ఐదు రోజుల్లో ఫ్లాట్ సిద్ధం!


Sat,July 14, 2018 02:31 AM

-నగర నిర్మాణాల్లో నయా పోకడలు
రెరా అమలు నేపథ్యంలో.. ఈ ఏడాదిలో కొత్త నిర్మాణాలు పెరిగే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. ఎనిమిది కోట్ల చదరపు అడుగుల వాణిజ్య స్థలానికి గిరాకీ ఉందని అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. వీటితో బాటు మునుపెన్నడూ లేనివిధంగా, వేర్‌హౌజ్, లాజిస్టిక్ రంగాలకూ ఆదరణ పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో..అంతర్జాతీయ నగరంగా అవతరించడానికి అతివేగంగా హైదరాబాద్ పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో, మన నిర్మాణ రంగం ఎలాంటి ఆధునిక నిర్మాణ పద్ధతుల్ని అందిపుచ్చుకుంటున్నది?

Bellding
అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం ఏర్పాటు కావడం.. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు .. వినూత్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టి హైదరాబాద్ మీద పడింది. ఐటీ, ఫార్మా, బయోటెక్, విద్య వంటి రంగాలు గణనీయంగా పురోగతి చెందుతున్నాయి. రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు అడుగుపెట్టే విధంగా సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టింది. పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి చిన్న కుటుంబాల ఏర్పాటు వంటి అంశాల వల్ల నివాస గృహాలకు గిరాకీ ఏర్పడింది. మిగతా నగరాలతో పోల్చితే మన వద్ద వాణిజ్య స్థలం ధర 30 నుంచి 40 శాతం తక్కువుంది. అద్దెలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఫలితంగా, ఐటీ కార్యాలయాలతో పాటు ఇతర ఆఫీసులకు గిరాకీ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మూడేండ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసమే రూ.45 వేల కోట్లను ఖర్చు పెడుతున్నది. ఫలితంగా నివాస, వాణిజ్య స్థలానికి గిరాకీ అధికమైంది. పెరిగిన గిరాకీకి తగ్గట్టు మన నిర్మాణ విధానాలు ఎలా ఉన్నాయి? గిరాకీ తగ్గట్టుగానే తెలంగాణ నిర్మాణ రంగం ఎలా రూపాంతరం చెందాలి?

స్వస్తి పలకాల్సిందే..

కాలం చెల్లిన నిర్మాణ పద్ధతులకు స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కార్మికుల కొరత హైదరాబాద్‌లో అధికంగా ఉన్నది. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ వంటి వాటిని సకాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే దాదాపు 22,000 మంది నిర్మాణ కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తుండటం గమనార్హం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955లో మొదలు పెట్టి 1967లో పూర్తి చేయడానికి దాదాపు యాభై వేల మంది నిర్విరామంగా పని చేశారు. అలాంటిది, ప్రస్తుతం 22 వేల మందితో కాళేశ్వరంను పూర్తి చేస్తున్నారు. ఇందులో ఆధునిక యంత్రపరికాల వినియోగమూ కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. అందుకే, హైదరాబాద్‌లో కట్టే నిర్మాణాల్లోనూ ఆధునిక పరిజ్ఞాన్ని ఆవిష్కరించాల్సిందే.

మైవాన్ పరిజ్ఞానం..

ప్రస్తుతం హైదరాబాద్‌లో వుడెన్ బల్లిస్ నుంచి జాక్ పైపుల స్టీలు సెంట్రింగ్ విధానంలోకి మారింది. దాన్ని నుంచి అల్యుమినియం ఫోమ్ వర్క్ విధానంలోకి మారుతున్నది. మైవాన్ ఫ్రేమ్‌వర్క్ అని కూడా అంటారు. సంప్రదాయ విధానంలో ఒక అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ సివిల్ పనులు పూర్తి చేయడానికి దాదాపు 3 నుంచి 4 నెలలు పడుతుంది. శ్లాబులు కొట్టడానికి పదిహేను రోజులు తీసుకుంటే, శ్లాబు వేసిన తర్వాత 15 రోజులకు షట్టరింగ్ తీయడం.. దాని తర్వాత గోడలు కట్టడం, ఎలక్ట్రికల్ పైపుల కోసం గోడలను కత్తరించి పైపులైన్ వేసేవారు. తర్వాత దానిని మూసివేసి గోడలు ప్లాస్టరింగ్ చేయడం, ఆతర్వాత ఎక్స్‌టర్నల్ ప్లాస్టరింగ్ చేసేవారు. మైవాన్ షట్టరింగ్ విధానంలో మాత్రం.. ఎలక్ట్రికల్ కాండ్యూట్లతో పాటు గోడలను ఆర్‌సీసీతో వేసి శ్లాబులను వేస్తారు.

ఇలా, 5 రోజులకో ఒక ఫ్లాట్ చొప్పున సివిల్ పనుల్ని పూర్తి చేయవచ్చు. దీనికి ఎక్స్‌టర్నల్ ప్లాస్టరింగ్ కూడా అవసరం లేదు. కానీ, అల్యూమినియం ఫోమ్ వర్క్ విధానంలో నిర్మాణం చేపడితే.. అంతర్గత మార్పులు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఎలక్ట్రికల్ పాయింట్‌లో కానీ గోడల్లో కానీ మార్పులు చేసుకోలేం. ఈ నిర్మాణం మొత్తం గోడలతో సహా ఆర్‌సీసీ తోనే కట్టేస్తారు. అందుకే, భూకంపాలను తట్టుకునే తత్వం మెరుగుగా ఉన్నప్పటికీ.. ఎండాకాలంలో ఇంటిలోపల వేడి కొంత ఎక్కువుండే అవకాశమున్నది.

అతివేగంగా నిర్మాణాలు..

టన్నల్ ఫ్రేమ్‌వర్క్ షట్టరింగ్ విధానంలో నిర్మాణం మరింత వేగం పెంచవచ్చు. కానీ, హైదరాబాద్‌లో ఇప్పటివరకూ దీన్ని ఎవరూ ఉపయోగించిన దాఖలాల్లేవు. ఏదైనా అపార్టుమెంట్‌లో చాలావరకూ ఫ్లాట్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ మైవాన్, టన్నల్ ప్రేమ్‌వర్క్ విధానం వాడటం తేలిక అని చెప్పొచ్చు. ఫ్లాట్ల గదుల సైజుల్లో తేడా ఉన్నా.. ఈ విధానంలో షట్టరింగ్‌లో స్వల్ప మార్పులతో సులువుగా నిర్మించవచ్చు. మైవాన్ షట్టరింగ్ అల్యూమినియం మెటీరియల్‌తో చేయడం వలన బరువు తక్కువుంటుంది. నిర్మాణ పనులు సులభంగా జరుగుతాయి. కార్మికుల అవసరమూ తక్కువగా ఉంటుంది.

స్టీల్ స్ట్రక్చర్.. స్ప్రే పరికరాలు!

ఆర్‌సీసీ స్ట్రక్చర్ నిర్మాణం కంటే స్టీల్ స్ట్రక్చర్ త్వరగా పూర్తి చేయవచ్చు. ఉక్కు నిర్మాణాలకు అగ్ని, భూకంపాలను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. కాకపోతే, వీటిని డిజైన్ చేసి, నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కొంత శ్రమించాలి. ఇందుకోసం నైపుణ్యం గల సిబ్బంది అవసరమేర్పడుతుంది.
-ఆర్‌సీసీ స్ట్రక్చర్ సాయంతో నిర్మించిన భవనాల్లో ఇటుక పనుల కంటే ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ప్లాస్టిరింగ్ (రెండు కోటింగులు) కు చాలా సమయం పడుతుంది. దీనికి చాలా దేశాల్లో కొన్నేండ్ల నుంచి స్ప్రే మెషీన్‌ల ద్వారా ప్లాస్టరింగ్ చేస్తే కార్మికుల సంఖ్యను తగ్గించడంతో పాటు నిర్మాణ సమయాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఈ స్ప్రే పరికరాన్ని కొన్ని ఆర్‌ఎంసీ సంస్థలు ఈ మధ్యనే వినియోగంలోకి తెచ్చాయి.
-ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికుల కొరత ఉంది కాబట్టి.. నిర్మాణాల్లో యంత్ర పరికరాల్ని వాడితే నిర్మాణ సమయాన్ని తగ్గించుకోవచ్చు. టవర్ క్రేన్ బాబ్ కాట్, హాయిస్ట్ లాంటివి వాడటం వల్ల నిర్మాణాల్లో నిర్మాణ కార్మికుల సంఖ్యను తగ్గించవచ్చు.
-నిర్మాణం మొదలు పెట్టే ముందు, పూర్తి చేయడానికి ప్రణాళిల్ని తయారు చేసుకోవాలి. దాని ఆధారంగా, ఎప్పటికప్పుడు ప్రణాళికలన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయా? లేవా? అనే అంశాన్ని బేరీజు వేసుకోవాలి. ఒకవేళ, ఆలస్యం జరుగుతున్నట్లయితే, అందుకు కారణాల్ని అన్వేషించాలి. పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పుడే, మనం నిర్దేశించుకున్న సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు.
ramchandra-reddy
1990లో ఒక హైటెక్ సిటీని 158 ఎకరాల్లో మొదలు పెట్టారు. కాకపోతే, ఇలాంటివి ఇప్పుడు మన నగరంలో వందలలో ఉన్నాయి. నివాస సముదాయాలు కూడా 2000 సంవత్సరానికి కంటే ముందు ఒక ఎకరం కంటే అధిక విస్తీర్ణంలో కట్టిన ప్రాజెక్టుల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అదే, 2010 వచ్చేసరికి 10 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అపార్టుమెంట్ ప్రాజెక్టులు తక్కువున్నాయి. కానీ, ఇప్పుడో పది ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అధిక నిర్మాణాలు వస్తున్నాయి.

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles