జీర్ణాశయ క్యాన్సర్ కు ఆధునిక చికిత్స


Mon,January 22, 2018 11:01 PM

stomach-cancer
ఆహారపదార్థాలన్నీ జీర్ణించుకొని శరీరానికి అవసరమైన శక్తినంతా సరఫరా చేసేది జీర్ణాశయం. శిశుదశ నుంచి వృద్ధాప్యం దాకా ఆ జీర్ణక్రియ నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. అయితే ఒకవేళ ఆ జీర్ణాశయం రోగగ్రస్తమైతే? ప్రత్యేకించి క్యాన్సర్ బారిన పడితే అసలు జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. అయితే ఆధునిక వైద్య విధానాలు ఈ సమస్యను సమర్థవంతంగా నివారించగలుగుతున్నాయి. కాకపోతే జీర్ణాశయ క్యాన్సర్ లక్షణాలను గురించిన అవగాహనతో మునుముందే డాక్టర్‌ను సంప్రదిస్తే ఆ క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. జీర్ణాశయ క్యాన్సర్‌లు మనదేశంలో దక్షిణ భారతీయుల్లోనే ఎక్కువ. ఈ క్యాన్సర్ స్త్రీలతో పోలిస్తే మూడింట రెండు వంతులు పురుషులే ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుకుంటారు. ప్రత్యేకించి 50 ఏళ్లు దాటిన వారిలో జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువగా కనబడతాయి.

ఇన్‌ఫెక్షన్లు వల్లా..?

హెచ్ పైలోరీ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారి జీర్ణాశయంలో లింఫోమాలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణాశయ క్యాన్సర్ వస్తే వాటిలో ఎక్కువగా లోలోపల పెరిగే ఎడినో కార్సినోమా క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల అధ్యయనాల్లో పొగమంటలతో అంటే కట్టెల మీద గానీ, పొట్టు మీద గానీ వండే పదార్థాలు తినేవారిలో ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉప్పు ఎక్కువగా కలిసే కూరలు, పచ్చళ్లు తినే వారిలో కూడా ఈ క్యాన్సర్లు ఎక్కువే. పొగతాగే వారు కూడా ఈ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతుంటారు. స్థూలకాయుల్లోనూ ఈ క్యాన్సర్ ఎక్కువగానే కనిపిస్తుంది. డియోడినల్ అల్సర్ ఉన్న వారికి వెగాటమీ జిజెసర్జరీ అంటూ చేస్తారు. అలా సర్జరీ చేయించుకున్న వారిలో కూడా జీర్ణాశయ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య మిగతా వారితో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పర్నీషియస్ ఎనిమియా ఉన్న వారిలో కూడా ఈ జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కారణం ఏమిటో తెలియదు గానీ, ఏ గ్రూపు రక్తం ఉన్న వారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారసత్వంగా పూర్వికుల్లో నాన్‌పాల్ఫోసిస్ కొలరెక్టల్ క్యాన్సర్, రొమ్ము, అండాశయ క్యాన్సర్ ఉన్నవారి వారసుల్లో కూడా జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బొగ్గు, లోహాలు, రబ్బరు పరిశ్రమల్లో పనిచేసే వారిలో కూడా ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

నివారించలేమా?

ఆహార నియమాలు పాటిస్తూ శరీరం బరువును నియంత్రణలో ఉంచుకుంటూ, క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ క్యాన్సర్‌ను చాలా వరకు నియంత్రించవచ్చు. రిఫ్రిజిరేటర్లు లేని రోజుల్లో ఆహార పదార్థాలను ముఖ్యంగా మాంసం, చేపలు, పచ్చళ్లు నిలువ ఉంచడానికి ఉప్పు ఎక్కువగా వాడే వారు. రిఫ్రిజిరేటర్లు వాడడం ఎక్కువవుతున్న క్రమంలో జీర్ణాశయ క్యాన్సర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దంపుడు బియ్యం వాడటం, తాజా ఆకుకూరలు, కూరగాయలను విరివిగా వాడడం ద్వారా ఈ జీర్ణాశయ క్యాన్సర్‌ను చాలా వరకు నిరోధించే అవకాశాలు ఉన్నాయి. విటమిన్ ఎ,సి,ఇ విటమిన్లు, సెలీనియం వంటి లవణాలు తీసుకుంటూ ఉంటే ఈ జీర్ణాశయ క్యాన్సర్ బారిన పడకుండా తమను తాము కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. గమనిస్తే, పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ జీర్ణాశయ క్యాన్సర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. అవేమీ తీసుకోకుండా, కారం, మసాలా ఆహార పదార్థాలు, పచ్చళ్లు ఎక్కువగా తినే వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా నివారణకు సకాలంలో వైద్యం తీసుకోగలిగితే ఈ జీర్ణాశయ క్యాన్సర్ బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తం పలచబడానికో, మరే ఇతర కారణంగానోరోజు ఆస్పిరిన్ మాత్రలు వేసుకునే వారికి పేగు క్యాన్సర్ లేదా జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఎలా తెలుస్తుంది?

ఈ క్యాన్సర్ లక్షణాల్లో ప్రధానంగా ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, పొత్తికడుపులో నొప్పి రావడం, కడుపులో ఎప్పుడూ ఏదో అసౌకర్యంగా అనిపించడం వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు ఏ కొంచెం అన్నం తిన్నా కడుపు నిండిపోయినట్లు అనిపించడం, ఏదీ రుచిగా అనిపించకపోవడం, ఛాతీలో మంట అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలను చాలా మంది కడుపు ఉబ్బరం సమస్య అనుకుంటారు. కానీ, ఒక్కోసారి అది జీర్ణాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. కొంత మందికి అజీర్తి సమస్యగా కూడా అనిపిస్తుంది. వికారం, వాంతులు, వాంతిలో కొన్ని సార్లు రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపు మీద నుంచి తడిమితే చేతికి గడ్డలా తగలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది ఈ లక్షణాలన్నింటిని గ్యాస్ సమస్యగా భావించి డైజిన్, జెంటాక్ వంటి మాత్రలు వేసుకంటూ ఉండిపోతారు. క్యాన్సర్ కణితి తాలూకు రక్తం కొన్ని సార్లు బయటికి రాకుండా పేగుల్లోకి వెళ్లిపోయి రక్తం కూడా జీర్ణమవుతుంది. అందుకే నల్లటి విరేచనాలు కావచ్చు. అలా రావడాన్ని మెలీనా అంటారు. అప్పటికే క్యాన్సర్ ముదిరిపోయి ఉంటే పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలోకి నీరు చేరడం, కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వ్యాధినిర్ధారణ

కొన్ని లక్షణాలు ఎక్కువ రోజులుగా కనిపిస్తున్నపుడు వెంటనే డాక్టర్‌ను కలవడం ఎంతో అవసరం. వ్యాధి నిర్ధారణకు ఎండోస్కొపీ ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగానే అది క్యాన్సరా? లేక అల్సరా తెలిసిపోతుంది. ఒకవేళ క్యాన్సర్ కణితే అయితే అది ఏ భాగంలో ఉంది, ఇతర భాగాలకు వ్యాపించిందా తెలిసిపోతుంది. అదే సమయంలో బయాప్సీ కూడా తీసుకుంటారు. ఆ తర్వాత సీటీ స్కాన్ గానీ, పెట్ సీటీ స్కాన్ గానీ అవసరమవుతుంది. దీని ద్వారా కణితి జీర్ణాశయంలోనే ఉందా? ఇతర భాగాలకు వ్యాపించిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు.

చికిత్సలు

వైద్య చికిత్సలు ప్రధానంగా సర్జరీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ అంటూ నాలుగు రకాలుగా ఉంటాయి. వ్యాధి నిర్ధారణ కాగానే సర్జరీ ద్వారా ఆ కణితులను తొలగిస్తారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించగలిగితే ఎండోస్కోపీ ద్వారా కూడా సర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేయడాన్ని ఎండోస్కోపిక్ మ్యూకోజల్ డిసెక్షన్ అంటారు. రెండవది పార్షియల్ రాడికల్ గ్యాస్ట్రెక్టమీ చేస్తారు. దీన్నే సబ్ - టోటల్ గ్యాస్ట్రెక్టమీ అని అంటారు. ఒకవేళ క్యాన్సర్ కణితులు బాగా విస్తరించి ఉండే జీర్ణాశయాన్ని మొత్తంగానే తీసేయ్యాల్సి ఉంటుంది. దీన్నే టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. మొత్తం జీర్ణాశయం మొత్తంగా తీసేస్తే జీర్ణక్రియకు ఇబ్బంది ఏర్పడుతుందని అనుకుంటారు, కానీ నిజానికి జీర్ణక్రియ దాదాపుగా చిన్న పేగుల్లోనే జరుగుతుంది. లింఫ్‌నోడ్స్‌లోకి వ్యాపించి ఉంటే అప్పుడు లింఫ్ నోడ్స్ కూడా తీసేయాల్సి రావచ్చు. సర్జరీ తర్వాత పరిస్థితి అనుసరించి కీమోథెరపీ గానీ, కీమో- రేడియో థెరపీ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. కీమోథెరపీతో పాటు కొందరికి మెరెసెప్టిన్ కూడా ఇవ్వడం జరుగుతంది. దీన్నే టార్గెటెడ్ థెరపీ అంటారు. చివరకు టార్గెటెడ్ థెరపీ ఇస్తారు. జీర్ణాశయ క్యాన్సర్ అనగానే వణికిపోవడం ఒకప్పటి మాట. ఆధునిక వైద్య విధానాలు ఆ క్యాన్సర్‌ను సమూలంగా తొలగించగలుగుతున్నాయి. కాకపోతే వ్యాధిని ఎంత త్వరితంగా గుర్తించగలిగితే అంత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.
mohana-vamshi

1022
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles