కార్ రేసింగ్‌కు రెఢీ!


Sat,December 8, 2018 02:34 AM

రెప్పపాటులో దూసుకెళ్లడం వారికి ఇష్టం. రయ్.. రయ్ మంటూ సౌండ్ చేస్తూ... వేగాన్ని అందుకోవడం వారికి అలవాటు. తామెందులోనూ తక్కువ కాదని నిరూపించేందుకు పురుషులతో సమానంగా ఫార్ములా రేసింగ్‌లో పోటీ పడుతున్నారు. వేగానికే వణుకు పుట్టించే స్పీడ్‌తో వందల మందిని వెనక్కి నెట్టి.. జాతీయ తొలి మహిళా రేసింగ్ టీమ్‌గా రికార్డులకెక్కారు. మహిళ గడప దాటితే గగనం అనుకునే స్థాయి నుంచి.. చరిత్రలో తమకంటూ కొత్త పేజీని లిఖించుకున్నారు. వాయువేగంతో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మన మహిళా రేసర్ల పరిచయమిది.కార్ రేసింగ్.. అందులోనూ ఫార్ములా వన్. ఇలాంటి పోటీల్లో పురుషుల ప్రాతినిధమే ఎక్కువగా ఉంటుంది. అలాంటి చాలెంజింగ్ పోటీని కూడా మహిళలు అవలీలగా గెలుస్తున్నారు. అదికూడా పురుషులతో పోటీపడి మరీ. ఈ యేడాది నిర్వహించిన ఫార్ములావన్ టాలెంట్ హంట్‌లో వందల మందిని వెనక్కి నెట్టి.. ఈ ఆరుగురు కొత్త చరిత్ర లిఖించారు.
Daniil-Kvyat

అంతా సరోష్ పట్టుదలే!


తమిళనాడులోని కోయంబత్తూర్‌కి చెందిన ఉమా హటారియా కార్ రేసర్. 1980లోనే అన్ని అడ్డంకులను ఎదుర్కొని కార్ రేసర్‌గా నిలిచింది. ఎంతోమంది మహిళా రేసర్లకు ప్రేరణగా నిలిచింది. ఆమె కొడుకు సరోష్ పటారియా. ఇతను కూడా ఫార్ములా వన్ రేసర్. మూడుసార్లు జాతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ కాలంలోనే తన తల్లి కార్ రేసింగ్‌లో దూసుకుపోయినా ఎలాంటి గుర్తింపూ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మహిళా రేసింగ్‌ను పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో తానే చొరవ తీసుకొని మహిళా రేసింగ్ టీం కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేశాడు. అహురా రేసింగ్ అకాడెమీని స్థాపించి.. మహిళా రేసర్లను ప్రోత్సహించేందుకు టాలెంట్ హంట్‌లు నిర్వహించాడు. వీటికి విశేష స్పందన రావడంతో పాటు.. వందలాది మంది మహిళలు ఉత్సాహం చూపించారు. ఔత్సాహికులకు పలు ప్రైవేట్ సంస్థల సహకారంతో పలు దఫాలుగా పోటీలు నిర్వహించాడు. వీరిలో ఆరుగురిని ఎంపిక చేసి.. జాతీయ తొలి రేసింగ్ బృందాన్ని ఏర్పాటు చేశాడు. కనీసం ఫార్ములా వన్‌లో అనుభవం లేని వారిని జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దాడు సరోష్. వారే మ్రినాలినీ సింగ్, డయానా పండోల్, లియా డారెన్, శివానీ పృథ్వీ, మేఘా కేఎస్, ఫొయిబ్ డాలే. రకరకాల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ రేసర్ల గురించి వారి మాటల్లోనే..

ఆ ఆలోచనే మార్చింది..


నాకు 22 యేండ్లు. నేను పుట్టింది పెరిగింది కాలిఫోర్నియాలోనే. మా అమ్మమ్మ, తాతయ్యలు భారతదేశంలోనే ఉంటారు. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. వారిని చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటాను. ఎప్పుడు వచ్చినా రెండుమూడు వారాలకంటే ఎక్కువ ఉండను. ఈ సారి మాత్రం కాస్త ఎక్కవ రోజులే ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు సరోష్ హటారియా పోస్ట్ చేసిన మహిళల కార్ రేసింగ్ గురించి తెలిసింది. ఇందులో పాల్గొంటే ఇండియాలో చాలారోజులు ఉండొచ్చన్న ఆలోచన. అదీగాక ఎక్కువగా అబ్బాయిలు పాల్గొనే రేసింగ్‌లో మహిళలకు అవకాశం దొరకడం చాలా అరుదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. నా టాలెంట్, అదృష్టానికి పరీక్ష పెడదామనుకున్నా. రేసింగ్ గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో నన్ను ప్రోత్సహించారు. అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటూ రేసింగ్‌లో పాల్గొన్న. రేసింగ్ గురించి అసలు తెలియక పోయినా శిక్షణ సమయంలో శ్రద్ధగా నేర్చుకునేదాన్ని. అలా జాతీయ జట్టులో స్థానం కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఫలితం దక్కింది.
లియా డారెన్

అడ్డంకులు అధిగమించి..


నేను ఐటీ ఉద్యోగిని. ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో పనిచేసుకొని ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం కాగానే ఇంటికి చేరుకోవడం నా దినచర్య. ఒకరోజు ఆన్‌లైన్లో వెతుకుతుంటే సరోష్ హటారియా పోస్ట్ కనిపించింది. రేసింగ్‌లో పాల్గొనాలంటే చాలా లీవ్స్ పెట్టాల్సి వస్తుంది. అందుకు మా మేనేజర్ ఏమంటాడో అన్న భయం ఉండేది. ఒకరోజు ధైర్యం చేసి లీవ్స్ గురించి మా మేనేజర్‌ని అడిగా. మన కంపెనీ నుంచి పాల్గొంటే మనకే మంచి పేరు వస్తుంది. దీనికి ఎందుకు అంత భయపడుతున్నావు. గో ఎహెడ్ అని ప్రోత్సహించాడు. రేసింగ్‌కి ఐప్లె చేశాను. రేస్‌ని పోటీలా కాకుండా చాలెంజ్‌గా తీసుకున్నాను. ఒకవైపు ఆఫీసు, మరోవైపు రేస్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. కొన్నిసార్లు నేను చేయాల్సిన పనిని మా కొలీగ్స్ చేసిన రోజులున్నాయి. వారితో పాటు కుటుంబ ప్రోత్సాహం ఉండడంతో మరింత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న. మాకు దగ్గరుండి శిక్షణ ఇచ్చి, ఈ స్థాయికి తీసుకొచ్చిన సరోష్‌కి మా కృతజ్ఞతలు.
మ్రినాలినీ సింగ్

నా లైఫ్‌లో కొత్త మార్పు..


పుట్టినప్పట్నుంచీ ఎన్నో అనుకుంటాం. అవన్నీ జరగాలనీ రూల్ లేదు కదా. నీ జీవితం కూడా అంతే. మాది పుణే. మా నాన్నకి చిన్న స్టోర్ ఉంది. నేను అందులోనే పని చేస్తుంటాను. ఏ పని చేయాలన్నా డబ్బుతో కూడుకున్నది. అప్పుడే దేవుడు పంపిన మార్గంలా హటారియా పోస్ట్ మా సోదరుడి కంటపడింది. పోటీకి కావలసిన అర్హతల గురించి తెలుసుకున్నాడు. నువ్వు ఇందులో పాల్గొనాలని చెప్పాడు. మొదట వినగానే భయం వేసింది. కానీ కొత్తగా అనిపించింది. నా జీవితానికి కొత్త మార్పు వస్తుందనుకున్నా. అన్న, కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. మహిళలకు సరోష్ కల్పిస్తున్న అవకాశాన్ని నేనూ వదులుకోవాలనుకోలేదు. పోస్ట్‌కి ఐప్లె చేశా. సెలెక్ట్ అయ్యా. కఠోర శిక్షణ తీసుకొని రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.
డయానా పండేల్
Daniil-Kvyat1

ఎంతో కష్టపడి సాధించా!


నేను ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. రేసింగ్ గురించి తెలిసినప్పుడు అందరితో పాటు ఐప్లె చేశా. ఎంతో కష్టపడితేనే చివరి ఆరుగురిలో ఒకదాన్నయ్యా. రేసింగ్ మీద దృష్టి పెడితే చదువుకు భంగం కలుగుతుందేమో అనుకున్నా. రేసింగ్ అంటే ఇష్టం ఉండడంతో కష్టమనిపించలేదు. అన్ని రౌండ్లలో విజయం సాధించి చాంపియన్‌గా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. ఎంతోమంది లక్కీ ఛాన్స్ కొట్టేశావ్ అని అంటున్నారు.
మేఘా కేఎస్

భయాన్ని తరిమేశా


మా టీమ్‌లో నేను ఒక్కదాన్నే చిన్నదాన్ని. నేను మెడికల్ మూడో సంవత్సరం చదువుతున్నా. నాకు డ్రైవింగ్ గురించి ముందుగానే తెలుసు. కార్ మగవాళ్లే బాగా నడుపుతారని చాలామంది అనుకుంటారు. డ్రైవర్ మహిళ అని తెలిస్తే కొంతమంది దిగివెళ్లిపోతారు. ఆ నమ్మకాన్ని, భయాన్ని తరిమికొట్టాలి. కానీ ఏం చెయ్యాలి? అప్పుడే హటారియా పెట్టిన కార్ రేసింగ్ పోస్ట్ కనిపించింది. అందులో పాల్గొని గెలిచి వారి నమ్మకాన్ని తిరగరాయాలనుకున్నాను. నా పట్టుదల చూసి నా తల్లిదండ్రులూ ప్రోత్సాహించారు.
శివానీ పృథ్వీ

ఈశాన్య రాష్ర్టాల తొలి రేసర్


నేను ఈశాన్య రాష్ర్టాల నుంచి వచ్చిన తొలి రేసర్‌ని. మాది మేఘాలయ రాష్ట్రం. నాకు 12 యేండ్ల వయసు నుంచే రేసింగ్‌పై ఇష్టం. పోలీసు ఉన్నతాధికారి అయిన నా తండ్రి చిన్నప్పుడే తన ఒడిలో కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ పాఠాలు నేర్పించాడు. అప్పటి నుంచి డ్రైవింగ్‌ను ఫ్యాషన్‌గా ఎంచుకున్న. 18 యేండ్ల వయసు నుంచి స్ట్రీట్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేదాన్ని. నేషనల్ ర్యాలీస్, అరుణాచల్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్, ది ఇండియన్ నేషనల్ ర్యాలీ చాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచా. గతేడాది మూడు నేషనల్ చాంపియన్ టైటిళ్లను కైవసం చేసుకున్న. సరోష్ సర్ దగ్గర ఫార్ములా రేస్ పాఠాలు నేర్చుకొని, చివరి ఆరుగురిలో స్థానం సంపాదించా. భవిష్యత్‌లో ఫార్ములా రేసింగ్‌లో మహిళల హవా కొనసాగాలని కోరుకుంటున్నా.
ఫొయిబ్ డాలే

వనజ వనిపెంట

645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles