ది గూబ్- ఎ టీనేజ్ బాయ్


Sat,July 7, 2018 11:16 PM

movie
ఇదొక ఇండిపెండెంట్ సినిమా తరహాలో ఉంటుంది. కథ రెగ్యులర్ సినిమా ఫార్మాట్‌లో ఉండదు. ఒక టీనేజ్ యువకుడి పరిచయం, పరిస్థితులు, కొన్ని సన్నివేశాలు మాత్రమే ఈ సినిమా.

గూబ్ పదహారేండ్ల కుర్రాడు. గూబ్‌కి వేసవి సెలవులు మొదలవుతాయి. సెలవుల్లో సరదాగా ఆటపాటలతో గడుపుదామనుకుంటాడు. గూబ్‌కి తల్లి, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉంటారు. తల్లి అమాయకురాలు. తోడులేక బతుకలేనిది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి ఆడపిచ్చి. కనపడ్డవాళ్లని కావాలనుకునే తత్వం. కోపమెక్కువ. అధికార తత్వం. ఎవ్వరినీ సహించడు. గూబ్ మీద అజమాయిషీ చేస్తుంటాడు. అందుకే వీళ్లిద్దరి మధ్య తెలియని విరోధం.


సెలవుల మూలాన పొద్దునంతా తమ గుమ్మడితోటలో పనిచేయడం, రాత్రి దానికి కాపలాకాయటం గూబ్ పని. అయినా ఎక్కడ సమయం చిక్కినా అక్కడ సరదాగా గడుపుతుంటాడు. వయసు ప్రభావం అలాంటిది. తన తల్లి మిత్రుడి లీలలన్నీ తెలిసినా తల్లికి చెప్పడు.


గూబ్ సరదాగా గడుపుతున్న ప్రతిసారీ అతడు పడనీయడు. తోటలో పనికోసం వచ్చిన ఓ అమ్మాయితో గూబ్‌కి స్నేహం కుదిరి చనువు పెరుగుతుంది. కానీ, ఆ పిల్ల మీద వాడి కన్ను పడుతుంది. గూబ్ ఆ అమ్మాయినీ కలువనీయడు. చివరికి ఆ గూబ్ స్నేహితురాల్ని కూడా బలవంతం చేయబోతాడు. గూబ్ అడ్డుకొని విడిపిస్తాడు. అంతకంటే ఏమీ చేయలేడని వాడికి తెలుసు. గూబ్‌తల్లికి కూడా ఆ విషయం తెలిసినా నిస్సహాయంగా ఆ విషయాన్ని వదిలేయమంటుంది గూబ్‌ని. గూబ్ తల్లిని అర్థం చేసుకుంటాడు. గూబ్ తన వాహనాన్ని తీసుకొని ఎక్కడికో బయల్దేరుతాడు.!!


ఈ సినిమా సినిమాలాగా ఉండదు. కథా, కథనంలో ఏదో వెలితి ఉంటుంది. కొన్ని పాత్రలూ, సన్నివేశాలూ అనవసరం అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు అక్కరలేని ఉపకథల్లాగా వచ్చిపోతాయి. కొన్ని అనవసర విషయాలు చెప్పారేమో అనిపిస్తుంది.
అయితే ఇది డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ Guy Myhill అనే ఒక నూతన దర్శకుడి సినిమా. అతడు ఆ డాక్యుమెంటరీ ైస్టెల్‌ని వదల్లేకపోవడం వల్ల అలా అయి ఉండవచ్చు. లేక సినిమా కథ చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన లేకా కావచ్చు. లేదా తెలిసీ ఇలాగే తీద్దామనుకునీ కావచ్చు.


ఏదేమైనా నాకు నచ్చింది. ఎందుకంటే జీవితం సినిమా కాదు. మన జీవితంలో దారినపోయే దానయ్యలుంటారు. మనకి సంబంధం లేని సన్నివేశాలు జరుగుతుంటాయి. మనం అనుకోని సంఘటనల్లోకి చొరబడుతాం. కాసేపుంటాం. వచ్చేస్తాం. అలా జీవితంలోని ఓ ముక్కని సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ సినిమా. ప్రతిసారీ ఓ మొదలు.. ఓ పెద్ద కంప్లిక్షన్.. ఓ గొప్ప ముగింపూ.. ఇవ్వే సినిమా అవ్వాల్సిన పనిలేదు. రోజూవారీ జీవితంలో ఇవ్వేవీ ఉండవు. ఏదో అనుకుంటాం. ఏదో చేస్తుంటాం. ఎటో పోతుంటాం. నిర్ణయాలు తీసుకుంటాం. వదిలేస్తాం. అటిటూ తిరుగుతాం. ఎంజాయ్ చేస్తాం. ఏడుస్తాం. బాధపడుతాం. నవ్వుతాం.


బాధపడాల్సిన విషయాల్ని లైట్ తీసుకుంటాం. అక్కరలేని విషయాలకు బాధపడుతాం. బాధలకి అలవాటవుతాం. కొత్త బాధలకి భయపడుతాం. అయినా నవ్వాలనుకుంటాం. ఉన్నంతలో హాయిగా ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే, లైఫ్ టెండెన్సీ ఈజ్ టు బీ హ్యాప్పీ అండ్ ఎంజాయ్, ఆనందంగా హాయిగా సుఖంగా ఉండాలనుకోవడం జీవతపు ధోరణి!!


దర్శకుడు సరిగ్గా దాన్నే చూపించాలని అనుకున్నాడని నాకనిపించింది. కనుక నచ్చింది. దానికితోడు సూపర్ సినిమాటోగ్రఫీ. ఆ లొకేషన్లూ.. బాగానే కుదిరిన నటన, నిజజీవితానికి దగ్గరగా ఉండే తరహాలో సినిమా తీసిన విధానం బాగా ఆకట్టుకుంది. గూబ్‌గా చేసిన అబ్బాయి Lian Walpole.. తల్లి బాయ్‌ఫ్రెండ్‌గా చేసిన sean Harris పాత్రలు ప్రస్పుటంగా ఉండి ఆకట్టుకుంటాయి.


ఈ సినిమా గొప్ప సినిమా చూసిన భావన కలిగించదు. కానీ, ఇలాంటి సినిమా ైస్టెలు బాగా నచ్చుతుంది. అందుకే ఇది వివిధ సినిమా పండుగల్లో బహుమతులు పొందకున్నా ప్రదర్శితమైంది.
మీకూ నచ్చొచ్చని పరిచయం చేసా.. ఓ లుక్కేయండి కుదిరితే!!

386
Tags

More News

VIRAL NEWS