా అనిపించిందా?

-అలా అని ఏమీలేదు. ఒక ఛాయాగ్రహకుడిగా నాకు ప్రతి సినిమా ఓ సవాలే. పెద్ద సినిమాలు చేస్తే ఒకలా.. చిన్న సినిమాలు చేస్తే మరోలా ఉంటుంది. అంతేకానీ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చాలెంజింగ్‌గానే ఉంటుంది. బాహుబలి సినిమాకు నేను ఏది అడిగితే అది సమకూర్చారు. ఆ సినిమాకు పనిచేశాను. కాబట్టి ఆ స్థాయి సౌకర్యాలు కావాలంటే ఇక్కడ కుదరదు. అయితే సినిమా చిత్రీకరణ మొదలైన ప్రారంభ దశలో మాత్రం చిన్న సినిమా వాతావరణానికి అలవాటుపడే విషయంలో కొంత ఇబ్బందిపడ్డాను. బాహుబలిలో ఓ బెడ్‌రూమ్‌కు సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కించాలంటే పెద్ద హాలు ఉండేది కానీ ఈ సినిమాకు అలా కాదు. చిన్న గదిలో కెమెరా.. దానికి అనుగుణమైన లైట్స్ పెట్టడం.. ఇవన్నీ సెట్‌చేసుకుని షాట్ పెట్టడానికి కొంత ఇబ్బందిపడ్డాను. ఈ సినిమాతో మర్చిపోయినవి అన్ని మళ్లీ నేర్చుకున్నానేమో అనిపించింది. ఐతే రోజులు గుర్తొచ్చాయి. బాహుబలి తరువాత ఇలాంటి సినిమాలే చేయాలనే భావనలో ఉన్న నాకు అదృష్టం కొద్ది విజేత నా వాస్తవ స్థితిని గుర్తుచేసింది.

బాహుబలితో కెమెరామెన్‌గా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. దర్శకుడిగా
మారాలనే ఆలోచన ఉందా?

-దర్శకుడిగా పేరుతెచ్చుకోవాలని ప్రతీ టెక్నీషియన్‌కు ఉంటుంది. ఆ కోరిక నాకూ ఉంది. నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చాను. కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసు. నేను దర్శకుడిగా మారే రోజు తప్పకుండా వస్తుంది. అది ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను. ఇప్పుడే చెయ్యాలి అనే ఆత్రుత మాత్రం నాకు లేదు.
-రవి గోరంట్ల
సీఎమ్. ప్రవీణ్‌కుమార్

706
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles