తెలుగు సాహిత్యం చదవాలని ఉంది!


Sun,July 29, 2018 01:57 AM

ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసింది మలయాళీ సోయగం మాళవిక నాయర్. కల్యాణ వైభోగమే, మహానటి, విజేత చిత్రాల్లో చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అమాయకత్వం మూర్తీభవించిన మోము, కళ్లలో ఏదో తెలియని ఆకర్షణతో యువతరాన్ని కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కథల ఎంపికలో నాకంటూ కొన్ని ప్రాథమ్యాలు ఉన్నాయి. సినిమాల నుంచి దూరమయ్యాక కూడా నా పాత్రల గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవాలి. అలాంటి అర్థవంతమైన సినిమాల్నే అంగీకరిస్తాను అని అంటున్న ఈ సొగసరి తన సినీ ప్రయాణం గురించి చెప్పిన ముచ్చట్లివి..
Malavika
13 ఏండ్ల వయసులోనే: నా తల్లిదండ్రుల స్వస్థలం కేరళ. నాన్న ఉద్యోగరీత్యా ఢిల్లీలో పనిచేయడంతో నేను అక్కడే పుట్టి పెరిగాను. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. పాఠశాల రోజుల నుంచే నన్ను అందరూ చలాకీ అమ్మాయి అనేవారు. అకాడమిక్స్‌తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు.. ఇలా అన్ని రంగాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండేదాణ్ని. ప్రతి పనిలో పర్‌ఫెక్షన్ కనబరచాలని తపించేదాణ్ని. ఇప్పుడు కూడా అదే దృక్పథంతో సినీ రంగంలో రాణిస్తున్నాను. స్కూల్ రోజుల్లో సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేదికాదు. నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. చదువుతో పాటు ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టాలి. సృజనాత్మక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి అని నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన ప్రోత్సాహంతోనే సినీరంగంలోకి అడుగుపెట్టాను. 13 ఏండ్ల వయసులోనే మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్‌లో చిన్న పాత్రలో నటించాను. ఆ తర్వాత మలయాళంలో మరో నాలుగు సినిమాలు చేశాను. కుకూ చిత్రం ద్వారా తమిళంలో కథానాయికగా అరంగేట్రం చేశాను. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాను.

క్లాసులు అస్సలు మిస్ చేయను: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో వున్నప్పుడు నాకు ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో నటించే అవకాశం లభించింది. కాలేజీకి సెలవులు ఎక్కువగా తీసుకోకుండానే షూటింగ్ పూర్తిచేశాను. సినిమాల్లో అవకాశాలొస్తున్నాయని చదువుల్ని నిర్లక్ష్యం చేయను. నా వృత్తిని, చదువుని బ్యాలెన్స్ చేయడం ఒక్కోసారి ఒత్తిడిగా అనిపిస్తుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు విరామ సమయాల్లో చదువుకుందామంటే అస్సలు కుదరదు. సెట్‌లో వాతావరణమంతా హడావుడిగా ఉంటుంది. అక్కడ చదువుకుందామంటే ఏకాగ్రత కుదరదు. కాబట్టి షూటింగ్ లేని సమయాల్లో క్లాసులు అస్సలు మిస్ చేయను. కల్యాణ వైభోగమే టైమ్‌లో కొన్ని క్లాస్‌లు మిస్ కావడంతో తర్వాత ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పించుకున్న.

పెయింటింగ్ ఎగ్జిబిషన్ కోసం

Malavika2
నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. మనసులో తట్టిన భావాల్ని వెంటనే క్యాన్వాస్‌పైకి తీసుకొస్తాను. ఇప్పటికీ రకరకాల థీమ్‌లతో పెయింటింగ్ వేశాను. అన్నింటినీ కలిపి పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టాలని కోరికగా ఉంది. ఈ ఏడాది చివరలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాను. పెయింటింగ్స్‌తోపాటు నాకు రచనలు చేయడమంటే చాలా ఇష్టం. స్కూల్ రోజుల నుంచే రచయిత్రిని కావాలనే ఆకాంక్ష ఉండేది. సాహిత్యంతో పాటు చరిత్రకు సంబంధించిన పుస్తకాలు బాగా చదువుతాను. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే ప్రయత్నంలోఉన్నాను. తెలుగులో ఉన్న గొప్ప సాహిత్యం గురించి నా హైదరాబాద్ స్నేహితులు చెబుతుంటారు. తెలుగు నేర్చుకొని ఇక్కడి సాహిత్యం గురించి చదవాలని ఉంది.

హీరోయిన్ అని ఫీలవను: కాలేజీకి వెళ్లినప్పుడు నేను హీరోయిన్ అనే విషయాన్నే మర్చిపోతాను. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఉంటాను. కొత్త ప్రదేశాల్ని సందర్శిస్తూ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాను. నాకు హైదరాబాద్ నగర జీవితం ఎంతగానో నచ్చింది. అదృష్టం కొద్ది ఇక్కడ నా వ్యక్తిత్వానికి తగిన ఫ్రెండ్స్ దొరికారు. విరామ సమయాల్ని ఫ్రెండ్స్‌తో ఆస్వాదిస్తాను. హైదరాబాద్ ఫుడ్, నైట్ లైఫ్ బాగా నచ్చుతుంది.

అదే ఫిట్‌నెస్ మంత్రం: ఆహారం విషయంలో ఎలాంటి నియమాల్ని పాటించను. నచ్చిన ఫుడ్ తీసుకుంటాను. నేను ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల పంజాబీ, రాజస్థానీ భోజనాల్ని ఎక్కువగా ఇష్టపడతాను. బరువు తగ్గాలనో పెరగాలనో ఎప్పుడూ ప్రయత్నించను. ఎలా వున్నా శారీరకంగా ఫిట్‌గా ఉండాలనుకుంటాను. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రతి విషయంలో పాజిటివ్‌గా ఉంటాను: జీవితంలో నాకు పెద్ద లక్ష్యాలంటూ ఏమీ లేవు. నచ్చిన పని చేయడమే లక్ష్యంగా భావిస్తాను. పోటీతత్వం నాకు అస్సలు నచ్చదు. ఎవరి వ్యక్తిగత ప్రతిభను బట్టి వారు జీవితంలో రాణిస్తారు. అలాంటప్పుడు పోటీ గురించి ఆలోచించడంలో అర్థం లేదన్నది నా ఫిలాసఫీ. ప్రతిరోజునూ ఉన్నతంగా గడపాలని అభిలషిస్తాను. రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఎంత ఫలవంతంగా గడిచింది? ఎలాంటి మంచి పనులు చేశానని విశ్లేషించుకుంటాను. సమయాన్ని వృథా చేయకుండా ప్రొడక్టివ్‌గా ఉన్నామనే భావననే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది.

ఎప్పుడూ గుర్తుండిపోవాలి: నటిగా పెద్ద లక్ష్యాల్ని పెట్టుకోలేదు. కథలో కొత్తదనం ఉంటూ అభినయప్రధానమైన పాత్రల్నే చేస్తాను. ఎలాంటి పాత్ర చేసినా నాదైన ముద్ర ఉండేలా చూసుకుంటాను. సినిమాల నుంచి దూరమయ్యాక కూడా నా పాత్రల గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా ఉండాలి. అలాంటి ప్రభావశీలమైన పాత్రలు చేయాలని ఉంది. ఎవడే సుబ్రమణ్యం సినిమా గురించి నా ఫ్రెండ్స్ ఇప్పటికీ మాట్లాడుతుంటారు. అందులోని ఫిలాసఫీతో వాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. నిరుత్సాహంగా ఉన్న ప్రతిసారీ ఆ సినిమా చూస్తే ఏదో తెలియని శక్తి లభించినట్లుగా ఫీలయ్యామని నాతో చెబుతుంటారు.

అలా మొదలైంది..

Malavika1
ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో అనుకోకుండా అవకాశమొచ్చింది. నా ఫొటోలు కొన్నింటిని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కడో చూశాడట. సినిమాలో తాను అనుకున్న పాత్రకు నేనైతే పక్కాగా సరిపోతానని భావించడంతో నన్ను సంప్రదించాడు. కథ ఎంతగానో నచ్చడంతో ఎవడే సుబ్రమణ్యం చిత్రానికి వెంటనే ఒప్పుకున్నాను. ఆ సినిమాలో నేను చేసిన ఆనంది పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తెలుగులో తొలి చిత్రమే నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో కల్యాణ వైభోగమే చిత్రంలో నటించాను.

కళాధర్‌రావు

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles