కాళ్లు కదపనీయని.. చికున్ గున్యా!


Mon,December 17, 2018 10:39 PM

Chikungunya
వైరస్ దాడి చేయడానికి అనువైన సీజన్ చలికాలం. కీళ్ల విషయంలో అయితే వైరస్ దాడి ఎక్కువే. ముఖ్యంగా చికున్ గున్యా వైరస్. ఇది ప్రాణాంతక వ్యాధి కాకపోవచ్చు. కానీ మనిషిని కదలలేని స్థితికి చేరుస్తుంది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయేట్లు చేస్తుంది. ఎందుకొచ్చిన సమస్య? ఈ చలికాలం పోయేదాక జాగ్రత్తగా ఉండి చికున్ గున్యాకు దూరంగా ఉంటే సరిపోతుంది కదా! అందుకే ఈ వ్యాధి లక్షణాలేంటి? నివారణ ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి విషయాలు తెలుసుకొని చికున్ గున్యాను తరిమేద్దాం!


1 దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ డయగ్నోస్టిక్ సెంటర్.. ఓ అబ్బాయికి సుమారు ఆరేండ్ల వయసు ఉంటుంది. రక్తం సేకరించేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ప్రయత్నిస్తున్నాడు. ఆ బాబు ఏడుస్తున్నాడు. సూది గుచ్చుతుంటే చూడలేక ఆ బాబు తల్లి బిగ్గరగా కండ్లు మూసుకుంది. ఎలాగోలా రక్తం సేకరించి ఆ బాబును పక్కన కూర్చోమన్నారు. కానీ.. అడుగు తీసి అడుగు కూడా వేయడానికి చేత కావడం లేదు ఆ అబ్బాయికి. కాళ్లు వాచాయి కూడా. ఏమైంది? అని టెక్నీషియన్‌ను అడిగితే చికున్ గున్యా సోకిందని చెప్పారు. చలికాలంలో విజృంభిస్తున్న వైరస్‌ల వల్లే ఆ బాబుకు చికున్‌గున్యా సోకిందన్నారు.


2 35 సంవత్సరాల వయసున్న మహిళ. ఆమెకు ఇంతవరకు పెద్దగా ఏ ఆరోగ్య సమస్యలూ లేవట. కానీ ఒక వారం పది రోజుల నుంచి కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి. మోకాళ్ల నొప్పులు కావచ్చు అని నొప్పుల గోళీలు వేసుకుంటూ తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నది ఆమె. కానీ నొప్పులు తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుండటం.. అందులోనూ కాళ్లు వాచిపోవడం.. కదలించడానికి కూడా అవకాశం లేకపోవడంతో డాక్టర్‌ను సంప్రదించింది. చికున్‌గున్యా సోకినట్లుందని డాక్టర్ చెప్పడంతో వ్యాధి నిర్ధారణ కోసం టెస్టులు చేయించుకునేందుకు ల్యాబ్‌కు వచ్చింది.


ప్రస్తుతం హడలెత్తిస్తున్న జ్వరం చికున్ గున్యా. కాళ్లు, చేతులు, ముఖ్యంగా మోకాళ్ల నొప్పులతో ఉన్నవాళ్లు ఏ హాస్పిటల్‌లో చూసినా కనిపిస్తున్నారు. అందుకే చికున్ గున్యా రాకముందే జాగ్రత్త వహిస్తే ఏ సమస్యా ఉండదు. అంటే ముందు వ్యాధి గురించి తెలుసుకోవాలి. దానిపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే నివారణ ఎలాగో తెలుస్తుంది. చికున్ గున్యా వైరస్ ఎడిస్ ఈజిప్టీ రకం దోమకాటు వల్ల మనిషి రక్తంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కీళ్లు, కండరాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినవారిలో, జీర్ణశక్తి లోపించిన వారిలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.


వ్యాధి లక్షణాలేంటి?

అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉండి ఎటూ కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. కాంతిని చూస్తే కళ్లలో బాధ కలిగినట్లు అనిపిస్తుంది. స్కిన్ రాషెస్ వస్తాయి. ఎర్రగా, చిన్న గాయాల్లా అవి చర్మంపై కనిపిస్తాయి. అరచేతిలో, ముఖంపై కూడా రాషెస్ రావచ్చు. శోషరస గ్రంథుల్లో వాపు కనిపిస్తుంది. శోషరసగ్రంథులు మెడ పక్కన, చెవులకు పక్కన, దవడ కింద ఉంటాయి. వైరస్ విడుదల చేసే విషం వల్ల కొందరిలో సుమారు 18 వారాల వరకు కీళ్ల నొప్పులు ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది.

Chikungunya2

చికిత్స ఏంటి?

చికున్ గున్యా కోసం ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. ఎలిసా పరీక్ష ద్వారా చికున్ గున్యా వైరస్‌ను గుర్తిస్తారు. ఇది జనరల్ ఫిజీషియన్ పర్యవేక్షణలో జరగాలి. కీళ్ల నొప్పులు ఉన్నాయని డాక్టర్‌ను సంప్రదించకుండా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడకుండా డాక్టర్ సూచించినట్లుగా మందులు వాడితే ఉపశమనం పొందవచ్చు. ఆకలిని సంరక్షించడం, నొప్పులు, జ్వరానికి ఉపశమన మందులు వాడటం, రోగ నిరోధకంగా పని చేసే రసాయన మందులను, శక్తికారక మందులు తీసుకోవాలి. ఆయుర్వేదంలో కూడా చికిత్సలు ఉన్నాయి.


నివారణ ఎలా?

చికున్ గున్యా వ్యాధికి ముఖ్య కారణం దోమలు. కాబట్టి దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు లేకుండా చూసుకోవాలి. మురుగు నీరు వల్లే దోమలు గుడ్లు పెట్టి వైరస్‌ను ప్రేరేపిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అవసరమైతే యాంటీ బయాటిక్స్ మందులు వెంట తీసుకెళ్లాలి. హోమియో వైద్యంను అనుసరించి కూడా చికున్ గున్యాను నివారించవచ్చు.


ఏం తినాలి?

-చికున్ గున్యా సోకినవారిలో ముఖ్యంగా జ్వరం.. దానితో పాటు జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ స్థితిలో ఏది పడితే అది తినకుండా జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారం పడని తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
-జావ, అంబలి, పండ్లు, పండ్ల రసాలు, పలుచని పాలు, మజ్జిగ, పలుచని పప్పు, ఉడికించిన కూరగాయల రసం, కొబ్బరి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు చికిత్స జరిగినంత కాలం తీసుకోవాల్సి ఉంటుంది.
-ఆకలి మందగించినప్పుడు కొందరికి వికారంగా కూడా ఉంటుంది. మరికొందరికి వాంతులు కూడా అవుతాయి. ఎలా చూసుకున్నా ద్రవపదార్థాలే తీసుకోవడం వల్ల సమస్యను తగ్గుముఖం పట్టించవచ్చు.
-చికున్ గున్యాతో బాధపడేవాళ్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
-పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను డైట్‌లో చేర్చుకోవాలి. దీనివల్ల చికున్ గున్యా వేగంగా నయం అయ్యే అవకాశాలను పెంపొందించవచ్చు.
-యాపిల్స్, అరటిపండ్లు తేలికగా డైజెస్ట్ అవడమే కాకుండా ఆకలిని పెంచుతాయి. అలాగే సీ విటమిన్ ఉండే ఆహారాలైన జామ, కివీ, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీని పెంచి చికున్ గున్యాతో పోరాడుతాయి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు

-చికున్ గున్యాతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా తేలికపాటి వ్యాయామం చేయాలి.
-దోమల బెడద లేకుండా చూసుకోవాలి. పరిసరాల పరిశుభ్రత ముఖ్యం. ఒత్తిడి తగ్గించుకోవాలి.
-వ్యాధి కన్నా.. వ్యాధి ఉందనే బెంగ ప్రమాదకరం కాబట్టి ఆ ఆలోచనను.. ఆందోళనను మనుసులోంచి తీసేయాలి.
-ప్రశాంతత కోసం యోగా చేయాలి.
-పరామర్శలకు ఎవరూ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే చికిత్సలో విశ్రాంతి కూడా ఒక భాగం. ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల వ్యాధి అంత ప్రమాదకరమా అనే భావన కలగవచ్చు.
-ఆల్కహాల్ తీసుకోరాదు. మాంసాహారానికి కొద్దికాలం దూరంగా ఉండాలి.
-చికున్ గున్యా ఉపశమనం నివారణ కోసం.. నొప్పులు ఉపశమనం కోసం డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంది.

Chikungunya1

ప్లేట్‌లెట్సూ పడిపోవచ్చు

-డాక్టర్ సుజేష్, జనరల్ ఫిజీషియన్
చికున్ గున్యా ఎడిస్ ఈజిప్ట్ దోమకాటు వల్ల వస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి అయితే కాదు.. కానీ దీనివల్ల కొన్నిసార్లు వేరే ఇతర వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఆర్నెళ్ల వరకు ఉండొచ్చు. ఎలిసా, ఐజీఎం పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు. నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమందికి ప్లేట్‌లెట్స్ కూడా తగ్గే ప్రమాదమూ ఉంది.


- దాయి శ్రీశైలం

337
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles