ఐఫోన్ అద్బుత పీచర్లు


Wed,September 19, 2018 01:21 AM

i-phone
పండ్లలోకెల్లా అందరూ ఇష్టంగా తినే పండు యాపిల్. మొబైల్స్‌లోకెల్లా అందరూ ఆశగా చూసే మొబైల్ యాపిల్ ఫోన్. ఐఫోన్ పేరుతో మార్కెట్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని, అసంఖ్యాక వినియోగదార్లను సొంతం చేసుకొని మొబైల్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్నది. సరికొత్త ఫీచర్లతో.. మిగతా ఫోన్లన్నీ గుంపులు గుంపులుగా వస్తే.. సింహం సింగిల్‌గా వస్తుంది అన్నట్టు రెండేండ్లకు ఒక ఎడిషన్ విడుదల చేస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నది. తాజాగా అదిరిపోయే ఫీచర్లతో, ఆకట్టుకునే స్క్రీన్ సైజులో మార్కెట్లోకి వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ తాజా ఐఓఎస్12 వెర్షన్ ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ ఫీచర్ ఉంది. సెప్టెంబర్ 28న విపణిలో విడుదల కానున్న ఐఫోన్ గురించి విశేషాలివి.

చాలాకాలంగా ఐఓఎస్12 బీటా వర్షన్‌ను యాపిల్ సంస్థ పరిశీలిస్తున్నది. కాకపోతే సరైన సమయం కోసం ఎదురుచూస్తూ.. ఇదిగో.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఐఓఎస్ 12 ఫైనల్ వెర్షన్‌ను లేటెస్ట్ ఐఫోన్లతో పాటు విడుదల చేసింది.


తొలిసారి డ్యుయల్‌సిమ్


iphones1
ఇప్పటి వరకు ఐఫోన్‌లలో డ్యుయల్ సిమ్ సదుపాయం అందుబాటులో లేదు. కానీ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఎక్స్‌మ్యాక్స్, ఎక్స్‌ఆర్ ఫోన్లలో రెండు సిమ్‌కార్డులు వేసుకునే సదుపాయం ఉంది. ఒకేసారి రెండు సిమ్‌కార్డులు ఆన్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ టెన్ వరకు ఒకేసిమ్ సదుపాయం మాత్రమే ఉంది. ఇప్పుడు డ్యుయల్ సిమ్ ఫీచర్ అందుబాటులోకి తేవడంతో ఈ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కాకపోతే ఒక సిమ్ మొబైల్‌లో అమర్చాలి. మరొక సిమ్ ఈ సిమ్ ద్వారా అనుసంధానం చేసుకోవాలి.

సిమ్‌కార్డు లేకుండానే..


Sim
మొబైల్ కొనగానే ఏం చేస్తాం? పాత మొబైల్ నుంచి సిమ్‌కార్డు తీసి కొత్త మొబైల్‌లో వేసేస్తాం. ఎంచక్కా కాల్స్, చాటింగ్, బ్రౌజింగ్ ఎంజాయ్ చేస్తాం. కానీ.. ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఎక్స్‌మ్యాక్స్ ఫోన్లలో సిమ్‌కార్డు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫోన్లు సరికొత్త టెక్నాలజీతో తయారయ్యాయి. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న క్రమంలో ఐఫోన్లు కూడా దాన్ని ఒంట బట్టించుకున్నాయి. క్యూఆర్ కోడ్‌తో పనిచేసే ఎలక్ట్రానిక్ సిమ్‌కార్డు (ఈ-సిమ్)తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. ఒక్కసారి మొబైల్‌లో సిమ్‌కార్డు మీదున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు.. సిమ్‌కార్డు ఏ నెట్‌వర్క్‌లో ఉందో ఆ నెట్‌వర్క్‌ని అందుకొని ఆ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఇప్పటికే గూగుల్ పిక్సెల్2 మొబైల్‌లో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఐఫోన్ రాకతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఐఫోన్‌ని ఆదర్శంగా తీసుకొని రాబోయే స్మార్ట్‌ఫోన్లలో ఈ సిమ్ టెక్నాలజీని ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ - సిమ్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోవాలి


-ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెల్యూలర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
-అందులో సెల్యులర్ ప్లాన్స్ సెక్షన్‌లో యాడ్ సెల్యులర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
-ఆ తర్వాత టెలికాం ఆపరేటర్ ఇచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదంటే.. వారు ఇచ్చే సెట్టింగ్స్ మ్యానువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
-సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఈ-సిమ్‌కి సంబంధించిన వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే ఈ-సిమ్ యాక్టివేట్ అయిపోతుంది.
-అయితే.. ఈ-సిమ్ నుంచి కేవలం కాల్స్, ఎస్సెమ్మెస్‌లు మాత్రమే వాడుకోవచ్చు. ఇంటర్నెట్ వాడుకునే వీల్లేదు.

ఫీచర్లూ ప్రత్యేకమే!

గతేడాది విడుదలైన ఐఫోన్ టెన్ కంటే ఐఓఎస్12 వర్షన్‌లో వస్తున్న ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్లు ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. డిస్‌ప్లే విషయానికొస్తే ఐఫోన్ ఎక్స్‌ఎస్ డిస్‌ప్లే 5.8 అంగుళాలు, ఎక్స్‌ఎస్ మ్యాక్స్ డిస్‌ప్లే 6.5 అంగుళాలు, ఎక్స్‌ఆర్ డిస్‌ప్లే 6.1 అంగుళాలు. మొబైల్ సైజు పెంచకుండానే డిస్‌ప్లే సైజు పెంచేలా ప్రత్యేక మార్పులతో ఈ మూడు మొబైల్స్‌ను రూపొందించారు. అత్యాధునిక ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఓఎల్‌ఈడీ) డిస్‌ప్లే ఆకట్టుకునేలా ఉంది. మొబైల్ ఫ్రేమ్‌ను కిందపడినా గాట్లు, చారలు పడకుండా ఉండేందుకు అల్యూమినియంతో రూపొందించారు. ఏ12 బయోనిక్ అనే సరికొత్త ప్రాసెసర్ అమర్చారు. ఈ ప్రాసెసర్ గత ఐఫోన్‌లో అమర్చిన ఏ11 కంటే 15 శాతం మెరుగ్గా పనిచేస్తుంది. యాపిల్ సంస్థ 7-నానోమీటర్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీతో రూపొందించిన తొలి మొబైల్, తొలి గాడ్జెట్ ఇదే కావడం విశేషం. ఈ 7నానోమీటర్ ట్రాన్సిస్టర్ వల్ల మొబైల్ పనితీరు వేగంగా ఉండడమే కాకుండా, బ్యాటరీ బ్యాకప్ కూడా మెరుగుపడుతుంది.

ఈ మూడు ఫోన్లలో ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్ మ్యాక్స్ ఫోన్లకు 12 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరాలు రెండు అమర్చారు. 12 మెగాపిక్సెల్ వైడ్‌యాంగిల్ లెన్స్ అయితే, మరో 12 మెగాపిక్సెల్స్ టెలిఫొటో లెన్స్ అమర్చారు. ఎక్స్‌ఆర్ మొబైల్‌కి ఒకే కెమెరా అమర్చారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో యాప్‌లలో మనకు కావాల్సిన హెచ్‌డీ వీడియో కంటెంట్‌ను వేగంగా, సులభంగా పొందవచ్చు. గేమ్స్ ఆడేవారి కోసం 4కోర్ జీపీయూ, వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం 6కోర్ సీపీయూలు అమర్చారు. వైడర్ స్టీరియో సౌండ్ సిస్టమ్ వల్ల సౌండ్‌క్లారిటీ అద్భుతంగా వస్తుంది. నీళ్లలో పడినా తట్టుకునేలా వాటర్ రెసిస్టెంట్‌తో ఈ మొబైల్ తయారుచేశారు. వాట్సాప్ గ్రూప్‌కాల్స్‌లో ఒకేసారి 32మందితో మాట్లాడవచ్చు. మీ సౌకర్యాన్ని బట్టి ఆడియో, వీడియో కాల్స్‌తో కనెక్ట్ కావచ్చు. స్క్రీన్‌టైమ్ అనే ఫీచర్ ఒకరోజులో మీరు మీ ఫోన్ ద్వారా ఎన్ని యాప్స్‌లో ఎంత సమయం గడిపారో రికార్డు చేస్తుంది. ఏయే వెబ్‌సైట్స్ మీద ఎంత సమయం కేటాయించారు? మీ పిల్లలు మీ మొబైల్‌లో ఎంతసేపు, ఏమేం బ్రౌజ్ చేశారు అనే విషయాలన్నీ రికార్డు చేసి ఆ వివరాలను ఒక రిపోర్టు రూపంలో మీకందిస్తుంది.

కొత్త ఐఫోన్లు.. వాటి ధరలు


iphone
ఐఫోన్ ఎక్స్‌ఆర్
64జీబీ : రూ. 76, 900
128 జీబీ : రూ. 81, 900
256 జీబీ : రూ. 91, 900

ఐఫోన్ ఎక్స్‌ఎస్
64జీబీ : రూ. 99, 900
256 జీబీ : రూ. 1, 14, 900
512 జీబీ : 1, 34, 900

ఐఫోన్ మ్యాక్స్
64జీబీ : రూ. 1, 09, 900
256 జీబీ : రూ. 1, 24, 900
512 జీబీ : రూ. 1, 44, 900

1198
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles