కష్టాలే ఇంతటివాణ్ణి చేశాయి..


Sat,November 24, 2018 12:20 AM

చిన్న కణంతో ప్రారంభమైన అవయవాల ఉత్పత్తి ఏ రకంగా పనిచేయగలుగుతున్నాయనే దానిపై నేను ప్రత్యేకంగా రీసెర్చ్ చేశాను. ఇదే ప్రతిపాదనతో ఉప్పల్‌లోని ద సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ మిశ్రాను కలిశాను.

రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబంలో నుంచి శాస్త్రవేత్త కావాలనే సంకల్పంతో పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించాడు. తానేంటో నిరూపించుకున్నాడు. ఎన్నో ప్రయాసలకోర్చి, ఒడిదుడుకులను తట్టుకొని నేడు ఖండాతర ఖ్యాతిని సొంతం చేసుకున్నాడీ యువ శాస్త్ర వేత్త. చదువు మానేయాల్సిన పరిస్థితులు ఎదురైనా చదువు మాత్రం ఆపలేదు. ల్యాబ్ నుంచి మూలకణాల ద్వారా అవయవాల ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందాడు. అత్యుత్తమ అమెరికన్ ఫెలోషిప్‌కు ఎంపికైన దేశంలోనే అరుదైనవ్యక్తిగా మన్నలు పొందుతున్నాడు. కరీంనగర్ జిల్లా కొండాపూర్‌కి చెందిన డా.చక్రపాణి తన ప్రయాణాన్ని జిందగీతో పంచుకున్నాడు. ఆ కథ ఆయన మాటల్లోనే..
srinivas
మాది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం, కొండాపూర్ గ్రామం. నాన్న సంపాదనే అందరికీ ఆధారం. వడ్రంగి పనిచేసి ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయంతోనే మా ఇల్లు గడిచేది. అమ్మానాన్నలకు మేం నలుగురు సంతానం (ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు). నేను అందరికంటే చిన్నవాడిని. ఆర్థిక ఇబ్బందుల వల్ల నాన్న అక్కలిద్దరినీ పెద్దగా చదివించలేక పోయిండు. అన్న ఆర్‌ఎంపీగా స్థిరపడ్డాడు. నాన్న తెచ్చే కూలీతో ఇల్లు గడువడమే చాలా కష్టంగా ఉండేది. అలాంటి సందర్భంలో మమ్మల్ని చదివించడం నాన్నకు మరింత భారమయ్యేది. చాలా సందర్భాల్లో నేను చదువు మానేద్దానుకున్నాను. కానీ ఎప్పటికైనా శాస్త్రవేత్త కావాలనే లక్ష్యం నన్ను ఇబ్బందుల నడుమ కూడా బడిబాట పట్టించింది.

పాఠాలు చెబుతూ..


మా ఊరిలోని స్కూల్లో 7వ తరగతి వరకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత పై చదువు కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడెంలోని హైస్కూల్లో చేరాను. అక్కడ పదో తరగతి వరకు చదువుకున్నా. రోజూ సైకిల్ మీద వెళ్ళి, వచ్చేవాడిని. చిన్నప్పటి నుంచి నేను క్లాస్‌ఫస్ట్ స్టూడెంట్‌నే. పదో తరగతి వరకూ నా చదువు సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఆర్థికసమస్యలు చుట్టుముట్టాయి. టెన్త్‌లో టాప్‌మార్కులు రావడంతో సిద్దిపేటలోని ప్రైవేట్ కళాశాలలో ఫీజు కట్టకుండానే స్కాలర్‌షిప్‌తోనే ఇంటర్ ఫస్ట్‌ఇయర్ పూర్తి చేయగలిగాను. తిండితిప్పలకు అప్పట్లో నెలకు రూ. 75లు ఖర్చయ్యేది. అది కూడా ఇంటి వద్ద నుంచి పంపిస్తేనే. కొన్నిరోజుల తర్వాత ఇంటి దగ్గర నుంచి డబ్బులు రావడం కష్టమైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కొత్త వాతావరణం కావడంతో, ఆర్థిక సమస్యల కారణంగా మార్కులు కూడా తగ్గాయి. ఇక లాభం లేదనుకొని ముస్తాబాద్‌లోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో చేరాను. చదువులో అందరి కంటే ముందు ఉండడం వల్ల మా నాన్న నన్ను చదువు ఆపేయమని అనలేకపోయాడు. ఇంటర్ తర్వాత డిగ్రీలో చేరేందుకు సిద్దిపేటలోని డిగ్రీ కాలేజ్‌లో ఐప్లె చేస్తే మూడు జాబితాలలో నాపేరు రాలేదు. ఇక అకడమిక్ ఇయర్ కూడా మొదలవుతున్నది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్‌టెస్ట్ (ఏపీఆర్‌డీసి) కూడా రాశాను. కర్నూలు డిగ్రీ కాలేజ్‌లో సీటుతో పాటు ఫుడ్డు, బెడ్డు కూడా దొరికింది. అక్కడ ఉన్న శ్రీనివాస్ సార్ సైన్సులో నిష్ణాతులు. ఆయన చెప్పిన ప్రతీ పాఠం బాగా అర్థమయ్యేది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని భోపాల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ సీటు వచ్చింది. రెండేండ్లపాటు చాలా కష్టపడ్డా. అన్ని సబ్జెక్టులలో పట్టు ఉండడం వల్ల చదువుకుంటూనే ట్యూషన్లు చెప్పేవాడిని. ఇలా ఖర్చులకు కొంత డబ్బు వచ్చేది. కష్టపడి 2009లో ఎంఎస్సీ పూర్తి చేశా.

ప్రేమ పెండ్లి...


సిద్దిపేటలో ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా చేరాను. ఇక్కడే నా జీవితం ఓ మలుపు తిరిగింది. ఆ కాలేజ్‌లోనే పనిచేసే ఆదిత్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయిది మా ఊరే. వాళ్ళ నాన్న టీచర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. మా ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. పెండ్లికి అంగీకరించక లేదు. 2010లో ఇద్దరం అల్వాల్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నాం. అప్పడు మా గురువు గారి కుమార్తెతోపాటు, మాస్నేహితులు మాకు అండగా నిలిచారు. పైండ్లెన కొద్ది రోజులకే అమ్మాయి వాళ్ల తండ్రి మా దగ్గరకు వచ్చి చూసి ధైర్యాన్ని చెప్పారు.

దేశంలోనే ఎనిమిదో వాడిగా..


ఎంఎస్సీ తర్వాత లెక్చరర్‌గా పనిచేస్తూనే ఢిల్లీలోని కౌన్సెల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్‌కు నేను సొంతంగా ప్రపోజల్ తయారుచేసి పంపాను. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రాజెక్టు కోసం మరో ప్రతిపాదననూ పంపాను. ఇలా నేను విడివిడిగా రెండింటికీ ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే రెండు ప్రాజెక్టులకూ అనుమతి వచ్చింది. మానవ శరీరంలోని వివిధ అవయవాలు పిండ దశలో ఉన్నప్పుడే కొన్ని కోట్ల కణాలతో ఒక్కో అవయవం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఆర్గాన్‌లు పని చేసేందుకు ఒక రకమైన జీన్స్ కారణమవుతాయి. వాటినే హాక్స్ జీన్స్ అని, హోమియోటిక్ జీన్స్ అని పిలుస్తారు. హోమియోటిక్ జీన్స్ ఏమాత్రం సరిగా పనిచేయకపోయినా శరీరంలోని అవయవాలు వైకల్యానికి గురవుతాయి. చిన్న కణంతో ప్రారంభమైన అవయవాల ఉత్పత్తి ఏ రకంగా పనిచేయగలుగుతున్నాయనే దానిపై నేను ప్రత్యేకంగా రీసెర్చ్ చేశాను. కణాల ప్రభావం క్రమపద్ధతిలో ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ అదుపు తప్పితే ఒకే మనిషికి రెండు తలలు రావడం, చేతికి అదనంగా వేళ్లు పెరుగడం వంటివి జరుగుతుంటాయి. జన్యువుల మార్పుల కారణంగా కణాలన్నీ ఒకేచోట ఆగిపోతాయి. అవే క్యాన్సర్ గడ్డలుగా మారుతున్నాయి. ఇదే ప్రతిపాదనతో ఉప్పల్‌లోని ద సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ మిశ్రాను కలిశాను. ఆయన వద్దనే సీఎస్‌ఐఆర్ నెహ్రూ సైన్స్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కింద జన్యువుల పుట్టుక, నియంత్రణ అనే అంశంపై ఫెలోషిప్ చేశాను. ఇదే అంశంపై ఇండియాలో 8 మంది పరిశోధన చేశారు. వారిలో నేను ఒకడిని.
srinivas1

గౌరవ డాక్టరేట్ అందుకొని..


భువనేశ్వర్‌లోని ఉత్కల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఆరునెలల పాటు ఇండియన్ కౌన్సెల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్‌లో సీటొచ్చింది. బర్మన్ అనే పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రొఫెసర్ దగ్గర ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ స్టూడెంట్‌గా చేరాను. మానవుల జన్యువులతో పోలిస్తే జిబ్రా అనే చేపలో ఉన్న జన్యువులు 80 శాతం వరకు మనిషి జన్యువులకు దగ్గర పోలికలు కలిగి ఉంటాయి. మనుషులకు ఎటువంటి రోగం వస్తే దానికి కూడా అదే రోగం వస్తుంది. ఈ విషయం మీద ఆరేండ్లు పరిశోధన చేశాను. దేశంలో జరిగిన పలు జాతీయ సదస్సులకు, సమావేశాలకు హాజరై రోగనిరోధక శక్తి గురించి 18 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్‌ను తయారు చేశాను. 2017లో నేను చేసిన పరిశోధనలను గుర్తించి ఇండియన్ కౌన్సెల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ 2018లో గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. నాతో పాటు మరో ఏడుగురిని ఈ అవార్డు వరించింది.


అండగా ఉన్నారు..


నేను ఈస్థాయికి చేరుకోవడానికి అమ్మానాన్న, నా జీవిత భాగస్వామి, మా మామ ఎంతో సహకరించారు. చిన్నప్పటి నుంచి నేను పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం అందుకుంటున్నా. కాకపోతే ఈ సమయంలో మా నాన్న నా ఎదుగుదలను చూడలేకపోవడం, ఆయన మా మధ్య లేకపోవడం బాధగా ఉంది. ఈ మధ్యే నాన్న క్యాన్సర్‌తో మరణించాడు. నన్ను సైంటిస్ట్‌గా చూడడం కోసం నా అర్ధాంగి కూడా చాలా త్యాగం చేసింది. మా మామ నాకు ఆర్థిక సాయంతో పాటు, మానసిక ైస్థెర్యాన్ని కూడా ఇచ్చాడు. వీరందరి ప్రోత్సాహంతో పనిచేసుకుంటూ పోతే.. ఫలితాలు అవే వస్తాయన్న మాటను నమ్మి శ్రమించాను. ఇప్పుడు ఫలితం వచ్చింది.
సులభంగా

అవయవ మార్పిడి..


అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లో సులభంగా అవయవ మార్పిడి అనే అంశంపై డా.డెనిన్ వెల్లిక్ అనే శాస్త్రవేత్త పరిశోధన చేస్తున్నది. నా పబ్లికేషన్స్ చూసి ఆమె నన్ను సంప్రదించింది. ఇద్దరం కలిసి అమెరికాలోనే పనిచేద్దామని నన్ను కూడా అక్కడికి ఆహ్వానించింది. ప్రస్తుతం ఇద్దరం కలిసి రీజనరేటివ్ మెడిసిన్‌ను కనుగొనేందుకు పరిశోధన చేస్తున్నాం. అవయవ దానం చేసే అవసరం లేకుండానే అవయవాలు కోల్పోయిన వారికి మా పరిశోధనల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ల్యాబ్‌లలో జరిగే పరిశోధనలు విజయవంతమైతే వాహనానికి పరికరం అమర్చినంత సులువుగా మనిషికి కూడా అవయవాలను మార్చవచ్చు, అమర్చవచ్చు.
పసుపులేటి వెంకటేశ్వరరావు
కోనేటి వెంకట్

1160
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles