గృహ రుణాలు తీసుకున్నవారికి భారీ ఊరట


Sat,December 8, 2018 01:14 AM

గృహ రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు భారీ ఊరట లభించబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఐదో ద్వైమాసిక పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్ల కోసం కొత్త ప్రామాణికాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ కొత్త ప్రామాణికాలతో 91 రోజులు లేదా 182 రోజుల ట్రెజరీ బిల్లుల ఆదాయం, ఎఫ్‌బీఐఎల్ చూపిన ఇతరత్రా బెంచ్‌మార్క్ మార్కెట్ వడ్డీరేట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను సవరించనున్నాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో గృహ రుణాలు తీసుకున్న, భవిష్యత్తులో తీసుకునే వారికి ఊరట లభించనున్నది.
home-loan
దీంతో మరింత పారదర్శకంగా రుణాలు తీసుకోవడానికి వీలు కలుగనున్నది. పరపతి సమీక్షలో రెపో రేటును తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు చేరవేయకుండా బ్యాంకులు ఆడుతున్న నాటకానికి తెరదించుతూ ఫైనాన్షియల్ బెంచ్‌మార్క్ ఇండియా(ఎఫ్‌బీఐఎల్) ట్రెజరీ బిల్లును ఆర్బీఐ రూపొందించింది. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయడానికి సిద్ధమైంది సెంట్రల్ బ్యాంక్. బెంచ్‌మార్క్ వడ్డీరేటును నిర్ణయించుకునే అవకాశం కూడా బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ కల్పించింది. ఆర్బీఐ పలుమార్లు వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు చేరవేయకుండా బ్యాంకులకు అడ్డుకుంటుడటంపై వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ వీటిలో సమూల మార్పులకు మొగ్గుచూపింది. అలాగే గడిచిన మూడేండ్లుగా వడ్డీరేట్లను వివిధ పద్దతుల్లో పరిష్కారం చూపుతున్నారు..ఒకవేళ పెరిగిన, తగ్గినప్పుడు అనుసరించే పద్దతులో ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆర్బీఐ ఈ నూతన మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది.

వినియోగదారులకు లబ్ది చేకూర్చడానికి సెంట్రల్ బ్యాంక్ ఈ నూతన మార్గదర్శకాలవైపు మొగ్గుచూపుతున్నదని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు వెల్లడించారు. ఈ విభిన్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 2016 నుంచి ఆర్బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్ మూడు విభాగాల కింద ఇవ్వడం జరుగుతున్నది. ఉదాహరణకు ఎంసీఎల్‌ఆర్ ఆరు నెలలు+ 0.4 శాతం కలుపుకొని వడ్డీని నిర్ణయిస్తున్నారు. అంటే ఎంసీఎల్‌ఆర్ 8.6 శాతమైతే, దీనికి మరో 0.4 శాతం కలుపుకొని వడ్డీరేటు 9 శాతం వసూలు చేస్తున్నారన్నమాట. ఈ సందర్భంగా రిటైల్‌లెండింగ్.కామ్ వ్యవస్థాపకుడు సుకణ్య కుమార్ మాట్లాడుతూ..వ్యక్తిగతంగా జీవితకాలంలో గృహ రుణాలు తీసుకోవడం కష్టతరమవుతున్న ఈ సమయంలో బీపీఎల్‌ఆర్ నుంచి ఎంసీఎల్‌ఆర్‌కు సిస్టాన్ని మార్చడంతో కొంతలో కొంత మేలు జరిగినట్లు అయిందన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే..గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తే ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో వినియోగదారులకు బ్యాంక్‌లు మళ్లించడం లేదని కమిటీ గుర్తించిందని, దీంతో ఈ నూతన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

గృహ రుణాల ఫ్లోటింగ్ వడ్డీరేట్లను నియంత్రించాలని కమిటీ ప్రతిపాదించిందని, వీటితోపాటు రిటైల్ లేదా కార్పొరేట్ రుణాలపై కూడా ఈ పరిమితులు వర్తింపచేయాలని సూచించింది. రిటైల్ కన్జ్యూమర్, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇచ్చిన రుణాలకు ఈ ప్రతిపాదనలు వర్తింపచేయాలనే కమిటీ విజ్ఞప్తిని రిజర్వు బ్యాంక్ ఆమోదం తెలిపింది. చాలా రకాలు బెంచ్‌మార్క్ రేట్లు ఉండటంతో ఎదురవుతున్న గందరగోళానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆర్బీఐ తన పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రస్తుతం ప్రైం లెండింగ్ రేటు (పీఎల్‌ఆర్), బెంచ్‌మార్క్ ప్రైం లెండింగ్ రేటు (బీపీఎల్‌ఆర్), బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) వంటి అంతర్గత ప్రామాణికాలపై బ్యాంకులు రుణాల వడ్డీరేట్లను నిర్ణయిస్తున్నాయి. ఇప్పటికే సిటీబ్యాంక్..ట్రెజరీ బిల్లు బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేటు ఆధారంగా వడ్డీరేట్లను నిర్ణయిస్తున్నది. ఇవి మూడు నెలలకొకసారి మార్పులు చేస్తున్నది. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వడ్డీరేట్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగావున్నాయి. ఒకవేళ క్రెడిట్ కార్డు బిల్లు లేదా నెలవారి రుణవాయిదా చెల్లింపులు జరుపనివారికి ఆటంకాలు తప్పవని హెచ్చరించింది.

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles