జన్మజన్మల బంధం!


Sat,August 25, 2018 11:35 PM

raksha-bandan
ప్రతీ అన్నకీ ఓ చెల్లి కావాలి.. ప్రతీ చెల్లికి ఓ అన్న తోడు కావాలి. అన్నాచెల్ల్లెళ్ల బంధం ఎప్పటికీ నిలిచి ఉండాలి. అన్నాచెల్లె, అక్కాతమ్ముడు అన్నప్పుడు ఇద్దరి మధ్య చాలా విషయాలుంటాయి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ.. ఒకరి కోసం ఒకరు నేనున్నా అంటూ తోడుంటారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా ఒకే రకమైన సందర్భం ఇద్దరికీ ఎదురైనప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారో సరదాగా ఓ లుక్కేద్దామా!


పడ్డానండీ ప్రేమలో మరి..

love
మనిషన్నప్పుడు ఒక వయసొచ్చాక ప్రేమలో పడడం కామన్. ఒకే ఇంట్లో ఉండే అన్నాచెల్లె, అక్కాతమ్ముడికి ఈ సందర్భం వచ్చినప్పుడు వారెలా స్పందిస్తారంటే..


అక్క/చెల్లి : అరేయ్.. ఎవర్రా ఆ పిల్లా? బాగుంటదా? నాకెప్పుడు పరిచయం చేపిస్తవ్? అమ్మానాన్నలకు చెప్పినవా? నన్ను చెప్పమంటవా? ఏమన్న హెల్ప్ కావాలంటే చెప్పు రా


అన్న/తమ్ముడు : ఎవరు ఆ అబ్బాయి? ఇసొంటి ముచ్చట్లు మనింట్ల కుదరయ్ అని తెలుసు కదా! నాయినకు తెలిస్తే పెద్ద లొల్లయితది. ఎందుకొచ్చిన పంచాయితి చెప్పు. వాడు మంచోడు కూడా కాదు.. పెద్ద గలీజ్ గాడు. ప్రేమ, గీమ అన్నీ మరిచిపోయి గమ్మునుండు అని కొందరంటే.. ఒకసారి ఆలోచించుకో.. ఇది నీ జీవితం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చలేం. ఏమున్నా.. గొడవలు కాకుండా.. లోపట లోపట అయ్యెటట్టు చేసేద్దాం. ఇంట్లోళ్లతోటి నేను మాట్లాడుత.అందరూ ఇలా అంటారనే ఏం లేదు.. కొందరు బ్లాక్‌మెయిల్ చేసి తమ అవసరాలు తీర్చుకునే టైప్ కూడా ఉంటారు. ఇంకొందరు తెలిసినా తెలియనట్టు, చూసినా చూడనట్టు ఉంటారు. రకరకాల వేరియషన్లుంటాయ్!


పరీక్షలో ఫెయిలైతే..

Fail-Exam
ఎగ్జామ్‌లో ఫెయిల్ కావడం అనేది యువతకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇదే ఎగ్జామ్ ఫెయిల్ సీన్ ఇంట్లో ఎలా ఉంటుందంటే..


అన్న/తమ్ముడు : ఏ.. లైట్ తీస్కో..! ఒక్క సబ్జెక్ట్ పోతె ఏడుస్తరా ఎవలన్న? నావి మూడు పోయినయ్. నన్ను సూడు ఎంత హ్యాపీగా ఉన్నానో. డాడీకి పేపర్ టఫ్ వచ్చింది అని చెప్దాం లే


అక్క/చెల్లి : సదువుకొమ్మంటే.. దోస్తులెంబడి తిరిగినవ్. పరీక్ష టైమ్‌ల క్రికెట్ మ్యాచ్‌లు చూసే బదులు చదువుకుంటే ఇప్పుడు తిట్లు పడేవి కాదుగా.. ఎవల్ చేస్కున్న ఖర్మ వాళ్లే అనుభవించాలి.. నీ ఖర్మ


టూర్ ప్లాన్..

tour
వయసులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరికీ ఇవ్వం. అలాంటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు వాళ్లతో వెళ్లాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. టూర్ గురించి ఇంట్లోవాళ్లను అడగాలంటే తోడబుట్టిన వాళ్ల సపోర్ట్ చాలా అవసరం. అప్పుడు సీన్ ఎలా ఉంటుందంటే..


అన్న/తమ్ముడు : ఎలా వెళ్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారు? మొత్తం ఎంతమంది? ఎన్ని స్పాట్‌లు అనుకున్నారు? ఎన్ని రోజులు? గ్రూప్‌లో అబ్బాయిలున్నారా.. అందరూ అమ్మాయిలేనా? వంటి వివరాలతో పాటు అటోమేటిగ్గా సమాచారం కూడా తీసి పెట్టుకుంటారు.


అక్క/చెల్లి: కేవలం ఒకే ఒక ప్రశ్న.. వచ్చేటప్పుడు నాకేం తెస్తావ్? ఈ ప్రశ్నకు గనక సరైన సమాధానం చెప్తే.. టూర్ పర్మిషన్ వచ్చేసినట్టే.


ఇంటికి లేట్‌గా వస్తే..

late-coming
పార్టీలు, సినిమాలకెళ్లినప్పుడు ఇంటికి రావడం లేటవుతుంది. ఆ సమయంలో మనకు ఆపద్భాందవుడిలా కనిపించేది తోడబుట్టినవాళ్లే. ఆ సమయంలో వాళ్ల రెస్పాన్స్..


అన్న/తమ్ముడు : ఇంత లేటా? సర్లే కానీ.. లోపట్కి నడువ్.. ఇంకోసారి.. పార్టీ, ఫ్రెండ్స్‌తో సిన్మాలు అనాలె అప్పుడు చెప్తా.. నీ సంగతి
అక్క/చెల్లి : అరేయ్.. ఎన్ని గంటలకు వస్తావ్? డోర్ దగ్గరేసి ఉంచనా? వద్దులే.. వచ్చిన తర్వాత కాల్ చెయ్..! అమ్మో.. ఫోన్ సౌండ్ వస్తే నాన్న లేస్తాడు. మెసేజ్ చెయ్. నేను డోర్ తీస్తా.


యాక్సిడెంట్ అయితే..

takar
కొత్తగా స్కూటీయో, బైకో కొన్నప్పుడు దాన్ని కిందపడేయకుండా డ్రైవ్ చేయడం కొత్త టిపికల్ టాస్కే. ఇంట్లో నుంచి జాగ్రత్తగా బండి బయటకు తీసుకెళ్లి దాన్ని కిందపడేసి ఏమీ తెలియకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అప్పుడు తప్పు చేసినవారి మీద తప్పు చేయనివారు విరుచుకుపడే సీన్ ఇలా ఉంటుంది..


అన్న/తమ్ముడు : నీకు బండి తాళం ఎవరిచ్చారు? అసలు నీకు డ్రైవింగే సరిగా రాదు.. బండి ఎందుకు తీసుకెళ్లావ్? ఏం అవసరం లేదు నీకు బండి. రేపటి నుంచి బస్సులో వెళ్లు


అక్క/చెల్లి : అంత స్పీడుగా ఎందుకు నడిపినవ్ మరి? రోడ్డు మీద బండి నడిపేటప్పుడు సూస్కోవాలని తెల్వదా? పే..ద్ద ైస్టెల్ కొట్టుకుంట నడిపినట్టున్నడు.. కింద పడ్డడు పోనీ అని జాలి చూపించాల్సింది పోయి.. పుండు మీద కారం చల్లుతుంటారు.


అప్పుడప్పుడు సరదాగా కొట్టుకుంటాం కానీ.. తోడబుట్టిన వాళ్లంటూ లేకపోతే జీవితంలో ఓ సరదా, ఓ అనురాగం ఉండదు.
వాళ్ల మీద చూపించే అధికారం, వారి పట్ల అజమాయిషీ, బాధ్యత, ప్రేమ, వెనకేసుకు రావడం అవన్నీ మాటల్లో చెప్పలేని
అనుభూతులు కదా! ఎనీ వే.. మీ జీవితంలోనూ ఇలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి కదా! ఈ పండుగ పూట సరదాగా
గుర్తు చేద్దామనే ఈ చిన్న ప్రయత్నం. అన్నట్టు.. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
-ప్రవీణ్‌కుమార్ సుంకరి

926
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles