డిఫరెంట్ డాక్టర్!ఇక్కడ జబ్బులు పోవును.. నవ్వులు పూయును!


Mon,September 21, 2015 12:37 AM

gruvareddy

ఆయన మాట్లాడే నాలుగు మాటలతోనే.. అరవై సెకన్లలోనే రోగులకు కుటుంబ సభ్యుడైపోతాడు. పెదవులపై చెదరని చిరునవ్వుతో లాఫింగ్ థెరపీ చేస్తాడు. ఆయన్ని చూసి అరిగిపోయిన మోకాళ్లన్నీ సావధాన్ అంటాయి. కొత్త కీళ్లు పాత మోకాళ్లలో సులువుగా ఒదిగిపోతాయి. మోకాళ్ల నొప్పులు.. కీలుమార్పిడి.. పదాలతో పాటే డాక్టర్ గురవారెడ్డి కూడా గుర్తొస్తారు. పేషెంట్ల హృదయాలను చదవడంలోనే కాదు.. జీవితాన్ని ఆసాంతం ఆనందించడం కూడా ఆయనకు మాత్రమే చేతనవుతుందేమో! పేషెంట్లూ.. మన వైద్య వ్యవస్థ గురించి ఆయన జీవనరేఖతో పంచుకున్న మాటలు...

1958వ సంవత్సరం... సెప్టెంబర్ 29వ తారీఖు....సాయంత్రం 6.30 దాటింది. కరెంటు పోయింది.
ఒక రిక్షాలో ఓ అమ్మ నొప్పులు పడుతోంది. ఒక పక్క కటిక చీకటి.. మరో పక్క హోరుమని వాన.. వీటికి తోడు రిక్షా టైరు పంక్చరయ్యింది. ఆ అమ్మకి నొప్పులతో చెమటలు పడుతుంటే.. నాన్నకు కంగారుతో ముచ్చెమటలు. వెంటనే వాళ్లను అక్కడే ఉంచి, సైకిల్ మీద ఒక్కడే హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్ అందుబాటులో లేరు. కంపౌండర్‌ని పిల్చుకొచ్చాడాయన. ఈలోపే ఆ అమ్మ ప్రసవం జరిగిపోయింది. పుట్టిన పసివాడి ఏడుపు నింగి నవ్వులో కలిసిపోయింది. ఆ ఏడుపు కూడా నవ్వులాగే వినిపిస్తోంది. కంపౌండర్ అంబిలికల్ కార్డును కట్ చేసి అమ్మ నుంచి బిడ్డను వేరుపరచాడు.

ఇదంతా ఏ సినిమాలోని సీనో అనుకుంటే పప్పులో కాలు.. కాదు... కాదు.. నవ్వులో నవ్వేసినట్టే. యాభై ఏడు సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన సంఘటనే ఇది. చాలామంది మనుషులు పుడతారు. కొందరు మాత్రం ఉద్భవిస్తారు. అలా ప్రకృతి పారవశ్య వాతావరణంలో ఉద్భవించిన ఆ పసివాడే డాక్టర్ గురవారెడ్డి. అరిగిపోయిన మోకాళ్లను మాత్రమే కాదు.. పెదవులపై ఆరిపోయిన హాసానికి కూడా మందేయగల దిట్ట ఆయన. పుట్టడంలోనే డిఫరెన్సీ చూపించిన ఆయన వైద్యులందరిలోనూ డిఫరెంటే. మాట్లాడేది అయిదు నిమిషాలే అయినా రోగుల మదిలో చిరకాలం స్థానం సంపాదించగలడు. అందుకే మోకాళ్లలో సమస్య ఉన్నవాళ్లు ఎవరైనా ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఆయన అపాయింట్‌మెంట్ కోసం తిరుపతి క్యూలో మాదిరి వేచి చూడడానికైనా వెనుకాడరు.

ఒత్తిడి తెలియని మనిషి!


మెడిసిన్ అనగానే అదేదో సీరియస్‌గా తీసుకోవాల్సిన వ్యవహారం అన్నట్టుగా గంభీరంగా చదువుకోవాలనుకుంటారు. కాని ఆయనకు మాత్రం జీవితంలో ఏ భాగమైనా సెలబ్రేషనే. అందుకే జీవితంలో ఏ ఆనందాన్నీ దూరం చేసుకోరాయన. వైద్యవృత్తిలోకి రావడమంటే వ్యక్తిగత జీవితానికి దూరం కావడమే అనే అపోహ చాలామందికి ఉంటుంది. కాని తన వైద్యంతో పేషెంట్లను బాగుచేస్తూనే, ఇంట్లోవాళ్లతో గడిపే సమయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగల కళ డాక్టర్ గురవారెడ్డి సొంతం. కేవలం ఇంట్లో వాళ్లతో మాత్రమే కాదు.. తనతో తాను గడపడానికి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయించుకోగలరాయన. అందుకే వేలకొద్దీ ఆపరేషన్లు చేస్తూ ఉన్నా ఎప్పుడూ అలసిపోరు. ప్రతిరోజూ రాత్రి 10-11 గంటలకు ఛాయాగీత్ వినందే నిద్రపోని ఆయన్ని ఒత్తిడికి గురిచేయడం ఎవరి తరం మరి?. డాక్టర్‌గా నేను ఆరోగ్యంగా ఉంటేనే నా పేషెంట్ల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతానంటారాయన.

నెగటివ్స్ ఏవీ గుర్తుపెట్టుకోకపోవడమే తన ఆరోగ్య రహస్యం. పాజిటివ్ విషయాలు మాత్రం ఎప్పుడూ గుర్తుంటాయి. నన్ను కూడా బాధపెట్టినవాళ్లు ఉన్నారు గాని ఎవరు, ఎప్పుడంటే గుర్తురావు. మంచి చేసిన విషయాలైతే వందైనా చెబుతాను. అందుకే హాస్పిటల్‌కి సంబంధించి ఎన్ని ఇబ్బందులెదురైనా పాజిటివ్‌తో అధిగమించా. వెయ్యిమందికి పైగా జీవితాలను నా ఆసుపత్రి ఆలంబన అయిందంటే నా పాజిటివ్ దృక్పథమేనంటారాయన. లైఫ్ ఈజ్ ఎ రొమాన్స్ అని చెప్పే డాక్టర్ గురవారెడ్డి దాన్నో వేడుక లాగ చూస్తారు. జీవితంలో ఎంతో ప్రేమ ఉంది. మన జీవితం సరిపోనంత. ద్వేషించడానికి సమయాన్ని వ్యర్థం చేసుకోనంటూ చెబుతారు తాత్వికంగా.

భరోసాయే మొదటి వైద్యం


1999 నుంచి 2004 వరకు అపోలో హాస్పిటల్ రోగులు తమ మోకాళ్ల నొప్పిని మరిచిపోయి నవ్వుతూ వెళ్లిపోయారు. డాక్టర్ గురవారెడ్డి అక్కడ కాలు పెట్టిన వేళా విశేషం మరి. ఆయన ఎక్కడున్నా చుట్టూ ఉన్నవాళ్లందరూ తమ బాధ మరిచిపోయి ఆహ్లాదంగా ఫీలయ్యేట్టు చేయగలరాయన. అందుకే పేషెంట్లకు ఆయన మాటలు లాఫింగ్ థెరపీలా పనిచేస్తాయి. కీళ్ల నొప్పిని మరిపింపచేస్తాయి. 2004లో కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) హాస్పిటల్‌ని డాక్టర్ భాస్కర్ రావుతో కలిసి పెట్టారు. దానికి ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్నారు. కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆర్థోపెడిక్స్ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నా, విస్తరించాలన్నా అనేక ఇబ్బందులు. పైగా నాదైన తీరులో హాస్పిటల్ నడపాలంటే కుదరదు. అందుకే 2009లో సన్‌షైన్ ఉదయించిందంటారు నిజాయతీగా. మీదైన తీరు అంటే ఏమిటని అడిగినప్పుడు పేషెంట్ ఫస్ట్. మిగిలినవన్నీ తరువాతే అంటూ ఒక్క మాటలో చెప్పేస్తారు. హాస్పిటల్‌కి పేషెంటు భయంతో వస్తాడు. అది పోగొట్టాలి. మేమందరం మీకోసం ఉన్నామనే భరోసా ఇవ్వాలి అంటారాయన.

కార్పొరేట్ వైద్యం.. ఆరోగ్యశ్రీ


ఆరోగ్యశ్రీ పథకం కూడా మంచిదే. చాలామందికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. చాలామంది పేషెంట్లకు ఆధునిక వైద్యం ఉచితంగా అందుతున్నది. కార్పొరేట్ హాస్పిటల్స్ లబ్ధి కొరకే ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతున్నదనడంలో నిజం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం తప్పని అంటే ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయేవారు. మంచి శాలరీ, సౌకర్యాలు ఇస్తే ప్రభుత్వంలోకి మంచి డాక్టర్లు వస్తారు. లంచాలు తీసుకోవడం మానేయాలి. మెడికల్ కాలేజీ పూర్తయ్యాక మూడునాలుగేళ్లు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలన్న రూలు పెట్టాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమరేలా చూడాలి. ఇవన్నీ సక్రమంగా అమర్చాలంటే చిత్తశుద్ధి ఉండాలి. పరిస్థితులూ అనుకూలించాలంటూ సూచిస్తారు డాక్టర్ గురవారెడ్డి.

పేషెంట్లంటే ఎటిఎం మెషీన్లు కాదు!


ఇంగ్లండులో ఉన్న హెల్త్‌కేర్ సిస్టమ్ ప్రపంచంలోనే ఉత్తమమైనది. అక్కడ ఎన్‌హెచ్‌ఎస్ సిస్టమ్. ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. ఫెంటాస్టిక్ హెల్త్‌కేర్ ఇన్‌ది వరల్డ్. అమెరికాలో మరీ అధ్వానం. మనకన్నా ఎక్కువ పిండేస్తారు. మనది ఇప్పుడిప్పుడే బాగుపడుతోంది. కాని పేషెంట్లకు డాక్టర్ల మీద నమ్మకం పోతోంది. ఈ నమ్మకం పోవడం వల్ల వ్యవస్థ దెబ్బతింటోంది. పేషెంట్లు, డాక్టర్లు, మీడియా అంతా మారాలి. పేసెంట్ల నమ్మకాన్ని గెల్చుకునే ప్రయత్నం డాక్టర్లు చేయాలి. అయితే డాక్టర్లంతా చెడ్డవాళ్లు కారు. వాళ్లలో కూడా మంచోళ్లుంటారు. వందలో 90 మంది పేషెంటు గురించే ఆలోచించేవాళ్లుంటారు. డాక్టర్ వృత్తే వాళ్లను అలా మార్చేస్తుంది మరి. వాళ్లలో ఉండే చెడు కొంతవరకైనా పోతుంది. అదే రోడ్డు మీద వంద మంది ఉంటే వారిలో 60 మందే మంచోళ్లుంటారు. డాక్టర్లలో కూడా విలువలు పడిపోతున్నాయి. ఆశ ఎక్కువైంది. తొందరగా సంపాదించాలన్న తహ తహ ఉన్నప్పటికీ మరీ ఠాగూర్ సినిమాలో చూపించినట్టుగా చనిపోయిన వ్యక్తికి చికిత్స ఇచ్చేవాళ్లుండరు. ఎంత కమర్షియల్‌గా ఆలోచించేవాళ్లయినా అంత చెడ్డగా ఎవరూ ఉండరు. చాలాతక్కువ మంది స్వలాభం కోసం చూసేవాళ్లుంటారు. ఇలాంటి ప్రచారాల వల్ల కూడా పేషెంట్లకు నమ్మకం పోతోంది. పేషెంటు పట్ల మనస్ఫూర్తిగా సహానుభూతితో వ్యవహరించాలి. అప్పుడు ఏ పబ్లిసిటీలూ అక్కర్లేదు. వాళ్లను ఎటిఎంలుగా చూస్తే ఎంత పబ్లిసిటీలిచ్చినా దగ్గరకు రారు. చాలామంది పేషెంట్లకు నేను అప్పు కూడా ఇచ్చాను. పేషెంటుకు ఎమర్జెన్సీ ఉంటది. ఊరికెళ్లి డబ్బులు తీసుకొస్తామంటారు. ఇలాంటప్పుడు వాళ్లు ఊరెళ్లి డబ్బు తీసుకొచ్చేలోగా పరిస్థితి చేయిదాటిపోవచ్చు. అందుకే ముందు ఆపరేషన్ చేయించుకోండి. ఊరికి వెళ్లిన తరువాత డబ్బులు పంపించండి అని చెబుతాను. ఇప్పటివరకు ఏ పేషెంటూ నన్ను మోసం చేయలేదని చెబుతారు సంతోషంగా.

4743
Tags

More News

VIRAL NEWS