ఒడిదుడుకులు సహజం


Sat,July 28, 2018 12:46 AM

వ్యాల్యూ ఇన్వెస్టింగే వ్యూహం - వివిధీకరణే విశిష్టత
పరాగ్ పరీఖ్ మ్యూచువల్‌ఫండ్. పేరుకు చిన్న ఫండే. మార్కెట్‌లోకి వచ్చి ఐదేండ్లే అయింది. ఈ ఐదేండ్లలో ఎక్కువ హడావిడి చేయకుండా ఇన్వెస్టర్లకు సగటున ఏటా 20 శాతం రాబడిని ఇస్తున్నది. ఒకే ఒక్క స్కీమ్‌తో ఇన్వెస్టర్లకు విదేశీ షేర్లలో కూడా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నది. మార్కెట్‌లో ఒడిదుడుకులు సహజం కనుక వాటిని చూసి బెదిరి పోకుండా క్రమం తప్పకుండా మదుపు చేయాలంటున్నారు పీపీఎఫ్‌ఏఎస్ మ్యూచువల్ ఫండ్ ఛైర్మన్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీల్ పరాగ్ పారిఖ్. ఆయనతో నిధి ప్రత్యేక ఇంటర్వ్యూ.

Neil-Parikh
మ్యూచువల్ ఫండ్ రంగంలోకి ప్రవేశించిన ఐదేండ్లలో సగటున ఏటా 20 శాతం పైగా రాబడిని ఇవ్వడంలో ఎలాంటి పెట్టుబడి వ్యూహాన్ని మీరు అవలంభిస్తున్నారు.
మా వ్యూహం చాలా సింపుల్. ఎక్కడ మంచి అవకాశం ఉంటే అక్కడ మదుపు చేయడం. వ్యాల్యూ ఇన్వెస్టింగ్ మా ఫిలాసఫీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరిమితులు విధించుకోకుండా మదుపు చేస్తాం. ఫ్లెక్సీ క్యాప్ పోర్టుఫోలియో మాది. 25 నుంచి 35 షేర్లలో మదుపు చేస్తాం. కంపెనీ ఫండమెంటల్స్‌తో పాటు మేనేజ్‌మెంట్ ఎలాంటిదో చూస్తాం. మైనారిటీ షేర్‌హోల్డర్లకు ఆ కంపెనీ ఎలాంటి ప్రాముఖ్యతను ఇస్తుందో చూస్తాం. సాధారణంగా పెద్ద కంపెనీలే మా పోర్టుఫోలియోలో అధికభాగం. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా ఒక కంపెనీ గురించి విశ్లేషించిన తర్వాతనే అందులో మదుపు చేయడం మా ప్రత్యేకత.

మీ మ్యూచువల్ ఫండ్‌లో ఎన్ని స్కీములున్నాయి? వాటిలో ఏది అత్యుత్తమం?

ప్రస్తుతానికి మా దగ్గర రెండే రెండు స్కీములు. ఒకటి లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. రెండోది లిక్విడ్ ఫండ్. ఈక్విటీ ఫండ్‌ను రూ.1150 కోట్ల నిధులతో నిర్వహిస్తున్నాం. ఇటీవలే ప్రారంభించిన లిక్విడ్ ఫండ్‌లో రూ. 85 కోట్ల నిధులను నిర్వహిస్తున్నాం.
పరాగ్ పరేఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ గురించి మరికొన్ని వివరాలు చెబుతారా? ఒక ఇన్వెస్టర్ ఈ స్కీములో ఎందుకు మదుపు చేయాలనే ప్రశ్నకు సమాధానంగా ఉండాలి.
ఈ స్కీములో రూ. 1150 కోట్ల నిధులున్నాయి ఇందులో దాదాపు 30 శాతం నిధులను విదేశీ మార్కెట్లలో మదుపు చేస్తున్నాం. అలాగే మరో 24 శాతం నగదు, నగదుకు సమానమైన పెట్టుబడుల్లో వున్నాం. మిగిలిన 45 శాతం నిధులను వివిధ షేర్లలో మదుపు చేసి ఉన్నాం. ఇందులో ఐటీ, ఫార్మా, ఆటో, ఆటో విడిభాగాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగా షేర్లలో అధికమొత్తాలను మదుపు చేసి ఉన్నాం. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్‌లకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అందుకే గత ఏడాది మార్కెట్ భారీగా పెరిగినా మా ఫండ్ సగటు కన్నా ఎక్కువ రాబడిని మాత్రమే ఇవ్వగలిగింది.

లిక్విడ్ ఫండ్ వివరాలేమిటీ?

ఇటీవలే ఈ ఫండ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం ఇందులో రూ 85 కోట్ల నిధులున్నాయి. వీటిలో దాదాపు 95 శాతం నిధులను రుణ మార్కెట్‌లో మదు పు చేశాం. దాదాపు 5 శాతం నగదు లేదా నగదుకు సమానమైన సాధనాల్లో మదుపు చేశాం. ఇందులో కనీసం రూ. 5000 నుంచి మదుపు చేయవచ్చు.

మీ ఫండ్ నుంచి సమీప భవిష్యత్‌లో కొత్త స్కీములు ఏవైనా వస్తున్నాయా?

ఎక్కువ స్కీములతో మా మదుపరులను తికమకలకు గురిచేయాలని లేదు. అందుకే ఒకే ఒక్క ఈక్విటీ స్కీమును నిర్వహిస్తున్నాం. త్వరంలో పన్ను ఆదా చేయాలనుకునే వారి కోసం ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్స్ స్కీమును ప్రారంభించాలని యోచిస్తున్నాం. ప్రస్తుం ఉన్న స్కీములోనే వివిధీకరణ చేశాం కనుక కొత్త స్కీమ్‌ల అవసరం లేదని భావిస్తున్నాం.

ఈ ఐదేండ్లలో మీ పురోగతి..

స్థిరంగా మేం ఇస్తున్న ఏటా సగటున 20 శాతం వృద్ధిరేటను మదుపరులు ఆదరిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మేం ఈ రాబడిని ఇవ్వగలుగుతున్నాం. కనుకనే 2017-18 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 300 కోట్లకు పైగా నిధులు జమ అయ్యాయి. ప్రస్తుతానికి ప్రతి నెల రూ. 17-18 కోట్ల కొత్త నిధులు వస్తున్నాయి. ఇందులో దాదాపు సగం ఎస్‌ఐపీల రూపంలో వస్తున్నవే. ఇం దులో దక్షిణాది రాష్ర్టాల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నుంచి మా స్కీమ్ లో మదుపు చేసిన ఇన్వెస్టర్ల సంఖ్య, పెట్టుబడులు రెండూ గత ఏడాది కాలంలో రెట్టింపు అయ్యాయి.

ప్రస్తుతం జీవిత కాల గరిష్ఠ స్థాయిల్లో మార్కెట్ ట్రేడ్ అవుతున్నది. సాధారణ ఎన్నికలు సమీపంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇన్వెస్టర్లకు ఇది మంచి సమయమేనా? అలాగే పాత ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించవచ్చా?
మార్కెట్లో ఒడిదుడుకులు సహజంగా వస్తాయి. ఎన్నికల కారణంగా బిజినెస్‌లేవీ ఆగిపోవు. అలాగే ప్రస్తుతం ఉన్న విధానాలేవీ అంత తేలిగ్గా మారిపోయే అవకాశాలు తక్కువ. ఎప్పటికీ మదుపు చేసి ఉండటమే ఎవరైనా చేయాల్సింది. దీర్ఘకాలానికి ఈక్వి టీ మార్కెట్లోనే మిగతా అసెట్‌ల కన్నా ఎక్కువ రాబడి వస్తుంది. ఇది చారిత్రక సత్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రమం తప్పకుండా మదుపు చేస్తుండాలి.

విదేశీమార్కెట్లలో మదుపు చేశామని చెబుతున్నారు. అందుకు వ్యూహం ఏమైనా ఉందా? ఏ మార్కెట్లలో, ఏషేర్లలో మదుపు చేశారు?

we-value
సెబి అనుమతులు పొందిన తర్వాతనే మొత్తం ఫండ్‌లో 30 శాతం నిధులను విదేశీ మార్కెట్లో మదుపు చేస్తున్నాం. ప్రపంచ జీడీపీలో మన దేశం వాటా దాదాపు 6 శాతం మాత్రమే. మిగిలిన ఇతర దేశాల్లో ఉంది. అందుకే విదేశాల్లోనూ మంచి వాల్యూయేషన్, పెట్టుబడి పెరగడానికి అవకాశాలున్న షేర్లలో మదుపు చేశాం. ఇందులో గూగుల్, ఫేస్‌బుక్, సుజికీ మోటార్ కార్పోరేషన్, నెస్లె, 3ఎం కంపెనీ, ఐబీఎం కంపెనీల్లో మదుపు చేశాం. ప్రస్తుతానికి ఈ పెట్టుబడుల కరెన్సీ ఒడిదుడుకుల రిస్క్‌ను హెడ్జింగ్ కూడా చేశాం. గత ఐదేండ్ల డాలర్-రూపాయి మారకం విలువ ఒడిదుడుకుల సగటు ఆధారంగా ఈ హెడ్జింగ్ చేశాం. ప్రస్తుతానికి ఇందులో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి.

370
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles