చరిత్రకు సాక్ష్యం పోలీస్ మ్యూజియం


Mon,September 10, 2018 11:42 PM

టిప్పు సుల్తాన్ ముచ్చటపడి చేయించుకున్న కత్తులు, షాజహాన్, ఔరంగజేబుల చేతుల్లో వడివడిగా తిరిగిన ఖడ్గాలను చూడాలని ఉందా? హైదరాబాద్ పోలీస్ మ్యూజియంలో ఇవన్నీ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఆయుధాలు మొదలుకొని ప్రస్తుత పోలీసులు వాడుతున్న అధునాతన ఆయుధాలు.. ఇవన్నీ ఒకేచోట కనిపించే ఆయుధ భాండాగారం ఈ మ్యూజియం. ఆ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే.. ఔరంగజేబు, షాజహాన్ వాడిన కత్తులు.. రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు స్వాగతం చెప్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయుధ తయారీ నిపుణులు తయారుచేసిన కోట్ల రూపాయలు విలువ చేసే తల్వార్లు ఇక్కడ ఉన్నాయి తెలుసా? ఎంతో చరిత్ర ఉన్న కత్తులు, ఎన్నో యుద్ధాల్లో పాలు పంచుకున్న కత్తులకు పోలీస్ మ్యూజియం నెలవైంది. దాదాపు ఆరుకోట్ల రూపాయల విలువ చేసే కత్తులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోలీస్ మ్యూజియం గురించి చాలా తక్కువమందికే తెలుసు. నిజాం కాలంలో తొలి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించిన డా. హాన్‌కిన్స్ పేరున ఈ మ్యూజియం ఏర్పాటైంది.
Palu-rakala-Guns

డాక్టర్ హాన్‌కిన్స్ మ్యూజియంలో ఐదు గ్యాలరీలున్నాయి. ఒకటి, రెండో గ్యాలరీల్లో ఎడ్జ్‌డ్ ఆర్మ్స్, ఫైర్ ఆర్మ్స్ ఉంటాయి. రెండో ప్రపంచయుద్ధం నుంచి నేటి ఆధునిక ఆయుధాల వరకు రెండు గ్యాలరీల్లో ఉన్నాయి. వాటితో పాటుగా 14వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు పలువురు రాజులు, నిజాం ప్రభువులు వాడిని తల్వార్లు, ఇతర యుద్ధసామాగ్రి ఉన్నాయి. మూడోది పోలీస్ గ్యాలరీ. దీనిలో నిజాం కాలం నుంచి నేటివరకు పోలీస్‌శాఖలో వచ్చిన మార్పులు, అప్పట్లో పోలీస్ యూనిఫాం, పోలీస్ ర్యాంకులను తెలియజేసే బ్యాడ్జ్‌లు, అప్పటి పోలీసులు వాడిన హ్యాట్స్ ఉన్నాయి. నిజాం కాలం నుంచి నేటి వరకు పోలీస్‌శాఖ అధికారులు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వివిధ పోటీల్లో గెలుచుకున్న బహుమతులు, పాత కాలంనాటి నకిలీ నోట్ల ముద్రణ, పాత కాలంలో దొంగలు వాడిన ఆయుధాలు చూస్తుంటే మనకు తెలియకుండానే కాలంలో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోతాం. ఇక నాలుగో గ్యాలరీ కమ్యూనికేషన్ గ్యాలరీ. దీనిలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ఆర్మీ నుంచి కొనుగోలు చేసిన కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. పాత ట్రాన్స్‌రిసీవర్లు, కంట్రోల్ రూం పరికరాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీస్‌లు వాడుతున్న వైర్‌లెస్ సెట్ పరికరాలు దర్శనమిస్తాయి. ఐదవది.. ఫోరెన్సిక్ సైన్స్ గ్యాలరీ.. దీనిలో ఫొరెన్సిక్ సైన్స్‌లో వచ్చిన మార్పులు, పలు కేసుల్లో ఫోరెన్సిక్ నిపుణులు ఎలా ఛేదించారనే అంశాలుంటాయి.


knife

రాజుల కత్తులున్నాయి..

హాన్‌కిన్స్ పోలీస్ మ్యూజియంలో ఉన్న వస్తువుల్లో అత్యంత ఆసక్తి కలిగించేవి అప్పటి రాజులు వాడిన కత్తులు. వీటిల్లో ఒక్కొక్కటి రూ.5 నుంచి రూ.6 కోట్ల విలువ చేసేవి ఉన్నాయి. ఈ కత్తులు ఇరాన్‌కు చెందిన ఆయుధతయారీ నిపుణుడు అసదుల్లా ఇస్ఫతానీ 17వ శతాబ్దంలో తయారుచేశాడట. వీటిలో ప్యూర్‌జేడ్ (డైమండ్స్, ప్లాటినం కంటే కూడా విలువైన పదార్థం)తో తయారుచేసిన పిడి ఉన్న దమాస్కస్ బ్లేడ్ శంషేర్ అనే కత్తి ప్రత్యేకమైంది. మ్యూజియాలజిస్ట్‌ల ప్రకారం ఈ కత్తి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుంది. షాజహాన్ వాడిన యాతగాన్ కత్తి, ఔరంగజేబు వాడిన జుల్ఫికర్ కత్తినీ ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఆయా తల్వార్ల మీద వారి కిరీటం గుర్తు, బంగారుపూతలో వారి పేర్లు రాసి ఉంటాయి. వాటి ఆధారంగా అది ఏకాలం నాటిది, ఏ రాజు వాడారో చెప్పవచ్చు.


సిరియాలో ఐఎస్‌ఐఎస్ వారు తయారు చేసిన కత్తులు సైతం ఈ మ్యూజియంలో దర్శనమిస్తాయి. ఏనుగు దంతాల పిడి కలిగిన కత్తులున్నాయి. టిప్పు సుల్తాన్ వాడిన సొసున్‌పట్టా తల్వార్లు (లిల్లీ ఆకు ఆకారంలో ఉండేలా టిప్పు సుల్తాన్ ప్రత్యేకంగా తయారు చేయించిన కత్తులను సొసున్‌పట్టా తల్వార్ అంటారు). వీటితోపాటు ఆయుధ తయారీ నిపుణులు మహ్మద్‌ముక్విమ్(ఇరాన్), మహ్మద్‌మొల్లమ్ మిస్త్రి(ఈజిక్ట్) మహ్మద్ అనిబ్ (ఇరాన్), సయ్యద్ అహ్మద్, మహ్మద్ హమ్మీద్ (తురిష్క్)తోపాటు లండన్‌కు చెందిన హెన్నీ విల్కిన్‌సన్, విండ్‌సర్ అండ్ కో, ఇంగ్లాండ్‌కు చెందిన విల్కిన్‌సన్ పాల్‌మాల్ వంటి వ్యక్తులు, ఆయుధ తయారీ కంపెనీలు తీర్చిదిద్దిన పలు ఆయుధాలు ఈ మ్యూజియంలో కనిపిస్తాయి.


gun

గుఫ్తీ ఆయుధాలు

రాజుల కాలంలో వారు వాడిన సీక్రెట్ ఆయుధాలను గుఫ్తీ ఆయుధాలు అంటారు. ఈ మ్యూజియంలో రకరకాల గుఫ్తీ ఆయుధాలున్నాయి. దీనిలో చేతికర్ర ఆకారంలో ఫీక్ ఫైర్‌ఆర్మ్స్ ఉన్నాయి. దీనిలో సీక్రెట్ రైఫిల్స్, కత్తులు ఆసక్తిని కలిగిస్తాయి. కొందరు రాజులు తమ కోటరిలో ఉన్న శత్రువులను ఎదుర్కొనేందుకు పెన్ను, చేతికర్ర ఆకారంలో ఉండే వస్తువుల్లో విషం పూసి ఉంచిన చిన్నపాటి ఆయుధాలు వాడేవారు. అలాంటి ఆయుధాలు కూడా ఈ మ్యూజియంలో మనకు కనిపిస్తాయి.


pistol

పెన్ ఆకారంలో పిస్టల్స్.. రైఫిల్స్ ఫ్యామిలీ

అనేక రకాల రైఫిల్స్ మ్యూజియంలో దర్శనమిస్తాయి. 303 రైఫిల్ సిరీస్‌లో వివిధ రకాలు ఇక్కడ దర్శనమిస్తాయి. మల్టీ బ్యారెల్‌గన్స్, క్రీ.శ 1450లో తయారు చేసిన యూరప్‌కు చెందిన తొలితరం తుపాకీ అయిన బర్నింగ్ కార్డ్‌గన్‌లను ఇక్కడ చూడొచ్చు. పెన్ ఆకారంలోని పిస్టల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. 0.22 ఎంఎం డయామీటర్ రివాల్వర్ ఇక్కడ ఉన్న ఆయుధాల్లో ప్రత్యేకమైంది. అరచేతిలో ఇమిడిపోయేలా ఉండే ఈ రివాల్వర్‌ను అమెరికా నుంచి తెప్పించారు. తుపాకీ తయారీ మొదలైన తొలినాళ్లలో చైనాలో తయారు చేసిన గన్నులు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. సింగల్ బ్యారెల్ దేశీతపంచ, డబుల్ బేరల్, ట్రిపుల్ బేరల్, ఫోర్ బ్యారెల్ పిస్టల్స్ సైతం ఈ మ్యూజియంలో చూడొచ్చు. 20వ శతాబ్దం తొలినాళ్లలో వాడిన సిగ్నల్ పిస్టల్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు రకరకాల సైజుల్లో ఉండే ఫిరంగులు, నేపాలీ, అస్సామీ డాగర్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి.


fire-arm

మీరూ.. చూడాలంటే..

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గరిలోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ లోపల ఈ మ్యూజియం ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రజలను అనుమతించడం లేదు. ప్రస్తుతానికి పాఠశాల, కళాశాల విద్యార్థులకు మాత్రం ముందస్తు అనుమతితో ప్రవేశం కల్పిస్తున్నారు. త్వరలోనే అందరికీ మ్యూజియంలోకి ప్రవేశం కల్పిస్తామంటున్నారు అధికారులు.


Santhosh-Mehra2

చరిత్రను గుర్తుతెస్తాయి..

ఎంతో ప్రాముఖ్యం కల్గిన హాన్‌కిన్స్ మ్యూజియంలో ప్రతిష్టాత్మకమైన వస్తువులున్నాయి. అవి మనకు గత చరిత్రను గుర్తుకు తెస్తాయి. త్వరలోనే సామాన్యులకు కూడా ఎంట్రీ కల్పించే విషయమై ఆలోచిస్తున్నాం. ఒక ప్రత్యేక భవన సముదాయం నిర్మించి మ్యూజియంను షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం.
-సంతోష్ మెహ్రా, డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ


డా.హాన్‌కిన్స్ పేరుతో ప్రారంభం..

నిజాం కాలంలో తొలి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేసిన డా.హాన్‌కిన్స్ పేరిట ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 1990లో అప్పటి డీజీపీ సుశీల్‌కుమార్ నేతృత్వంలో వేసిన ఒక కమిటీ పోలీస్ మ్యూజికం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2000-2002 వరకు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసిన ఏకే మహంతి మ్యూజియం ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తర్వాత డా.గోపినాథ్‌రెడ్డి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అయ్యాక దీన్ని మరింత వేగవంతం చేశారు. పూర్తిస్థాయిలో 2007-08 నుంచి ఈ మ్యూజియం అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎక్కడెక్కడో ఉన్న పురాతన కత్తులు, ఆయుధాలు కూడా పోలీస్ యాక్షన్ తర్వాత ఇక్కడకు చేర్చారు. అహ్మద్‌అలీ అనే ప్రపంచ ప్రఖ్యాత మ్యూజాలజిస్ట్ సహకారంతో ఈ మ్యూజియం రూపుదిద్దినట్టు ప్రస్తుతం మ్యూజియంలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మనోజ్‌కుమార్ దూబే తెలిపారు.
-నాగోజు సత్యనారాయణ
నమస్తే తెలంగాణ స్టేట్‌బ్యూరో ప్రతినిధి

399
Tags

More News

VIRAL NEWS