కండ కలిగితే ఆరోగ్యం కలదోయ్!


Mon,August 20, 2018 11:33 PM

helth
ఆరోగ్యంగా ఉండటమంటే.. బలమైన శరీరం ఉండటం కాదు.. దృఢమైన కండరం ఉండాలి. కండరాలు ఎంత బలంగా ఉన్నాయన్నదాన్ని బట్టే మన ఆరోగ్య స్థితిని అంచనా వేయొచ్చు. అందుకే కండగలవాడే మనిషోయ్ అనే మాట వచ్చింది కూడా దీనిని ఉద్దేశించే. కానీ.. ప్రస్తుత మన జీవన విధానం వల్ల కండరాల బలహీనత రాజ్యమేలుతున్నది. పిల్లలు, పెద్దలు అనేం లేదు.. అన్ని వయసుల వారికి ఇది ప్రమాదకరంగా మారి ఆరోగ్యాన్ని.. ఆయుష్షును దెబ్బతీస్తున్నది. ఏ లక్షణాలు ఉంటే దీనిని వ్యాధిగా భావించొచ్చు? చికిత్స ఏంటి? తెలుసుకుందాం. కొన్ని వ్యాధులు మామూలుగానే అనిపిస్తాయి. ఆఁ.. ఏముందిలే ఇంతే కదా అనిపిస్తుంది. రోజులు గడుసున్న కొద్దీ వాటి తీవ్రత మొదలవుతుంది. అలాంటి వ్యాధుల్లో కండరాల బలహీనత ఒకటి. దీనికీ సాధారణ జబ్బులకు ఉండే లక్షణాలే ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం శరీరం కుప్పయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


ఒక అధ్యయనం

కండరాల బలహీనత సమస్య దేశవ్యాప్తంగా వేధిస్తున్నదనీ.. గుండెపోటు కన్నా ఎక్కువ స్థాయిలో ఇది విజృంభిస్తున్నదని ఇన్‌బాడీ అనే సంస్థ పేర్కొన్నది. అంతేకాదు.. కండర బలహీనతే క్రమంగా గుండెపోటు, బీపీ, షుగర్ వ్యాధులకు దారితీస్తుందని చెప్పింది. ఇన్‌బాడీ నిపుణులు ఇటీవల కండర వ్యాధులపై అధ్యయనం చేశారు. దేశంలో 72 శాతం మంది కండరాల బలహీనత సమస్య ఎదుర్కొంటున్నట్లుగా తమ అధ్యయనంలో గుర్తించారు. 30- 40 ఏళ్ల మధ్య వయసున్నవారు 72 శాతం, 50 ఏళ్లు దాటినవారు 77 శాతం మంది కండరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారట. పౌష్టికాహార లోపం.. వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల కండరాల బలహీనత ఏర్పడుతుందని చెప్పారు. ఉద్యోగం చేసేవాళ్లు 72 శాతం ఉండగా.. ఇంటిపట్టునే ఉండేవాళ్లలో 69 శాతం కండరాల బలహీనత సమస్యలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.


లక్షణాలేంటి?

అలసట, నీరసం, చిరాకు వంటి లక్షణాలతో కండరాల బలహీనత వ్యాధి మొదలవుతుంది. ఒకచోట కుదురుగా కూర్చోలేకపోవడం. కూర్చున్నా కాళ్లు, చేతులు, మెడ లాగడం.. ఒకవేళ నిలబడదామనుకుంటే నిలబడ లేకపోవడం, నీరసంతో కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు ఉంటే దానిని కండరాల బలహీనతగా భావించొచ్చు. విపరీతంగా జుట్టు రాలిపోవడం కూడా కండరాల బలహీనత వ్యాధి లక్షణమే.


కారణమేంటి?

పౌష్టికాహార లోపం, విటమిన్-డి లోపం వల్ల కండరాల బలహీనత వ్యాధి వస్తుంది. రుచిగా ఉన్నాయనీ, చూడటానికి రంగు రంగుల్లో ఉన్నాయనీ ఏది పడితే అది తినడం వల్ల, తరుచూ ఒకే రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి పౌష్టికాహారం అందదు. దీని ప్రభావం కండరాలపై చూపిస్తుంది. క్రమంగా బలహీనం అవడం మొదలవుతుంది. అలా కాకుండా వైద్యుడి సలహా మేరకు పౌష్టిక విలువలున్న సహజమైన ఆహారాన్ని తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. మాంసకృత్తులు తక్కువ మోతాదులో అందుతున్నా కూడా కండరాల్లో బలం ఉండదు. దీనికి తోడు విటమిన్-డి లోపం ఉండటం వల్ల కండరాలు మరింత బలహీనంగా మారి సమస్య తీవ్రమవుతుంది.


జీవనశైలి లోపమా?

కండరాల బలహీనత అనేది అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల ఏర్పడే వ్యాధి అని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మనిషి కండర పుష్టికి విటమిన్-డి అవసరం. ఇది సూర్యరశ్మి ద్వారా సహజసిద్ధంగా లభిస్తుంది. సూర్యరశ్మిని నేరుగా పొందడం వల్ల ఎలాంటి సమస్యలూ రావు. 99శాతం విటమిన్-డి సూర్యరశ్మి ద్వారానే పొందవచ్చు. కానీ నేటి బిజీ లైఫ్‌లో.. ఆధునిక జీవన విధానం వల్ల విటమిన్-డి సహజసిద్ధంగా పొందే అవకాశం లేకుండా పోయింది. నగర జనాలకు అయితే సహజసిద్ధమైన విటమిన్-డి అందకుండా పోతున్నది. వాహనాల్లో పోవడం.. కార్యాలయాల్లోకి వెళ్లాక.. సూర్యాస్తమయం తర్వాత బయటకు రావడం వల్ల అసలు ఎండ తగలడం లేదు. దీనికి తోడు.. ఇంట్లో, బయటా అంతా కూర్చునిచేసే పనులే ఎక్కువగా ఉండటం, వ్యాయామం చేయకపోవడంతో కండరాలు బలహీనమవుతాయి. ఈ స్థితి క్రమంగా వ్యాధిగా మారుతుంది. అందుకే దీనిని జీవనశైలి లోపం వల్ల వచ్చే వ్యాధిగా పరిగణిస్తున్నారు. మార్పు రావాల్సిన అవసరం ఉంది.


నియంత్రణ ఎలా?

అలవాట్లు మార్చుకోవాలి. జీవనశైలిలో మార్పులు పాటించాలి. వీటిద్వారానే 90% వ్యాధిని నియంత్రణ చేయొచ్చు అంటున్నారు డాక్టర్లు. అర్ధరాత్రులు పార్టీలు చేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, సరిగ్గా నిద్ర పోకపోవడం వంటివన్నీ మానేయాలి. ఒక వ్యక్తికి సగటున 6-8 గంటల పాటు నిద్ర ఉండాలి. అంటే 70% అలవాట్ల వల్ల ఈ వ్యాధిని నియంత్రిస్తే 30% మందులు వాడటం వల్ల తగ్గించుకోవచ్చు. మందులు అనేవి డాక్టర్ సూచిస్తేనే వేసుకోవాల్సి ఉంటుంది.


స్త్రీలలో సమస్య ఎక్కువా?

ఈ కండరాల సమస్యలు కొందరికి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఎప్పుడూ నొప్పితోనే ఉంటారు. కొన్ని అధ్యయనం ప్రకారం ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల జీవనశైలి, తీసుకునే ఆహారం, వ్యాధి నిరోధక శక్తి పురుషులకన్నా భిన్నంగా ఉంటాయి కాబట్టి పోషకాహారం తీసుకోవడంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.


చికిత్సలేంటి?

Muscle
విటమిన్-డి, బీ12 పరీక్షలు చేయించుకోవాలి. వీటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా డాక్టర్ వ్యాధిని నిర్ధారిస్తారు. తీవ్రతను బట్టి పరిష్కార మార్గాలు సూచిస్తారు. ఒక్కోసారి వెన్నుపూస సమస్య, మెడ నరాలు పట్టుకోవడం వల్ల వాటి ప్రభావం కండరాలపై చూపించి సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి కండరాల బలహీనతకు సంబంధించిన సమస్యలుంటే ప్రాథమికంగా డాక్టర్‌ను సంప్రదించి తగు సూచనలు పాటించాలి. హోమియో చికిత్స ద్వారా రస్టాక్స్, రోడోడెండ్రాస్, రూటా, బ్రయోనియా, యూపటోరియం, బెల్లడోనా, ఆర్నికా, వెరాట్రమ్, వేలరీనా, కాల్కేరియా కార్బ్ వంటి మందులు వాడితే కండరాల బలహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.


మార్పుల వల్లే..

helth1
జీవనశైలిలో మార్పులు పాటిస్తేనే కండరాల బలహీనత వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ వ్యాధి ఉన్నవాళ్లలో 90% విటమిన్-డి లోపమే ప్రధానంగా కనిపిస్తున్నది. కాబట్టి తీసుకునే ఆహారంలో విటమిన్-డి ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. వీలైతే సూర్యరశ్మిని పొందేట్లు చూసుకోవాలి. విధిగా వ్యాయామం చేయాలి. ఒకవైపు నొప్పి ఉన్నా.. ఆయాస పడుతూ ఇంట్లో కూర్చుంటే దాని తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి వ్యాయామం చేస్తే పరిస్థితిలో కొంత మార్పు తీసుకురావచ్చు.
kirankumarreddy

66
Tags

More News

VIRAL NEWS