డబుల్ ఇక్కత్‌తో.. పుట్టపాకకు పురస్కారం!


Mon,July 25, 2016 03:12 AM

ఆడవారి అలంకరణకు రెట్టింపు సౌందర్యం తీసుకొస్తుంది చీర! సహజసిద్ధ వర్ణాలకు.. ఆ వర్ణరంజిత వన్నెలకు కేరాఫ్ ఇక్కత్! మగ్గాలపై.. హస్తకళా నైపుణ్యంతో కాంతులీనే ఇక్కత్‌కు మరింత హిమ్మత్ లభిస్తోంది! ఫ్యాషన్ ప్రపంచాన్ని తన కొంగు అంచులతో ఆడించే సాగసు తన సొంతమని వస్తోంది డబుల్ ఇక్కత్! నల్లగొండ జిల్లా పుట్టపాక కళాకారుల హస్తకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ డబుల్ ఇక్కత్.. భారత చేనేత వస్త్రకళా నైపుణ్య గొప్పతనాన్ని చాటుతోంది. ఆగస్టు 7న జాతీయ చేనేత దివస్ సందర్భంగా ఇద్దరు పుట్టపాక గ్రామస్తులు జాతీయ పురస్కారం అందుకోబోతున్నారు! గంటకో ఫ్యాషన్ మార్చే ప్యారిస్ నగరానికే.. కోరుకున్న వస్ర్తాలను ఎగుమతి చేసే చేనేతల శ్రమ స్వరూపం.. ఆ గ్రామం. చుట్టూ పచ్చని పొలాలతో అలరారుతూ వ్యవసాయ పల్లెగా కనిపించినా.. పెను సంక్షోభంలోనూ వృత్తినే నమ్ముకున్న నేతన్నల కృషితో దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన ఖ్యాతి పుట్టపాక సొంతం. పట్టు వస్ర్తాల్లో మేటి డిజైన్లకు పేరుగాంచి పట్టుపాకగా.. నేటికీ వన్నె తగ్గని మర మగ్గాలతో చేనేతపుట్టగా.. పట్టుకు ప్రాధాన్యతనిచ్చే పట్టుపుట్టగా మార్మోగుతోంది!
puttapaka
చేనేత రంగంలో చేసిన కృషికి ఫలితంగా ఇప్పటికే పుట్టపాకకు చెందిన ఇద్దరిని భారత ప్రభుత్వ అత్యుత్తమ అవార్డు పద్మశ్రీ వరించగా.. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు చేనేత కార్మికుల అద్భుత శ్రమకు జాతీయ ఉత్తమ అవార్డు వరించింది. పుట్టపాకకే ప్రత్యేకమైన డబుల్ ఇక్కత్ విధానంలో ప్రకృతి రంగులతో 108 డిజైన్లతో రూపొందించిన వస్ర్తానికిగాను జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు పుట్టపాకవాసులు రాధాకృష్ణమూర్తి, బుచ్చి రాములు!

అసామాన్యులు వీరు!


పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి, కొలను బుచ్చిరాములు.. ఆర్థిక అవస్థల్లోనూ నమ్ముకున్న చేనేత వృత్తితోనే జీవనం సాగిస్తున్న శ్రమ జీవులు. తాతలు, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన వస్ర్తాల నేతతోనే బతుకుబండిని లాగుతున్న చేనేత కార్మికులు. బతుకు పయనంలో సామాన్యులే అయిన వీళ్లు.. బతుకు నడిపిస్తున్న చేనేత కళలో మాత్రం అసామాన్యులు. ఆ కళ ఫలితమే.. వచ్చే ఆగస్టు 7న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వీళ్లు సంయుక్తంగా అందుకోనున్న జాతీయస్థాయి ఉత్తమ చేనేత అవార్డు. ఇద్దరూ ఏడాది పాటు శ్రమించి ప్రత్యేకమైన నిలువు పేక డబుల్ ఇక్కత్ విధానంలో రాశులు, వాస్తు వంటి 108 డిజైన్లతో రూపొందించిన తేలియా రూమాల్ చీర ద్వారా వీరి శ్రమకు జాతీయ స్థాయి అవార్డు వరించనుంది!

108 నమూనాలతో!


రాధాకృష్ణ, బుచ్చిరాములు సాధారణ చేనేత కార్మికులు. కాటన్ వస్త్రంపై అద్భుతాన్ని ఆవిష్కరించాలన్నదే వాళ్ల ఆశయం. చేనేత వృత్తినే నమ్ముక్ను తమ ఊరికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కలలుగన్నారు. నూలు వడకకున్నా.. వస్ర్తాలు నేయకున్నా.. పూట గడవని స్థితిలో ఓవైపు జీవన సమరం సాగిస్తూనే మరోవైపు ప్రత్యేక ప్రయత్నమూ కొనసాగించారు. నిలువు పేక విధానంలో డబుల్ ఇక్కత్ డిజైన్ ద్వారా 6.25 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉన్న చీరను రూపొందించారు. వృశ్చికం, మేషం వంటి రాశులకు సంబంధించిన ప్రతికూల డిజైన్లతోపాటు.. వాస్తు సంబంధిత అంశాలనూ చీరపై పొందుపరిచారు. మొత్తం 108 రకాల డిజైన్లు రెండు సార్లు మాత్రమే వచ్చేలా రూపొందించిన అద్భుతమైన ఈ చీర తయారీలో సహజ సిద్ధమైన రంగులు ఉపయోగించారు!

ప్రకృతి పదార్థాలనే!


మంచి అర్థాన్ని, మంచి ఆలోచనలను కల్పించే రూపాలను మాత్రమే తమ చీరపై పొందు పరిచిన ఈ చేనేత కార్మికలు ఇద్దరూ.. సహజ రంగులతో 108 డిజైన్లు పొదిగిన డబుల్ ఇక్కత్ తేలియా రుమాల్ కాటన్ చీర కోసం పనిని ప్రణాళికాబద్ధంగా విభజించుకున్నారు. డిజైనింగ్‌తోపాటు టై అండ్ డై (రంగులు అద్దడం)లో ఎంతో నైపుణ్యం కలిగిన పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి తన పని చాకచక్యంగా పూర్తి చేశారు. తేలియా (ఎరుపు), బ్లాక్ (నలుపు) రంగులు మాత్రమే కలిగిన ఈ చీరపై ముద్రించిన ఆ రంగులు పూర్తిగా ప్రకృతి పదార్థాల నుంచి రూపొందించినవే. పచ్చగడ్డి తిన్న వెంటనే గొర్రెలు పెంట రూపంలో విసర్జించే గొర్రె నుచ్చు.. ఆముదం పొట్టు కాల్చిన తర్వాత వచ్చే బూడిద.. నువ్వుల నూనె వంటి మిశ్రాన్ని కలిపి 21 రోజులు నానబెట్టి నలుపు రంగును తయారు చేశారు!

కళకు జాతీయ గుర్తింపు!


తాటిబెల్లం, ఇనుప తుప్పును 45 రోజులు నిల్వ చేసి నల్ల రంగును మరో దఫా రూపొందించారు. కొండ పసుపు, సున్నం కలిపిన మిశ్రమంతో ఎరుపురంగు వెలికి తీశారు. సహజమైన రంగులే వస్ర్తానికి మన్నికగా అంటడంతో పాటు సరికొత్త అందాన్ని కూడా తీసుకొస్తాయనే ఉద్దేశంతోనే రంగుల తయారీలో జాగ్రత్తలు వహించిన తర్వాత.. హ్యాండ్లూమ్ వర్క్(మగ్గం నేయడం) పనిని కొలను బుచ్చిరాములు మరింత ఓపికగా పూర్తి చేశారు. తమ శ్రమకు గుర్తింపు కోసం వీళ్లు హైదరాబాద్ వీవర్స్ సెంటర్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆ తర్వాత జోనల్, సెంట్రల్ స్థాయిలోనూ ఆకట్టుకున్న వీరి చీర జాతీయ స్థాయిలోనూ ఉత్తమ అవార్డు కైవసం చేసుకుంది. జాతీయ చేనేత దివస్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోడీ వీరికి అవార్డు ప్రధానం చేయనున్నారు!
puttapaka1

డబుల్ ఇక్కత్ ధమాకా!


సాధారణంగా చేనేత వస్త్ర పరిశ్రమలో అంతటా నడిచేది సాధారణ పేక, ప్లెయిన్ డిజైన్.. సింగిల్ ఇక్కత్ విధానం. కానీ.. పుట్టపాకలో మాత్రం వీటితోపాటు నిలువు పేక డబుల్ ఇక్కత్ విధానం ప్రత్యేకత. ఇక్కడి చేనేత కార్మికుడి పనితనమైనా.. ఏదో ఒకరకంగా వారి సలహాలు, సూచనలైనా లేకుండా దేశంలో ఎక్కడా డబుల్ ఇక్కత్ వస్త్రం తయారు కాలేదంటే అతిశయోక్తి కాదు. పుట్టపాక నుంచి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ టై అండ్ డై సింగిల్ ఇక్కత్, ఫర్నిషింగ్ క్లాత్ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పాతికేళ్లుగా ఇక్కడి నుంచి ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ.. వంటి గల్ఫ్ దేశాలకు వస్ర్తాల ఎగుమతి జరుగుతోంది. గంటకో ప్యాషన్ మార్చే నగరంగా పేరుగాంచిన ప్యారిస్‌కు కూడా వస్ర్తాలు ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. కోరుకున్న డిజైన్‌కు తగ్గట్టుగా క్లాత్ తయారు చేయడంలో ఇక్కడి చేనేత కార్మికులు సృజనశీలురు. రాధాకృష్ణమూర్తి, బుచ్చిరాములుకు దక్కే పురస్కారం పుట్టపాక గ్రామంలోని ప్రతి చేనేత గడపకు దక్కిన గౌరవంగా గ్రామస్తులు భావిస్తున్నారు.

చేనేతకే ప్రత్యేకత!


1980 సంవ్సరకాలంలో ఎక్కడెక్కడ్నుంచో పుట్టపాకకు సుమారు 400 చేనేత కుటుంబాలు వలస వచ్చాయి. ఈ పరిశ్రమ సంక్షోభంలో కూరుకొని నష్టాల బాట పట్టడంతో దాదాపు సగం మంది తిరిగి వెళ్లిపోయారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ ప్రస్తుతం 500పైగా చేనేత మగ్గాలు నడుస్తున్నాయి. మరోవైపు వ్యాపారుల పెట్టుబడికి కార్మికులు బలవుతూనే ఉన్నారు. చేనేతరంగం పరంగా ఈ గ్రామం నుంచి కృషి చేసిన వాళ్లెంతోమంది ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకునే వ్యక్తి గజం నర్సింహా. 2012-13 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు అందుకున్నారాయన. తర్వాత సంవత్సరం గజం అంజయ్య అనే చేనేత వస్త్రకళాకారునికి పద్మశ్రీ వరించింది. తాజాగా 2015 సంవత్సరానికిగాను రాధాకృష్ణ, బుచ్చిరాములు జాతీయ అవార్డుకు ఎంపికకావడంతో పుట్టపాక ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది!
గుర్తింపు కోసమే

30 ఏళ్ల క్రితం పుట్టపాకకు వచ్చి స్థిరపడ్డాం. సంక్షోభం వచ్చినా వృత్తిని మాత్రం వీడలేదు. కాలక్రమంలో ఎన్నో కష్టాలు చవి చూశాం. ఇప్పటికీ ఓవైపు బతుకు పోరాటం సాగిస్తూనే.. మరోవైపు చేనేత కార్మికుల శ్రమకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చీర రూపొందించడానికి కృషి చేశాం. 108 డిజైన్లతో సహజసిద్ధ రంగులతో తయారు చేసిన వస్ర్తానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది!
- పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి

సంతోషంగా ఉంది


ఎంతో శ్రమ.. ఓపికతో కూడిన పని వస్ర్తాలు నేయడం. మా తండ్రి నుంచి నేర్చుకున్న ఈ వృత్తిని వదులుకోలేక.. ఒక దశలో ముంబై, గుజరాత్‌లలోనూ పని చేశాను. తర్వాత మళ్లీ గ్రామానికే వచ్చి చేనేత పనిని కొనసాగిస్తున్నాను. ఏడాదిపాటు ఎంతో శ్రమించి మేము తయారు చేసిన డబుల్ ఇక్కత్ చీరకు జాతీయస్థాయి ఉత్తమ అవార్డు రావడం చేనేతకు మరింత హిమ్మత్ లభించినట్లయింది!
- కొలను బుచ్చిరాములు

-జూలకంటి రాజేందర్ రెడ్డ్డి నల్లగొండ ప్రతినిధి
ఐతగోని రాఘవేందర్, చౌటుప్పల్

1551
Tags

More News

VIRAL NEWS