దెయ్యాల బావి


Sat,July 28, 2018 11:47 PM

KATHA
అది వ్యవసాయాధారమైన కుటుంబాలున్న చిన్న గ్రామం. పేరు వెంకటాపురం. అక్కడి రైతులు ఒకరికంటే మరొకరు పోటీలుపడి పంటలు పండిస్తుంటారు. దీంతో ఆ గ్రామం ఎప్పుడూ పచ్చగా ఉండేది. ఒకరోజు ఆ ఊరి వ్యవసాయానికి ఆధారమైన వ్యవసాయ బావిని నాలుగు దెయ్యాలు ఆక్రమించుకొని అందర్నీ భయపెట్టసాగాయి. గ్రామస్తులంతా వాటి దెబ్బకు పంటలు వేయలేక బతుకుదెరువు కోసం వలస వెళ్లడం మొదలు పెట్టారు. దీంతో గ్రామంలో కరువు తాండవించి ఆకలి చావులు మొదలయ్యాయి. కొన్నాళ్ల తరువాత గ్రామ పెద్ద మనుమడు సూరి.. పట్నంలో బాగా చదువుకొని సొంత ఊరికి వచ్చాడు. ఆ గ్రామ పరిస్థితి తెలుసుకొని.. ఎలాగైనా ఆ దెయ్యాల ఆటకట్టించాలని అనుకున్నాడు. ఆ రాత్రే ఎవరికీ చెప్పకుండా పొట్టేలు కూర, దివిటీ తీసుకొని పొలానికి వెళ్లాడు. బావి చేరువయ్యేసరికి దెయ్యాలు సూరిని చూసి వికృతంగా అరుస్తూ భయపెట్టసాగాయి. అయినా అతను భయపడకుండా బావిని చేరుకున్నాడు. పొట్టేలు మాంసం వాసనలకు ఆగలేక అవి అతని చుట్టూ చేరి నాకో ముక్కివ్వవా..? నాకో ముక్కివ్వవా? అంటూ దెయ్యాలు బతిమాలడం మొదలుపెట్టాయి. ఇస్తాను రండి అని వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి చేతిలోని సూరకత్తితో పిల్లదెయ్యం ముక్కు పట్టుకుని కోసి, చంకకు తగిలించుకున్న సంచీలో వేసేసుకున్నాడు.

పిల్లదెయ్యం బాధతో గంతులేస్తున్నది. అది చూసి మిగిలిన దెయ్యాలు లబలబలాడిపోయాయి. భయంతో వణుకుతూ కాళ్ల బేరానికొచ్చాయి. బాబ్బాబు.. మమ్మల్ని ఏం చెయ్యొద్దు. మా బిడ్డను మాకు ఇచ్చేయ్. మేం వెళ్లిపోతాం అంటూ వేడుకున్నాయి. అందుకు సూరి.. సరే బావిలోని నీళ్లతో తెల్లారేలోపల పొలాలన్నీ తడిసేలా పారిస్తే ఏమీ చెయ్యను అని అన్నాడు. భయంతో అవి అలాగే చేశాయి. మర్నాడు మళ్లీ వాటితోనే పొలం దున్నించి, విత్తనాలు నాటించడం వంటి పనులన్నీ రోజుకొకటి చేయించాడు. ఆరునెలలు గడిచేసరికి అందరి పొలాల్లోని పంట ఎప్పటిలాగే చేతికొచ్చింది. మీరు మళ్లీ మా గ్రామం వైపు వస్తే.. ఈసారి అందర్నీ చంపేస్తా అంటూ భయపెట్టడంతో దెబ్బకు బతుకు జీవుడా! అంటూ దెయ్యాలు పారిపోయాయి. మళ్లీ ఎప్పటిలాగే రైతులు సంతోషంగా బతికారు.
నీతి ః సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా పరిష్కరించాలి.
-డేగల అనితాసూరి

210
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles