దశ తిప్పిన దోశ


Thu,July 19, 2018 01:05 AM

Dosa.jpg
హోటల్ బిజినెస్‌లో కరోడ్‌పతి ధైర్యానికి పట్టుదల తోడైతే ఎవరి సాయం అక్కర లేకుండానే విజయం సాధించగలమని ఆయన జీవితం నిరూపించింది. మన ధ్యేయం చూపే మార్గంలో సూటిగా వెనుకడుగు వేయకుండా సాగితే గమ్యం చేరడం తథ్యమని ఆయన అనుభవం తెలిపింది. కష్టపడితే ఫలితం దానంతటదే వరిస్తుందని ఆయన జీవితం చెప్తున్నది. హోటల్ బిజినెస్‌లో కేవలం రూ. 150 జీతంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం 30 కోట్లకు చేరుకున్నది. ప్రేమ్ సాగర్ దోశ ప్లాజా యజమాని ప్రేమ్ గణపతి విజయ ప్రస్థానమిది.

మనిషి మనుగడ జీరో నుంచే ప్రారంభమౌతుంది. అక్కడే ఉంటే జీరోగానే మిగిలిపోతాం. కానీ ప్రేమ్ గణపతి దీనికి పూర్తి విరుద్ధం. అదేదో సినిమాలో చెప్పినట్లు మెల్లగా ఎలాగో అలా బతికేద్దామని ముంబై రాలేదు. అంతటి కాన్ఫిడెన్స్ గణపతిలో ఉంది. ఆ సంకల్పమే ఆయనను ముందుకు నడిపించింది.
prem-ganapathy.jpg

ఇల్లు వదిలి..

ప్రేమ్ గణపతి సొంతూరు తమిళనాడు ట్యూటికోరిన్ దగ్గర. ఆర్థికంగా అంతగా ఉన్న కుటుంబమేమీ కాదు. అందుకే ఇంట్లో చెప్పా పెట్టకుండా బయటపడ్డాడు. అప్పుడు ఆయన వయసు కేవలం 17 సంవత్సరాలు. ఎటు వెళ్లాలో తెలియకపోయినా ఎలాగోలా బతుకుదామని ముంబై చేరుకున్నాడు. మహానగరం అర్థం కావడానికి టైం పట్టింది. ఆకలి రూపంలో తొలి పరీక్ష ఎదురైంది. ముందు కడుపు బాధ తీరాలి. తర్వాతే ఏదైనా అనుకున్నాడు. మొత్తానికి ఓ బేకరీలో అంట్లు తోమే పనికి కుదిరాడు. తిండిపెట్టి, షెల్టర్ ఇచ్చి, నెలకు 150 రూపాయలు ఇస్తామన్నారు. సరే అన్నాడు. అలా రెండేండ్లు గడిచిపోయాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే చిరుగుల చొక్కా, మాసిపోయిన ప్యాంటు తప్ప జీవితంలో ఏమీ లేదు. ఆ వయసుకి చేతినిండా పని లేదనేదే అతని ఇంటెన్షన్. అందుకే మరికొన్ని రెస్టారెంట్లను మాట్లాడుకున్నాడు. తిండి ఎలాగూ బేకరీలో ఉంది. పనికోసం పిజ్జా డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. అలా జీవితం నవీ ముంబైకి చేరుకుంది.

తోపుడు బండి పెట్టి..

కాలం గిర్రున తిరిగింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు. తెలిసిన వాళ్ల దగ్గర కొంత చేబదులు తీసుకొని ఒక తోపుడు బండి రెంటుకు తీసుకున్నాడు. దానిమీద ఇడ్లీలు, దోశలు పెట్టి వషి రైల్వేస్టేషన్ ముందు నిలబడ్డాడు. కానీ మున్సిపాలిటీ వాళ్లు ఊరుకుంటారా? రోడ్డు పక్కన దుకాణం అంటే చాలు.. ఇరగ్గొట్టేదాకా వాళ్ల మనసు ఊరుకోదు. గణపతి పరిస్థితి అదే. బండి ఇలా పెట్టాడో లేదో- అలా మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి ఈడ్చి అవతల పడేసింది. అలా ఎన్నిసార్లు బండిని ఎత్తుకెళ్లారో లెక్కేలేదు. అయినా గణపతి బెదరలేదు. ఎత్తుకెళ్లనీ.. ఎన్నిసార్లు తీసుకెళ్తారో చూద్దాం అనుకున్నాడు. మొండిఘటం టైపు.
Prem-Ganapathy-Dosa.jpg

ఇంటర్నెట్‌పై పట్టు..

పాజిటివ్ యాటిట్యూడ్ గణపతికి ఎలా అబ్బిందంటే -అతని రూమ్మేట్లలో కాస్త చదువుకున్న వాళ్లున్నారు. అలా వాళ్ల ద్వారా కాన్ఫిడెన్స్ గెయిన్ చేశాడు. అంతేకాదు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా సంపాదించాడు. వీలు దొరికినప్పుడల్లా నెట్ కేఫ్‌లో కూర్చుని గంటా రెండు గంటలు అలా సర్ఫింగ్ చేసేవాడు. అప్పుడే వ్యాపారం అనే మాట మదిలో పడింది. చాలా రీసెర్చ్ చేశాడు. పైగా తను బండి పెట్టే దగ్గర కొత్తగా మెక్ డొనాల్డ్స్ ఓపెన్ చేశారు. అదెంత తక్కువ సమయంలో పాపులర్ అయిందో ఇతను కళ్లారా చూశాడు, అక్కడ ఫిక్సయ్యాడు గణపతి. ఎలాగైనా రెస్టారెంట్ పెట్టాలని డిసైడయ్యాడు.

దశ తిరిగిందిలా..

భాగ్యవంతుడిని ఎవరూ చెడగొట్టలేరు.. దరిద్రుడిని ఎవరూ బాగు చేయలేరంటారుగా. సేమ్ అదే టైప్. గణపతి సుడి ఎలా తిరిగిందంటే- ఇతని దోశ ప్లాజా దగ్గర ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెనైంది. అందులో మేనేజ్‌మెంట్, సిబ్బంది అంతా ఇతని రెస్టారెంటులోనే తినేవారు. తమ మాల్‌లో స్టాల్ పెట్టమని సలహా ఇచ్చారు. అంతే మనోడి దశదిశా అన్నీ ఒక్క దోశతో తిరిగిపోయాయి.

ఇప్పుడు ప్రేమ్ గణపతి దోశ ప్లాజాలు ఇండియా అంతటా 45 ఔట్ లెట్స్ వెలిశాయి. యూఏఈ, ఒమన్, న్యూజిలాండ్ కలిపి మూడు దేశాల్లో 7 ఇంటర్నేషనల్ ఔట్ లెట్స్ అవతరించాయి. అవిగాక ఫ్రాంచైజీ రిక్వెస్టులు. అందులో విదేశాలనుంచి కూడా. ఒకప్పుడు నెలకు 150 రూపాయల జీతంతో బతికిన ప్రేమ్ గణపతి- ఇవాళ కరోడ్‌పతి. ఒకటి కాదు రెండు కాదు 30 కోట్ల రూపాయల టర్నోవర్ అతనిది.

గణపతి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేదే. ఆయన లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవడం అసాధ్యమేం కాదు.

105 రకాలు...


big2.jpg
1997లో ఒక చిన్న ప్లేస్ లీజుకు తీసుకుని రెస్టారెంట్ పెట్టాడు. దానికి నెలకు 5 వేలు రెంటు. హోటల్‌కు ప్రేమ్ సాగర్ దోశ ప్లాజా అని పేరు పెట్టాడు. పేరులోనే దోశ వుంది కాబట్టి దోశలో ప్రయోగాలు చేయాలనుకున్నాడు. రెగ్యులర్ దోశలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ ఇక్కడంటూ ఒక స్పెషాలిటీ వుండాలిగా. అందుకే రకరకాల ఎక్స్‌పరిమెంట్స్ చేశాడు. మొదటిసారి ఒక 26 వెరైటీలు జనాలకు పరిచయం చేశాడు. షెజ్వాన్ దోశ, పన్నీర్ చిల్లీ, స్ప్రింగ్ రోల్ దోశ ఇలా.. అనేక ప్రయోగాలు చేశాడు. 2002 నాటికి ప్రేమ్ దోశ ప్లాజా ముంబై వాసులకు ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అడ్డాగా మారింది. 20-30 కాదు 105 రకాల దోశలు వేసి జనంతో శభాష్ అనిపించుకున్నాడు.

3963
Tags

More News

VIRAL NEWS

Featured Articles