కీలకాంశాలను మరువొద్దు


Fri,August 17, 2018 11:40 PM

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి ముందు ఆయా షేర్ల కదలికలు, ప్రభావితం చేస్తున్న అంశాలు, ఒడిదుడుకులు, ప్రతిఫలాలు వంటివి ఎన్నోవాటిపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అంశాల్లో వేటి గురించీ మనం చర్చించుకోవడం లేదు. కావాలనే పక్కకు పెడుతున్నామో.. లేదంటే ర్చిపోతున్నామోగానీ ఈ కీలకాంశాలను పట్టించుకోవడం లేదు. భారీ లాభాలో, భీకర నష్టాలో ఎదురైనప్పుడు మాత్రమే వీటి గురించి ఆలోచిస్తున్నాం.
STIOCK-MARKET
తెలివిగా ఈత కొట్టినప్పుడే రాకాసి అలలు కూడా మనల్ని చూసి భయపడుతాయి అని ప్రఖ్యాత మదుపరి, బెర్క్‌షైర్ హాథవే చైర్మన్, సీఈవో అయిన వారెన్ బఫెట్ అన్నారు. స్టాక్ మార్కెట్లలోనూ మదుపరులు తెలివైన నిర్ణయాలు తీసుకుంటే అంతిమ విజయం మనదేనన్నది గుర్తుంచుకోవాలి.

-అంతా సజావుగా సాగుతుంటే అప్రమత్తతకు తావే ఉండదు. నిపుణుల సలహాలనూ పెద్దగా పట్టించుకోము. కానీ సమస్య ఎదురైనప్పుడే ఆ సలహాల గురించి ఆలోచిస్తాం. వాటి విలువ తెలుస్తుంది. విజయాలున్నప్పుడు వెనుదిరిగిచూసుకోరెవ్వరు. గెలుపు బాటలో నడుస్తున్నప్పుడు మన లోపాలూ కనిపించవు. తప్పుల్నీ గుర్తించం. ఇది మానవ నైజం. పెట్టుబడుల విషయంలోనూ ఇంతే. మనం పెట్టిన పెట్టుబడులు లాభాల్ని తెస్తున్నప్పుడు మనం చేసేది సరైనదేనని అనిపిస్తుంది. అయితే ఈ దశలో మరిన్ని పొరబాట్లకు ఆస్కారం ఉంటుంది.

-పునాది బలంగా ఉన్నప్పుడే భవనాలు నిలబడుతాయి. లేదంటే ఎంతటి కట్టడాలైనా కూలిపోవడం ఖాయం. అలాగే పెట్టుబడుల మూలాలు బాగున్నప్పుడే.. ఆశించిన ప్రయోజనం అందుతుంది. పైకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. లోపల ఏమాత్రం పెట్టుబడులకు అనుకూలంగా లేని షేర్లు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పైపై మెరుగులను చూసి మోసపోరాదు. ప్రతీ షేర్ కొనుగోలుకు ముందు దాని గత చరిత్రను పరిశీలించడం చాలా అవసరం. ఎలాంటి అంశాలు దాని ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయనేది తప్పక గమనించాలి. అలాగే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నప్పుడు సహజంగానే మదుపరుల్లో విశ్వాసం అనేది సన్నగిల్లుతుంది. అప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి తీసుకుంటాం. ఇప్పుడే కీలకాంశాల ప్రాధాన్యతనేది బయటపడుతుంది.

-ఉదాహరణకు 2013 మాంద్యాన్నే తీసుకుంటే.. నాడు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనమైంది. విధానాల్లో చురుకుదనం లోపించింది. అధిక ద్రవ్యోల్బణం భయాలు వెంటాడాయి. ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు పెచ్చుమీరాయి. ఇలాంటి విపరీతమైన ప్రతికూల పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు అవకాశాలు తక్కువే. ఈ సమయంలో కూడా ధైర్యంగా పెట్టుబడులు పెట్టినవారు ఇప్పుడు లాభాలను అందుకుంటున్న దాఖలాలూ లేకపోలేదు. ఇలాంటి సమయాల్లో మన ఓపిక, మన విశ్వాసమే.. మన పెట్టుబడులను కాపాడుతాయి. మదుపు అనేది విశ్లేషణపైనే ఆధారపడిలేదు. మన ప్రవర్తన, మానసిక ధృడత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది.

-మన ఆదాయాన్నిబట్టే పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఫలితం ఎలా ఉన్నాగానీ అది మన జీవితాల్ని ప్రభావితం చేసేలా ఉండకూడదు. లాభం వస్తే పర్వాలేదు. కానీ నష్టం వస్తే.. అందుకే పెట్టుబడిని ఓ ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకోవడం ఉత్తమం. సహజంగా ఒడిదుడుకులకు లోనయ్యే ఈ పెట్టుబడులు.. మన ఆర్థిక పరిస్థితులను బలపరిచేలా ఉండాలే తప్ప, తలకిందులు చేసేలా ఉండకూడదు. కనుక స్థోమతకు తగ్గట్లుగా పెట్టుబడుల ప్రణాళికలుండటం విజయాలకు సులువైన మార్గం.

-గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిలకడగా ఆలోచించడంలోనే మదుపరి తొలి గెలుపు దాగుంది. లాభాలు వచ్చినప్పుడు దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం, నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం మన మానసిక అపరిపక్వతను తేటతెల్లం చేస్తుంది. ఒంటరి నిర్ణయాల కంటే ఉమ్మడి నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వైఫల్యాలు ఎదురైనప్పుడు మనకంటూ కొంత మద్దతు అప్పుడే లభిస్తుంది. ఇలాంటి బాసట మనకు ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది కూడా. కాబట్టి సలహాలను అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఆచితూచి వ్యవహరించి అపజయాల నుంచి తప్పించుకోండి.

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles