కండల హీరో కథ కాదు కండెల దారం కథ


Sat,November 10, 2018 01:21 AM

ఆడపిల్లలకు టెన్త్ అయిపోగానే ఆసు పోయడం నేర్పించాలె. మగ పిల్లలకు పదో తరగతి అయిపోగానే మగ్గం గుంటలో జొరబెట్టాలె.. అనే పద్మశాలీల సూక్తిని బద్దలు చేస్తూ మల్లేశానికి ఓ అమ్మాయి నుంచి ఫోన్‌కాల్.. మల్లేశమన్నా..నేను ఆసు నేర్చుకునే టైములో మీ ఆసు యంత్రం అందింది. ఆసు నేర్చుకునే టైమును
నా సదువుకు వాడుకొని ఇప్పుడు నేను ఇంజినీర్‌ను అయ్యా..నా జీతం నెలకు నలబై వేలు అని.

మల్లేశం పాత్రలో ప్రియదర్శి, తండ్రిగా చక్రపాణి ఆనంద, తల్లిగా ఝాన్సీ నటిస్తున్నారు. పెద్దింటి అశోక్ మాటలు, గోరటి వెంకన్న పాటలు ఈ సినిమాలో ఉండనున్నాయి.

jhansi
ఆరో తరగతి చదివి ఆసు యంత్రాన్ని కనిపెట్టి ఓ ఇంజినీర్‌ని తయారు చేసిన చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా పోచంపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవణ పల్లి ఊరిలో నిఖార్సైన చేనేత కుటుంబాల మధ్య నిశబ్దంగా షూటింగ్ జరుపుకుంటున్నది. నిశ్శబ్దంగా అని ఎందుకంటే రీరికార్డింగులు లేకుండా మల్లేశం ఇంటిపై వాలే కాకి ఒరిజినల్ అరుపులు, వీధి చివరి నుంచి వినబడే ఉల్లిగడ్డలూ.. అన్న శబ్ద తరంగాలను సింక్‌సౌండ్‌తో క్యాప్చర్ చేయడానికి.. అలాగే అక్కడ నల్ల పరదాలు వేసి షూటింగ్ చేస్తున్నారు. సాధారణంగా షూటింగ్‌లో కనబడే బ్లూమ్యాట్స్, గ్రీన్ మ్యాట్స్ లేవక్కడ. ఇది గ్రాఫిక్స్ తరహా సినిమా కాదు గదా మరి. భారీ శివలింగం లాంటి ఆసు యంత్రం కలను మోస్తూ.. జీవితమనే పెద్ద పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరిన మల్లేశంపై పడే లైటింగ్ గాఢతను కంట్రోల్ చేయడానికి.. ఆ నల్ల పరదాలని అర్థమైంది.

90వ దశకంలో నేత కార్మికుల ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. అట్లాంటి రోజుల్లో ఆసు యంత్రం కనిపెట్టాలన్న ఓ పాజిటివ్ ఆలోచన.. ఓ నేత కార్మికుడికి రావడం అద్భుతమనిపించింది అంటాడు ఈ చిత్ర దర్శకుడు రాజ్. ఊరిలోని ఓ పేద నేతన్న చేనేత సంక్షోభం భరించలేక సిటీ కొచ్చి ఆటో నడుపుతాడు. కొన్నేళ్లు పోయాక అతనికి పద్మశ్రీ అవార్డు వస్తుంది. ఊరిలో వీవర్.. సిటీలో ఆటో డ్రైవర్.. పద్మశ్రీ.. ఈ మూడు పాయింట్లు బేస్ చేసుకొని, రెండేండ్లు స్క్రిప్ట్ రాసుకొని, రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. మగ్గం నేయుము రా.. మోక్షం పొందుము రా.. అంటూ పటం కథలోని మార్కండేయ పురాణంతో పద్మశాలి కథ మొదలవుతుంది. చింతకింది మల్లేశం అవతరిస్తాడు.. ఇలా తెలంగాణ ఆర్ట్ ఫామ్స్- ఒగ్గు కథ, పీర్ల పండుగ, యక్షగానం, శారద కాండ్లు, ఎల్లమ్మ కథలు, నిలువు- పేక దారాల్లా మల్లేశం కథలో ఒదిగిపోతాయి.

షూటింగ్ షురూ అయింది అంటూ నిలువెత్తు ఆసుపై మల్లేశం అనే టైటిల్ ఉన్న పోస్టర్లు ఇప్పటికే సోషల్‌నెట్‌వర్క్‌ల్లో సందడి చేస్తున్నాయి. సినిమా పోస్టర్ అంతా కండలు తిరిగిన హీరో ఉండే సినిమా కాదిది. కండెల కోసం దారం ఉత్పత్తి చేసే ఆసు యంత్రం ఆలోచనలోని హీరోయిజాన్ని ప్రతిబింబించే సినిమా. ఒరిజినాలిటీ దెబ్బతినకుండా సినిమాటిక్ లిబర్టీతో ఫిక్సనలైజ్ చేసే సన్నివేశాలతో రక్తి కట్టించబోతున్నామంటున్నారు దర్శకుడు.


ఆసు అంటే..


mallesham
ముందు నలభై కొయ్యలు, వెనుక ఒక కొయ్య-ముందు ప్రతి కొయ్య చుట్టూ తిప్పిన దారాన్ని వెనుక కొయ్యతో అనుసంధానం చేయడం. ఇలా ముందున్న నలభై కొయ్యల దారాన్ని వెనుక కొయ్యకు చుట్టడం.. అట్లా 5 గంటల పాటు 9 వేల సార్లు అంటే పన్నెండున్నర కిలోమీటర్ల దారాన్ని చుడితే ఒక చీరకు సరిపడా కండె దారం సిద్ధమవుతుందన్నమాట. ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఆసు పోసి పోసి చేయి లేవలేని స్థితికి చేరుకున్న మల్లేశం తల్లి ఈ పని మానేద్దాం రా మల్లేశా.. నువ్వేదన్నా కొలువు చూసుకో అంటుంది. చదివింది ఆరో తరగతి మాత్రమే. కాబట్టి ఇంకో కొలువు చూసుకునే అవకాశం లేదు మల్లేశానికి. సిటీకొచ్చి ఆటో నడుపుతున్న మల్లేశం ఆలోచన అమ్మ సమస్య అయిన ఆసు గురించే. ఆ సమస్య రాకుండా ఆసు యంత్రాన్ని కనిపెట్టాలన్న ఆలోచన పుట్టడంతో మల్లేశంలో మేధోమథనం జరుగుతుంది. ఆ ప్రయత్నానికి అమ్మ నుంచి, దోస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదురవుతాయి.

ముందు తన ప్రయత్నానికి వ్యతిరేకతలు, తర్వాత విమర్శలు, ఆ తర్వాత ఆమోదం. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న వేదన, ఘర్షణ తదితర అంశాలు మల్లేశం సినిమా చూపెట్టబోతున్నది. ఆసు యంత్రం కనిపెట్టడం అన్నది అత్యుత్తమమైనదే.. కానీ అసాధారణమైనదేమి కాదు..కష్టమైనదే కానీ ఎవరూ కనిపెట్టలేనంత కష్టమైనది కాదు. కానీ ఎందుకు గ్రేట్ అంటే.. అది ఆరో తరగతి చదివిన వాడు చేయడం వల్ల..కెమెరా ఏ యాంగిల్‌లో పెట్టి మానిటర్‌లో చూసినా మగ్గం సట్టరు, పింజర, ధూలాలు, గూనెపెంకలు, మొగురాలు అద్భుతమైన కళాత్మక దృశ్యాలుగా కనిపిస్తున్నాయి అంటున్నాడు ఈ సినిమా కళాదర్శకుడు ఏలే లక్ష్మణ్. అంతేకాదు కచ్చితమైన టెక్చర్‌తోపాటు శబ్దాన్ని కూడా పిక్చరైజ్ చేయడం కోసం అసలు సిసలు తోలు డప్పు సంపాదించడానికి చాలా కష్టపడ్డామని చెబుతున్నాడు ఏలే లక్ష్మణ్. మెకంజే కైఫీయత్ లో ఉన్న పద్మశాలి వైశిష్ట్యాన్ని స్టడీ చేసే అవకాశం కూడా కలిగిందనీ చెబుతున్నాడు.

మా నాయిన కీ.శే. చిలువేరు రామలింగం జీవితంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని ముప్పై మూడేండ్ల క్రితం ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్ సుష్మన్ అనే సిన్మా ఇదే ఊరు పోచంపల్లిలో తీశారు. నేత కార్మికుల జీవితంలోని సవాలక్ష సమస్యలతో పాటు సహకార సంఘాల వైఫల్యం, ఆధునికి పరిశ్రమ, వాణిజ్యం దెబ్బకు అమూల్యమైన సాంప్రదాయ చేనేత కళ ఎలా కొట్టుకుపోయిందో శ్యాంబెనెగల్ హిందీ సుష్మన్ సినిమా చూపెడుతుంది. నేతకార్మికుడై ఉండి జీవితాంతం కష్టపడ్డా సొంత కూతురికి ఓ చీర కొనివ్వలేని తండ్రి.. చివరకు చనిపోయిన తన బిడ్డపై కప్పడానికి నిలువెత్తు గుడ్డ కూడా లేక తల్లడిల్లే తండ్రి ఆవేదనను తమిళ కంజీవరమ్ గుండెల్ని పిండేస్తుంది.

ఆత్మహత్యల సీజన్‌లో అమ్మ ఆవేదన చూడలేక ఆసు యంత్రం కనిపెట్టాలన్న ఆలోచనతో స్ట్రగుల్‌కు గురయ్యి సక్సెస్ సాధించిన వ్యక్తి జీవితాన్ని తెలుగు మల్లేశం చూపెట్టబోతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేనేతకు ప్రకటించే పలు సంక్షేమ పథకాలకు తోడు ఆసు యంత్రం ఆవిష్కరణ జరుగడం వల్ల పోచంపల్లి పరిసర ప్రాంతాల్లో 1500 ఉన్న మగ్గాలు ఆరు వేలకు చేరుకున్నాయి. ఏటీఎం సెంటర్లో వాచ్‌మెన్లుగా, ట్రావెల్స్‌లో క్లీనర్లుగా పనిచేసే నేతన్నలు, అక్కలు తిరిగి ఊళ్లోకి వస్తున్నారు. సడుగులిరిగిన సాలెల మగ్గం జీవం పోసుకుంటున్నది. మల్లేశం మన హీరో. ఇది మన సినిమా...ఒక్క మాటలో చెప్పాలంటే మల్లేశమనే ఆసు యంత్రం ఆత్మను ఆవిష్కరించే ఈ సినిమా ఓ వ్యక్తిత్వ వికాసం.
mallesham1

-చిలువేరు మృత్యుంజయ్

2425
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles