ఒలింపియాడ్‌లో కొత్త చరిత్ర!


Sat,August 11, 2018 11:25 PM

ఒలింపియాడ్.. విద్యార్థి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలను పరీక్షించి, ఓ బాల మేధావిని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే అంత ర్జాతీయ వేదిక. ఐదు దశలను దాటుకొని ఆ వేదిక వరకూ రావడమే చాలా గొప్ప. అలాంటిది క్లిష్టతరంగా భావించే ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో మన దేశానికి చెందిన ఈ ఐదుగురు కుర్రాళ్లు ఏకంగా ఐదు బంగారు పతకాలను సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. 86 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో మనవాళ్లు అద్భుత ప్రతిభ చూపి స్వర్ణ విజేతలయ్యారు.
Olympiad-Students
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు విద్యార్థి దశ నుంచే పునాదులు వేస్తున్నారు. ఇందుకు పరిశోధనలకు ప్రాధాన్యం పెంచి, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడంతో పాటు.. అన్వయం, విశ్లేషణ, సునిశిత పరిశీలన వంటి నైపుణ్యాలను పరీక్షించేందుకు ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ ఐదుగురు చిన్నారులు తొలిసారిగా ఐదు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. వారే ముంబయికి చెందిన భాస్కర్ గుప్తా, కోటకు చెందిన లేజైన్, రాజ్‌కోట్‌కు చెందిన నిషాంత్ అభాంగి, జైపూర్‌కు చెందిన పవన్ గోయల్, కోల్‌కతాకు చెందిన సిద్ధార్ద తివారీ.


మొత్తం ఐదు దశలు

ఒలింపియాడ్స్ ఐదు దశలుగా ఉంటుంది. అవి నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్, ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్, ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. వీటిల్లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తున్నది. మిగతా విభాగాలను హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) పర్యవేక్షిస్తున్నది. 2018కి సంబంధించి పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో గత నెల 30న జరిగిన అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐపిహెచ్‌ఒ) ఐదు దశల్లోనూ మనవాళ్లు ముందుండి విజయం సాధించారు.


1967లో ప్రారంభం

ప్రఖ్యాత ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్లలో ఒకటైన ఐఫో ను ఫిజిక్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడం, అంతర్జాతీయ స్థాయిలో ఫిజిక్స్ ప్రాధాన్యం పెంచే లక్ష్యంతో ఏటా నిర్వహిస్తారు. థియరీ, ప్రాక్టికల్స్ విభాగాల్లో జరిగే ఈ పోటీలు 1967లో ప్రారంభం కాగా భారత్ 1998 నుంచి పాల్గొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుండి ప్రాతినిధ్యం వహించిన 396 మంది విద్యార్థుల్లో 42 మంది చివరి రెండు దశల్లో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించడం విశేషం. దేశంలో ప్రీ యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థుల్లో బేసిక్ సైన్సెస్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఒలింపియాడ్స్‌ను ప్రవేశ పెట్టారు. మొత్తం ఐదు విభాగాల్లో ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ (పాఠ శాల స్థాయి విద్యార్థుల కోసం).


ప్రతిభే కొలమానం

సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ విభాగాల్లో ఎన్‌ఎస్‌ఈఎస్ నిర్వహిస్తారు. ఇందులో జ్ఞాపక శక్తి కాకుండా.. విద్యార్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో సీబీఎస్‌ఈ 11, 12వ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. కానీ ఆస్ట్రానమీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ ఆస్ట్రానమీ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. జూనియర్ సైన్స్ విభాగంలో.. సీబీఎస్‌ఈ పదో తరగతి స్థాయి సిలబస్ ఉంటుంది. ఇందులో సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా విధానం సబ్జెక్టును బట్టి వేర్వేరుగా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ కలయికగా ఇంగ్లిష్ భాషలో ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం రెండు గంటలు. ఫిజిక్స్ పేపర్ మొత్తం 180 మార్కులకు ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ, బి రెండు విభాగాలు ఉంటాయి. వివరాలకు http://olympiads.hbcse.tifr.res.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.


Olympiad-Students2

5 స్వర్ణాలు సాధించడం ఇదే ప్రథమం!

ఈ పోటీల్లో పాల్గొన్న మన విద్యార్థులు ఐదుగురు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. సుదీర్ఘకాలంలో ఈ విధంగా భారత సభ్యులు ఐదు స్వర్ణాలు సాధించడం ఇదే మొదటిసారి. 86 దేశాల నుంచి 396 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో చైనా నుంచి అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించారు. ఈ పోటీల్లో 1998 నుంచి పాల్గొంటున్నామని, ఈ సంవత్సరం అందరూ స్వర్ణ పతకాలు సాధించారని హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ పథక్ చెప్పారు. గతంలో మూడుసార్లు నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించినట్లు పథక్ వెల్లడించారు. ఈ సంవత్సరం అసాధారణ ప్రతిభను ప్రదర్శించిందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్‌ఆర్) ప్రతినిధులు విద్యార్థులను కొనియాడారు. ఈ ఏడాది పోర్చుగల్‌లో జరిగింది 49వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్. ఒక్కో యేటా ఒక్కో దేశంలో ఒలింపియాడ్స్ నిర్వహిస్తుంటారు.
-రవికుమార్ తోటపల్లి

464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles