క్యాన్సర్‌ను జయించడమెలా?


Tue,January 29, 2019 01:38 AM

breast-cancer-pain
క్యాన్సర్ ఒక మహమ్మారి.. కానీ నియంత్రించలేని వ్యాధేమీ కాదు. అయినా క్యాన్సర్ మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కారణం.. వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం. ప్రాథమిక లక్షణాలు తెలిసినా నిర్లక్ష్యం చేయడం. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. క్యాన్సర్ అంటే ఏంటి? దానిని ఎలా అరికట్టాలి? చికిత్స ఏంటి? అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.


తొలిదశలోనే లక్షణాలను గుర్తిస్తే క్యాన్సర్‌ను అంతమొందించవచ్చు. ఎముకలు, కాలేయం, ఊపిరితిత్తులు ఇలా ఏ అవయవమూ దానికి అతీతం కాదు. అలా విస్తరిస్తూ లింఫ్ నాళాలు, రక్తం ద్వారా ఏ భాగానికైనా పాకుతుంది. మిగతా అవయవాలకు పాకితే దానిని లేటుదశ అంటారు. ఈ దశకు చేరుకోకుండా చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ను అదుపుచేయవచ్చు.

Cells-Cancer

2019 థీమ్

క్యాన్సర్‌పై ఆరోగ్య సంస్థలు.. ప్రభుత్వాలు.. స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ దానిని అందుకోలేకపోతున్నారు ప్రజలు. ప్రతీయేటా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యూఐసీసీ) ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు.. వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి దానిని అంతమొందించాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. ప్రతీయేటా ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్.. I Am and I Will. కనీసం వారు సూచించే నిర్దేశకాలనై పాటిస్తే ఎంతో కొంత అవగాహన కలుగుతుంది.


ఏది క్యాన్సర్?

శరీరంలోని ఏదైనా అవయవం వ్యాధికారక వైరస్ బారిన పడి రోజురోజుకూ నశిస్తుంది. చాలాసార్లు తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వచ్చిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అన్ని క్యాన్సర్లనూ ఒకే రకం పరీక్షతో తెలుసుకోవడం అసాధ్యం. క్యాన్సర్ అంటువ్యాధి కానేకాదు. కానీ గర్భాశయ ముఖ్యద్వార క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ వైరస్ శృంగారం.. రక్తమార్పిడిల ద్వారా సోకే ప్రమాదం ఉంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మాత్రం దగ్గరి సంబంధీకులకు రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ క్యాన్సర్లు ఉంటే ఆ కుటుంబసభ్యుల్లో వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ అసలు భాగం నుంచి ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావచ్చు కాబట్టి అవగాహనే ఆరోగ్య రక్షగా భావించాలి.


క్యాన్సర్‌కు కారణాలు

ప్రధానమైంది ఆధునిక జీవనశైలి. మద్యం, పొగతాగడం, ఆహారపదార్థాల్లో రంగులు, రసాయనాలు వాడటం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, నీటి, వాతావరణ కాలుష్యాలు, క్రిమిసంహారకాలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్‌కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ క్యాన్సర్‌కు కారకాలు. ఉదాహరణకు జర్మనీలో వెవెల్సేప్లెతే అనే పల్లె ఉంది. అక్కడ మూడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, ఒక నౌకాశ్రయం ఉన్నాయి. అక్కడి నుంచి వెలువడే రేడియోధార్మికతతోనూ, నౌకాశ్రయంలో కంటెయినర్లకు వేసే రంగులలోని గాఢమైన రసాయనాలతో ఆ గ్రామంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు క్యాన్సర్‌కు గురవుతున్నారు.


రాకుండా వ్యాక్సిన్ లేదా?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణం ఖచ్చితంగా హెచ్‌పీవీ వైరస్ అని తెలుసుకాబట్టి ఇవి రాకుండా వ్యాక్సిన్ ఉంది. 9 ఏళ్ళ నుంచి పెండ్లికాని అమ్మాయిలందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అండాశయం, గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్ పనిచేయవచ్చు. 40 ఏండ్ల వరకు స్త్రీలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. హెపటైటిస్ సి వైరస్ తరుచూ రూపాంతరం చెందుతూ ఉండటం వల్ల ఆ వైరస్‌తో వచ్చే లివర్ క్యాన్సర్‌కు ఇంకా టీకాను కనుక్కోలేక పోయారు.


క్యాన్సర్ సోకితే మరణమేనా?

మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించటం అనే విషయం దానిని కనుగొన్న దశ.. దానికి పాకే గుణం ఉందా లేదా ఒక్క ప్రాంతానికే పరిమితం అయిందా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, థెరపీలు కూడా ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించటంలో, త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ స్టేజ్, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం.


ఏ వయసులో వస్తుంది?

కాన్సర్‌కు వయోభేదం లేదు. అయితే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా వరకు పూర్తిగా నయం చేయగలిగినవే. వయస్సు పెరిగేకొద్ది క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వయస్సులో ఉన్నప్పుడు వచ్చే క్యాన్సర్స్ తీవ్రత చాలా ఎక్కువ. అందుకే క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కూడా వయస్సును బట్టి నిర్ధారిస్తారు. క్యాన్సర్ కణాలమీదే పని చేసే కీమోథెరఫీ, రేడియోథెరఫీలతో పాటు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీహోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్ చికిత్సకు చేయగలుగుతున్నారు. సర్జరీ చేసి రేడియో, కీమో, హార్మోన్ థెరఫీ వంటివి ఇచ్చినా లేక థెరఫీల తర్వాత సర్జరీ చేసినా ట్రీట్‌మెంట్ అంతటితో అయిపోయింది అనుకోవడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్‌లు చేసుకోవాలి.

Mmmography

పరీక్షలు ఏంటి?

క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కుడుందో ముందుగానే తెలుసుకోవడం కష్టం. ఏ అవయవానికి వచ్చిందని అనుమానం ఉంటే ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, యఫ్‌యన్‌ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, యంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను పాప్‌స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు.


లక్షణాలు

రొమ్ములో గడ్డలు, విడవకుండా దగ్గు, గొంతు బొంగురు పోవడం, ఆకలి, బరువు తగ్గడం, మానని పుండు, కొత్తగా మచ్చ, అంతకు మునుపే ఉన్న మచ్చ/పులిపిరి కాయలో మార్పులు, వాంతులు, అజీర్ణం, కడుపు ఉబ్బరం, తగ్గని జ్వరం వంటి సాధారణ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇవి కాకుండా ఇంకా కొన్ని కచ్చితమైన లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


తలనొప్పి : ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు.


దగ్గు, ఆయాసం : గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లె/తెమడలో రక్తం, ఆయాసం వంటివి లంగ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.


మచ్చలు : చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్‌క్యాన్సర్‌ను హెచ్చరించేవి. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్ / లంగ్ క్యాన్సర్లకు సూచన కావచ్చు.

Dr.-Mohana-Vamshi
డాక్టర్ చిగురుపాటి మోహనవంశీ
సర్జికల్ ఆంకాలజిస్ట్
ఒమేగా హాస్పిటల్స్

962
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles