చిట్టగాంగ్ వీరవనితల చైతన్య వారసత్వం


Sat,June 18, 2016 01:54 AM

chaitanya
పురుషుడు తన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఓడిపోయిన ప్రతిసారీ... ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు మహిళే ముందడుగు వేసింది. అది జీవితం కావచ్చు... యుద్ధం కావచ్చు... ఆమె చేపట్టిన ఏ పనైనా పూర్తి చేసే వరకు విశ్రమించదు. దీనికి ఉదాహరణే చిట్టగాంగ్ సాయుధ పోరాటంలో ఆ ప్రాంత మహిళలు చూపిన తెగువ. దానికి అక్షర రూపమిచ్చి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం- 2016 సాధించింది చైతన్య పింగళి.ఈ సందర్భంగా ఆమెను జిందగీ పలుకరించింది.

విశ్వశాంతి కోసం పరితపించిన మహ్మద్ ప్రవక్త బోధనలను, తత్వాన్ని విస్తరించే బాధ్యతను ఆయన శిష్యులు, కొడుకులు ఎవరూ తీసుకోలేదు. ఆయనకు వారి మీద నమ్మకం లేదు. కానీ తన 14వ భార్య అయేషాకు ఆ బాధ్యత అప్పగిస్తాడు.

యేసు క్రీస్తు జాడ చెప్పమని ఆయన 11 మంది శిష్యులను వేధిస్తుంటే... అందులో చాలామంది తప్పించుకున్నారు. కొందరైతే యేసు ఎవరో మాకు తెలియదు అని చెప్పారు. చివరికి యేసు జాడ తెలుసుకున్న రాజ సైనికులు ఆయనకు శిలువ వేస్తే నిర్యాణం చెందిన మూడవ రోజు అంతమంది శిష్యుల్లో కేవలం ముగ్గురు ఆడవాళ్లకు మాత్రమే కనిపిస్తాడు.

దేవతలను, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మహిషాసురుడిని ఎదుర్కోవడానికి ఏ దేవుడూ ధైర్యం చేయలేకపోయారు. ఆ దానవుణ్ణి అంతం చేయడానికి చివరికి అమ్మవారే మహిషాసుర మర్ధిని అవతారం ఎత్తాల్సి వచ్చింది.

రామయ్య పళ్లైన కొత్తలో భార్యను బాగానే చూసుకునేవాడు. కానీ కొన్నిరోజుల తర్వాత మద్యానికి బానిసయ్యాడు. పని కూడా మానేశాడు. పిల్లలు పస్తులుండడం చూడలేని రామయ్య భార్య మంగమ్మ కుటుంబ పోషణ బాధ్యతను తీసుకుంది. ఇళ్లలో పాచిపనులు చేసి పిల్లల కడుపు నింపింది.

పై నాలుగు సందర్భాల్లో ఒక బాధ్యత నెరవేర్చే సమయంలో సమాధానంగా కనిపించింది ఒక మహిళే. ఒక పని పూర్తి చేసేందుకు ఆమె అన్ని సందర్భాలల్లో సిద్ధంగానే ఉంటుందని చెప్పడానికి ఉదాహరణలు ఇవి. చరిత్ర విషయానికి వస్తే ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. అందులో చిట్టగాంగ్ సాయుధ పోరాటం ఒక వాస్తవ ఉదాహరణ.

1928 దేశం స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న రోజులు. అహింస ద్వారా స్వాతంత్య్రం సాధిద్దామని గాంధీ మార్గంలో వెళ్లేవారు కొందరైతే.. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలంటే సాయుధ పోరాటమే మార్గం అని నమ్మిన వాళ్లు ఇంకొందరు. అందులో ఒకరే సూర్యసేన్. ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ (ఐఆర్‌ఏ) నిర్మాత, దళపతి. రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ బ్రిటీష్ స్థావరాలు, బలగాల మీద దాడి చేసే భారతీయుల సాయుధ సైన్యం. ఏడు రోజుల్లో చిట్టగాంగ్ ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్ల చెర నుంచి విడిపించాలని టార్గెట్ పెట్టుకుని పోరాటం మొదలుపెట్టింది ఐఆర్‌ఏ. నాలుగు రోజులు ఐఆర్‌ఏ సైన్యానిదే పైచేయిగా ఆ పోరాటం సాగింది. చిట్ట్టగాంగ్ ఇక స్వతంత్య్ర ప్రాంతం అని కూడా ప్రకటించారు ఐఆర్‌ఏ ప్రతినిధులు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం అదనపు బలగాలను తెప్పించి ఐఆర్‌ఏ మీద ధాటిగా దాడి చేసింది. ఐఆర్‌ఏ సైనికులు కనిపిస్తే కాల్చివేసేవారు. గాయాలతో దొరికిన వారిని అండమాన్ జైలుకు తరలించి చిత్రహింసలు పెట్టేవారు.

దీంతో ఐఆర్‌ఏ సభ్యులు రహస్య జీవితం గడపవలసి వచ్చింది. మహిళలు సాయుధ పోరాటంలో ఇమడలేరు. ఆ ఇబ్బందులు, కష్టాలు తట్టుకోలేరన్న ఉద్దేశ్యంతో సూర్యసేన్ మహిళలకు ఐఆర్‌ఏలో చేర్చుకోలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చిట్టగాంగ్ మహిళల సాయం కోరారు. వారిని కోవర్టులుగా నియమించుకున్నారు. రహస్యంగా ఆయుధాలు అందించడం, వార్తలు, బ్రిటీష్ ఎత్తుగడలకు సంబంధించిన సమాచారం సేకరించడం వంటి పనులు చేయించేవారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు ఐఆర్‌ఏ కోసం పనిచేశారు. అదనపు బలగాలున్నప్పటికీ ఐఆర్‌ఏ ఆగడాలు ఆగడం లేదన్న కోపంతో బ్రిటీష్ సర్కార్ వారి మీద ఇంకా ఒత్తిడి పెంచింది. ఐఆర్‌ఏ సభ్యులు అస్సలు బయటకు రాలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐఆర్‌ఏ కనుమరుగవడం ఖాయం. అప్పుడు రంగంలోకి దిగారు చిట్టగాంగ్ మహిళలు. ఆయుధాలు చేపట్టి బ్రిటీష్ వారితో ప్రత్యక్ష యుద్ధం చేశారు.

త్యాగాలు చేశారు...


20వ శతాబ్దంలో జరిగిన బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన చిట్టగాంగ్ సాయుధ పోరాటంలో మహిళలు చూపిన పోరాట పటిమ అసాధారణమైనది. కల్పనాదత్ అనే మహిళ బాంబులు తయారుచేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా బాంబులు తయారుచేసి ప్రయోగించిన మొదటి మహిళ ఈమె. ప్రీతిలతా అనే ఆవిడ ఆత్మాహుతి దాడి చేసింది. స్వాతంత్య్ర సంగ్రామంలో నేలకొరిగిన మొట్టమొదటి అమరజీవి ప్రీతిలతా. ప్రేమలతా అనే ఇంకో ఆవిడ తన ఇంటినే ఐఆర్‌ఏ కార్యకలాపాలకు అడ్డాగా మార్చింది. తరచూ ఐఆర్‌ఏ సభ్యులు ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్లు ఆమె గురించి చెడుగా అనుకునేవారు. అందరూ ఆమె మీద అసహ్యం పెంచుకున్నారు.

ఆమె భర్త కూడా ఐఆర్‌ఏ దళసభ్యుడే. ఓ దశలో బ్రిటీష్ పోలీసులు అతణ్ణి అరెస్టు చేసి ఉరితీశారు. చుట్టూ ఉన్నవారు అనే మాటలు భరించలేక, సభ్యుల ఆచూకీ కోసం బ్రిటీష్ పోలీసులు పెట్టే వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంది. కానీ ఎలాంటి సమాచారం మాత్రం ఇవ్వలేదు. పైగా నాకు తెలుసు... కానీ నీకు చెప్పను.. ఏం చేస్తావో చేస్కో అని ధీటుగా జవాబిచ్చింది. ఐఆర్‌ఏ సభ్యులను పట్టుకుని చిత్రహింసలు పెడుతున్న క్రమంలో బ్రిటీష్ పోలీసులు మగవారి ఒంటిమీద షర్టులు తొలగించి వీపు మీద కొడుతున్నారు. అందులో కల్పనాదత్ వంతు వచ్చినప్పుడు కొంగు ఉంచమంటారా..? తొలగించమంటారా? అంటూ ఏమాత్రం భయం లేకుండా, దేశం కోసం పోరాడుతున్నా అనే సంకల్పంతో మగవారి ముందు సిగ్గుపడకుండా మాట్లాడింది.

ఈ పోరాటంలో పాల్గొన్న మహిళల్లో కొందర్ని అత్తింటి వారు ఇంటినుంచి వెళ్లగొట్టారు. కొందరి కుటుంబ సభ్యులను బ్రిటీష్ పోలీసులు చంపేశారు. కొందరి భర్తలు తామే స్వయంగా వంట చేసి భోజనం పంపారు. ఇలా కుటుంబ, వ్యక్తిగత జీవితాల్ని త్యాగం చేసి ఉద్యమానికే జీవితం అంకితం చేశారు. చిట్ట్టగాంగ్ మహిళలు చేసిన ఆ పోరాటాలు, త్యాగాలు, వారు చూపిన తెగువ కళ్లకు కట్టినట్టుగా తన పుస్తకంలో చూపింది చైతన్య పింగళి. చిట్టగాంగ్ వీర వనితలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నో పోరాటాలకు ఆదర్శం. వారి జీవితచరిత్రల్ని పుస్తకంగా రాసింది చైతన్య. ఆ పోరాట వారసత్వాన్ని అందించినందుకు ఆమెకు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైంది.

పుస్తకం రాసిన పరిస్థితులు...


చైతన్య గర్భవతిగా ఉన్నప్పుడు చదివిన పుస్తకాలే చిట్ట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకానికి ఊపిరి పోశాయి. ఆ సమయంలో ఆమె చదివిన చిట్ట్టగాంగ్ అప్రైసింగ్ అనే పుస్తకంలో చిట్టగాంగ్ మహిళల గురించి చదివింది. వారు త్యాగాలు, పోరాట పటిమ చైతన్యను ఆకట్టుకున్నాయి. పుస్తకాలు, ప్రముఖులు, రచయితలు ఎంతోమందిని కలిసి చిట్టగాంగ్ సాయుధ పోరాటం గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకుంది. అదే సమయంలో నిర్భయ ఘటన జరగడంతో చిట్టగాంగ్ మహిళల స్ఫూర్తిని ఈతరానికి అందించాల్సిన అవసరం ఉంది. అందుకే పుస్తకం రాయాలని నిర్ణయించుకుంది.

పూర్తిస్థాయిలో సమాచారం దొరికిన పదిమంది గురించి రాసింది. చైతన్య పుస్తకం రాసే సమయంలో ఆమె అత్తకు క్యాన్సర్.. కీమోథెరపీ జరుగుతున్నది. ఆమెకే సేవలు అవసరమున్న సమయంలో చైతన్యకు సాయపడేది. ఆమె ప్రోత్సాహం, సహాయంతోనే పుస్తకం పూర్తి చేయగలిగింది. అందుకే ఆమె చేతుల మీదుగానే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది చైతన్య. పుస్తకం రాస్తున్న క్రమంలో చైతన్య చదివిన పుస్తకాల్లో ఖుదీరాం బోస్ గురించి చదివి, ఆయన త్యాగం గురించి తెలుసుకుని కొడుకుకు ఆ పేరే పెట్టుకుంది.

ఇదే మొదటి పుస్తకం...


చైతన్య పుట్టింది విజయవాడ అయినా పెరిగింది కోదాడ దగ్గర నందిగామలో. తండ్రి పింగళి దశరథరామ్. నిఖార్సయిన సోషలిస్టు. చైతన్య చిన్నప్పుడే ఆయన హత్యకు గురయ్యారు. ఇప్పటి వరకు చైతన్య రెండు పుస్తకాలు రాసింది. ఒకటి చిట్ట్టగాంగ్ విప్లవ వనితలు, రెండోది మనససులో వెన్నెల. చైతన్య శేఖర్ కమ్ముల దగ్గర కో-రైటర్‌గా పనిచేసింది.ప్రస్తుతం వరుణ్‌తేజ్ నటిస్తున్న ఫిదాకి కో-రైటర్‌గా చేస్తున్నది.

చైతన్యానికి రూపం...


చిట్ట్టగాంగ్ మహిళల పోరాట వారసత్వం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఒక ఇరోం షర్మిలా, మణిపూర్ మహిళలు, ఇలా అన్యాయం జరిగిన ప్రతీసారి మహిళలు ఇప్పుడు గొంతు విప్పుతున్నారు. వారి పోరాటాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. ఈ జనరేషన్ చిట్ట్టగాంగ్ వీర వనితల గురించి తెలుసుకోవాలి. పురుషుల్లో కూడా ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నది. మహిళలు చేసే ఉద్యమాలకు జత కలుస్తున్నారు. మన పుట్టుకకు మూలాన్నే మనం హీనంగా, తక్కువ చేసి చూస్తున్నం. ఈ పరిస్థితిలో మార్పు వచ్చినప్పుడు ప్రపంచం బాగుపడుతుంది. మహిళంటే ఒక మనిషే కాదు.. చైతన్యానికి నిలువెత్తు రూపం.

1180
Tags

More News

VIRAL NEWS