డైరెక్టర్‌గా మార్చిన.. పేపర్‌బాయ్!


Tue,September 25, 2018 10:49 PM

అది.. డైరెక్టర్ సంపత్ నంది ఆఫీస్.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి.. ఇంకో ఇద్దరు సంపత్ నంది పక్కనే కూర్చున్నారు.. వాళ్లు సీరియస్‌గా ఏదో కథ గురించి డిస్కస్ చేస్తున్నారు. అప్పుడే మే ఐ కమిన్ సర్.. యస్ కమిన్.. ప్లీజ్ సిడౌన్. థ్యాంక్యూ సర్. డైరెక్ట్‌గా విషయానికి వద్దాం. చూడు జయశంకర్.. నీ షార్ట్ ఫిల్మ్స్ చూశా. చాలా బాగున్నాయి. వాటిల్లో హ్యాపీ ఎండింగ్ తీసినట్లే నాకో సినిమా చేసి పెట్టాలి. దానికి నువ్వే డైరెక్టర్ అంటూ కేవలం షార్ట్‌ఫిల్మ్స్ తీసిన ఓ వ్యక్తికి పేపర్ బాయ్ అనే కమర్షియల్ మూవీని అప్పగించాడు సంపత్ నంది. సర్ నాకు అంత.. అంటూ సందేహం వ్యక్తం చేస్తున్న జయశంకర్ భుజం
తట్టి.. నీకేం సందేహం వద్దు. నువ్ చెయ్యగలవు అన్నాడు సంపత్. ఇంకేం ఆలోచించలేదు జయశంకర్.. అదే స్ఫూర్తితో వినూత్నమైన కథతో పేపర్‌బాయ్‌లోని కొత్త కోణాలను మనకు పరిచయం చేశాడు. పెద్ద సినిమాలకు పనిచేసిన అనుభవం లేకపోయినా.. తాను తీసిన షార్ట్ ఫిల్మ్స్ మన కరీంనగర్ కుర్రోడికి ఇంతటి అవకాశాన్ని ఇచ్చాయి.

Paper-Boy
పదుల సంఖ్యలో లఘు చిత్రాలకు డైరెక్టర్‌గా పనిచేసి, పెద్ద సినిమాలను డైరెక్ట్ చేసినవాళ్లు కొద్దిమంది ఉన్నారు. వారు కూడా ఈ మధ్యకాలంలోనే వెలుగులోకి వచ్చినవారే. కారణం.. ప్రేక్షకుడిని ఆకట్టుకొనేతత్వం. మంచి కథ, ఫ్రేమింగ్, సందేశాలతో షార్ట్‌ఫిల్మ్స్‌ను రూపొందించి మెగాఫోన్ పట్టుకుంటున్నారు. డైరెక్టర్ అవ్వాలనే కోరికతో లఘు చిత్రాలను డైరెక్ట్ చేసి, 24 ఫ్రేమ్స్‌లో పలు విభాగాల్లో ఏళ్ల తరబడి చేసి, అనుభవం వచ్చాకే పెద్ద సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటిది ఏ విభాగంలో పనిచేయకపోయినా, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అనుభవం లేకపోయినా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయకపోయినా, దర్శకుడిగా చాన్స్ కొట్టేశాడు జయశంకర్. కారణం.. తన ప్రతిభే. చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం. తనకు షాట్ నచ్చేవరకూ అహర్నిశలు కష్టపడడం, ఇవే.. తనకు దర్శకుడిగా అవకాశం ఇప్పించాయి.


Paper-Boy7

పేపర్‌బాయ్‌లో కొత్త కోణం

ఇదో సున్నితమైన ప్రేమకథ. మనం నిత్యం ఎవరెవరి గురించో ఆలోచిస్తుంటాం. అయితే, పొద్దున్నే పేపర్ వేసే ఓ బాయ్ గురించి పట్టించుకోం. ఎందుకంటే మనం లేచేసరికే అతను వెళ్లిపోతాడు. అతనికి ఓ లైఫ్ ఉంటుందని, ఆ జీవితంలోని అన్ని కోణాలను, భావోద్వేగాలను వెండితెరకు పరిచయం చేయాలనుకున్నాడు సంపత్ నంది. ఓ పేపర్ బాయ్ జీవితాన్ని సినిమా కథగా మలిచి, దానిని డైరెక్ట్ చేసే బాధ్యతను జయశంకర్‌కు అప్పగించాడు. బాక్సాఫీస్ వద్ద డివైడెట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లింది పేపర్‌బాయ్ చిత్రం. జయశంకర్ తీసిన హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, హ్యాపీ ఎండింగ్ షార్ట్‌ఫిల్మ్ చూసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి.. జయశంకర్ ప్రతిభను సంపత్‌కు పరిచయం చేశాడు. అలా సంపత్ నందిని జయశంకర్ మీట్ అవడంతో పేపర్‌బాయ్‌ను జయశంకర్ చేతుల్లో పెట్టాడు. దీంతో వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి 2016 నుంచి పేపర్‌బాయ్‌కు పనిచేశాడు జయశంకర్. కథ సంపత్ నంది అందించినా.. సన్నివేశానికి తగ్గట్లుగా జయశంకర్ చెప్పిన కొన్ని మార్పులను కూడా స్వీకరించారు. ఒక డైరెక్టర్‌గా జయశంకర్‌కు సర్వహక్కులూ ఇచ్చి, మంచి నటీనటులను, కెమెరామేన్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అనుభవం ఉన్నవాళ్లను ఇవ్వడంతో చాలా సరదాగా సినిమా చేశానని చెబుతున్నాడు జయశంకర్.


Paper-Boy2

రైటర్ అవ్వాలనుకున్న డైరెక్టర్

ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు రవీంద్రభారతి, త్యాగరాయ గాన సభలకు రోజూ వెళ్తుండేవాడు శంకర్. అక్కడ ప్రదర్శనలను చూసి స్ఫూర్తి పొందేవాడు. ఆ సమయంలో ప్రముఖ నవలా రచయిత ఆదివిష్ణు పరిచయంతో రచయిత అవ్వాలనుకున్నాడు. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. రచయితగా ప్రయత్నాలు ప్రారంభించాడు. సీరియల్స్‌కు రచయితగా పనిచేస్తున్న కొమ్మనాపల్లి గణపతిరావు అతని అభిరుచిని గమనించి సీరియల్స్ రైటర్‌గా అవకాశం కల్పించారు. అయినా, జీవితంలో ఏదో వెలితి.. అప్పుడే 2014లో షార్ట్‌ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తున్నది. అదే అదునుగా.. లవ్ ఫరెవర్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, ది గాడ్ మస్ట్ బి క్రేజీ, రామాయణంలో తుపాకుల వేట, హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్-2 అనే షార్ట్‌ఫిల్మ్స్ చేశాడు. వీటిల్లో హాఫ్ గర్ల్ ఫ్రెండ్‌కు విమర్శలతో పాటు మంచిపేరూ వచ్చింది. ఎలాగైనా దర్శకత్వంవైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతో 20 యేండ్ల అబ్బాయి, 27 యేండ్ల అమ్మాయి మధ్య స్వచ్ఛమైన ప్రేమను తెలిపేలా హ్యాపీ ఎండింగ్ లఘు చిత్రాన్ని నిర్మించాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, వీకెండ్స్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు జయశంకర్. ప్రతి షార్ట్ ఫిల్మ్‌లోనూ సమాజ స్థితిగతులను చక్కగా చూపించాడు.


Paper-Boy3

ఇండస్ట్రీ పెద్దల ఆశీస్సులు

జయశంకర్ నిర్మించిన హ్యాపీ ఎండింగ్ లఘు చిత్రాన్ని దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు రిలీజ్ చేసి, అభినందించారు. తెలుగు పరిశ్రమకు కొత్తనీరు రావాలని ఎప్పుడూ కాంక్షించే ఆయన.. తనను అభినందించడం చాలా గొప్ప విషయమని అంటున్నాడు. ది గాడ్ మస్ట్ బి క్రేజీ షార్ట్‌ఫిల్మ్ చూసి నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా అభినందించి.. అరగంట పాటు మాట్లాడారు. దేవుడు, మనుషుల స్వభావాలను చక్కగా చెప్పారంటూ అభినందించడం చాలా స్ఫూర్తినిచ్చిందని అంటున్నాడు. ఆయనను కలిసిన తర్వాతే సినిమాలను సీరియస్‌గా తీసుకున్నానని, ఎప్పుడు నిరాశలో ఉన్నా.. అల్లు అరవింద్, దాసరి మాటలే గుర్తుకొస్తాయని, అందుకే దర్శకత్వం వైపు అడుగులు వేశానని చెబుతున్నాడు. భవిష్యత్‌లో ఇంకా మంచివి, ప్రజలు ఆదరించే సినిమాలు చేస్తానని అంటున్నాడు జయశంకర్.


Paper-Boy8

వారి సహకారం మర్చిపోలేనిది!

నేను ఉద్యోగం మానేసి సినిమాలు చేయాలని ఇంట్లో చెప్పినప్పుడు.. కుటుంబసభ్యులు బాగా ప్రోత్సహించారు. నేను తీసిన షార్ట్‌ఫిల్మ్స్, వాటికి వచ్చిన స్పందనను తెలుసుకున్న ఫ్యామీలీ ఎలాంటి అడ్డూ చెప్పలేదు. షార్ట్‌ఫిల్మ్స్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని తయారు చేసుకున్నా. నా ప్రతి లఘుచిత్రంలోనూ వారిదే కీలకపాత్ర. వాళ్లే లేకుంటే ఈ స్థాయిలో ఉండేవాడినికాదు. వారి నుంచి చాలా నేర్చుకున్నా. సంపత్ నందిగారు నా ప్రతిభను మెచ్చి మంచి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నా మొదటి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు వేవేల దండాలు.
- జయశంకర్, దర్శకుడు


Paper-Boy5

కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు..

జయశంకర్‌ది కరీంనగర్ పక్కన సుల్తానాబాద్. ప్రాథమిక విద్య, ఇంటర్ కరీంనగర్‌లోనే సాగింది. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. ఆరుగురు సంతానంలో నాలుగో వ్యక్తి జయశంకర్. ఆరుగురినీ ఉన్నత చదువులు చదివించారు తల్లిదండ్రులు. జయశంకర్‌కు మెగాస్థార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన నటనా స్ఫూర్తితోనే ఎలాగైనా సినిమాలకు పనిచేయాలని అనుకున్నాడు. ఇంజినీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చి.. ప్రయత్నాలు మొదలు పెట్టి సఫలీకృతమయ్యాడు. సీరియల్స్‌కు పనిచేస్తున్నప్పుడు.. దూకుడు మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర తాను డైరెక్షన్ చేయబోయే మొదటి యాక్షన్ 3డీ సినిమాకి డైలాగ్ రైటర్ కావాలని ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు చూసి జయశంకర్ తను రాసుకున్న షార్ట్ స్టోరీస్ ఆయనకు పంపడంతో ఆ మూవీకి అసిస్టెంట్ రైటర్‌గా ఎంపికయ్యాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కష్టాన్ని కళ్లారా చూశాడు.

Paper-Boy4


Paper-Boy6
-డప్పు రవి

1872
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles