జుట్టు రాలుతున్నది.. ఏం చెయ్యాలి?


Fri,June 9, 2017 11:21 PM

నా వయసు 35 సంవత్సరాలు. ఈ మధ్య జుట్టు ఎక్కువగా రాలిపోతున్నది. ఇంటి చాలా పాటించి చూశాను. షాంపూలు, హెయిర్ ఆయిల్ కూడా మార్చి చూశాను కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. పట్టుకుచ్చులా ఉండే జుట్టు చాలా పలుచబడిపోతున్నది. అక్కడక్కడ మాడు కూడా కనిపిస్తున్నది. నా సమస్యకు పరిష్కారం చూపగలరు?
వింద్య, ఆదిలాబాద్

councelling
ఈరోజుల్లో స్త్రీ, పురుషులిద్దరిలోనూ జుట్టురాలే సమస్య సాధారణంగా కనిపిస్తున్నది. అందుకు రకరకాల కారణాలుంటాయి. ముఖ్యంగా ఒత్తిడి, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాడుతున్న కాస్మెటిక్ వస్తువుల వంటి అనేక రకాల అంశాల ప్రభావం జుట్టు మీద ఉంటుంది. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. మీకు నెలసరి సమస్యలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుపలేదు. ఒక్కోసారి గర్భాశయం, అండాశయాల్లో సమస్యలు ఉన్నప్పుడు హిస్టరెక్టమీ ద్వారా వాటిని తొలగిస్తారు. అందువల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లలో తేడాలు వస్తాయి. అది కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.
-థైరాయిడ్ సమస్యలు
-పాలి సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్
-తల మీది చర్మంలో ఇన్‌ఫెక్షన్లు
-హెయిర్ ైస్టెలింగ్‌కోసం ఎక్కువగా రసాయనాలు ఉపయోగించడం
-ఒత్తిడి
-జన్యుపరమైన కారణాలు
-గర్భం దాల్చడం
-గర్భనిరోధక మాత్రల వాడకం
ఇప్పుడు జుట్టురాలే సమస్యకు పరిష్కారంగా చాలా రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ప్లేట్లెట్‌రిచ్ ప్లాస్మా థెరపి : రక్తంలో ఉండే మూలకణాలను తీసుకొని వాటిలోని హెయిర్ గ్రోత్ ప్రొటీన్‌ను జుట్టు పరెగేందుకు ఉపయోగిస్తారు. ఈ చికిత్స కోసం మీ శరీరం నుంచి రక్తాన్ని తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత వచ్చే ప్లేట్లెట్ రిచ్ రక్తాన్ని మాడు మీదకు ఎక్కిస్తారు. ఫలితంగా జుట్టు రాలడం తగ్గడమే కాదు. కొత్త జుట్టు కూడా వస్తుంది.
మీసోథెరపీ : మీసోథెరపీ జుట్టురాలకుండా నివారించడానికి మంచి చికిత్స. ఇది బట్టతలకు, ప్యాచెస్‌గా ఊడిపోవడానికి కూడా చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఇందులో తలలోని చర్మంలోకి ఇంజెక్షన్‌గన్‌ను ఉపయోగించి విటమిన్స్ ఎక్కిస్తారు. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది పురుషుల్లో బట్టతలను నివారించడానికి ఉపయోగపడుతుంది.
స్టెమ్ సెల్ థెరపీ : ఈ థెరపీలో హెయిర్ ఫాలికిల్స్‌లో కోల్పోయిన మూలకణాలను తిరిగి అందిస్తారు. ఇందులో తల చర్మానికి మూలకణాలను అందిస్తారు. ఫలితంగా కొత్త జుట్టు తిరిగి వస్తుంది. అయితే ఈ చికిత్స మొదలు పెట్టిన 3, 4 నెలల్లో తిరిగి కొత్త జుట్టు పెరుగడం మొదలవుతుంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ : దీనికి సర్జరీ అవసరమవుతుంది. జుట్టు సాంద్రత ఎక్కువగా ఉన్న భాగం నుంచి జుట్టు కుదుళ్లను సేకరించి వందలాది చిన్న చిన్న గ్రాఫ్ట్‌లుగా తయారు చేసి వాటిని సాంద్రత తక్కువగా ఉన్న భాగాల్లో అతికిస్తారు. 6-9 నెలల్లో ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు పెరుగడం ప్రారంభిస్తుంది.
ఇలా రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న స్కిన్ అండ్ హెయిర్ డాక్టర్‌ను సంప్రదిస్తే వారు మీకు సరైన చికిత్సను సూచిస్తారు.

డాక్టర్ వేణు కుమారి
డాక్టర్ వేణూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్
హైదరాబాద్

727
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles