ఐసీయూలో జరిగే చికిత్సలేమిటి?


Sun,January 21, 2018 10:56 PM

నా మిత్రుడి వయసు 38 సంవత్సరాలు. ఇటీవల అతడికి శ్వాసకోశ సమస్యల కారణంగా అతన్ని హాస్పిటల్‌లో చేర్పించాం. నాలుగు రోజుల దాకా క్రమంగా కోలుకుంటున్నట్టు అనిపించింది. డాక్టర్లు ఐసీయూలో ఉంచాలని చెప్పినప్పటికీ కోలుకుంటున్నాడు కదా అని మేం ఒప్పుకోలేదు. అయితే ఒకరోజు అర్ధ్థరాత్రి హఠాత్తుగా పరిస్థితి విషమించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అతడు చనిపోయాడు. ఐసీయూలో ఉంచి ఉంటే ఇలా జరిగేది కాదని డాక్టర్లు అన్నారు. అసలు ఐసీయూలో జరిగే ప్రత్యేక చికిత్సలు ఏమిటి? పూర్తి వివరాలు తెలియజేయగలరు.
- ప్రసాద్, మేడిపల్లి

IntensiveCareUnit
శరీరం చాలా రకాల జీవరసాయనాల ఆధారంగా పనిచేస్తుంది. ఏదైనా అనారోగ్యం కలిగినపుడు ఈ రసాయన ప్రక్రియల్లో తేడాలు జరుగుతాయి. శరీరంలోని వివిధ భాగాలు ఈ తేడాల సమతుల్యత వల్ల దెబ్బతింటాయి. ఐసీయూలో ఉంచినపుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని క్రమబద్ధీకరించేందుకు ఏర్పాట్లు ఉంటాయి. తిరిగి కోలుకునేందుకు అవసరమైన వైద్య చికిత్సలు ఐసీయూలో అందుబాటులో ఉంటాయి. శరీరానికి ఒక నిర్ణీత సమయంలో కోలుకునే శక్తి సహజంగానే ఉంటుంది. కీలక భాగాలైన మెదడు, గుండె, శ్వాసకోశాలు, కాలేయం, కిడ్నీల్లో ఏర్పడే తేడాల వల్ల రక్తంలో కలిగే మార్పుల మీద రోగి పరిస్థితి ఆధారపడి ఉంటుంది. హఠాత్తుగా గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు రావడం, కడుపులో లేదా మెదడులో రక్తస్రావం కావడం వంటి సమస్యల్లో ఒక్కోసారి శరీరానికి తిరిగి కోలుకునేంత సమయం దొరకకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.

ఇలాంటి పరిణామాలు మామూలుగా అయితే మనం ముందుగా ఊహించలేం. ఇలాంటి పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉందేమో అన్న అనుమానం ఉన్నపుడు ఐసీయూలో ఉంటే తక్షణ చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐసీయూలో వెంటిలేటర్లు, డయాలసిస్ యంత్రాల వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. గుండె పనితీరులో తేడాలను వెంటనే గుర్తించి పరిస్థితిని నియంత్రించేందుకు డిఫిబ్రిలేటర్లు అందుబాటులో ఉంటాయి. కిడ్నీలు పనిచేయనపుడు ఉపయోగించే రీనల్ రీప్లేస్మేంట్ థెరపీ, కాలేయం పనిచేయనపుడు ఉపయోగించే మార్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే మందులను అనుకున్నంత సూక్ష్మస్థాయిలో ఇచ్చే ఇన్‌ఫ్యూజన్ పంపులు కూడా ఉంటాయి. వీటితో పాటు నాడీ లోపలి నుంచి ప్రతి స్పందనను కొలిచేందుకు వీలుంటుంది. ఏ కొంచెం తేడా కనిపించినా తక్షణమే చికిత్సలు ప్రారంభించేందుకు అనువుగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఉన్నవారిని మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. కాబట్టి డాక్టర్ల సలహా పాటించడమే మంచిది.

డాక్టర్ నిఖిల్ మాధుర్
కన్సల్టెంట్ అండ్ హెడ్
ఎమర్జెన్సీ మెడిసిన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

423
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles