కళల డాక్టర్లు..!


Sat,August 23, 2014 12:18 AM

ఒత్తిడి.. స్ట్రెస్.. ప్రెజర్..
మూడూ ఒకటే. కానీ మూలాలు
తెలియకే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం.
మరి వారికీ ఇదే సమస్య వస్తే ఏం చేస్తారు?
ఇట్స్ మై పాషన్ అంటూ ఇన్నోవేటివ్‌గా
ట్రై చేస్తున్నారు ఈ డాక్టర్లు.

సామాజిక కళా వైద్యుడు!

ప్రజావైద్యునికీ, ప్రజా ప్రతినిధికీ ఎంతో సామ్యం ఉంటుంది. రెండు వృత్తులూ ప్రజలతో మమేకం అయ్యేలా చేస్తాయి. ప్రజల సమస్యలను దగ్గరగా గమనించేందుకు వీలు కలిగించే వృత్తులే ఇవి. ఒకటి ఆరోగ్య పరిస్థితులను వివరిస్తే, రెండవది సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన కలిగిస్తుంది. ఒక సమాజం అభివృద్ధి చెందాలన్నా, చెందకపోయినా దానికి కారణం రాజకీయ నాయకులే.

narasaiya అందువల్ల సామాజిక దృక్పథం ఉన్న విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలి. సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన విద్యాధికులు దూరంగా ఉండి, కేవలం విమర్శిస్తూ కూర్చున్నారంటే అది బాధ్యతారాహిత్యమే అవుతుంది. నా ఈ ఆలోచనా విధానమే నన్ను రాజకీయాలకు దగ్గర చేసింది అంటారు ఎం.పి. డాక్టర్ బూర నర్సయ్య. తల్లిదండ్రుల పేరుతో ఆయన స్థాపించిన బీఎల్‌ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యరంగాల్లో వీలైనంత మేరకు సేవలందిస్తున్న డాక్టర్ నర్సయ్య తెలంగాణ కీలక పాత్ర వహించారు. డాక్టర్లందరినీ ఉద్యమంలో మమేకమయ్యేలా చేశారు.

ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇవ్వడం, అనూహ్యంగా ప్రజలు ఆదరించడం జీవితాన్ని మలుపు తిప్పింది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నవాళ్లే గెలిచే నియోజకవర్గంలో గెలవగలిగానంటే సారు-కారు ప్రభావమేనంటారాయన. అనుకున్నది సాధించడానికి ఎం.పి. పదవి దోహదం చేసింది. అయినా వైద్యరంగాన్ని కూడా వదలలేనంటారు డాక్టర్ నర్సయ్య. అన్నట్టు ఈయనలో మరో కళ కూడా ఉంది. పుట్టుకతోనే చిత్రకళను తెచ్చుకున్నారాయన. తాను ఒక సర్జన్‌గా రాణించడానికి ఈ పెయింటింగ్ క్రియేటివిటీయే కారణం కావచ్చంటారు. వృత్తిరీత్యా బిజీ ఉండడంతో ౪౫ ఏళ్ల వయసులో మళ్లీ మొదలెట్టి ౨౦౧౦లో ౫౦ పెయింటింగ్‌లతో ఎగ్జిబిషన్ పెట్టారాయన. పత్రికల్లో వ్యాసాలు, పలు పుస్తకాలు కూడా రాశారాయన. ఏదో ఒకలా టైం దొరకబుచ్చుకుని ఆర్ట్‌కి, రైటింగ్‌కి కేటాయించాలన్న పట్టుదలతో ఉన్నారు.

Dr_AVG_Reddy

గురవాయణం..!

కీళ్ల డాక్టర్‌గా సుప్రసిద్ధులైన డాక్టర్ గురవారెడ్డి గురవాయణం పుస్తకంతో తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. ౨ జడలు, ౩ ముళ్లు, ౪ కళ్లు ఈ కథ నాలో ఉన్న మరో వ్యక్తిని చూపించింది. నేను రాసిన ఈ కథ మొదటి బహుమతి గెలుచుకుంది. నాలో ఓ రైటర్ దాగున్నాడని అప్పటికి గాని నాకు తెలియలేదు. నేను కూడా కామెడీ రాస్తే జనాలు నవ్వుకోగలరన్న నమ్మకం వచ్చింది. అలా నా రాతలు మొదలయ్యాయి అంటారు డాక్టర్ గురవారెడ్డి. హైస్కూల్‌లో చదివేటప్పుడు వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ఏడాదికి ఓ పది బహుమతులన్నా వచ్చేవి.

అలా వచ్చిపడిన పుస్తకాలను చదువుతూ నాలోని రచయిత కూడా నిద్రలేచాడంటారాయన. మెడికల్ కాలేజ్‌లో ఉన్నప్పుడు కాలేజ్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉండేవారట. మరో గురవాయణం పేరుతో ఇంకో పుస్తకం రాయాలని ఉంది గాని సమయం దొరకట్లేదంటారాయన. అయితే, ప్రతి శనివారం మాత్రం నేను నాకోసం మాత్రమే కేటాయించుకుంటాను. పుస్తకాలు చదువుకోవడం, రాసుకోవడం, సంగీతం, సినిమాలు.. ఆ రోజంతా అదే జీవితం. ఆదివారం ఫ్యామిలీకి. నా శ్రీమతి భవానితో కలిసి టెన్నిస్ ఆడతాను. ఇవన్నీ స్ట్రిక్ట్‌గా పాటించడం వల్లేనేమో అలసిపోకుండా నిరంతరం పనిచేయగలుగుతున్నాను అంటారు డాక్టర్ గురవారెడ్డి.


చదరంగ వీరుడు ఈ స్పైన్ మెకానిక్

వెన్నుపాముకు మరమ్మతులు చేయడంలోనే కాదు.. చదరంగపు పావులు కదపడంలో కూడా నిష్ణాతుడు డాక్టర్ సుబ్బయ్య. చిన్నప్పుడు స్నేహితులందరూ కలిసి ఆడుతూ ఉంటే సరదాపడి నేర్చుకున్న ఆట ఇప్పుడు ఆయనకి ఒత్తిడిని దూరం చేసే నేస్తం అయింది.

Dr.Subbaiah హైస్కూల్‌లో ఉన్నప్పుడు ఓసారి తనకన్నా వయసులో పెద్ద వ్యక్తితో ఆడినప్పుడు అతను ఇచ్చిన మెచ్చుకోలు ఆటను సీరియస్‌గా తీసుకునేలా చేసింది. ఎంబీబీఎస్‌లో చెస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. వైఎంసీఏ ఇంటర్‌క్లబ్స్ పోటీల్లో ఫస్ట్ బోర్డుపై ఆడేవాడిని. రాష్ట్రస్థాయిలో ఎ లెవల్ కాంపిటీషన్‌లో ఆడాను. జాతీయస్థాయిలో నేషనల్ బిలో ఆడాను. గ్రాండ్‌మాస్టర్ కావాలని ఉండేది. కానీ అప్పుడు టైం బ్యాలెన్స్ కాలేదు. చదువుపై శ్రద్ధ తగ్గుతోందని అనిపించింది. అందుకే చెస్‌ను కొంచెం వెనక్కి జరిపాను. కాని ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో చదరంగం ఆడకుండా ఉండను. ఇంటర్నెట్‌ల పుణ్యమాని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఆడుకోవడానికి వీలు కలుగుతోంది అంటారు డాక్టర్ సుబ్బయ్య.

డ్యాన్సింగ్ డాక్టర్!

గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ రాజశ్రీ మంచి డ్యాన్సర్ కూడా. తన పెద్దమ్మ స్ఫూర్తితో గైనకాలజిస్ట్ అయ్యారు. చిన్నప్పటి నుంచి నృత్యంపై మక్కువ ఉన్నా చదువు, తరువాత వృత్తి వల్ల దానికి సమయం కేటాయించలేకపోయారు. అక్క కూతురు ఆరంగేట్రంతో బాల్యంలో అణచివేసిన ఆమె కళాతృష్ణ అయిదు పదుల వయసులో మళ్లీ మొగ్గ తొడిగింది. ఆ అమ్మాయి గురువు, ప్రముఖ నాట్యాచార్యులు రాజేశ్వరీ సాయినాథ్‌తో మాటల మధ్యలో నాట్యం పట్ల తనకున్న ఆసక్తిని రాజశ్రీ బయట పెట్టారు. ఆమె ప్రోత్సాహ ఫలితం... డాక్టర్ రాజశ్రీ తన ౫౫వ ఏట ౨౦౧౨, సెప్టెంబరు ౯న రవీంద్రభారతిలో అరంగేట్రం. శని, ఆదివారాల్లో సాయంత్రం గంట క్లాసులు ఉండేవి. మొదటి రెండు మూడు క్లాసులయిపోయేవరకు కొద్దిగా కాళ్లు నొప్పులుగా అనిపించాయి.

కానీ తర్వాత పెద్దగా కష్టమనిపించలేదు. మొదట్లో మా కోడలికి తప్ప నేను డ్యాన్స్ నేర్చుకుంటున్న విషయం ఎవరికీ తెలియదు. టైం అవుతోంది అత్తమ్మ మీరు వెళ్లండి పనులు నేను చూసుకుంటాను అంటూ ఆ అమ్మాయి చాలా సంతోషంగా నన్ను క్లాసులకు పంపేది. కుటుంబ సభ్యులు, గురువులు, పేషెంట్లు, స్నేహితులు అందరి ప్రోత్సాహంతో ప్రదర్శన విజయవంతం చేయగలిగాను అంటారు డాక్టర్ రాజశ్రీ. డాన్స్ నేర్చుకోవడానికి ముందు, ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా అని అడిగితే కచ్చితంగా ఉందంటారామె. డాన్స్ మంచి వ్యాయామం మాత్రమే కాదు. శరీరానికి మంచి టోనర్ కూడా. వృత్తిపరమైన ఒత్తిడి నుంచి దూరం చేయడానికి ఇప్పుడు నాకిది ఎంతో ఉపయోగపడుతోంది. ఇంతకు ముందు కంటే మానసికంగానూ, శారీరకంగానూ నేను చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నా. అంటారామె.

883
Tags

More News

VIRAL NEWS