చేనేతే.. సరికొత్త ఫ్యాషన్!


Tue,August 7, 2018 12:06 AM

ప్రపంచమే హద్దుగా ఫ్యాషన్ ఇండస్ట్రీగా విరాజిల్లుతున్నది. ప్రపంచం ఒకే వేదికగా కొనసాగుతున్న రంగమిది. ఆ వేదికపై తమ డిజైన్లను ప్రదర్శిస్తూ సత్తాను చాటుతున్నారు చాలామంది. కానీ దానికి మూలం చేనేత వస్ర్తాలే. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ఫ్యాషన్ రంగానికి కేంద్రంగా నిలుస్తున్నది. కొత్తగా ఈ రంగం వైపు యువత అడుగులు వేస్తున్నది. తెలంగాణలో చేనేత కళా రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిందగీ కథనం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రతి ఫ్యాషన్ డిజైనర్‌కూ ఇక్కడి ఉత్పత్తులే ప్రాథమికం. ఏ వేదికలో విజయం సాధించినా చేనేత వస్ర్తాల కళా నైపుణ్య మూలమే. ఫ్యాషన్ కెరియర్ గ్లామరస్‌గా ఉంటుంది. దానికి తగ్గ ప్రతిఫలమూ లభిస్తుంది. అన్ని స్టార్టప్‌ల కంటే వైవిధ్యమైంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌నూ అందుకోవడానికి అనేక మంది ఉవ్విళ్లూరుతున్నారు.
anasuya-handlooms


ఫ్యాషన్.. చేనేతతోనే సాధ్యం. జాతీయ.. అంతర్జాతీయ మార్కెట్‌లోనైనా.. గుర్తింపు చేనేతకే. హైదరాబాద్‌లో ఫ్యాషన్ తళుకులైనా.. ప్యారిస్‌లో ర్యాంప్‌పై మోడళ్ల హొయలైనా చేనేత మగ్గాల ఉత్పత్తులే!


హ్యాండ్లూమ్‌లోనే ఫ్యాషన్ : ట్రెండ్ మారింది. ఒకప్పుడు రాజకీయ నాయకులు, వృద్ధులకే పరిమితమైన చేనేత వస్ర్తాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. హ్యాండ్లూంలోనే యువత కోరుకునే ఫ్యాషన్ దాగి ఉందని గుర్తించారు. అందుకే తెలంగాణ కార్మికుల చేతుల్లో తయారైన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ వచ్చింది. అందుకే నేడు చేనేత పండుగ చేసుకుందాం. జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి పల్లె, ప్రతి పట్నంలో మార్మోగేటట్లు పండుగ చేసుకుందాం. చేనేత రంగాన్ని మరింతగా వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు చేయి వేద్దాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలనే ధరించి లైవ్ ఫ్యాషన్.. లవ్ హ్యాండ్లూం అని పిలుపునిద్దాం. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో చేనేత దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారు.


anasuya-handlooms4
సినీ, మోడళ్ల వరకూ : ఒకప్పుడు రాజకీయ నాయకులకే పరిమితం. కానీ ఇప్పుడు హ్యాండ్లూం డ్రెస్ ధరిస్తేనే ఫ్యాషన్, ట్రెండ్. రిచ్ లుక్.. హై క్వాలిటీ. అందుకే సినీ, మోడళ్ల వరకూ ఇది పాకింది. నేటి ప్రతి సినిమాలోనూ ప్రధాన నటులంతా వీటినే ధరిస్తున్నారు. ఒకప్పటి ట్రెండ్‌ను ఆధునీకరించి సరికొత్త డిజైన్లుగా రూపొందించి సినిమాల్లో చూపిస్తున్నారు. చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేసేందుకు సినీ నటీమణులు సమంత, విద్యాబాలన్ వంటి వారు కంకణం కట్టుకున్నారు. ప్రతి చోటా వారి నోట ఇదే మాటను వల్లె వేస్తూ బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో చేనేత వస్ర్తాల ప్రాభవం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందనడంలో ఆంతర్యం లేదు. మంత్రి కేటీఆర్ పిలుపుతో ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగ, ఐటీ, వ్యాపార, వాణిజ్య, సినీ వర్గాల వారు కూడా మంత్రి పిలుపుతో ఉత్తేజితులయ్యారు.


anasuya-handlooms6
ఆర్గానిక్ దుస్తులతో ప్రాచుర్యం : తెలంగాణలో ఆర్గానిక్ వస్ర్తాల తయారీ కూడా పెరిగింది. అందులో కాటన్, లినెన్, సిల్క్ యార్న్‌తో అనేక ప్రయోగాలు చేశారు. చీరలు, డ్రెస్ మెటీరియల్‌తో మార్కెట్‌ను అదరగొడుతున్నారు. షోరూముల్లో దొరికే లెనిన్‌కు, ఈ ఉత్పత్తుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ధరలోనూ అంతే. నిజం చెప్పాలంటే లినెన్ అనే చెట్టు నుంచి తీసిన పదార్ధంతో యార్న్(దారం) తయారు చేస్తారు. అంతే కాదు.. రంగులు కూడా అత్యంత సహజమైనవి. బంతి, చామంతి, దానిమ్మ తొక్కలను ఎండబెట్టి వాటితో రంగులు అద్దుతారంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇతర ఇలాంటి సహజసిద్ధంగా దొరికే రంగులతోనే అద్ది మగ్గం మీద నేస్తారు. మంజిస్టా, రతన్‌జోత్, అనార్, ఇండిగో, బ్లాక్ సులీషన్, బ్లూ అంటూ రంగులను కార్మికులు పిలుచుకుంటున్నారు. ఒక్క ఇండిగో రంగును దారానికి అద్దాలంటే మూడు నెలల సమయం పడుతుంది. నేతలోనూ డిజైన్లను రూపొందిస్తున్నారు. పట్టు చీరల్లో జకాట్, పింజెరతో ఎట్లయితే డిజైన్లు చేస్తున్నారో ఈ ఉత్పత్తుల్లోనూ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. స్కార్ఫ్‌లు, దుప్పట్లు, కర్టెన్లను ఆర్గానిక్ మార్గంలో నేయిస్తున్నారు. వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి బాగా పెరుగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ ఆర్గానిక్ రంగులతో వస్ర్తాల ఉత్పత్తి కేంద్రంగా పని చేస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 100 మగ్గాలు పని చేస్తున్నాయి.


anasuya-handlooms2
మార్కెట్లోకి యువతరం: హ్యాండ్లూంలో డిప్లొమా చేసిన వారు వచ్చేశారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసిన వారు మార్కెటింగ్ రంగంలోకి ప్రవేశించారు. మూడేండ్ల క్రితం పోచంపల్లిలో కేవలం 8 మంది ఆన్‌లైన్‌లో ఇక్కత్ చీరలు అమ్మేవారు. ఇప్పుడా సంఖ్య 100 దాటింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, వెబ్‌సైట్ల ద్వారా విక్రయిస్తున్నారు. మాకు షాపు ఉంది. ఐతే ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. నెలకు 50 నుంచి 100 చీరల వరకు ఆన్‌లైన్‌లోనే అమ్మేస్తున్నాం. ఇక్కత్ చీర అంటే చాలు. ఫ్యాషన్ ప్రపంచంలో రారాజుగా పేరొచ్చింది. అందుకే మాకు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. నేను కేవలం ఫేస్‌బుక్ ద్వారానే అమ్ముతున్నా. మేం సొంతంగా 25 మగ్గాల ద్వారా నేయిస్తాం. అవి సరిపోక ఇతర మాస్టర్ వీవర్ల దగ్గర కొనుగోలు చేస్తాం అని పోచంపల్లికి చెందిన భారత పార్ధసారధి చెప్పారు. చాలా కాలం పాటు మూస పద్దతిలో చీరలు నేశారు. ఇక్కత్‌లో కంచి, కోట వంటి డిజైన్లను మిక్స్ చేసి ఆధునికతను సాధించారు. అందుకే ఫ్యాషన్ ప్రియులకు ఇవి నచ్చుతున్నాయి. కొత్తదనాన్ని కోరుకునే వారికి ఇప్పటి ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇక్కత్ అంటే క్రేజ్‌గా మారింది. పైగా డిజిటల్ డిజైన్లను నేర్చుకున్నారు. అవునన్నా కాదన్నా.. చేనేత రంగానికి మంచి రోజులు వచ్చాయి అని పోచంపల్లికి చెందిన టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడ్క రమేశ్ తెలిపారు. కొత్త డిజైన్లు రావడం వల్ల వలసపోయిన కార్మికులంతా తిరిగొచ్చారు. ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందన్నారు.


అమ్మ దగ్గరగా ఉన్నట్లుంటుంది

చేనేత వస్ర్తాలు ఎంతో మేలు. నేను చాలా కాలంగా ఇవే వేసుకుంటున్నా. నా చిన్నతనంలో ఇక్కత్ డిజైన్ డ్రెస్సులేస్తే స్కూల్, కాలేజీలో వెక్కిరించేవాళ్లు. ఇవేంటి? చెక్స్.. ఇవేం డిజైన్లు.. అనేవారు. ఇప్పుడేమో వరల్డ్ ఫేమస్ అయ్యాయి. మాది భూదాన్‌పోచంపల్లి. మా నాన్న హైదరాబాద్‌కు వచ్చేశారు. కానీ మాకు ఊరి మీద ఎంతో మమకారం ఉంది. అందుకే ఇటీవల 20 సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్లొచ్చా. అక్కడే చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చా. అక్కడి మగ్గాల సవ్వడి వింటూ నాలుగు గంటల పాటు గడిపాను. ఎంతో హాయిగా గడిచింది. షాపింగ్ కూడా చేశాను. ఈ మధ్య కాదు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కత్(హ్యాండ్లూం) డ్రెస్సులు వేసుకుంటున్నా. ఇక్కత్ చీర కట్టుకుంటే మా అమ్మ నా దగ్గరగా ఉందనిపిస్తుంది. హ్యాండ్లూం డ్రెస్సులు, చీరలు ఎంతో మేలు, సౌకర్యం. అందుకే అందరూ హ్యాండ్లూం వస్ర్తాలే ధరించాలని చెప్తా. నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం.
- అనసూయ, యాంకర్, నటి


anasuya-handlooms3

అనేక రకాల్లో చేనేత

సిల్క్‌ను కాటన్, లినెన్‌కు మిక్స్ చేసి ఇప్పటికే అనేక రకాల చీరలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. రూ.4 వేల నుంచి రూ.2 లక్షల విలువైన చీరలను తెలంగాణలోనే ఉత్పత్తి చేస్తున్న ఖ్యాతి గడించారు. ఇక్కత్, టస్సర్ సిల్క్, పట్టు వస్ర్తాలతో యువతను ఆకట్టుకునే రీతిలో డ్రెస్సులను రూపొందిస్తున్నారు. ముడిసరుకులో నాణ్యతకు పెద్ద పీట వేస్తుండడంతో వస్ర్తాలకు మంచి ప్రాచుర్యం లభిస్తున్నది. డ్రెస్సులు, ఓవర్‌కోట్స్, టాప్స్, స్కర్టులు, కుర్తాస్, బాటమ్స్, దుప్పటాలు తయారు చేస్తున్నారు. వీకెండ్‌లో ధరించేందుకు చేనేత వస్ర్తాలతో రూపొందించిన పలు డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. హ్యాండ్లూం ఇక్కత్ కాటన్‌తో బ్లూ వేవ్ ప్యాటరన్, మల్బరీ సిల్క్, హ్యాండ్లూం ఇక్కత్ స్కర్టులు, హ్యాండ్లూం ఇక్కత్ కాటన్ సిల్క్ క్రాప్ టాప్‌లు, బోట్ నెక్ ఇక్కత్ మోటిఫ్ కాటన్‌తో షర్టులు, హ్యాండ్లూం ఇక్కత్ ఫ్లేర్ షిఫ్ట్ డ్రెస్ వంటి వాటితో ఆకట్టుకుంటున్నారు.


anasuya-handlooms5

హ్యాండ్లూమ్ డే కార్యక్రమాలు

-కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డుల ప్రదానోత్సవం. వేదిక: పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు, హైదరాబాద్. సమయం: ఉదయం 9.30 గంటలకు. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథి. చేనేత రంగంలో సేవలందించిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందజేస్తున్నది. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లో నైపుణ్యం కలిగిన వారిని కూడా ఎంపిక చేసింది.
-చేనేత వస్ర్తాలతో ఫ్యాషన్ షో. వేదిక: శిల్పారామం, హైదరాబాద్. సమయం: సాయంత్రం 6.30 గంటలకు. పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ పాల్గొంటారు.
శిరందాస్ ప్రవీణ్‌కుమార్,
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

1333
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles