చిటపట చినుకులు పడుతూ ఉంటే..


Sun,August 12, 2018 01:34 AM

Vaana
చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చిరుగాలి వీస్తూ.. ఏదో తెలియని హాయిని చినుకులతో పాటు కురిపిస్తుంది వాన. మనసును తేలికపరుస్తూ, వాతావరణాన్ని చల్లబరుస్తూ కురిసే వర్షాన్ని చూసేందుకు, ఆస్వాదించేందుకు చాలా అందంగా ఉంటుంది. అలాంటి వర్షాన్ని కెమెరాల్లో బంధించి చూపించే ప్రయత్నం తెలుగు సినిమాల్లో చేశారు. సన్నగా చినుకులు రాలుతుంటే.. తారలు ఆడిపాడిన పాటలు, ఫైట్ చేసిన సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటలు, ఫైట్ సీన్ల గురించి చినుకులు రాలుతున్న ఈ చల్లటి వాతావరణంలో సింగిడి మీకందిస్తున్నది..

తడిపేసే పాటలు
ఆత్మబలంచిటపట చినుకులు పడు తూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టాలేసుకొని.. చెట్టు నీడకై పరుగెడుతుంటే.. చెప్పలేని ఆ హాయి.. ఎంతో వెచ్చగ ఉంటుందోయీ.. 1964లో విడుదలైన ఆత్మబలం సినిమాలోని ఈ పాటను ఇప్పటి తరం కూడా పాడుకుంటున్నది.

వేటగాడు


ఆకుచాటు పిందె తడిసె.. కోకమాటు పిల్ల తడి సే.. ఆకాశ గంగొచ్చిందీ.. అందాల్ని ముంచెత్తిం దీ అంటూ వేటగాడులో శ్రీదేవితో జతకూడి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అప్పట్లో ఉర్రూతలూగించా యి. అల్లరి రాముడు సినిమాలో ఎన్టీఆర్, ఆర్తి అగర్వాల్‌తో కలిసి వానలో తడుస్తూ.. రెండువేల రెం డువరకు చూడలేదే ఇంత సరుకు అంటూ తాతను గుర్తు చేస్తూ వానలో సాగే పాటకు స్టెప్పులేశాడు.

గ్యాంగ్‌లీడర్


విజయశాంతితో కలిసి గ్యాంగ్‌లీడర్ సినిమాలో స్టెప్పులేసిన వానా వానా వెల్లువాయే.. కొండాకోన తుళ్లిపోయే.. అంటూ సాగిన పాట యూత్‌ను ఒక ఊపు ఊపింది. రచ్చ సినిమాలో చిరంజీవి కొడుకు రాం చరణ్ కూడా అదే పాటకు తమన్నాతో కలిసి స్టెప్పులేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

బంగారు బుల్లోడు


స్వాతిలో ముత్యమంట.. సందెలా గుచ్చుకుంది గుండెలోనా బాలకృష్ణ బంగారుబుల్లోడు సినిమాలో స్టెప్పులేసిన వాన పాట అద్భుతమైన మెలోడి పాటల లిస్టులో చోటు సంపాదించుకుంది.

ప్రేమయుద్ధం


నాగార్జున, అమల వానలో తడిసి ఆడిపాడిన పాట స్వాతిముత్యపు జల్లులలో.. శ్రావణమేఘపు జావలిలో అంటూ అలరించారు.

మాయలోడు


చినుకు చినుకు అందెలతో.. చిటపట చిరు సవ్వడితో.. నీలిమబ్బు కురులపైన అంటూ సౌందర్య, బాబుమోహన్ కలిసి మాయలోడు చిత్రంలోని పాటకు చిందేశారు. ఇదే పాటకు సౌందర్య శుభలగ్నం సినిమాలో కూడా అలీతో కలిసి చిందేసింది.

వర్షం


ప్రభాస్, త్రిష ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం వర్షం. హీరో, హీరోయిన్లిద్దరినీ కలిపే సీన్‌లో వర్షందే కీలకపాత్ర. ఈ సినిమాలో రెండు వానపాటలున్నాయి. నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా అంటూ వర్షాన్ని ప్రేమించే అమ్మాయిగా వానలో తడిసి స్టెప్పులేసింది త్రిష. ఇదే సినిమాలో మెల్లగా కరగనీ.. రెండు అడుగుల దూరం అంటూ సాగే పాట కూడా పూర్తిగా వర్షంలోనే ఉంటుంది.

వాన


పేరు మాత్రమే కాదు.. కథ సాగినంత సేపూ వానతోనే నిండిపోయిన సినిమా ఇది. ఎదుట నిలిచింది చూడు.. జలతారు వెన్నెలేమో అంటూ సాగే పాట.. టాప్ వానపాటల్లో ఒకటిగా నిలిచింది.

తడియారని సన్నివేశాలు
కాలా


రజినీకాంత్ ఏం చేసినా ఆ ైస్టెల్ అదిరిపోతుంది. యూత్‌ని ఆకట్టుకుంటుంది. కాలా సినిమాలో వర్షంలో విలన్ గ్యాంగ్‌తో ఫైట్ చేసే సీన్ సినిమాకే హైలెట్. ఆ సీన్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే వర్షం సీన్లలో ఒకటిగా నిలిచిపోయింది.

ఛత్రపతి


ఒక పెద్ద ఫైట్ తర్వాత విలన్‌ను చంపి ఓ బడా లీడర్ దగ్గరకు వెళ్లి డైలాగ్ చెప్పిన తర్వాత వచ్చే సీన్ ఇది. బ్యాక్‌గ్రౌండ్‌లో అగ్నిస్కలన.. వర్గప్రళయ అంటూ మ్యూజిక్‌తో వచ్చే ఛత్రపతిలో ఈ సీన్ చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి.

మిర్చి


వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటూ కుర్రకారు ప్రేమను పొందిన హీరో ప్రభాస్. మిర్చి సినిమాలో వర్షంలో సాగే ఓ ఫైట్ సినిమాకే హైలైట్.

గీతాంజలి


ఆ ఫాస్టర్ చచ్చిపోతాడు.. ఈ పోస్ట్ మాష్టర్ కూడా చచ్చిపోతాడు.. అంటూ గీతాంజలి సినిమాలో హీరోయిన్‌తో వర్షంలో తడుస్తూ నాగార్జున చెప్పే డైలాగ్, ఆ సీన్ ఎప్పటికీ మరచిపోలేం.

7/g బృందావన్ కాలనీ


ఫ్రెండ్స్ అందరూ కలిసి మేడ మీద పడుకుంటారు. హీరో ప్రతీ పది నిమిషాలకోసారి సుమన్ శెట్టిని లేపి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడే కునుకు పట్టి, తెల్లవారుతుండగా సుమన్ శెట్టి గాఢనిద్రలో ఉండగా వర్షం కురుస్తుంది. ఆ కామెడీ సీన్ సినిమాకే హైలెట్.

జై లవకుశ


తనకు ఎదురుచెప్పిన వాళ్లందరికీ బుద్ధిచెప్పి నిరంకుశుడిగా ఎదుగుతుంటాడు రావణ్.. అలియాస్ జై. సినిమాలో ఓ సీన్‌లో విలన్‌తో జరిగే ఫైట్‌లో వానలో మీసం తిప్పుతూ యంగ్‌టైగర్ చేసిన ఫైట్ వర్షంలోనే సాగుతుంది.

విక్రమార్కుడు


చావంటే భయపడడానికి.. అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గుండా నాయాల్ననుకున్నారా? రాథోడ్.. విక్రమ్ రాథోడ్ అంటూ తనను వెతుక్కుంటూ వచ్చిన విలన్లను తరిమికొట్టే సీన్ వర్షంలోనే ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఇంకా ఎన్నో వాన పాటలు, సీన్లు ఉన్నాయి. వాన చినుకులు పలుకరిస్తున్న వేళ మచ్చుకు కొన్ని మీకు గుర్తు చేయడానికి ప్రయత్నించాం. మీకు తెలిసిన మరిన్ని పాటలు, సీన్లు చూస్తూ కిటికీలోంచి వర్షాన్ని ఆస్వాదించండి.

ప్రవీణ్‌కుమార్ సుంకరి

1335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles