తడి ఆరని ప్రకృతి సౌందర్యం చిరపుంజీ


Thu,September 27, 2018 11:00 PM

ఎటు చూసినా తివాచీ పరిచినట్లు పచ్చని ప్రకృతి, సంవత్సరమంతా సగటున వర్షించే మేఘాలు, ఎత్తైన కొండలపైనుంచి మంచు కురిసినట్లు నేలకు జారే జలపాతాలు..ఒక్కటని కాదు ఎటూ చూసినా మనసుకు హత్తుకునే అందాల హరివిల్లు చిరపుంజీ. అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన ప్రదేశంగా, పర్యాటకులకు స్వర్గధామంలా విలసిల్లుతున్న నేల. ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతంలో మేఘాలు ప్రసవానికి సిద్ధమైన నిండు చూలాలులా హఠాత్తుగా వర్షిస్తుంటాయి. సముద్రమట్టం నుంచి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ్రప్రదేశంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరున్న మాసిన్రామ్ ఉండడం విశేషం. పర్వత పంక్తులను తాకుతున్నట్లుండే మేఘాలతో, కాలుష్య వాతా వరణానికి దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరించే పర్యాటక ప్రాంతం చిరపుంజీ.
Chirapunji
మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగుకు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ ఓ అందమైన ప్రకృతి నిలయం. చిరపుంజీని చిర్రాపుంజి అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. దీనికి సమీపంలో ఉండే మాసిన్రామ్‌లో అత్యధిక వర్షపాతం ఉంటోంది. చిరపుంజీ అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కాలక్రమేణా అది చిరపుంజీగా మారింది.


సంవత్సరమంతా.. : చిరపుంజీకి వెళ్లాలంటే ముందు షిల్లాంగ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఘాట్ రోడ్‌లో సాగే ప్రయాణంలో చుట్టూ ఎత్తైన పర్వతాలను చూస్తూ వాటినుంచి జాలువారే జలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్ రాతిగుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ పురాతన ప్రెస్బిటేరియన్ చర్చి, రామకృష్ణ మిషన్‌లను దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్రామ్ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ శివలింగాన్ని స్థానికులు మావ్ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు. షిల్లాంగ్ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యూజియం ఆఫ్ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలుకల పార్క్ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రముఖ హిల్ స్టేషనైనా షిల్లాంగ్ కేవలం పర్యాటకులకే కాక సినిమా షూటింగ్‌లకు కూడా అనువైన ప్రదేశం.


కారణం: చిరపుంజీ భారత వేసవి ఋతుపవనాలు, బంగాళాఖాతం నుంచి వర్షాలను అందుకుంటుంది. రుతుపవన మేఘాలు బంగ్లాదేశ్‌లోని పర్వతసానువుల గుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా సుమారు 400కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఆ తరువాత అవి ఖాసీ పర్వతాలను ఢీకొంటాయి. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇవి అనూహ్యంగా సముద్రమట్టానికి 13 70 మీటర్లు ఎత్తు పెరగడమే దీనికి కారణం. భౌగోళిక పరంగా లోతైన లోయలుండటంతో బాగా దిగువకు ప్రయాణించే మేఘాలు (150 నుంచి 300 మీటర్లు) చిరపుంజీ మొత్తం పరుచుకుంటాయి. ఆ గాలులు వర్షాల మేఘాలను ద్రోణివైపు లేదా నునుపైన తలాల వైపుకు నెడతా యి. మేఘాలు వేగంగా పైకి పోతుండటంతో పైన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. అంటే పై భాగాలు చల్లబడుతాయి. ఫలితంగా నీటిభాష్పాలు ద్రవీభవిస్తాయి. చిరపుంజీలో కురిసే వర్షాల్లో అధిక శాతం నీరు భాష్పాలుగా మారడం వల్లనే సంభవిస్తాయి.


ఒరోగ్రాఫిక్ లక్షణాలు: ఇక అతి పెద్ద మొత్తంలో వర్షాలు పడటానికి కారణం, బహుశా అందరికీ తెలిసిందే. అదే ఈశాన్య రాష్ర్టాల్లో కురిసే ఒరోగ్రాఫిక్ వర్షాలు. చిరపుంజీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు సంభవిస్తే మిగిలిన ప్రాంతాలు వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు చూపిస్తూ, పూర్తిగా పొడిగా ఉంటాయి. రుతుపవనాల కాలం క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో వాతావరణంలో తేమ గరిష్ఠంగా ఉంటుంది. చిరపుంజీలో అత్యధిక శాతం వర్షం కురవడానికి, ఒరోగ్రాఫిక్ లక్షణాలే కారణమని చెప్పవచ్చు. దక్షిణం వైపు నుంచి వచ్చే మేఘాలు ఈ కొండల మీదుగా ప్రయాణించినప్పుడు ఇవి లోయ మొత్తం విస్తరిస్తాయి. ఈ మేఘాలు చిరపుంజీ కొండలను నిట్టనిలువుగా ఢీకొట్టినప్పుడు దానికి దిగువన ప్రయాణించే మేఘాలు నునుపైన వక్రతలాల్లోకి నెట్టబడతాయి. ఖాసీ కొండల నుంచి గాలి నేరుగా వీస్తున్నప్పుడు భారీ వర్షాలు కురవడం సర్వసాధారణమే.


రాత్రిపూటే ఎక్కువ:రెండు రకాల గాలులు ఒకేసారి రావడమే దీనికి కారణం. రుతుపవన కాలంలో బ్రహ్మపుత్ర లోయ నుంచి వీచే గాలులు సాధారణంగా తూర్పు నుంచి ఈశాన్యం వైపుకు వీస్తాయి. కానీ మేఘాలయా నుంచి వీచే గాలులు దక్షిణవైపు నుంచి వీస్తాయి. ఈ రెండు రకాల గాలులు ఖాసీ కొండల దగ్గరకు వస్తాయి. ఈ కొండల్లో రాత్రివేళ చిక్కుకున్న గాలులు అవి వేడెక్కిన తరువాత ఉదయం వేళ, పైకి లేవడం ప్రారంభిస్తాయి. ఒరోగ్రాఫ్ లక్షణాల కారణంగా వాతావరణ మార్పులు కూడా రుతుపవన కాలంలో జరిగే మార్పులో కీలక పాత్ర పోషిస్తాయి. సీజన్ మొత్తం ఇదే విధంగా కొనసాగుతుంది.
తాగునీటికి ఇబ్బందే : నిత్యం వర్షాలు పడ్డా కూడా, చిరపుంజీ తాగు నీటి సమస్యను ఎదుర్కొంటోంది. అడవులు భారీగా ఆక్రమణకు గురికావడంతో, విస్తారంగా పడే వర్షాల కారణంగా, మట్టి పైపొరలు కొట్టుకుపోయాయి. దాంతో ఈ అడవుల్లో నీటిపారుదలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.


రవాణా సౌకర్యాలు : షిల్లాంగ్‌కు గౌహతి ప్రధాన కేంద్రం. ఇక్కడే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఉంది. గౌహతి చేరుకుని అక్కడినుంచి షిల్లాంగ్ వెళ్లాల్సి ఉంటుంది. గౌహతినుంచి షిల్లాంగ్ వెళ్లే వారికోసం ప్రభుత్వం హెలికాప్టర్ సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచింది. అలాగే మేఘాలయాలోని అన్ని ప్రాంతాల నుండి బస్ సౌకర్యం ఉంది.
-మధుకర్ వైద్యుల


మాతృ పాలన

Chirapunji2
చిరపుంజీలో నివసిం చే స్థానికులను ఖాసీలంటా రు. వీరిలో మాతృవంశ పాలన ఉంటుంది. పెళ్లి తరువాత భర్త భార్య వెంబడి ఆమె ఇంటికి వెళతాడు. పుట్టిన పిల్లలు తల్లిపేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. చిరపుంజీ లివింగ్ బ్రిడ్జ్‌లకు పెట్టింది పేరు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చిరపుంజీవాసులు చెట్ల వేళ్లనే బ్రిడ్జిలుగా మార్చే విధానాన్ని అభివృద్ధి చేశారు. వీటిని బ్రిడ్జిలుగా మలచడానికి పది, పదిహేను సంవత్సరాలు పడుతుంది. అయితే ఇవి వందల సంవత్సరాల పాటు ఉంటాయి. ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఒక పురాతన బ్రిడ్జి వయస్సు 500 ఏళ్లు ఉంటుంది.


ఇక్కడే వర్షాలు ఎందుకు?

Chirapunji3
బంగ్లాదేశ్ ముఖంగా ఉన్న ఖాసీ కొండల దక్షిణ కొనకు చిరపుంజీ ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే రుతుపవన గాలులు ఈ కొండశిఖరాలను తాకడం వల్ల చిరపుంజీలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఈశాన్య, నైరుతీ రుతుపవనాల నుంచి వర్షాలు కురవడంతో, ఇక్కడ రెండూ కలిసి ఒకే ఒక రుతుపవన కాలంగా ఉంటాయి. శీతాకాలంలో బ్రహ్మపుత్ర వ్యాలీ గుండా ప్రయాణించే ఈశాన్య రుతుపవనాల వల్ల ఇక్కడ వానలు పడతాయి. ఒక సంవత్సర కాలంలో గరిష్ట వర్షపాతానికి సంబంధించి చిరపుంజీ పేరిట రెండు గిన్నెస్ రికార్డులున్నాయి. ఒక ఏడాది కాలంలో ఆగస్టు 1860-1861జులై మధ్య, అదే విధంగా ఒక నెల వ్యవధిలో జులై 1861లో గరిష్ట వర్షపాతం నమోదు కావడంలో ఈ రెండు రికార్డులకు గిన్నెస్‌లో స్థానం దక్కింది.

1372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles