తక్షణ రుణం తలనొప్పే..


Sat,July 28, 2018 12:48 AM

అవసరం చెప్పి రాదు. అప్పు చేయక తప్పదు. అప్పటికప్పుడు అప్పు ఇచ్చేందుకు ఇప్పుడు క్యూ కట్టే కంపెనీలు అనేకం. ఒకప్పుడు బ్యాంకులు మాత్రమే ఇచ్చే వ్యక్తిగత రుణాలు ఇప్పుడు అనేక ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు, ఫిన్‌టెక్ కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్యనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పది సెకండ్లలో తక్షణ రుణాలను అందించే స్కీమును ప్రవేశపెట్టింది. మరికొన్ని కంపెనీలూ నిమిషాల్లో రుణాలివ్వడానికి సిద్ధంగా
వున్నాయి. మరి అవసరం తప్పనిదైతే.. తక్షణ రుణం తరుణోపాయమే.. పప్పుకూడు కోసమే అయితే తలకుమించిన భారమే..

LOAN

తక్షణ రుణం అంటే..

ఇవీ పర్సనల్ రుణాల్లాంటివే. కాకపోతే అప్పటికప్పుడు క్షణాల్లో మీచేతిలో డబ్బు పెట్టే రుణాలు. మహా అయితే ఒక్కరోజులోనే అప్పు పుట్టడం అన్నమాట. వీటిని బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ కంపెనీలు, ఫిన్‌టెక్ కంపెనీలు ఇస్తాయి. కొన్ని కంపెనీలు ప్రీ అప్రూవ్డ్ రుణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా వున్నాయి.

పొందడం ఎలా

మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు. ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్‌లోనే అన్ని వివరాలను నింపి, సంబంధించిన డాక్యుమెంట్లను అటాచ్ చేసి సబ్‌మిట్ చేస్తే చాలు. మీకున్న అర్హతలు, దరఖాస్తు చేసిన మొత్తాన్ని పరిశీలించిన తర్వాత వెంటనే మీ బ్యాంకు అకౌంట్లోకి జమ అవుతుంది. ప్రీ అప్రూవ్డ్ లోన్స్‌ను బ్యాంకులు ముందుగానే మీ రుణపరపతిని పరిశీలించి మీకు ఆఫర్ చేస్తాయి. తక్షణ (ఇన్‌స్టాంట్) రుణాలు మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలించి రుణాలను మంజూరు చేస్తాయి.

డిజిటల్ వెరిఫికేషన్

ఆన్‌లైన్‌లోనే ఈ రుణాలకు దరఖాస్తు చేస్తారు కనుక మీ డేటా అంతా వెంటనే పరిశీలించడానికి ఆల్గోరిథమ్స్ సిద్ధంగా ఉంటాయి. పాన్‌కార్డ్ వివరాలు చాలు మీ పాత ఆర్థిక లావాదేవీల చరిత్రను తవ్వడానికి. పాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్‌గా వెరిఫై చేస్తారు. మీకు రుణం మంజూరు అవుతుందా లేదో వెంటనే తేల్చి చెప్పేస్తారు.

ఎంత మొత్తం ఎంత కాలం

సాధారణంగా ఒక్క రోజులో జారీ చేసే ఈ రుణాలు ఏడాది నుంచి ఐదేండ్ల కాలపరిమితిని కలిగి ఉంటాయి. సామర్థ్యాన్ని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 25 లక్షల వరకూ ఇస్తారు. కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు రూ 20 వేల రుణాన్ని కూడా ఇస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ప్రముఖ కంపెనీల్లో పనిచేసే వారికే ప్రాధాన్యత. అనామక కంపెనీల్లో పనిచేసే వారికి ఈ తక్షణ రుణాలు దొరకవు. ఇందుకోసం కంపెనీల డేటాబేస్ ఫిన్‌టెక్ కంపెనీల వద్ద సిద్ధంగా ఉంటుంది.

తక్షణ రుణంతో తంటాలు అనేకం

తక్షణ రుణం అన్‌సెక్యూర్డ్ రుణంగా పరిగణిస్తారు. తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే వరకూ మీ రుణ పరపతి తగ్గుతుంది. హోమ్‌లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్‌కు దరఖాస్తు చేస్తే మీకు ఎక్కువ రుణం రాకపోవచ్చు. ఎందుకంటే మీ చెల్లింపు సామర్థ్యం మీదనే హోమ్ లోన్ జారీ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ వేతనాన్ని బట్టి మీరు నెలకు రూ. 25000 వరకూ ఈఎంఐని చెల్లించదగ్గ సామర్థ్యం వుంది. ఇప్పటికే తక్షణ రుణం మీద మీరు రూ. 10000 ఈఎంఐ చెల్లిస్తున్నారనుకోండి. అప్పుడు మీకు ఆటో మేటిక్ గా తాజాగా తీసుకునే రుణం మీద ఈఎంఐ రూ. 15000కు తగ్గిపోతుంది. ఈ మొత్తం హౌజింగ్ రుణాల విషయంలో చాలా పెద్ద ప్రభావాన్నే కలిగి ఉంటుంది.

జాగ్రత్త సుమా

తక్షణ రుణాలు తీసుకోవడం చాలా ఈజీ.. అప్పు సులభంగా పుట్టినంత మాత్రాన అదేమీ అప్పనంగా వచ్చిన డబ్బేమీ కాదు. తరచుగా ఇలాంటి తక్షణ రుణాలు అలవాటు పడితే తొందరగానే ఆర్థిక ఇబ్బందుల్లోకి జారడం ఖాయం. అత్యవసర సమయాల్లో మరే ఇతర వనరులు లేనప్పుడు ఈ తక్షణ రుణాల జోలికి వెళ్లాలి. తరచుగా వీటికోసం దరఖాస్తు చేయడం వల్ల కూడా సిబిల్‌లో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. ఈ రుణాలు తీసుకోవడం వల్ల మిగతా రుణాలు తీసుకోవడానికి అడ్డంకి కూడా కావచ్చు. అలాగే ముందుగా రుణాన్ని చెల్లించాలనుకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్ రుణాలకన్నా ఇన్‌స్టాంట్ రుణాల్లో వడ్డీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజును ఒకసారి పరిశీలించండి.

708
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles