కచ్చితంగా నెరవేర్చుకుంటా!


Mon,September 3, 2018 11:35 PM

జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చాలామంది కలలుగంటారు. కొంతమంది చిత్తశుద్ధితో పనిచేసి వాటిని నెరవేర్చుకుంటే.. మరికొంతమంది కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఈమె లక్ష్యం ఏమిటో తెలుసా? తన పాస్‌పోర్ట్‌లోని పేజీలన్నీ ప్రపంచ దేశాల స్టాంపులతో నిండిపోవాలని. తన లక్ష్య ఛేదనలో దివ్యాంగురాలైన ఈ మహిళ వీల్ చైర్‌పై ప్రపంచాన్ని చుట్టాలనుకుంటున్నది.
Parvinder-Chawla
అన్ని అవయవాలు సక్రమంగా ఉండి, ఆర్థికంగా ఎలాంటి లోటు లేనివాళ్లే.. ప్రపంచ దేశాలను చుట్టి రావడానికి నానా తంటాలు పడుతుంటారు. ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన 48 యేండ్ల పర్వీందర్ చావ్లా వీల్‌చైర్‌లోనే ఆరు ఖండాలను చుట్టివచ్చింది. దాదాపు 23 దేశాల్లో పర్యటించి.. అవయవాలు సరిగా లేవని బాధపడుతున్న ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే కాళ్లు పనిచేయకపోయినా వాటికి చక్రాలు కట్టుకొని మరీ ప్రపంచాన్ని చుట్టేసేందుకు సిద్ధమైంది. చిన్నప్పుడు అందరిలాగే గెంతులేస్తూ, ఆడిపాడిన పర్వీందర్‌కు రుమటాయిస్ ఆర్థరైటిస్ సోకింది. దీంతో హోటల్ నడుపుకొనే ఆమె తల్లిదండ్రులు ఎన్నో చోట్ల చూపించారు. ఎన్నో రకాల వైద్యాలు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో మరొకరిపైనా ఆధారపడకుండా చచ్చుబడిన కాళ్లపైనే నిలబడాలని గట్టిగా నిర్ణయించుకున్నది. మంచానికే పరిమితమైనా ఓపెన్ డిగ్రీ చేసింది. తల్లిదండ్రులకు భారం కాకూడదనుకొని కాల్ సెంటర్‌లో పనిచేసింది. తల్లిదండ్రులకు అండగా నిలబడాలనుకొని సొంతంగా క్యాటరింగ్ సర్వీస్ మొదలు పెట్టింది.


ఇలా నిండైనా ఆత్మవిశ్వాసంతో ప్రతి అడుగూ ఆచితూచి వేసింది పర్వీందర్. స్నేహితులతో కలిసి గుల్మార్గ్, జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో పర్యటించింది. అలా వెళ్తున్నప్పుడు తోటి స్నేహితులు తనవల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఓ ఆటోమేటిక్ వీల్‌చైర్‌లోనే ఒంటరిగా ప్రయాణాలు చేయడం మొదలు పెట్టింది. ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉండే ప్రజల ఆచార వ్యవహారాలు, పద్ధతులన్నింటినీ పర్వీ పరిశీలించింది. అలాగే చైనా, రోమ్, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి 23 దేశాలు పర్యటించింది. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కాబట్టి, నేను బతికి ఉన్నన్ని రోజులు స్వేచ్ఛగా విహరిస్తాను. నా పాస్‌పోర్ట్ట్ పేజీలు ప్రపంచ పటంలోని అన్ని దేశాల స్టాంపులతో నిండిపోవాలి. అదే నా కల దానిని ఎప్పటికైనా నెరవేర్చుకుంటాను అంటూ ఆత్మైస్థెర్యంతో చెబుతున్నది. ఏదైతేనేం దివ్యాంగురాలై కూడా తనకంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా, తనలాంటి వారిలో స్ఫూర్తిని కలిగించింది. మొత్తంగా తన పర్యటన వివరాలు, అక్కడి ప్రజల సంస్కృతిని తన బ్లాగ్‌లో రాసుకుంటున్నది.

421
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles