తల ఎందుకు తిరుగుతున్నది?


Fri,April 14, 2017 12:04 AM

నా వయసు 38 సంవత్సరాలు. నాకు తరచుగా కళ్లు తిరుగుతుంటాయి. ఈ సమస్య 4 సంవత్సరాలుగా వేధిస్తున్నది. గుండె స్కాన్, బ్రెయిన్ ఎంఆర్‌ఐ వంటి అన్ని పరీక్షలు చేయించుకున్నాను. అన్ని రిపోర్టులు నార్మల్ అనే వచ్చాయి. నాకు ఏదైనా డిప్రెషన్ ఉన్నపుడు ఈ సమస్య తీవ్రంగా ఉంటున్నది. ఈ సమయంలో మెడ నొప్పి కూడా ఉంటున్నది. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించగలరు?
- ప్రశాంత్, జగిత్యాల
headache
మీ లక్షణాలను బట్టి మీకు మరిన్ని పరీక్షలు అవసరమవుతాయని అనిపిస్తున్నది. మీ సమస్యకు అసలు కారణం తెలుసుకోవడానికి అవి తప్పనిసరి. అది గుర్తించగలిగితేనే చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది.
ఇలా తల తిరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉండవచ్చు. మొదటిది బినైన్ పొజిషనల్ విర్టిగో(బీవీపీ). ఇది లోపలి చెవికి సంబంధించిన సమస్య. ఈ సమస్యలో తల, మెడ తిప్పినప్పుడల్లా తలతిరుగడం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికి వెస్టిబ్యూలార్ రిహాబిలిటేషన్ అనే ప్రత్యేకమైన వ్యాయామాలు చెయ్యాల్సి ఉంటుంది.
రెండో కారణం మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, లేదా ఏదైనా ఇన్‌ఫెక్షన్, లేదా ట్యూమర్ ఉండడం వంటివి కారణం కావచ్చు. మీ ఎంఆర్‌ఐ నార్మల్‌గానే ఉంది కాబట్టి అది కాకపోవచ్చు.
ఇక మూడోది సర్వైకల్ స్పాండిలోసిస్. ఈ సమస్యలో కూడా మెడనొప్పితో పాటు కళ్లు తిరుగుతాయి. ఈ సమస్యకు చికిత్సగా ఫిజియోథెరపీ చెయ్యడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వీటితో పాటు మందులు కూడా వాడాలి. మీకు డిప్రెషన్ కూడా కలుగుతుందంటున్నారు కాబట్టి దానికి కూడా చికిత్స తీసుకోవడం అవసరం. మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు సరైన పరిష్కారాన్ని పొందవచ్చు.
డాక్టర్ సుధీర్ కుమార్
సీనియర్ కన్సల్టెంట్
న్యూరాలజిస్ట్
అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్

1714
Tags

More News

VIRAL NEWS