తొలిప్రేమ తిప్పలు!


Wed,September 5, 2018 01:08 AM

తొలిప్రేమ.. రెండక్షరాల సుదీర్ఘ ప్రయాణం. రెండు హృదయాల కలయిక. ఎలా పుడుతుందో, ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. కానీ, ఈ యువకుడికి మాత్రం ట్రైన్‌లో పుట్టింది. ఆ ప్రేమ ఎంతదూరం వెళ్లిందంటే, ప్రేయసి వివరాలు తెలియక ఆమెకోసం ఏకంగా 4 వేల పోస్టర్లు కొట్టించి, ఊరంతా అంటించేలా!
Toli-Prema
ఇతడే ఆ ప్రేమికుడు. ఇతగాడి తిప్పలు మామూలుగా లేవండోయ్. రైల్లో కనిపించిన ఓ అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించేశాడు. రెండు గంటల ప్రయాణంలో రెండు జతల కళ్లు చెప్పుకున్న ఊసులు.. అతడి మనసును మాయచేశాయి. మాట కలిపేలోపే.. గమ్యం గమ్మత్తు చేసింది. ఆమె దిగాల్సిన ఊరు రావడంతో రైలు దిగి వెళ్లిపోయింది. వెళ్తూ.. వెళ్తూ.. ఖుషి సినిమాలో భూమికలా ఓ చిరునవ్వు వదిలి వెళ్లింది. అంతే, మనోడి మనసులో అలజడి ఉప్పెనైంది. ఆమె చిరునామా కోసం ఊరంతా వెతుకుతూ.. ఇదిగో ఇలా ఆమె కోసం ఊరంతా పోస్టర్లతో నింపేశాడు. ఈ భగ్న ప్రేమికుడి పేరు విశ్వజిత్ పొద్దర్. వయస్సు 29. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లో రాష్ట్ర పర్యావరణ శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. బెహలాలో నివసిస్తున్న విశ్వజిత్ రోజూ లోకల్ రైల్లో కోల్‌కతాకు రాకపోకలు చేస్తాడు. జులై 23న కొన్నాగర్ రైల్వే స్టేషన్‌లో ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆమె తల్లిదండ్రులతో అదే రైలు ఎక్కి, అతని ఎదురుగా కూర్చుంది. అలా తొలిచూపులోనే అతని గుండెల్లో గంట మోగింది. క్రమంగా ఆమె కూడా ఇతన్ని చూస్తుండడంతో మాటలు కూడా కలిశాయి. అయితే ఆమె సొంత ఊరు, పేరు కనుక్కోలేకపోయాడు. చివర్లో తను చూసిన చూపునకు ఫిదా అయిన విశ్వజిత్.. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని నానా తంటాలు పడుతున్నాడు. ఇందుకోసం ఆ రోజు ఆమెను కలుసుకున్నప్పడు వేసుకున్న టీ షర్ట్ -జీన్స్‌తో ఫొటోలు తీయించుకొని, 4 వేల పోస్టర్లు సిద్ధం చేశాడు. వాటిలో అతడి ఫోన్ నెంబరుతో పాటు యూట్యూబ్‌లో ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్నాగరర్ కొనే (కొన్నగర్ పెళ్లికూతురు) వీడియో లింక్ పెట్టాడు. ఆ పోస్టర్లు చూసి తప్పకుండా ఆమె తనకు ఫోన్ చేస్తుందని విశ్వజిత్ నమ్ముతున్నాడు. మరి, అతడి తొలిప్రేమ ఎప్పటికి సక్సెస్ అవుతుందో.

3455
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles