గోల్డ్ ఈటీఎఫ్‌లు కొనుగోలుకిదే మంచి తరుణం


Fri,December 14, 2018 11:08 PM

gold
గత నాలుగేండ్లుగా ఈక్విటీ మార్కెట్లు, డెట్ మార్కెట్లలో రాబడులు అధికంగా ఉన్న కారణంగా పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మళ్లీ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో బంగారం ధర 8.35 శాతం పెరిగి పది గ్రాముల ధర దాదాపు రూ. 32 వేల స్థాయిలో కదలాడుతున్నది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఏర్పడడంతో పాటు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కొనుగోలు చేయవచ్చునా అనేది మిలియర్ డాలర్ ప్రశ్న. చాలా మంది బంగారాన్ని నేరుగా కొనడం కన్నా గోల్డ్ ఈటీఎఫ్‌ల రూపంలో కొనుగోలు చేయడం ప్రారంభించారు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో చాలా వరకు రూ 2,800-3,000 మద్దతు స్థాయిల నుంచి పటిష్ఠంగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక నుంచి బంగారం ధరలతో పాటుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లో వస్తున్న ఒడిదుడుకులతో ఉన్న రిస్క్‌ను గోల్డ్ ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు.


గత ఏడాది కాలంగా బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. సిరియాతో సహా పశ్చిమాసియా దేశాల్లో రాజకీయ అనిశ్చిత, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రతికూల పరిస్థితులు బంగారం ధరలు పెరగడానికి ప్రధానకారణంగా కనిపిస్తున్నది. ఒపెక్ దేశాల కూటమి నుంచి ఖతార్ బయటకు రావడం, టర్కీ, ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య వివాదాలు కూడా జియో పొలిటికల్ రిస్క్‌లను పెంచుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదాలు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇటీవలి జీ-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సంధి కుదిరినప్పటికీ అది ఎక్కువ కాలం నిలువలేదు. వాణిజ్య యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని దెబ్బ తీస్తాయని ఐఎంఎఫ్‌తో సహా పలు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. వాణిజ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడల్లా బంగారం ధరలు పెరుగుతాయని గత చరిత్ర చెబుతున్నది. చివరగా డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కూడా బంగారం ధరలు పెరగడానికి పరోక్షంగా దోహదం చేస్తున్నది. మిగతా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా మనకు కావాల్సిన బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం కనుక డాలర్లలో అధిక ధరను చెల్లించాల్సి వస్తున్నది. ఈ ఏడాది రూపాయి మారకం విలువ దాదాపు 14 శాతం వరకు నష్టపోయింది.


అమెరికా ఆర్థిక వ్యవస్థ 2008 సంక్షోభం తర్వాత గత దశాబ్దకాలంగా క్రమంగా పుంజుకుంటూ వస్తున్నది. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతూన్నది. దీంతో మళ్లీ అమెరికా ఆర్థికవ్యవస్థపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో డాలర్ల నుంచి బంగారంలోకి పెట్టుబడులు మళ్లే అవకాశాలు మెరుగ్గావున్నాయి. ట్రేడ్‌వార్, జియోపొలిటికల్ అంశాలతో బంగారంలోకి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఏంజెల్ బ్రోకింగ్ కమోడిటీస్ విశ్లేషకులు పార్థమేశ్ మాల్య విశ్లేషించారు. దీనికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడి కొనుగోళ్లను పెంచాయి. ప్రస్తుత క్యాలండర్ సంవత్సరం మూడో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 22 శాతం పెరిగి 148.4 టన్నులకు చేరుకుంది. 2015 తర్వాత ఇదే అత్యధిక కొనుగోళ్లు కూడా. గత నాలుగేండ్లలో ఈక్విటీలు, రుణ సాధనాల వంటి వాటితో పోల్చితే బంగారం రాబడులు తక్కువగా వున్న కారణంగా గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు దాదాపు అర శాతం మేర తగ్గాయని అసోసియేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలిపింది. రాబడులు లేకపోతే ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. మరో వైపు దేశీయ ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల కన్నా ఫిజికల్ బంగారాన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. రియల్ ఎస్టేట్, ఈక్విటీలలో పెట్టుబడులు పెరగడం కూడా ఒక కారణం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల ఎస్‌ఐపీల ద్వారా పెట్టుబడులు పెరుగుతూ వున్నాయి.


ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు ఓవర్ వ్యాల్యూ జోన్‌లో ఉన్నందున రాబడులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో బంగారం మళ్లీ ఉత్తమ పెట్టుబడి సాధనంగా వెలుగులోకి వచ్చింది. అందుకే గత ఏడాది కారణంగా వివిధ కారణాలతో స్థిరంగా బంగారం ధర పెరుగుతూ వస్తున్నది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈక్విటీ మార్కెట్ల పతనంతో బంగారం ధరలు పెరిగాయి. దీంతో టెక్నికల్‌గా బంగారం ధర మరో రూ. 3,000 వరకూ పెరిగే అవకాశం వుంది. అలాగే వచ్చే రెండేండ్లలో పదిగ్రాముల బంగారం ధర రూ 38, 000 దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


కింకర్తవ్యం

బంగారాన్ని ఒకేసారి ఫిజికల్‌గా కొనుగోలు చేయడం ఈటీఎఫ్‌లను ఎస్‌ఐపీ ద్వారా కానీ, లేదా క్రమంగా కొనుగోలు చేయడం ఉత్తమ మార్గంగా చెబుతున్నారు. దొంగతనం, లావాదేవీల చార్జీలు, తరుగు లాంటి ప్రతికూలాంశాలు ఇందులో లేవు. అందుకే బంగారం కొనుగోళ్లను ఈటీఎఫ్‌ల రూపంలో కొనుగోలు చేయడం మేలు.

592
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles