తల్లికీ బిడ్డకు మధ్యలో..!


Fri,November 30, 2018 11:31 PM

పెచ్చుమీరుతున్న విశృంఖలత్వం ఒకవైపు.. అవగాహన లేని అమాయకత్వం మరోవైపు. . క్షణకాల సుఖం కోసం అడ్డదారులు తొక్కే ఆవేశం ఇంకోవైపు.. వెరసి.. ఎయిడ్స్ కమ్మేస్తుంది. జీవితాలను కబిళిస్తున్నది. ఇది ఏ పాపం తెలియని పసిమొగ్గల్నీ నలిపేస్తున్నది. ఎవరో చేసిన తప్పులకు భావితరాలు బలవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ మహమ్మారి విస్తరిస్తూనే ఉన్నది. అందుకే.. ప్రభుత్వ అండతో సాతీ ముందుకొచ్చింది. తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ రాకుండా అడ్డుకుంటున్నది. ఇద్దరి మధ్య వారధిగా నిలిచి.. వేలాదిమంది చిన్నారులకు బంగారు భవిష్యత్‌ను అందిస్తున్నది.ఇకనైనా మాట్లాడదాం.. సూటిగా సుత్తిలేకుండా. సిగ్గుతో నిశ్శబ్దంగా ఉంటే..
baby
చాపకింద నీరులా ఎయిడ్స్ విస్తరిస్తూనే ఉన్నది. ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా, అరచేతిలోకి ప్రపంచం వచ్చినా ఎక్కడో లోపం జరుగుతూనే ఉంది. సరైన అవగాహన లేకపోవడంతో తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించి, రేపటి భావితరాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతున్నది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా, బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో.. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రాకుండా అడ్డుకుంటున్నది సాతీ (సాలీడరిటీ అండ్ యాక్షన్ అగైనెస్ట్ ది హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్ ఇన్ ఇండియా) సంస్థ. గడిచిన మూడేండ్ల్లలో తెలుగురాష్ర్టాల్లో 2,500మందికి పైగా బిడ్డలకు తల్లి నుంచి హెచ్‌ఐవీ సోకకుండా కాపాడగలిగింది.

ప్రభుత్వ దవాఖానాల్లో తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ నివారించేందుకు పీపీటీసీటీ, ఏఆర్‌టీ వ్యవస్థలున్నాయి. వైద్యం కూడా ఉచితంగానే అందుతుంది. మరీ.. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పరిస్థితి ఏంటి? వారు ఎయిడ్స్‌ను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేరు కాబట్టి.. అటు ప్రభుత్వానికి ఇటు ప్రైవేట్ ఆస్పత్రులకు మధ్యలో సాతీ సంస్థ ప్రతినిధులు ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకుండా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చెకప్ చేయించుకునే గర్భిణులకు హెచ్‌ఐవీ ఉందని తెలిస్తే.. ఆ ఆస్పత్రి సిబ్బంది సాతీ ప్రతినిధులకు సమాచారం ఇస్తారు. వీరు బాధితుల వివరాలు సేకరించి, ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెబుతారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇస్తారు. పీపీటీసీటీ, ఏఆర్‌టీ సెంటర్లలో వారి పేరు నమోదు చేయించి తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా ప్రభుత్వం అందించే మందులు, టీకాలు, సిరప్‌లు ఉచితంగా ఇస్తారు. తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలో, మందులు ఎలా వాడాలో వివరంగా చెబుతారు. ఈ సమాచారమంతా రహస్యంగా ఉంటుంది. గర్భవతి రెండో నెల నుంచి ఆమె డెలివరీ అయి, ఆ బిడ్డకు 18నెలలు వచ్చే వరకూ నిత్యం వారికి అండగా నిలుస్తూ సలహాలు సూచనలు ఇస్తుంటారు. తెలంగాణలో 3 వేల ప్రైవేట్ ఆస్పత్రులతో వీరికి సంబంధాలున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎయిడ్స్ కిట్స్ అందిస్తే.. వాటిని ఎలా ఉపయోగించాలి? రికార్డులు ఎలా భద్రపరుచాలి? టెస్ట్ ఎలా చేయాలి? వంటి వాటిపై టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నది సాతీ సంస్థ.

సాతీ ప్రస్థానం!


ఆరోగ్యవంతమైన సమాజాన్ని దేశానికి అందించే లక్ష్యంతో ఏర్పడిందే సాతీ సంస్థ. దీనిని 2002లో డాక్టర్ శుభశ్రీ రాఘవన్ ప్రారంభించారు. హెచ్‌ఐవీ నివారణ, హెల్త్, సెక్సువల్ మైనార్టీస్ రైట్స్, ఆరోగ్యపరమైన హక్కులను సాధించడానికి ఆమె దీనిని స్థాపించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 22 రాష్ర్టాల్లో 361 జిల్లాల్లో సేవలను అందిస్తున్నది. జాతీయస్థాయిలో ఎయిడ్స్ నియంత్రణపై పనిచేస్తున్న నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO), స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లకు సహకారం అందిస్తున్నది. 2020కల్లా ఏ బిడ్డకూ హెచ్‌ఐవీ రాకుండా నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలతో కలిసి సేవలందిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోని అన్ని జిల్లాల్లో సాతీ ప్రతినిధులున్నారు. గడిచిన మూడేండ్లలో తెలుగురాష్ర్టాల్లో 2,500మందికి పైగా బిడ్డలకు తల్లి నుంచి హెచ్‌ఐవీ సోకకుండా అడ్డుకున్నది సాతీ సంస్థ. ముగ్గురు తల్లులు సరిగా చికిత్స తీసుకోకపోవడం వల్ల ముగ్గురు చిన్నారులకు పాజిటివ్ వచ్చింది.
pregnant-woman

పట్టణాల నుంచి పల్లెల వరకూ..


తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ రాకుండా నివారించడంలో కీలకపాత్ర పోషించేది సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్లు, పీఓలు, సిబ్బందే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎవరైనా గర్భిణికి హెచ్‌ఐవీ ఉందని తెలిస్తే.. ముందుగా స్పందించేది సాతీ సంస్థ సిబ్బందే. పైస్థాయి సిబ్బంది పీఓలకు సమాచారం అందిస్తే.. వారు ఫీల్డ్ కోఆర్డినేటర్లను సంప్రదించి బాధితులతో మాట్లాడుతారు. ప్రసవం తర్వాత బిడ్డకు 2, 6, 12, 18 నెలలకు ఒకసారి పరీక్షలు చేస్తూ, నెవరాపిన్ (ఇది బయట దొరకదు) అనే ఔషధాన్ని అందిస్తుంటారు. బిడ్డకు 18 నెలలు నిండి, చివరి పరీక్ష ఫలితాలు వచ్చే వరకూ తోడుంటారు. ఆ తర్వాత కూడా తల్లీ, బిడ్డ యోగక్షేమాలు తెలుసుకొని, తగిన సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇలా ఎక్కడో మారుమూల గ్రామాల్లో హెచ్‌ఐవీ బాధితులకు కూడా వీరు అండగా ఉంటారు. ఇదంతా ఓ టీం వర్క్. ఎవ్వరు స్పందించకపోయినా.. ఓ బిడ్డ జీవితం నాశనం అవుతుంది. అందుకే నిరంతరం వీరు శ్రమిస్తూనే ఉంటారు. ఇలా తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ రాకుండా అడ్డుకునేందుకు ఓ యజ్ఞమే జరుగుతున్నది.

అవగాహన సదస్సులు..


కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగిన తర్వాత.. చాలామంది చికిత్సలకు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో హెచ్‌ఐవీ ఉన్న గర్భిణులు ఆయా ఆస్పత్రులకు వస్తే.. వారికి ఎలా చికిత్స అందించాలి, ఎలాంటి సహాయం చెయ్యాలనే అంశాలపై సాతీ సంస్థ వైద్య బృందం, ఆయా ఆస్పత్రుల సిబ్బందికి అవగాహన కల్పిస్తుంది. ప్రతి గర్భిణీకి హెచ్‌ఐవీ పరీక్ష చేసేలా చర్యలు తీసుకోవడం, పాజిటివ్ అని తేలిన తర్వాత సాతీకి సమాచారం ఇచ్చేలా ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా మోటివేట్ చెయ్యడం వీరి బాధ్యత. ఇందుకు ప్రత్యేకంగా ఓ వైద్య బృందమే ఉన్నది. వీరు ఆయా జిల్లాల్లోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, సాతీ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రత్యేక, క్లిష్టమైన పరిస్థితుల్లో నేరుగా బాధితులతో మాట్లాడి వారికి కౌన్సెలింగ్ ఇస్తుంటారు.

ఎం-మైత్రి సేవలు


ఎం-మైత్రి సంస్థ మొబైల్ ద్వారా పాజిటివ్ బాధితులకు సమాచారం అందిస్తుంది. హెచ్‌ఐవీ బాధితులు ఎం-మైత్రిలో తమ వివరాలు నమోదు చేయించుకుంటే.. వారితో వారంలో మూడు రోజులు, కోరుకున్న సమయంలో ఫోన్ ద్వారా మాట్లాడుతారు. రెండో నెల గర్భం నుంచి డెలివరీ అయ్యేవరకూ ప్రతినెలా, ప్రతి వారం, ఏవేం మందులు ఎలా వాడాలో ఫోన్‌లో చెబుతారు. ఈ సేవలన్నీ ఉచితంగా అందుతాయి. బాధితులకు వారంలో మూడు రోజులు ఎప్పుడు వీలుగా ఉంటే.. అప్పుడే వినే వెసులుబాటూ ఉన్నది.

గర్భిణులు ఏం చెయ్యాలంటే...?


-ప్రతి గర్భిణీ తప్పకుండా హెచ్‌ఐవీ, సిఫిలిస్ పరీక్ష చేయించుకోవాలి.
-పాజిటివ్ అయితే.. భర్తకూ పరీక్ష నిర్వహించాలి.
-ఏఆర్‌టీ కేంద్రంలో నమోదు చేయించుకోవాలి.
-ప్రసవం అయ్యేంత వరకూ చికిత్స కొనసాగించాలి.
-ప్రసవం అయిన తర్వాత వైద్యుల సలహా మేరకు బిడ్డకు నెవిరాపిన్ లేదా జిడోవుడైన్ సిరప్ ఇవ్వాలి.
-ఆరు వారాలు నిండిన తర్వాత వైద్యుల సలహా మేరకు నెవిరాపిన్ లేదా జిడోవుడైన్ సిరప్ ఆపాలి.
-ఆరు నెలలు నిండిన తర్వాత తల్లి పాలతో పాటు, అందుబాటులో ఉన్న ఘన, ద్రవ పదార్థాలు బిడ్డకు ఇవ్వాలి.
-పరీక్షల అనంతరం బిడ్డ హెచ్‌ఐవీ నెగిటివ్ అని తేలిన తర్వాత పాలు ఇవ్వడం ఆపాలి. పాజిటివ్ అయితే కొనసాగించొచ్చు.
-18 నెలలు నిండిన తర్వాత పరీక్షలు తప్పకుండా చేయించాలి.

ఆ సహాయం మరువలేనిది


నాకు హెచ్‌ఐవీ అని తెలియగానే చాలా బాధేసింది. అయితే, తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా కాపాడుతున్న సాతీ సంస్థ గురించి తెలుసుకున్నాం. నా భర్త సహకారంతో, ఫీల్డ్ కోఆర్డినేటర్ల సలహాలమేరకు ప్రతినెలా చికిత్స తీసుకున్నా. బిడ్డ పుట్టిన తర్వాత మందులు వాడాం. 18 నెలల తర్వాత నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు నా బాబుకు రెండేండ్లు. ఎలాంటి అనారోగ్యం లేదు. ప్రతినెలా చికిత్స తీసుకుంటున్నా. సాతీ సంస్థ చేసిన సహాయానికి రుణపడి ఉంటా.
- హెచ్‌ఐవీ బాధితురాలు,
కార్పొరేట్ ఉద్యోగిని
Anthony-Reddy

ప్రభుత్వం సహకారంతో..


ఏటా 6 లక్షల మంది గర్భం దాల్చుతుంటే.. అందులో 17 వందల మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉంటున్నారు. వీరిలో వెయ్యిమందిని గుర్తించగలుగుతుంటే.. ఇంకో 7 వందల మంది లెక్కల్లోకే రావడం లేదు. కారణం.. తెలిసినా రిపోర్ట్ చెయ్యకపోవడం, గ్రామీణ/ గిరిజన ప్రాంత మహిళలకు అవగాహన లేకపోవడం. తెలంగాణలోని ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా మూడేండ్లలో 463 మంది పాజిటివ్ గర్భిణులను గుర్తించాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి ఏడాదికి వెయ్యి మంది హెచ్‌ఐవీ ఉన్న గర్భిణులను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గర్భిణులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యడం, కేసీఆర్ కిట్ అందించడం ద్వారా చాలామంది ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. తద్వారా అందరికీ పరీక్షలు నిర్వహించి ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నాం. సాతీ సంస్థలో పనిచేస్తూ.. ఇలా మంచిపనిలో భాగస్వామ్యమవడం నా అదృష్టం.
- ఆంథోనిరెడ్డి, సాతీ స్టేట్ డైరెక్టర్

నెగిటివ్ వస్తే..


తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా కాపాడడంలో మేం కీలకంగా ఉండడం మాకెంతో గర్వంగా ఉంది. ఇది దేవుడు అప్పజెప్పిన పనిగా శక్తివంచన లేకుండా చేస్తున్నాం. పాజిటివ్ తల్లులు.. తమ బిడ్డలకు హెచ్‌ఐవీ నెగిటివ్ వచ్చినప్పుడు వారి కళ్లలో ఆనందం చూసి మా కష్టాన్నంతా మర్చిపోతాం. ఇదో చాలెజింగ్‌గా చేస్తున్నాం. ఎవరి వివరాలు బయటికి చెప్పకుండా, గోప్యంగా ఉంచుతూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. మా సంస్థ పైస్థాయి సిబ్బంది సహకారం మర్చిపోలేనిది.
- దుగ్గి కృష్ణారావు, పీఓ

డప్పు రవి భాస్కర్

1131
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles