ఢోక్లా తినండీ.. ఢోకా ఉండదు!


Thu,December 18, 2014 01:32 AM

ఏవండోయ్.. లంచ్ టైమ్ అయింది.. వీలైతే రెండు మాటలు.. నాలుగు ఢోక్లాలు తిని వెళ్లండీ! ఢోక్లాలా..? ఔను ఢోక్లాలే. అచ్చమైన గుజరాతీ షడ్రుచుల సమ్మేళనం. కొంచెం కారం.. కొంచెం ఉప్పు.. కొంచెం తీపి కలిపి తింటే ఎలా ఉంటుందో అదే ఢోక్లా! ఆఁ.. ఇప్పటికిప్పుడు ఢోక్లా ఎలా చేసేది? అనుకుంటున్నారా..? ఇదిగో ఇలా చేసేయండి.

మూంగ్‌దాల్ ఢోక్లా


moong-dal-dhokla

కావలసిన పదార్థాలు
పొట్టు పెసర పప్పు : 1 కప్పు,
పచ్చి మిరపకాయలు: 3
మెంతి ఆకులు: తగినన్ని
శనగపిండి: 2 టీస్పూన్‌లు
పెరుగు: 1 1/2 టీస్పూన్‌లు
తురిమిన క్యారెట్-క్యాబేజీ: తగినంత
ఇంగువ: తగినంత
ఉప్పు: తగినంత

తయారీ:
పొట్టు పెసరపప్పును రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని వంపేయాలి. దానిలో పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు, తురిమిన క్యాబేజీ, క్యారెట్, ఇంగువ, శనగపిండి, సన్నగా తరిగిన మెంతి ఆకులు, పెరుగు వేసి బాగా కలపాలి. వెడల్పాటి పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి, ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి.. వీటిపైన ఆవాలు, జీలకర్ర, ఇంగువ కలిపి పెట్టిన పోపు వేస్తే మూంగ్‌దాల్ ఢోక్లా రెడీ అయినట్టే! వేడివేడిగా టమాటో సాస్‌తో మూంగ్‌దాల్ ఢోక్లా తింటే టేస్టీగా ఉంటుంది. తీపిని ఇష్టపడే వారు వీటిపై చక్కరను కూడా వేసుకుని తినవచ్చు.

టమాటోఢోక్లా


tomato-dhokla

కావలసిన పదార్థాలు
శనగపిండి: 1కప్పు, రవ్వ: 2 టీస్పూన్‌లు
ఉప్పు: 1టీస్పూన్, పసుపు: తగినంత
టమాటో గుజ్జు: 1/4 కప్పు,
నీళ్లు: తగిన మోతాదులో

తయారీ: ఒక గిన్నెలో శనగపిండి, రవ్వ, పసుపు, కారంపొడి, తగినంత ఉప్పు, టమాటో గుజ్జు వేయాలి. అవసరమైతే కొద్దిపాటి నీటిని పోస్తూ.. ఉండలు లేకుండా చిక్కగా కలపాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని లోపలిభాగం నూనె పూయాలి. దాంట్లో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కొద్దిగా నీటిని పోసి.. దానిపై మిశ్రమంతో కూడిన ఈ వెడల్పాటి గిన్నెను పెట్టి పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అది ఉడికేలోపు మరో కడాయిని తీసుకుని తగిన మోతాదులో నూనె, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఉడికిన ఆ మిశ్రమాన్ని చిన్న ముక్కలుగా కోసి.. ఆ పోపును వాటిపై వేయాలి. తర్వాత కొంచెం చక్కెర, నిమ్మరసం కూడా చల్లితే వేడివేడి టమాటో ఢోక్లా రెడీ!

రవ్వ ఢోక్లా


ravva-dhokla

కావలసిన పదార్థాలు
గోధుమ రవ్వ: 1కప్పు
అల్లం-పచ్చిమిర్చి పేస్ట్: 1 టీస్పూన్
పెరుగు: 1 టీస్పూన్
ఫ్రూట్ సాల్ట్: చిటికెడు
కొబ్బరిపొడి: 1 టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
చక్కెర: 1 టీస్పూన్
ఉప్పు: తగినంత
నీళ్లు: తగినన్ని

తయారీ::ఒక కడాయిలో గోధుమ రవ్వని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత దీనిలో ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర, పసుపు, ఇంగువ, పెరుగు వేసి నీళ్లు పోస్తూ చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి మీద పదినిమిషాలు ఉడికించి దించాలి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు మరో కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఈ పోపును, కొబ్బరి పొడిని ఈ ఢోక్లాల పై వేయాలి. చక్కెర, నిమ్మకాయ రసాన్ని కలిపి దాన్ని కూడా ఢోక్లా పైన పోస్తే రవ్వ ఢోక్లా రెడీ. దీన్ని వేడివేడిగానూ, చల్లగానూ తినొచ్చు!

పన్నీర్ సాండ్‌విచ్ ఢోక్లా


Paneer-Sandwich-Dhokla

కావలసిన పదార్థాలు
శనగపిండి: 1కప్పు,
రవ్వ: 2 టీస్పూన్‌లు,
పెరుగు: 2 టీస్పూన్‌లు
అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్: 1టీస్పూన్
చక్కెర: రెండు టీస్పూన్‌లు,
ఫ్రూట్ సాల్:్ట 2 టీస్పూన్‌లు
ఉప్పు: తగినంత,
పన్నీర్: 100గ్రాములు
పచ్చిమిరపకాయలు: 2,
కొత్తిమీర చట్నీ: తగినంత

తయారీ: ఒక గిన్నెలో శనగపిండి, రవ్వ, పెరుగు, అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్, చక్కెర, ఫ్రూట్ సాల్ట్, తగినంత ఉప్పు వేసి నీళ్లుపోస్తూ చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పు కడాయిలో వేసి ఆవిరి మీద పదినిమిషాలు ఉడికించాలి. తర్వాత దీన్ని చల్లార్చి సాండివిచ్‌లా కట్ చేయాలి. పన్నీర్‌ను కూడా సాండ్‌విచ్ షేప్‌లో కట్ చేసి.. పెనంపైన ఒక నిమిషం వేయించాలి. తర్వాత ఒక ఢోక్లా పెట్టి దానికి కొత్తిమీర చట్నీ కలిపి.. పన్నీర్ ముక్కలు మధ్యలో పెట్టి.. దాన్ని మరో ఢోక్లాతో మూసేయాలి. అన్నింటినీ ఇలా చేసిన తర్వాత కడాయిలో వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువతో పోపుచేసి దానిని సాండ్‌విచ్‌లపై వేయాలి. రెడీ అయిన ఈ పన్నీర్ సాండ్‌విచ్ ఢోక్లాను టమాటో సాస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.


5817
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles