తెలంగాణ అందాలు..తీసిన కనువిందురో!


Sun,August 13, 2017 01:29 AM

Shekarkamala
ప్రియమైన దర్శకులారా.. పుడమితల్లికి పచ్చచీర కట్టినట్లుండే పసిడి సిరుల పంటపొలాలు.. కనులను కనువిందుచేస్తూ ఆహ్లాదపరిచే అందమైన గుట్టలు.. ఎగుడు దిగుడుగా ఉండి ఎల్లలను సూచించే ఎత్తయిన కొండలు.. జలజల పారుతూ ఝరీవేగంతో సుయ్‌ఁమని దుంకే జలపాతాలు.. నల్లరేగడి నారు మడుల్లో నాట్యం చేసే నాగటి సాళ్లు.. చూస్తే ఏమనిపిస్తుంది? తెలంగాణ అందాలు తీసిన కనువిందురో అనిపించదూ?! ఆదిలాబాద్ అడవి తల్లిని.. ఖమ్మం సెలయేళ్లను.. రంగారెడ్డి నల్లరేగడిని..నిజామాబాద్ పచ్చని పైర్లను చూస్తే.. ఏ అమెరికా అందాలు.. కోనసీమ హొయలు అవసరం లేదంటున్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. కల్మషం లేని తెలంగాణ మనుషుల మధ్య.. చూస్తే కడుపునిండిపోయే తెలంగాణ అందాలతో ఎన్ని సినిమాలైనా తీయొచ్చంటున్నారు.! ఫిదా అనుభవాలు.. భవిష్యత్ తెలంగాణ సినిమా గురించి శేఖర్ కమ్ముల ఏమంటున్నారో.. ఆయన మాటల్లోనే.. మధ్యతరగతి అనుబంధాలతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాధారణ కథాంశాలతో సినిమాలు వచ్చాయా? లేదా? అని పరిశోధిస్తే అలాంటి సినిమాలు రాలేదని అర్థమైంది. ఆ నేపథ్యంలో సన్నివేశాలను రాయడం మొదలుపెట్టాం. అప్పటికీ ఈ కథతో సినిమా చేయాలని గానీ, దిల్‌రాజు నిర్మాతగా అనుకోలేదు. లొకేషన్స్ కోసం తెలంగాణ ప్రాంత వాతావరణం ఎలా ఉంటుందో చూడాలని రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలు తిరిగాం. అక్కడి గుట్టలు, పచ్చటి పొలాలు, చెట్లు, ప్రకృతి చాలా నచ్చాయి.

దాంతో తెలంగాణ కథాంశంతో సినిమా చేస్తే వర్కవుట్ అవుతుందని భరోసా రావడంతో పూర్తి కథను సిద్ధం చేసుకున్నాను. తెలుగు సినిమాల్లో పల్లెటూరు అనగానే కోనసీమను ఎక్కువగా చూపిస్తుంటారు. మేము మాత్రం ఆ పంథాకు భిన్నంగా చాలారోజుల క్రితమే అడుగులు వేశాం. అనీష్ కురువిల్లా దర్శకత్వంలో నేను నిర్మించిన ఆవకాయ్‌బిర్యానీ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. వికారాబాద్‌లో ఆ సినిమాను చిత్రీకరించాం. నల్లటి మట్టితో కూడిన అక్కడి భూములు, అటవీ ప్రాంతాన్ని చూడగానే భౌగోళికంగా మా సినిమాకు అదే అనుకూల ప్రాంతమనిపించింది. మా ఊహలకు భిన్నంగా చాలా అందంగా అక్కడి లొకేషన్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత వాటికి గుర్తింపు వచ్చింది.

తొలుత ఫిదా సినిమాకు ముసురు అనే పేరు పెదడామని అనుకున్నాను. దిల్‌రాజు పల్లకి పేరయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. హఠాత్తుగా ఓ రోజు ఫిదా అనే పదం మనసులో మెదిలింది. దివంగత రచయిత సి.నారాయణరెడ్డి తన రచనల్లో ఉర్దూ మేళవింపుతో కూడిన ఇలాంటి పదాలను తరుచుగా వాడేవారు. కాబట్టి మా సినిమాకు ఫిదా టైటిల్ బాగుంటుంది. ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతులు సంప్రదాయాలపై అవగాహన పెంచుకుంటూ ప్రతి సన్నివేశాన్ని సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. పెండ్లి సన్నివేశాలతో పాటు పాత్రల పేర్లు, బతుకమ్మ పండుగ, పోలు పోయడం... ఇలా ప్రతీదీ ఉన్నది ఉన్నట్లుగానే చూపించాం. నాగబాబు గారు చెప్పినట్లు ఈ సినిమా కలల ప్రపంచంలో విహరించిన అనుభూతిని కలిగిస్తుంది. చాలా రోజుల పాటు ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది. ఈ సినిమా విషయంలో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు గర్వపడుతున్నాను. సృష్టిలో ఇప్పటివరకూ ఎప్పుడు, ఎక్కడ జరుగని అంశాల పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. ఈ సినిమా కథ నాలో అలాంటి ఆసక్తినే రేకెత్తించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, వారి మధ్య వచ్చే సంభాషణలు హృదయాన్ని సృశిస్తాయి. నాకున్న అవగాహన మేరకు హైదరాబాదీ మాండలికంలోనే స్వచ్ఛమైన తెలంగాణ సినిమాను తీశా.

అంకాపూర్‌కు చికెన్ కోసం..

ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అంకాపూర్‌లో చికెన్ బాగుంటుందని తెలియడంతో తినడానికి అక్కడకు వెళ్లాం. పచ్చదనంతో నిండిపోయిన అక్కడి నర్సరీల అందాలు నన్ను ఆకట్టుకున్నాయి. దాంతో ఆ ప్రాంతంలోనే ఫిదాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను. నా సినిమాల్లో సెట్స్ వేయడం అలవాటు లేదు. సహజంగా ఉండాలని హీరోయిన్ ఇంటి కోసం అన్వేషిస్తూ బాన్సువాడ వెళ్లాం. ఆ ఊరిలో విఠల్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన పురాతన కాలం నాటి ఇళ్లు చాలా నచ్చింది. స్వతంత్ర సమరయోధుల ఫొటోలతో పాతకాలం నాటి డిజైన్‌తో వైవిధ్యంగా ఉంది. నా ఆలోచనలకు అనుగుణంగా ఆ ఇంటిని, పరిసరాల్ని తీర్చిదిద్దాం. దాదాపు యాభై రోజుల పాటు బాన్సువాడలో చిత్రీకరణ జరిపాం. అక్కడ షూటింగ్ ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియన్స్. అమెరికా కంటే బాన్సువాడే నాకు బాగా నచ్చింది. ఆ ప్రాంతం వారు మా సినిమాలో భాగమయ్యారు.

ప్రతి రోజు పిల్లలను స్కూళ్లకు పంపించిన తర్వాత ఆడవాళ్లంతా సెట్స్‌కు వచ్చేవారు. సినిమాలో కీలకమైన పెండ్లి సన్నివేశాలను అక్కడి ప్రజల మధ్యే చిత్రీకరించాం. షూటింగ్‌కు అనుగుణంగా వారు ఎలాంటి బట్టలు ధరించాలో, ఏ వయస్సు వారు అవసరమో... ఇలా ప్రతి విషయంలో మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చాలా హార్డ్‌వర్క్ చేసింది. బాన్సువాడలో షూటింగ్ జరుగుతున్నన్నాళ్లు మాకు అవసరమైన ఆరిస్టుల కోసం ప్రతిరోజు ఆ ప్రాంతం వారిని ఆడిషన్స్ చేసేవాళ్లం. చిత్రీకరణకు అవసరమైన వారిని పట్టుకోవడం, సంభాషణల విషయంలో వారికి శిక్షణను ఇప్పించడంపైనే రాత్రింబవళ్లు నిమగ్నమయ్యాం. కొన్నిసార్లు అనవసరంగా తమను పిలిచారని అక్కడి వారు కోపగించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిని సముదాయించడం, వారి పాత్రలను మార్చకుండా మాకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం ఇలా ప్రతిదీ ఓ అనుభవంగా మిగిలిపోయింది. ఏడు గంటలకు షూటింగ్ అంటే ఉదయం ఐదు గంటలకే సిద్ధమై మా కసరత్తులు మొదలుపెట్టేవాళ్లం. మా షూటింగ్‌కు అవసరమైన చిన్న చిన్న వస్తువులను ఇంటింటికి తిరిగి సేకరించాం. ప్యాకప్ చెప్పేరోజు బాన్సువాడ ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. వారితో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడియో వేడుకకు అందరిని ఆహ్వానించాం.

పక్కా హైదరాబాదీని..

నేను పక్కా హైదరాబాదిని. నా మాటతీరు మిక్స్‌డ్‌గా ఉంటుంది. అన్ని భాషలను కలిపి మాట్లాడుతుంటాను. ఇక్కడే పుట్టిపెరిగాను. నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఆ ప్రభావం నా రచనా శైలిపై పడింది. తెలంగాణ మాండళికంలో ఏదైనా తొందరగా రాయగలను. ఆ రాయడంలో నవ్వించడం, గేలిచేయడం కాకుండా ప్రేమ దాగి ఉంటుంది. అందుకే అందరూ నా మాటలతో తొందరగా ప్రేమలో పడుతారు. ఫిదా సినిమాను బాధ్యతతో చేశాను. ఇక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు, భాష, ప్రాంతాలపై ఇష్టం పెంచుకొని ఈ సినిమాను తెరకెక్కించాను.

మా సినిమా అని గర్వపడ్డారు...


fidha3
బాన్సువాడలో షూటింగ్ చేసిన ఇల్లు నిర్మాత దిల్‌రాజు తమ్ముడైన శిరీష్ బంధువులది. సినిమా చిత్రీకరణ సమయంలో రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాకు అన్ని విధాలుగా సహకరించారు. లొకేషన్స్‌తో షూటింగ్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. మా సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ఆయన వచ్చారు. తెలంగాణ సినిమా తీస్తున్నామని తెలియగానే గర్వపడ్డారు. సినిమా తర్వాత బాన్సువాడ పేరు మారుమోగిపోతుందనే నమ్మకముంది. అక్కడ షూటింగ్ చేసిన అనుభవాల్ని పదే పదే చెప్పాలనిపిస్తుంది. భవిష్యత్తులో బాన్సువాడలో చాలా సినిమాల షూటింగ్‌లు జరుగుతాయనే నమ్మకముంది. తెలంగాణ ప్రాంతాలు కొత్త ట్రెండ్‌గా సృష్టిస్తాయని అనుకుంటున్నాను. బాన్సువాడలో ఓ పాటను చిత్రీకరించే సమయంలో వేసవి రావడంతో పచ్చదనం కోసం చాలా రోజులు వేచిచూశాం. వేరే ప్రాంతంలో తీద్దామని యూనిట్ చెప్పినా నేనే వద్దన్నాను. ఆ ప్రాంతంపై ఉన్న ప్రేమ మమ్మల్ని కట్టిపడేసింది. సినిమా చూస్తున్న వారు మన ఇంట్లో జరుగుతున్న కథే అన్న అనుభూతికి లోనవుతారు. పాత్రల తీరుతెన్నుల, వారు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయి. నా దృష్టిలో సినిమాను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడంలోనే ఎక్కువ కష్టం దాగి ఉంది. ఆ శ్రమే మా సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది.

మూసధోరణిని బ్రేక్ చేశాం...


Fidaa-Sai-Chand
ఫిదా చిత్రంలో పాత్రల పరంగా మూసధోరణిలో కాకుండా అంతా కొత్తవారిని తీసుకోవాలని భావించాం. ఆ ఆలోచనతోనే తండ్రి పాత్ర కోసం సాయిచంద్‌ను సంప్రదించాం. పాటల విషయంలో వచ్చిండే.. అనే గీతాన్ని గాయని మధుప్రియతో పాడించాం. తెలంగాణ బాణీలో సాగే ఈ గీతం పెద్ద హిట్టయింది. భాష, సంభాషణలను బట్టే ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే చిత్రీకరణ మొదలైన కొద్ది రోజులకే అర్థమైపోయింది. తెలంగాణ నేపథ్యం ఫిదా సినిమాకు చాలా ఎస్సెట్. ఈ సినిమాతో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ నమ్మకమైతే నాకు ఉంది. అందుకే జాగ్రత్తగా, బాధ్యతతో సినిమా చేశాం. చాలా అందంగా వచ్చింది. హీరోహీరోయిన్ల మాటలు, వారి ప్రేమకథ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంది. ప్రాంతీయ భేదాలకు తావు లేకుండా తెలంగాణ కుటుంబంలో ఉండే అనుబంధాలను, ఆప్యాయతలను మనసుల్ని హత్తుకునేలా తెరపై దృశ్యమానం చేశాం. గతంలో తెలంగాణ నేపథ్యంలో గౌతమ్‌ఘోష్ మాభూమి సినిమా తీశారు. ఆ సినిమాతో పోలిస్తే ఫిదా భిన్నంగా ఉంటుంది. తెలంగాణ సినిమాలంటే పటేల్‌దారుల పెత్తనాలు, దోపిడీలు, దౌర్జన్యాలే కనిపిస్తాయి. ఆ మూసధోరణిని ఈ సినిమాతో బ్రేక్ చేశాం.

హ్యాపీడేస్ రోజులు గుర్తొచ్చాయి...


fidaa-weddingshenanigans
ఫిదాతో పాటు గోదావరి సినిమా నా ఆలోచన దృక్పథాన్ని మార్చాయి. నాలో మార్పుల్ని తీసుకొచ్చాయి. ఫిదా విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణలో పెండ్లి తంతు, భాషలు, వాటి మధ్య ఉండే సారూప్యతను అర్థం చేసుకున్నాం. మాకున్న పరిధుల్లో కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని అందరికి అర్థమయ్యే భాషనే సినిమాలో చూపించాం. ఫిదా టీమ్‌ను చూడగానే హ్యాపీడేస్ రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో హాస్టల్‌లో ఉంటూ 70 రోజుల్లో ఆ సినిమాను పూర్తిచేశాం. అలాగే ఫిదా సినిమాలో కోసం సాయిచంద్‌తో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అబ్బాయి, హీరోహీరోయిన్లతో పాటు యూనిట్ అందరం కుటుంబంలా కలిసిపోయి పనిచేశాం. చిత్రీకరణ సమయంలో కూతురుకు పెళ్లిచేసి అత్తారింటికి పంపించినట్లనిపించింది. తెలంగాణ నేపథ్యం నాలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. సిటీలో ఉండే గొడవలన్నీ వదిలేసి సరదాగా కారులో తెలంగాణ ప్రాంతాలన్ని తిరగాలని అప్పుడప్పుడు అనిపిస్తున్నది. పచ్చదనం, కల్మషం లేని మనుషులతో తెలంగాణ చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

బుజ్జిగాడు.. నేను లోకల్


fidhaboy
ఫిదాలో బుజ్జిగాడుగా నటించిన బాల నటుడు ఆర్యన్ మనోడు. మన నిజామాబాద్ బిడ్డ. అమెరికాలో ఉంటున్న ఆర్యన్ పరిచయం.
ఎనిమిదేళ్ల వయసున్న పిలగాడు. మొదటిసారి వెండితెర మీద నటించిండు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నాడు. డబ్‌స్మాష్‌లు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశేటోడు. స్కూల్లో జరిగే కల్చరర్ ప్రోగ్రామ్‌లల్ల పాల్గొంటాడు. యూట్యూబ్‌లో ప్రత్యేక ఛానల్ పెట్టి వీడియోలు కూడా చేస్తున్నాడు. ఆ వీడియోలు చూసి దర్శకుడు శేఖర్ కమ్ముల అవకాశం ఇచ్చిండట. మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరూపించున్నాడు. తాళ్ల ఆర్యన్‌ది నిజామాబాద్ జిల్లా బోధన్. ఆర్యన్ తల్లి వీణ, తండ్రి చందు పెండ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ప్రైడ్ ఎలిమెంటరీ స్కూల్ ఆఫ్ టంపాలో మూడో తరగతి పూర్తి చేసుకుని నాలుగో తరగతి అడుగుపెడుతున్నాడు ఆర్యన్. భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటున్నా.. ప్రస్తుతం చదువుతో పాటు నటించడమే తన కోరిక అని చెప్తున్నాడు. ఆర్యన్ తండ్రి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి అక్కడ నుంచి తమవంతుగా ఏదో ఒక విధంగా తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉన్నారు. ఆర్యన్ తాత తాళ్ల విశ్వనాథం ఇరవై ఏళ్ల క్రితం బాన్సువాడలో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్‌గా సేవలందించారు. తాత సేవలందించిన బాన్సువాడ నలభై రోజుల పాటు ఉండి షూటింగ్ పాల్గొన్నందుకు గర్వంగా ఉందంటున్నాడు ఆర్యన్. ద ఓరియో మ్యాన్ పేరుతో యూట్యూబ్ చానల్ పెట్టి ప్రత్యేక వీడియోలను రూపొందిస్తున్నాడు.

ఫిదా సినిమాలో నటించడానికి ఓ బాల నటుడు కావాలని చాలా ప్రయత్నం చేశారు. ఇండియన్ అయితే అమెరికా షూటింగ్‌కు వెళ్లాలంటే.. వీసా వస్తుందో రాదో అనే భయంతో అమెరికా చిన్నారులకు ఆడిషన్స్ చేశారు. ఆడిషన్స్ కోసం చాలామంది వీడియోలు పంపారు. ఆర్యన్ తల్లిదండ్రులు కూడా పంపారు. వందల మంది పంపినా ఆర్యన్ ఫైనల్‌గా సెలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఆర్యన్ వాళ్లది నిజామాబాద్ జిల్లానే అని.. దాంతో మరింత సులభం అయింది. చాక్లెట్ అంటే ఇష్టంతో అమెరికా నుంచి వస్తున్నప్పుడు బ్యాగ్ నిండా చాక్లెట్లు నింపుకొని వచ్చాడు. ఆర్యన్ అమెరికా ఫ్రెండ్స్ అంతా హే.. సూపర్ స్టార్ అంటున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. బాస్కెట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఆటల్లో రాణించాలనుకుంటున్న ఆర్యన్‌కు కామెడీ అంటే కూడా ఇష్టం.

6925
Tags

More News

VIRAL NEWS

Featured Articles