కష్టేఫలి!


Sun,August 13, 2017 01:06 AM

దేన్నైనా మూఢంగా నమ్మడం తగదంటాడు బుద్ధుడు. జ్యోతిషం, హస్తసాముద్రికం, వాస్తు - ఇలాంటి నమ్మకాల కంటే సమ్యక్ దృష్టి శ్రేష్ఠం అంటాడు. ప్రజల్లో ఉన్న ఇలాంటి మూఢ నమ్మకాల బలహీనతను ఆధారం చేసుకుని జీవించడం అకుశల జీవనంగా చెప్తాడు. మూఢ నమ్మకాలు మనిషికి శత్రువుల కంటే ఎక్కువ నష్టం కలిగిస్తాయంటాడు. ఇందుకు బౌద్ధం లోని నందగోపుని కథే చక్కటి ఉదాహరణ.
Story-illustration
నందగోపుడు ఒక రైతు. సరైన వ్యావసాయిక పద్ధతులు పాటించక నష్టపడ్డాడు. దీనికి కారణం ఇంటికి ఈశాన్యంలో మెరక ఉండడమే అని చెప్పాడు ఒక సిద్ధాంతి. దానితో కొంత ఖర్చు చేసి, ఆ మెరకనంతా తవ్వించాడు. పెద్ద గుంట చేశాడు. వర్షానికి ఆ గుంట నీటితో నిండిపోయింది. ఆ ఇంట్లో ఉన్న నందగోపుని పారాడే పిల్లాడు అటుగా వెళ్లి, ఆ నీటిలో పడి చనిపోయాడు. మరో సిద్ధాంతి వచ్చి, దోషం అటూ లేదు, ఇటూ లేదు. ఇంట్లోనే ఉంది అని కిటికీలు, దర్వాజాలు అటూ ఇటూ మార్చాలని చెప్పాడు. ఆ మాట ప్రకారం పనిచేస్తుంటే ఇంటి గోడలు కూలిపోయాయి. చేసేది లేక ఇల్లు పడగొట్టి కొద్దిపాటి నివాసం నిర్మించుకున్నాడు.

ఈ సంవత్సరం నీ చేతి గీతలు బాగున్నాయి. నీవు పట్టిందల్లా బంగారమే. ఎంత వ్యవసాయం చేస్తే అంత లాభం అన్నాడు ఒక జోస్యుడు. దానితో తన పొలమే కాకుండా చాలా ఎక్కువ పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు. కానీ అనావృష్టి ఏర్పడి, తీవ్రంగా నష్టపోయాడు. ఇలా తన శ్రమని, పరిశ్రమని కాకుండా జోస్యాల్ని నమ్ముకుంటూ నష్టపడి, అప్పుల పాలయ్యాడు. అయినా తన ఆర్థిక నష్టాలు పోవాలని ఒక మంత్రగాడి దగ్గరకు వెళ్లాడు. అతను ఒక మంత్రం ఉపదేశించి, దీన్ని నట్టింట్లో కూర్చుని రోజుకు వెయ్యిసార్లు జపించు. నీ దరిద్రం పోతుంది అని చెప్పి, మంచిగా సొమ్ములు గుంజి పంపాడు. చేసే కొద్దిపాటి పనులు కూడా మాని, మంత్రజపం మొదలుపెట్టాడు నందగోపుడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. భార్య విసిగి పుట్టింటికి వెళ్లిపోయింది. నందగోపుని మిత్రుడు ఒకసారి తన వెంట నందగోపుణ్ణి బుద్ధుని ప్రవచనం వినడానికి తీసుకుపోయాడు. తన మిత్రుని విషయం బుద్ధునితో చెప్పాడు. చేసే పని పట్ల సరైన దృక్పథం లేకపోవడాన్ని మిథ్యాదృష్టి అంటారు. నందగోపుడు ఈ మిథ్యాదృష్టిలో పడి మునిగిపోయాడని బుద్ధుడు గ్రహించి, సమ్యక్ దృష్టి గురించి వివరించాడు.

ద్విట్ ద్విషం యత్ కుర్యాద్ వైరీ వా పునర్‌వైరిణం మిథ్యాప్రణిహితం చిత్తం పాపీయాంసమేనం తతః కుర్యాత్!నందగోపా! పరమ విద్వేషం కలవారు, పరస్పరం ఒకరినొకరు నిరంతరం నాశనం చేసుకోవాలనుకునేవారు ఒకరికొకరు చేసుకునే నష్టం కంటే ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల, మిథ్యా దృష్టి వల్ల కలిగే నష్టమే ఎక్కువ..అలాగే.. నీ సమ్యక్ దృక్పథమే తల్లిదండ్రుల కన్నా, బంధుమిత్రుల కన్నా, హితుల కన్నా ఎక్కువ మేలు చేస్తుంది - అని వివరించాడు. నందగోపుడు తన తప్పు తెలుసుకుని, కష్టాన్ని నమ్ముకుని, క్రమేపీ కుదుటపడ్డాడు.
- బొర్రా గోవర్ధన్

730
Tags

More News

VIRAL NEWS