కుబుద్ధి నక్క!


Sat,July 21, 2018 11:31 PM

దండకారణ్యంలో జంతువులన్నీ కలిసి మెలిసి హాయిగా జీవించేవి. వాటిల్లో హనుమ అనే కోతికి పెండ్లి కుదిరింది. పెండ్లికి జంతువులన్నీ రావాలని తల్లి దండోరా వేయించింది. ఆ పెండ్లి చాలా ఘనంగా జరిగింది. మృగరాజు కూడా పెండ్లికి వచ్చి దంపతుల్ని ఆశీర్వదించాడు.
Neethi-Katha
అందరూ పెండ్లి బాగా జరిగిందనీ, విందు చాలా బాగుందనీ సంతోషం ప్రకటిస్తూ వెళ్తుంటే, కుబుద్ధి అనే నక్క మాత్రం.. పెండ్లికి నన్ను పిలువలేదు అంటూ వచ్చిపోయే వారికి చెప్పడం ప్రారంభించింది. అది విన్న అడవి కుక్క నీది మరీ విడ్డూరం మావా. నీవొక్కడివే ఎందుకలా అంటున్నావ్ అన్నది. అందుకు కుబుద్ధి కోపంతో చాల్లే.. నీ పని నువ్వు చూసుకో అన్నది. ఈ విషయం కోతి తల్లి వరకూ చేరింది. ఆమెకు కుబుద్ధి ఎదురవడంతో అల్లుడూ! మా అబ్బాయి పెండ్లికి నువ్వు రాలేదేం? నీకోసం పెండ్లి పందిరంతా వెతికాను అని అభిమానంగా అన్నది. మీరు పెండ్లికి పిలవలేదు కదత్తా! అందుకే నేనూ, మా బంధువులెవరూ రాలేదు అన్నది కుబుద్ధి. పెండ్లికి అడివంతా ఆహ్వానం పలుకుతూ దండోరా వేయించాం. మీరు వినలేదా? మృగరాజుతో సహా పెండ్లికి వచ్చినవాళ్లంతా, ఆ ఆహ్వానం మేరకు వచ్చిన వాళ్లే అన్నది. ఏమో అత్తా! నేను వినలేదు. సర్లే.. మా అబ్బాయి నూకన్నకు వచ్చే ఆదివారం పెళ్లి. మీ కుటుంబం తప్పక రావాలి అన్నది కుబుద్ధి. అదేం మాట అల్లుడూ.. తప్పకుండా వస్తాం అన్నది హనుమ తల్లి.

పెండ్లిరోజు రానే వచ్చింది. కొడుకు కోడలుతో పెండ్లికి వెళ్లి అక్షింతలు చల్లి, భోజనానికి కూర్చున్నారు. అక్కడికి వచ్చిన కుబుద్ది.. అత్తా! పెండ్లంటే ఇంత ఘనంగా చెయ్యాలి. నన్ను చూసి ఎవ్వరైనా విందు చూశావుగా ఎంత బాగుందో. మిత్రులందరూ నా గురించే చెప్పుకుంటున్నారు. ఇకనైనా చేసే కార్యక్రమాలు ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకో అన్నది గర్వంగా. అందుకు హనుమ తల్లి బాగుందల్లుడూ పెండ్లి ఘనంగా చేశావు. విందు భోజనమూ బాగుంది. కానీ, నీ మాటలే బాగోలేవు. ఈ ధోరణి మార్చుకుంటే మంచిది అని సూటిగానే అన్నది. చాలా బాగా చెప్పారు పెద్దమ్మా అంది పక్కనే ఉన్న కొండముచ్చు. దీంతో కోపంగా చూశాడు కుబుద్ధి. చూడు కుబుద్ధి! మనం భోజనం ఎంత కమ్మగా పెట్టినా, పెండ్లి ఎంత ఘనంగా జరిపినా, మన మాటలు ఇంపుగా ధ్వనించాలి. ఎదుటి వాళ్ల తప్పులు ఎంచకూడదు. కాబట్టి నీ మాట ధోరణి మార్చుకుంటే మంచిది మిత్రమా! అన్నాడు పక్కనే ఉన్న మృగరాజు. తప్పు తెలుసుకున్న కుబుద్ధి తలవంచుకుని మృగరాజు ముందు నిల్చుంది.

నీతి : ఎన్నడూ ఎదుటి వారి తప్పులు ఎంచకూడదు. మన గొప్పల్ని అదే పనిగా చెప్పకూడదు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి.
- ఎల్. రాజాగణేష్

384
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles