క్విట్ ప్లాస్టిక్ నినాదం.. 72 గంటల స్ఫూర్తి కార్యక్రమం!


Tue,August 21, 2018 11:03 PM

ఒక రేడియో జాకీ ఆపకుండా ఎన్ని గంటలు మాట్లాడగలడు? ఒక రేడియో జాకీ అలవోకగా ఎన్ని కార్యక్రమాలు నడిపించగలడు? ఒక రేడియో జాకీ ఎన్ని ఫోన్‌కాల్స్ మాట్లాడగలడు? లెక్కలు వేసుకునేవాళ్లకు కావాలి. లక్ష్యం ముందు దేన్నీ లెక్కపెట్టని వాళ్లకు అవేం అవసరం లేదు. 72 గంటల పాటు నిద్ర లేకుండా చేసిన స్ఫూర్తిమంతమైన కార్యక్రమం, దాన్ని నిర్వహించిన ఆర్జే పరిచయం..
quit-plastic
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 92.7 బిగ్ ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో క్విట్ ప్లాస్టిక్ నినాదంతో 72 గంటల పాటు ఏకధాటిగా ఓ కార్యక్రమం సాగింది. ఆర్జే శేఖర్ బాషా నిద్ర లేకపోయినా ఎక్కడా అలిసిపోకుండా, తొలి నిమిషంలో చూపించిన ఉత్సాహాన్నే చివరి నిమిషం వరకు చూపించాడు. బిగ్ ఎఫ్‌ఎంలో తన నినాదాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ దారిలో వినిపించిన శేఖర్ బాషాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సామాజిక స్ఫూర్తి, మెరుపు వేగంతో మెలికలు పెట్టే ప్రశ్నలతో తనకంటూ ఒక కొత్త విధానంతో దూసుకుపోతున్నాడు.


ఎవడు పొడిస్తే దిమ్మ తిరిగిన మైండ్ కూడా ఓపెనైపోద్దో వాడే శేఖర్ బాషా ఈ డైలాగ్ వినని రేడియో అభిమాని హైదరాబాద్‌లో ఉండరేమో! రోజూ హైదరాబాద్‌లో ఉదయం పొద్దు పొడవగానే సూర్యుడితో పాటు తన బ్రాండ్ పోట్లు(రిడిల్స్)తో, సిటీ అప్‌డేట్స్‌తో 92 .7 బిగ్ ఎఫ్‌ఎంలో ఉదయిస్తాడు ఈ ఆర్‌జే శేఖర్ బాషా. రజినీకాంత్ బాషా సినిమా స్ఫూర్తితో తనకంటూ ఒక మార్క్ స్టయిల్‌ను సృష్టించుకొని రేడియోరంగంలో దూసుకుపోతూ, సమయం దొరికినప్పుడల్లా సామాజిక స్ఫూర్తిని రగిలించే కార్యక్రమాలు చేపడుతూ ఎఫ్‌ఎం రేడియో జాకీలు కమర్షియల్ కార్యక్రమాలే కాదు.. సామాజిక బాధ్యత గల కార్యక్రమాలూ చేస్తారని నిరూపిస్తున్నాడు. శేఖర్ బాషా అనేది తన రేడియో పేరు. అసలు పేరు గుదిమెళ్ళ రాజశేఖర్.


సామాజిక బాధ్యత

quit-plastic3
ప్రతి సంవత్సరం ఏదో ఒక సామాజిక అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రోజుల తరబడి ఆపకుండా రేడియోలో మాట్లాడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ రికార్డులు సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్లాస్టిక్‌ని తరిమేద్దాం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం అంటూ క్విట్ ప్లాస్టిక్ నినాదంతో మూడురోజుల (72 గంటలు) పాటు ఆర్జేఇంగ్ చేసి స్ఫూర్తి రగిలించారు . ఈ కార్యక్రమం 92 .7 బిగ్ ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి పదులు కాదు, వందలు కాదు. వేల ఫోన్ కాల్స్‌తో శ్రోతలు క్విట్ ప్లాస్టిక్‌కి తమ మద్ధతు తెలియజేశారు. అంతేకాదు సినిమా సెలబ్రిటీలు, సాధారణ గృహిణులు , యువత నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా రంగం నుంచి రేణుదేశాయ్, రాశీఖన్నా, మురళీ శర్మ , ఈ నగరానికి ఏమైంది టీంతో పాటు ఎందరో మద్దతు తెలిపారు.


ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ క్విట్ ప్లాస్టిక్ నినాదానికి మంచి మద్దతు లభించింది. క్విట్ ప్లాస్టిక్ ముగింపు కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్దన రెడ్డి బిగ్ ఎఫ్‌ఎం స్టూడియోని సందర్శించారు. శేఖర్ బాషాతో కలిసి స్టూడియోలో కబుర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రోతలు ఇచ్చిన సలహాలను సూచనలను విన్నారు, కొందరిని అభినందించారు. అలాగే ప్లాస్టిక్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని కూడా వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై చేపట్టిన అవగాహనా కార్యక్రమాల గురించి వివరించారు. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించీ చర్చించారు.


యాంకర్ నుంచి జాకీగా..

quit-plastic2
మొదట జెమినీ టీవీలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన రాజశేఖర్, క్రమంగా తన మార్క్ మాటలతో పాపులర్ అయ్యారు. 2007లో 92.7 లో యాంకర్ ఝాన్సీతో పాటు కలిసి రేడియో జాకీగా ప్రారంభించి ఆ తర్వాత హ్యాపీ మార్నింగ్స్‌తో సోలో యాంకర్ గా పదకొండు సంవత్సరాలుగా అలరిస్తూ వస్తున్నాడు శేఖర్ బాషా. తన లాంగ్ కెరీర్‌లో చాలా చెప్పుకోదగ్గ విజయాలు సాధించాడు. ఇండియాలో ఎవరూ సాధించనన్ని ప్రతిష్టాత్మక అవార్డులు సాధించాడు. ఇండియా రేడియో ఫోరమ్ అవార్డ్స్ 17 సార్లు అందుకున్నాడు. బెస్ట్ వీడియో జాకీగా 2016లో జెమినీ మ్యూజిక్ షోలకి గాను ఎఫ్ క్లబ్ నుంచి అవార్డు, 2014లో సంతోషం సినీ మ్యాగజైన్ వారి బెస్ట్ రేడియో జాకీ అవార్డు, 2010లో ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ బెస్ట్ కమ్యూనికేటర్ అవార్డు అందుకున్నాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఏదైనా సాధించాలని తన మెదడుకి పదును పెట్టుకుంటూ శ్రోతలకు కూడా పోట్లతో పదును పెడుతున్నారు.

763
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles