ట్యూమర్ తీసేసినా సమస్యలు వస్తాయా?


Tue,April 18, 2017 12:25 AM

మా వారికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టుగా పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. మా ఇంట్లో అందరం చాలా ఆందోళనగా ఉన్నాం. ఈ ట్యూమర్‌ను సురక్షితంగా, శాశ్వతంగా తొలగించడం సాధ్యమేనా? అది తీసేసిన తర్వాత కూడా ఏవైనా సమస్యలు వస్తాయా? మిగతా వివరాలన్నీ తెలియజేయగలరు.
పద్మావతి, స్టేషన్ ఘన్‌పూర్
Tumor
ట్యూమర్లు చాలా రకాలు ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మాలిగ్నెంట్ ట్యూమర్లు.. అంటే క్యాన్సర్‌కు సంబంధించినవి.. ఇవి ప్రాణాంతకం. మరోరకమైనవి బినైన్ ట్యూమర్లు.. అంటే క్యాన్సర్ కానివి అని అర్థం. సర్జరీతో మెదడులో కణితిని తొలిగించడం కొంచెం కష్టమైన విషయమే. అయితే మెదడులో వచ్చే కణితుల్లో చాలా వరకు బినైన్ రకానికి చెందినవే. అయినప్పటికీ మెదడు చాలా సున్నితమైన అవయవం కాబట్టి ఏ చిన్నపొరపాటైనా చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. న్యూరోనావిగేషన్ విధానంలో కంప్యూటర్ తెరపై చూస్తూ సర్జన్లు కణితిని సురక్షితంగా తొలగించగలుగుతారు. మీ వారి మెదడులో కణితి ఏ రకానికి చెందినదో ఒకసారి పరీక్షించి చూసి చికిత్స అందించి ఉండాల్సింది. అది బినైన్ రకానికి చెందినదైతే దాన్ని తొలగించి పూర్తిగా నయం చెయ్యడం సాధ్యపడుతుంది. మాలిగ్నెంట్ ట్యూమర్‌ను ఒకసారి తొలగిస్తే తిరిగి వచ్చే ఆస్కారాలు చాలా తక్కువ. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వారి సమస్యకు శాశ్వత చికిత్స అందుబాటులో ఉంది.
>డాక్టర్
ఆనంద్ బాలసుబ్రమణ్యం
న్యూరోసర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్

436
Tags

More News

VIRAL NEWS