జీరో బ్యాలెన్స్ అకౌంట్ ..


Sat,August 11, 2018 01:29 AM

-బ్యాంకుల బాదుడు తప్పించుకునే మార్గం
దేశంలో పెద్దనోట్ల రద్దు జరిగినప్పటి నుంచి బ్యాంకు పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వ (మినిమం బ్యాలెన్స్) అంశం తరచుగా వార్తల్లో వినిపిస్తున్నది. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత 500, 1000 రూపాయల నోట్ల చలామణిని రద్దుచేయడంతో బ్యాంకులకు నగదు ప్రవాహం వెల్లువెత్తింది. దీంతో బ్యాంకులు పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వకు సంబంధించిన నిబంధనలను మార్చాయి. అప్పటివరకు పొదుపు ఖాతాల్లో కనీస నగదును నిల్వ ఉంచని ఖాతాదారులకు ఎటువంటి జరిమానాలు విధించని ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం గత కొంతకాలం నుంచి ఈ నిబంధనలను గట్టిగా అమలుచేస్తూ పెనాల్టీలతో ఖాతాదారులను బాదేయడం మొదలుపెట్టాయి. ఫలితంగా ఇటువంటి పెనాల్టీల రూపంలో బ్యాంకులకు వస్తున్న వసూళ్లు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. మినిమం బ్యాలెన్స్ పేరుతో ఖాతాదారులు బ్యాంకుల్లో అధిక మొత్తాలను నిల్వ ఉంచకుండా తప్పించుకోవాలంటే అందుకు జీరో-బ్యాలెన్స్ ఖాతాలే మార్గం.

big
నేడు దేశంలోని చాలా బ్యాంకుల్లో జీరో-బ్యాలెన్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ)గా కూడా పిలిచే జీరో-బ్యాలెన్స్ ఖాతాలు కనీస నగదునిల్వ ఉంచాల్సిన అవసరంలేని ప్రాథమిక పొదుపు ఖాతాలు. పేరులో ఉన్నట్టుగానే జీరో-బ్యాలెన్స్ అకౌంట్‌లో ఒక్క రూపాయి నిల్వ ఉంచకపోయినా ఆ ఖాతాదారుడికి బ్యాంకు ఎటువంటి పెనాల్టీ విధించదు. ఏ వ్యక్తి అయినా ఒక బ్యాంకులో ఒక్క బీఎస్‌బీడీఏ ఖాతాను మాత్రమే కలిగి ఉండేందుకు వీలుంటుంది. బీఎస్‌బీడీఏ ఖాతాను కలిగివున్న వ్యక్తి అదే బ్యాంకులో ఇతర పొదుపు ఖాతాలను కలిగి ఉండేందుకు వీలుండదు. ఒకవేళ వేరే ఖాతాలేమైనా ఉన్నట్టయితే బీఎస్‌బీడీఏ ఖాతా తెరిచిన తర్వాత 30 రోజుల్లోగా వాటిని మూసేయాల్సి ఉంటుంది. బీఎస్‌బీడీఏ ఖాతాను ఎవరైనా ప్రారంభించవచ్చు. దీనిని తెరిచేందుకు ఎటువంటి వయోపరిమితి గానీ, ఆదాయ పరిమితిగానీ లేక ఇతర ఆర్థిక ప్రామాణికంగానీ అవసరంలేదు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రజలను సులభమైన నిబంధనలతో పొదుపు ఖాతాలు తెరిచేలా ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం అందుబాటులోకి రావడంతో బీఎస్‌బీడీఏ ఖాతాలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. చివరికి మన పేరుతో వేతన ఖాతాను సైతం జీరో-బ్యాలెన్స్ ఖాతాగా తెరువవచ్చు. అయితే జీరో-బ్యాలెన్స్ వేతన ఖాతా విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

జీరో-బ్యాలెన్స్ అకౌంట్ ఫీచర్లు

బీఎస్‌బీడీఏ చాలా విధాలుగా సాధారణ పొదుపుఖాతా లాంటి దే. దీనిలో నగదు జమ, ఉపసంహరణలతోపాటు డెబిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ ఖాతాను యాక్సెస్ చేసుకోవడంతోపాటు దానిద్వారా బిల్లుల చెల్లింపులు ఇతర లావాదేవీలు కూడా జరుపవచ్చు. ఈ ఖాతాకు సంబంధించి ఎటువంటి చార్జీ లేకుండానే ఏటీఎం కార్డు, పాస్‌పుస్తకం లభిస్తుంది. అయితే బీఎస్‌బీడీఏ ఖాతాదారులకు బ్యాంకులు కొన్ని పరిమితులను విధించాయి. దీంతో బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ, ఏటిఎం వినియోగం, ఆర్టీజీఎస్, నెఫ్ట్, చెక్కులు, ఈఎంఐలు తదితర లావాదేవీలను నెలలో నాలుగుసార్లు మా త్రమే ఉచితంగా నిర్వహించేందుకు వీలుంటుంది.
HOUSE
అయితే బ్యాంకులు ఈ ప్రాథమిక ఫీచర్లకు అతీతంగా సేవలు అందించేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. దీంతో బ్యాంకులు తమ సొంత నిబంధనను ఉల్లంఘించి నెలలో నాలుగు కంటే ఎక్కువసార్లు తమ ఖాతాదారులకు ఉచిత లావాదేవీలను అందించేందుకు లేదా ప్రీమియం సర్వీసుగా కొంత మొత్తం చార్జీతో అదనపు లావాదేవీలను అందించేందుకు వీలుంటుంది. బీఎస్‌బీడీ ఖాతాతో పోలిస్తే జీరో-బ్యాలెన్స్ వేతన ఖాతా కొంచం భిన్నమైనది. జీరో-బ్యాలెన్స్ వేతన ఖాతాదారులకు ఉచిత లావాదేవీలపై ఎటువంటి పరిమితి ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంకు నియమ నిబంధనల ఆధారంగా జీరో-బ్యాలెన్స్ వేతన ఖాతాదారులకు ఇతర ప్రీమియం సేవలను అందించేందుకు కూడా వీలుంటుంది.

జీరో-బ్యాలెన్స్ ఖాతా ఎవరు తెరువవచ్చు?

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎంతో అనువుగా ఉండే జన్‌ధన్ ఖాతాను పదేండ్ల వయసు దాటిన తర్వాత ఎవరైనా తెరిచేందుకు వీలున్నది. అదే బీఎస్‌బీడీఏ ఖాతానైతే వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరితోనైనా కలిసి ఉమ్మడిగా ప్రారంభించవచ్చు. ఏది ఏమైనప్పటికీ నెలవారీ లావాదేవీలపై ఎటువంటి పరిమితులు ఉండకూడదనుకుంటే సాధారణ పొదుపు ఖాతాను తెరువడమే మంచిది. అయితే ఇందుకోసం ఖాతాదారులు బ్యాంకు నియమ నిబంధనలకు అనుగుణంగా కనీస మొత్తాన్ని ఖాతాలో నిల్వ ఉంచాల్సి ఉంటుంది. మనలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండవచ్చు. వీటిని నిరంతరం పర్యవేక్షించడం, కనీస నిల్వలను కొనసాగించడం కష్టమైన పనే. కనుక మనం ఎక్కువగా నిర్వహించే లావాదేవీల కోసం ఒకటి లేదా రెండు ప్రాథమిక ఖాతాలను కొనసాగించడం మంచిది. అప్పుడప్పుడు నిర్వహించే లావాదేవీల కోసం ఈ రెండు ఖాతాల్లో ఒక దానిని కనీస నిల్వతో పనిలేని బీఎస్‌బీడీఏ ఖాతాగా మార్చుకుంటే పెనాల్టీల భయం ఉండదు.
- ఆదిల్ శెట్టి సీఈవో, బ్యాంక్ బజార్.కామ్
JAN-DHAN

జన్‌ధన్ ఖాతాదారులకు అదనపు ప్రయోజనాలు

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. జన్‌ధన్ ఖాతా కూడా జీరో-బ్యాలెన్స్ ఖాతాయే. అయితే బీఎస్‌బీడీఏ ఖాతాదారుల కంటే అదనపు ప్రయోజనాలను పొందుతున్న జన్‌ధన్ ఖాతాదారులకు రూ.30 వేల జీవిత బీమాతోపాటు లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా జన్‌ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత ఆ ఖాతాదారుడు సదరు బ్యాంకు నుంచి రూ.5 వేల వరకు రుణాన్ని పొందేందుకు వీలుంటుంది.

మ్యూచువల్‌ఫండ్స్‌లో 5 మదుపు వ్యూహాలు

మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్కులు సహజమే అయినప్పటికీ పెట్టుబడులకు అవి ఎంతో అనువైనవి. ఈ పెట్టుబడులను మీరు చిన్న మొత్తాలతో మొదలుపెట్టినప్పటికీ మీ సొమ్మును మేనేజ్ చేస్తూ మీరు ఏ స్టాక్స్‌లో లేదా బాండ్లలో పెట్టుబడులు పెట్టాలో నిర్ణయించడం ద్వారా నిపుణులైన ఫండ్ మేనేజర్లు ఆర్జించే లాభాన్ని కూడా మీరే పొందవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూలనిధిని (కార్పస్‌ను), లాభాలను పెంచుకునేందుకు పెట్టుబడిదారుగా మీరు కొన్ని వ్యూహాలను తప్పనిసరిగా అనుసరించాలి. వీటిలో ఐదు ముఖ్యమైన వ్యూహాలు ఇవీ..

1.విభిన్న ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం

వాంఛనీయ రిస్కులతో మ్యూచువల్ ఫండ్స్ నుంచి అధిక లాభాలను పొందాలంటే వివిధ తరగతులకు చెందిన వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమ మార్గం. ఈవిధంగా చేయగలిగితే మీరు స్థిరంగా లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది. ఇందుకోసం మీరు మీ ఆర్థిక లక్ష్యాలను, పెట్టుబడుల స్థాయిని, రిస్కుల తీరుతెన్నులను ఆధారంగా చేసుకుని పెట్టుబడుల కేటాయింపు, ఫండ్ల ఎంపిక చేసుకోవాలని పైసాబజార్ డైరెక్టర్, మ్యూచువల్ ఫండ్స్ విభాగ అధిపతి మనీష్ కొఠారీ సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో మరీ ఎక్కువ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం వాంఛనీయం కాదని, ఇలా చేయడం వల్ల పనితీరును పర్యవేక్షించడం కష్టతరమవుతుందని ఆయన హెచ్చరించారు.

2.డైరెక్టు ప్లాన్లను కొనుగోలుచేయడంమ్యూచువల్ ఫండ్స్‌ను నేరుగా కొనుగోలుచేసేందుకు అవకాశం ఉన్నప్పుడు మీ పెట్టుబడులపై బ్రోకరేజీ మొత్తాన్ని బ్రోకర్‌కో లేక ఏజెంట్‌కో ఇవ్వాల్సిన అవసరమేమున్నది? కోరుకున్న ఏఎంసీ వెబ్‌సైట్‌ను సందర్శించి ఏ స్కీములనైనా మీరే సులభంగా కొనుగోలు చేయవచ్చు. లేదంటే నేరుగా కొనుగోళ్లు జరిపేందుకు ఎంఎఫ్ యుటిలిటీ వెబ్‌సైట్ ద్వారా మీరే పెట్టుబడి పెట్టవచ్చు. రెగ్యులర్ ప్లాన్ల కంటే డైరెక్టు ప్లాన్లను ఎంచుకోవడం మంచిదని, నిష్పత్తి పరంగా దీనికయ్యే తక్కువ ఖర్చు దీర్ఘకాలంలో అధిక రాబడిగా మారుతుందని మనీష్ కొఠారీ తెలిపారు.

3.సిప్ మోడ్‌ను ఎంచుకోవడం

క్రమానుగతంగా క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడంలో ఉపకరించే వ్యూహాల్లో సిప్ (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) చాలా ముఖ్యమైనది. ఒడిదుడుకుల మయంగా మార్కెట్లో ఎప్పుడు కొనుగోలు చేయాలి అనే సందిగ్దతకు తావులేకుండా క్రమపద్దతిలో కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడిని సగటున గణించడం వల్ల ప్రయోజనాలు అనేకం. దీనికి తోడు రాబడులు చక్రరూపేణా పెట్టుబడులు అవుతాయి కనుక ఆ ప్రయోజనాలుకూడా అధికంగా ఉంటా యి. సిప్‌లో రూ. 500 కనీస మొత్తాన్ని కూడా మదుపు చేసే అవకాశం వుంది. మార్కెట్‌లో మదుపు చేయడానికి సిప్ ఆకర్షణీయమైన పద్ధతి.
PRINT

4.వయసు వారీగా..

మీ వయసు పెరిగే కొద్దీ ఈక్విటీల్లోనూ రుణ సాధనాల్లోనూ మదుపులను చేయవచ్చు. మీ వయసును 100నుంచి తీసి వేస్తే వచ్చే సంఖ్య శాతం మొత్తాన్ని ఈక్విటీల్లో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఉదాహరణకు మీ వయసు 45 అయితే మీరు మదుపు చేయాలనుకుంటున్న మొ త్తంలో 65 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టవచ్చు.అయితే రిస్క్ తీసుకోగలిగని సామర్ద్యాన్ని బట్టి ఇందులో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాస్త దూకుడు స్వభావం కలిగి రిస్క్ తీసుకోగ ల సామర్థ్యం ఉంటే ఈక్విటీల్లో కాస్త ఎక్కువ మొత్తాన్ని మదుపు చేయవచ్చు. రుణ సాధానాలు, ఈక్విటీలో రెండింటిలోనే మదుపు చేయడమనేది సరైన వ్యూహం. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి వారు ఎంత మొత్తం అనేది నిర్ణయించుకోవచ్చు. కానీ, తప్పనిసరిగా రెండింటిలోనూ మదుపు చేయాల్సిందే.

5.సమీక్ష తప్పనిసరి

మీరు మదుపు చేసిన ఫండ్ల పనితీరు అప్పుడప్పుడు సమీక్షించుకోవాల్సిందే. ఫండ్‌ల పనితీరు తగ్గట్టుగా వాటిని రీబ్యాలన్సింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీవయసును బట్టి కూడా మార్పులు చేర్పులు చేయాలి. మారే ఆదాయాలు, రిస్క్ తీసుకునే సామర్ధ్యం, ఫండ్ పనితీరు.. ఇలా అన్నింటినీ సమీక్షించిన తర్వాత తదనుగుణంగా మార్పులు చేయాలి. అందువల్ల మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మీ మదుపు యాక్టివ్‌గా ఉండడంతో పాటు రాబడి కూడా గరిష్ఠంగా ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరే వరకు మదపు చేస్తూ ఉండడమే అన్నింటి కన్నా మేలైన వ్యూహం.

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles