దానుత్సవ్ ఒక పండుగ!


Tue,October 2, 2018 11:10 PM

దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది, ఓనమ్, రంజాన్.. ఇవన్నీ మన దేశంలో ఆయా మతాలకు చెందిన వారు జరుపుకునే పండుగలు. పండుగలంటే నిజంగా ప్రతి ఒక్కరికి ఉత్సవంలాగే ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నడుమ వేడుకగా పండుగలను జరుపుకుంటారు. అయితే సామాజిక సేవను కూడా ఒక పండుగలా కొన్ని రోజుల పాటు జరుపుకుంటే ఎలా ఉంటుంది ? దాంతో ఎంతోమంది సహాయార్థులకు ఆపన్నహస్తం అందించవచ్చు.
అందుకోసమే ఉద్భవించింది దానుత్సవ్.

Daan-Utsav
దానుత్సవ్ అనేది నిజానికి స్వచ్ఛంద సంస్థ కాదు. అదొక పండుగ. ప్రతి ఏటా అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు దానుత్సవాన్ని నిర్వహిస్తారు. 2009లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని అంతకు ముందు జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ అని పిలిచేవారు. దీన్నే ఇండియాస్ ఫెస్టివల్ ఆఫ్ గివింగ్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆటో రిక్షా డ్రైవర్ల నుంచి సీఈవోల వరకు, స్కూల్ పిల్లల నుంచి సెలబ్రిటీల వరకు, గృహిణుల నుంచి నాయకులు, మీడియా వ్యక్తుల వరకు ఎంతోమంది భాగస్వాములు అవుతున్నారు. సహాయం అవసరం ఉన్నవారికి ఏదో ఒక విధంగా చేయూతను అందిస్తున్నారు.


పేదలకు సహాయం చేయడమే ప్రధాన ఉద్దేశం

2008 నవంబర్ నుంచి 2009 ఫిబ్రవరి వరకు పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కొందరు వ్యక్తులు ఒక్క దగ్గర చేరి ఇండియా గివింగ్ వీక్‌ను ప్రారంభించారు. దీని పేరిట గుజరాత్‌లో డిజైన్ ఫర్ చేంజ్ అనే పోటీ నిర్వహించారు. అలాగే పేదలకు అవసరం ఉన్న దుస్తులను అందజేసే గూంజ్ సంస్థ ఢిల్లీలో వస్త్రసమ్మాన్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా పేదలకు అవసరం ఉన్న దుస్తులను పంపిణీ చేశారు. అలాగే చెన్నైలో స్టయిల్ ఫర్ స్మయిల్ సీఈవో ర్యాంప్ వాక్‌ను నిర్వహించారు. పేరుకు ఇవి ఈవెంట్లే అయినా.. వీటి ప్రధాన ఉద్దేశం మాత్రం పేదలకు సహాయం చేయడమే.


లక్షల మంది వలంటీర్లు

మార్చి 2009లో యూరో ఆర్‌ఎస్సీజీ ఇండియా అనే అడ్వర్టయిజింగ్ కంపెనీ జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ పేరిట ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. దీని పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహించడం ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో దీన్ని దానుత్సవ్‌గా పేరు మార్చారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా గాంధీ జయంతి నుంచి అక్టోబర్ 8 వరకు దానుత్సవ్‌ను సామాజిక సేవా ఉత్సవంలా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వలంటీర్లుగా పనిచేస్తూ వస్తున్నారు.


Daan-Utsav3

సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇచ్చేయాలి

మనం పెరిగిన ఊరికి ఎంతో కొంత వెనక్కి ఇచ్చేయాలి. లేదంటే లావై పోతాం.. అనే ఓ సినిమా డైలాగ్ అందరికీ తెలిసిందే. సరిగ్గా దానుత్సవ్ కూడా సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇచ్చేయాలి అన్న భావనతో సాగుతున్నది. అందుకే కార్పొరేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులతోపాటు సెలబ్రిటీలు, సాధారణ పౌరులు తమకు చేతనైనంత సహాయాన్ని దానుత్సవ్‌లో భాగంగా అందిస్తున్నారు. ఇది నిజానికి కేవలం ఒక వ్యక్తికో లేదంటే కొంత మంది వ్యక్తులకో, ఒక సంస్థకో చెందింది కాదు. అది ప్రజలందరిదీ. ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా తమకు తోచిన సహాయం చేయడం కోసం ఆవిర్భవించిన వేదిక.


ఈ ఏడాది మరిన్ని ఈవెంట్లతో..

1500కు పైగా ఈవెంట్లు.. 50 నుంచి 80 లక్షల మందికి పైగా దాతలు.. 200కు పైగా ప్రాంతాలు.. ఇవీ ఒక్క 2016లోనే దానుత్సవ్ సాధించిన విజయాలు. మొత్తం 1500కు పైగా జరిగిన ఈవెంట్లలో కొన్ని లక్షల మంది మనస్సున్న మహారాజులు పాల్గొని రూ.10 కోట్ల వరకు డబ్బును సేకరించారు. అదంతా పేద ప్రజల కోసం వినియోగింపబడింది. ఇక ఈ ఏడాది కూడా దానుత్సవ్ మరిన్ని ఈవెంట్లతో ముందుకు వచ్చింది. ఈ ఏడాదితో ఇది 10వ వసంతంలోకి అడుగు పెడుతున్నది. రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా ఎంతో మంది దానోత్సవ్ నిర్వహిస్తున్న ఈవెంట్లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ప్రముఖ సెలబ్రిటీలైన ఆలియాభట్, మేరీ కోమ్, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండుల్కర్, లతా మంగేష్కర్, కార్పొరేట్ దిగ్గజ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ లాంటి ఎంతో మంది ఈ ఏడాది తమ వంతు సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు.


ఈ నెల 8వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవెంట్లను నిర్వహించనున్నారు. వాటిల్లో ఎవరైనా పాల్గొని తమకు చేతనైన సహాయం చేయవచ్చు. అలాగే తమ ప్రాంతంలో ఎవరైనా ఈవెంట్లను నిర్వహించి విరాళాలను సేకరించవచ్చు. అందుకు దానుత్సవ్ సహకారం అందిస్తుంది. మరిన్ని వివరాలకు.. www.daanutsav.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మహేశ్ రెడ్డి భవనం


Daan-Utsav2

నగరంలో దానుత్సవ్..

హైదరాబాద్ నగరంలోనూ రెండు చోట్ల దానుత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వలంటీర్లు. మాదాపూర్ సిలికాన్ టవర్‌లో దీనిని నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా పలువురు ప్రతినిధులు కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తారు. దాతల నుంచి విరాళాలను సేకరించి సహాయం అవసరం ఉన్నవారికి అందజేస్తారు. అలాగే మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోనూ దానుత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా బొమ్మలు, దుస్తులు, రేషన్ సరుకులు తదితరాలను సేకరించి అవసరం ఉన్నవారికి అందిస్తారు.
-మహేశ్ రెడ్డి భవనం

1344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles