త్యాగమే యోగమని..


Fri,August 17, 2018 01:25 AM

ఆత్మ సమర్పణను మించిన యోగం లేదని మన ధర్మశాస్ర్తాలు ఉద్ఘాటించాయి. భక్తులు పరమాత్మ సాక్షాత్కారం కోసం తమకు తాము ప్రాణార్పణకు సిద్ధపడటం గురించి విన్నాం. కానీ, భగవంతుడే తన భక్తుల్ని (పరీక్షించడానికైతేనేం) బలిదానానికి సిద్ధం కమ్మని ఆదేశించడం అత్యంత అరుదు. బక్రీద్ పండుగ ప్రాశస్త్య కథ మనకు ఇదే చెప్పింది. ఏ రకంగానైనా బలవంతపు ప్రాణత్యాగం అంగీకారం కాదు. అంతటి త్యాగనిరతిని దేవుడు సైతం తట్టుకోలేడు. ఇస్లాం మత దైవమైన అల్లాహ్, తన మహా భక్తుడైన ఇబ్రహీం తనయుడైన ఇస్మాయిల్‌ను బలివ్వడానికి ఒప్పుకోక, ఆ స్థానంలో ఒక గొర్రె (మేక)ను సృష్టించాడన్నది కథనం. మనిషిలోని ప్రాణార్పణ త్యాగగుణాన్ని ఉత్కృష్టంగా చాటిచెప్పిన ఈ సంఘటన దైవం పట్ల మనుషుల భక్తిని మరింతగా ఇనుమడింపజేస్తుంది.
Yoga
ప్రాణార్పణ స్థానంలో ఆత్మ సమర్పణను దాదాపు అన్ని మతాలూ (ధర్మాలు) ప్రబోధిస్తున్నాయి. అత్యుత్తమ ఉదాత్త గుణంగా భారతీయ తత్వవేత్తలు దీనిని అభివర్ణించారు కూడా. తనే త్యక్తేన భుంజీథా అన్న మాట ఈశోపనిషత్తులో ఉంది. అంటే, త్యజించి అనుభవించడం. త్యాగంతో అనుభవించినపుడు మనం కర్మపాశాలకు బద్ధులం కామన్నది అందులోని భావన. తమ స్వలాభాన్ని కూడా త్యాగం చేసి ఇతరుల సంక్షేమం కోసం పాటుపడే వారిని సత్పురుషులుగా భర్తృహరి పేర్కొన్నాడు. అలాగే, శిబి చక్రవర్తి దయాగుణం సాటిలేనిదని మనకు తెలుసు. ఒక పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్నే త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు.

ఇంకా, మహాభారతంలో భీష్ముడు, రామాయణంలో శ్రీరాముడు తమ తండ్రులకిచ్చిన మాటల కోసం తమ జీవితకాల సంతోషాల్నే త్యాగం చేయడం గురించి చదివాం. బలి చక్రవర్తి తనంతట తానుగా మూడడుగుల జాగను దానంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తానే స్వయంగా బలైపోయిన కథ ఒళ్లు జలదరింపజేస్తుంది. ఇంతేనా, పిల్లలు చదువుకొనే ఆవు- పులి కథ వంటి నీతికథలు ఎన్నెన్నో. మనిషి త్యాగబుద్ధిని చాటిచెప్పడానికి ఇలాంటి సందర్భాలు ఎన్నయినా చెప్పవచ్చు.

త్యాగం అంటేనే చాలామంది వెనకడుగు వేస్తారు. కారణం, కోల్పోవడం ఇష్టం వుండదు కనుక. స్వార్థచింతనను పక్కన పెట్టగలిగితే ఇది తేలికవుతుంది. కానీ, ఇది అందరి వల్ల సాధ్యం కాదు. అందరివల్ల సాధ్యమయ్యే త్యాగాలూ దైనందిన పరంగా కొన్ని లేకపోలేదు. మన వారికోసం మనం చేసే చిన్నచిన్న త్యాగాలనుంచి తల్లిదండ్రులు ప్రత్యేకించి మహిళలు తమ ఆత్మీయులు, రక్తసంబంధీకుల కోసం నిత్యజీవితంలో చేసే త్యాగశీలత వర్ణింపనలవి కానిది. త్యాగాలతో మానవ జీవితం ఉదాత్తభరితమవుతుంది. కర్మబంధాల నుంచి విముక్తమవుతుంది. ఆధ్యాత్మిక పరంగా పరిపక్వతను సాధించిన వారికి ఆత్మత్యాగం ఒక ఆభరణమై వెలుగొందుతుందని పెద్దలు అంటారు. స్వార్థాన్ని వదులుకొని ఇతరుల కోసం జీవించే ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అందుకే, మనం ఎంత కాలం జీవించామన్న దానికన్నా ఎలా, ఎంత ఉదాత్తంగా బతికామన్నది ముఖ్యమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

బక్రీద్ పర్వప్రాధాన్యం మనకేం బోధిస్తున్నదీ అంటే త్యాగబుద్ధిని! అల్లాహ్ పేరున గొర్రెనో, మేకనో బలి ఇవ్వడం మాత్రమే కాదు, గొప్ప త్యాగమంటే, మన జీవితంలో మరెంతో విలువైన దానిని కూడా దేవుని పేరుమీద పేదలకు, పరులకు బహుకరించగల దివ్యభావనకు లోనవడం ఇక్కడ ప్రధానం. ఖుర్బానీ పేరుమీద బలిచ్చిన జంతువు మాంసాన్ని మూడు భాగాలు చేసి తొలి భాగం పేదవారికి ఇవ్వడం ద్వారా ముస్లిమ్ సోదరులు దీనిని చాటుకుంటారు. మరొక భాగం బంధువులు, స్నేహితులకు ఇచ్చేసి, మిగిలిన మూడో భాగాన్ని తమ కుటుంబానికై వినియోగిస్తారు. ఇక్కడ పరుల క్షేమానికే అగ్రసింహాసనం. తర్వాత బంధువులు, మిత్రజనం, ఆఖరకు మాత్రమే తన ఉనికి! ఇదీ అసలైన ధార్మిక చింతన.

దేవుని కోసం పరులకు, ఆహారంగా మారుతూ తమ ప్రాణాలనే సమర్పించే మేకలు, గొర్రెలది ఎంత ఉదాత్త జన్మనో కదా అని ప్రశంసించే ధార్మికులూ ఉంటారు. ఆఖరకు బలిపశువు అన్న పేరు ఈ రకమైన జంతువులకు స్థిరపడిపోయింది. ఐతే, మేకలు, గొర్రెలను దైవం కోసం బలివ్వడమన్నది ముస్లిమేతరులలోనూ కనిపిస్తుంది. మన యజుర్వేద దేవత మేక ముఖంతోనే ఉంటుంది.

భక్తికోసమో, భుక్తికోసమో జంతుహింస పెరిగిన మాట వాస్తవం. ఈ క్రమంలోనే ఆత్మత్యాగ భావనకు ఆధ్యాత్మిక వేత్తలు పెద్దపీట వేస్తున్నారు. ఒక చెట్టులా నిస్వార్థంగా మానవుడు కూడా పరులకోసం తన జీవితాన్ని ఉపయోగించాలని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు, ఉద్ధవునికి ఉద్బోధించినట్టు చదివాం. వేలాదిమందికి నీడను, అనేక జీవాలకు ఆశ్రయాన్ని ఇస్తూ ప్రాణికోటికి సేద తీరుస్తున్న మహావటవృక్షంలా మనిషి జీవితం కూడా ఉండాలని హైందవ ఆధ్యాత్మిక గ్రంథాలు నొక్కి చెప్పాయి. ఇలాంటి ఆత్మత్యాగమే ఆధ్యాత్మిక పరిశుద్ధతకు, జీవన ఔన్నత్యానికి మార్గదర్శకమవుతుంది.
Yoga1

కొడుకు స్థానంలో మేక!

ఉత్కృష్టమైన త్యాగనిరతిని గుర్తుకు తెచ్చే బక్రీద్ పర్వదినాన్ని ముస్లిమ్ సోదరులు త్వరలో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా త్యాగగుణ విశిష్ఠతను తెలియజెప్పే ప్రత్యేక వ్యాసం.
బక్రీద్ పర్వ ప్రాశస్త్యాన్ని తెలిపే కథ తెలుసుకుంటే ముస్లిమ్ సోదరులు ఈ పండుగ నాడు మేకనో లేదా గొర్రెనో ఎందుకు ఖుర్బానీ (బలి) ఇస్తారో తెలుస్తుంది. బక్రీద్‌ను అరబ్‌లో ఈదుల్ అజ్ హా (ఈదుల్ జుహా) అనీ పిలుస్తారు. అంటే, త్యాగనిరతిని వెల్లడించే పర్వదినమని అర్థం. ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం మహ్మదీయుడు, గొప్ప భక్తుడైన హజ్రత్ ఇబ్రహీంను అల్లాహ్ పరీక్షించదలుస్తాడు. ఆయన కలలో కనిపించి వారి కుమారుడు ఇస్మాయిల్‌ను తనకు బలివ్వాలని ఆదేశిస్తాడు. ఇస్మాయిల్ కూడా అల్లాహ్ భక్తుడే కనుక బలవడానికి సిద్ధమవుతాడు. వారి ఉదాత్తగుణాన్ని మెచ్చిన అల్లాహ్ కత్తివేటు ఇస్మాయిల్‌పై పడకుండా ఒక మేక మెడపై పడేలా చేస్తాడు. ఈ ఆత్మత్యాగానికి గుర్తుగానే బక్రీద్ జరుపుకుంటారు.

347
Tags

More News

VIRAL NEWS